ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలు చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో రైతాంగానికి అడవి ఏనుగుల బెడద తీవ్ర సమస్యగా మారింది. పొరుగు రాష్ట్రం కర్ణాటక అడవుల నుంచి ఏనుగుల మందలు ఆహారం, నీటి అన్వేషణలో దారితప్పి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని వ్యవసాయ భూముల్లోకి ప్రవేశించి పంటలను తినేస్తూ ధ్వంసం చేస్తున్నాయి. అటవీ సిబ్బంది వీటిని తరిమికొట్టినా, అవి తమిళనాడు అడవుల్లోకి పారిపోయి మళ్లీ కర్ణాటకకు చేరుకుని, అటు నుంచి తిరిగి ఆంధప్రదేశ్‌కు వస్తుండటంతో ఇదొక నిరంతర పోరాటంగా మారింది. ఇదే తరహాలో ఒడిశా అడవుల నుంచి వచ్చే ఏనుగుల గుంపులు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి.
ఏనుగుల ధాటికి వరి, అరటి, చెరకు, కొబ్బరి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు మామిడి తోటలు; బోరు మోటార్లు, సౌర విద్యుత్ పరికరాలు ధ్వంసమవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల ప్రాణనష్టం కూడా జరుగుతోంది.
పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాల్లో గత కొన్నేళ్లుగా అటవీ ఏనుగుల సంచారం స్థానిక రైతులు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పక్కనే ఉన్న ఒడిశా అడవుల నుంచి 2018లో వచ్చిన అటవీ ఏనుగుల గుంపు భామిని, సీతంపేట, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో స్థిరనివాసం ఏర్పరచు కున్నాయి. ఇవి రెండు గుంపులుగా విడిపోయి సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తు న్నాయి. ఒక గుంపు విజయనగరం జిల్లా బాడంగి ప్రాంతంలో, మరో గుంపు పాలకొండ నియోజకవర్గం పరిధిలోని సీతంపేట మండలం గిరిజన/అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. పాలకొండ, పార్వతీపురం, కురుపాం నియోజక వర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వరి, మొక్కజొన్న, అరటి, పామాయిల్ వంటి పంటలను నాశనం చేశాయి. ఇప్పటివరకు ఈ ఏనుగుల దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆరుగురు ఒక్క కొమరాడ మండలానికి చెందిన రైతులే కావడం గమనార్హం. సుమారు 3,900 ఎకరాల్లో పంట ధ్వంసమై, రైతులకు రూ. మూడు కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఏనుగులను అడ్డుకోవడానికి ప్రతిపాదించిన కందకాలు, ఏనుగుల జోన్ల ఏర్పాటు వంటి పథకాలు స్థానికుల వ్యతిరేకత, సాంకేతిక కారణాలతో ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
చిత్తూరు జిల్లాలోను
ఇదే పరిస్థితి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నెలకొంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అటవీ ప్రాంతాల సరిహద్దుల్లో ఈ జిల్లాలు ఉండటం వల్ల, ఏనుగుల గుంపులు తరచుగా సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి చొరబడుతున్నాయి. ఫలితంగా, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి, అరటి, చెరకు, మామిడి, టమాటా వంటి వాణిజ్య పంటలు, కూరగాయల తోటలు సర్వనాశనం అవుతున్నాయి. కొన్నిసార్లు ఏనుగుల దాడులలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రి వేళల్లో ప్రాణాలకు తెగించి పొలాలకు కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొంది. కరెంటు కంచెలు, గస్తీ వంటి తాత్కాలిక చర్యలు పెద్దగా ఫలితాన్నివ్వడం లేదు. ఈ సమస్య నుండి బయటపడేయడానికి ప్రత్యేక కందకాలు తవ్వించారు. సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటుచేశారు. అయినా ఏనుగులు లెక్కచేయడం లేదు. ఈ సమస్య పరిష్కరంగా, ‘‘ఏనుగుల దాడుల నుంచి రక్షణకు ఏనుగులనే’’ ఉపయోగించే వినూత్న విధానాన్ని అటవీ శాఖ అమలు చేస్తోంది. ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించేవే కుంకీ ఏనుగులు.
కుంకీ ఏనుగుల కఠినశిక్షణ
కుంకీ ఏనుగులు అంటే అటవీ శాఖ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ పొందిన సాధు ఏనుగులు. అడవి నుంచి దారి తప్పి జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి నష్టం కలిగిస్తున్న అడవి ఏనుగులను సురక్షితంగా తిరిగి అడవిలోకి పంపడానికి, లేదా వాటిని బంధించడానికి అటవీ అధికారులు వీటిని ఉపయోగిస్తారు. దారి తప్పిన అడవి ఏనుగులను పట్టుకునే విధానం ఎంతో సాహసంతో కూడుకున్నది. కుంకీ ఏనుగులు తమ శిక్షకుల ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, అల్లరి చేస్తున్న అడవి ఏనుగుల చుట్టూ వ్యూహాత్మకంగా చేరి వాటిని శాంతింప జేస్తాయి. ఏ మాత్రం దారికి రాకపోయినా, తమ బలంతో వాటిని అదుపులోకి తెస్తాయి. ఆ తర్వాత అటవీ సిబ్బంది మత్తు మందు ఇస్తారు. స్పృహ కోల్పోయిన ఏనుగును తాళ్లతో బంధించి, ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించడానికి కుంకీ ఏనుగులే తమ దంతాలతో, తొండంతో వెనుక నుంచి నెడుతూ సాయపడతాయి. అనంతరం బంధించిన ఏనుగు లను సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడానికో, శిక్షణ శిబిరానికి తరలించడానికో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. మావటీలు కాలితో వాటి చెవులపై ఇచ్చే వేర్వేరు సంకేతాలను బట్టి కుంకీలు ముందుకు కదలడం, వెనక్కి తగ్గడం, ఆగిపోవడం చేస్తుంటాయి. పిల్లలతో కూడిన ఆడ ఏనుగుల గుంపులు సాధారణంగా కుంకీలను చూడగానే తమ మందను కాపాడుకునేందుకు వాటంతట అవే వెనుదిరుగు తాయని, ఎంతగా తరిమినా వెనక్కి వెళ్లని మొండి ఏనుగులతో అవసరమైతే కుంకీలు భీకరంగా పోరాడాల్సి వస్తుంది. వైద్యులు, అటవీ అధికారుల పర్యవేక్షణలో వ•డేళ్లపాటు సాగే ఈ శిక్షణ ఎంతో కఠినమైనది. ఇలా పంట పొలాల్లోకి చొరబడి బెడద పెట్టే గుంపులను సైతం కుంకీలు అడవి దిశగా తరిమికొడతాయి.
ఏనుగులు మనుషుల్లాగే ఆలోచిస్తాయి, తోటి ఏనుగుల పట్ల వాటికి అమితమైన ప్రేమానురాగాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనమే కేశవ్ అనే ఏనుగు కథ. కేరళలోని మధుమలై నుంచి 21 ఏనుగులు దశాబ్దాల క్రితం వలస వచ్చాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవుల్లో సంతతి వృద్ధి చేసుకొని 100కు పైగా సంఖ్య పెంచు కున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి, కర్ణాటకలోని కోలారు, ఆంధ్రలోని పలమనేరు, కుప్పం అడవుల్లో తిరుగు తున్నాయి. 21, 7, 4, 10, 17 ఇలా బృందాలుగా మారాయి. వీటిలో ఒకటే ఈ కేశవ. ఇప్పడు దీని వయసు 17 ఏళ్లు. వ•డేళ్ల క్రితం పలమనేరు సమీపంలోని జగమర్ల వద్ద కేశవ్ మరో 3 ఏనుగులతో కలసి రోడ్డు దాటుతుండగా ఒక వాహనం ఢీకొని వ•డు ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న కేశవ్, మిత్రుల మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర దుఃఖంతో క్రూరంగా మారింది. అవి చనిపోయి, పూడ్చిపెట్టిన ప్రదేశం చుట్టుపక్కలే తిరుగుతూ మనుషులపై, పశువులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. గతేడాది ఒక అటవీ శాఖాధికారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో కేశవ్‌ను బంధించడానికి అటవీ శాఖ ఐదు కుంకీ ఏనుగులతో భారీ కార్యాచరణ చేపట్టింది. ఆశ్చర్యకరంగా, తన మిత్రులను పూడ్చిపెట్టిన ప్రదేశంలోనే కేశవ్ అధికారులకు చిక్కింది. మొదటి రోజు అది తప్పింకోగా, రెండో రోజు ఆరు గంటల పాటు శ్రమించి, మత్తు మందు ఇచ్చి, కుంకీల సాయంతో దాన్ని బంధించారు. అనంతరం పలమనేరు సమీపంలోని ముసలిమడుగు శిబిరానికి తరలించి, ప్రత్యేక చెక్క బోనులో ఉంచి మచ్చిక చేసుకుంటున్నారు. దానికి కేశవ్ అని పేరుపెట్టారు. ఒకప్పుడు భయభ్రాంతులకు గురిచేసిన కేశవ్, ఇప్పుడు శిక్షణ పొందుతూ భవిష్యత్తులో ఉత్తమ కుంకీ ఏనుగుగా మారనుంది.
ఏపీకి విచ్చేసిన జయంత్, అభిమన్యు
కేశవ్ లాగానే శిక్షణ పొందిన మరో రెండు అత్యుత్తమ కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యు. జయంత్ ననియాలలో శిక్షణ పొందగా, అభిమన్యు కర్ణాటకలో శిక్షణ తీసుకుంది. పలమనేరులో ఏనుగులను అదుపు చేసే కార్యాచరణలో ఇవి కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఒడిశా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దుల్లోకి వస్తున్న అడవి ఏనుగుల గుంపులను అడ్డుకోవడానికి వీటిని అక్కడికి తరలించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం అటవీ రేంజ్ పరిధిలోని ననియాలలో 2006లోనే తొలి కుంకీ శిక్షణ శిబిరం ఏర్పాటైంది. ‘వినాయక్, జయంత్’ పదిహేడేళ్లుగా అక్కడ సేవలందించి, ప్రస్తుతం వృద్ధాప్యంలోకి చేరుకున్నాయి. దీంతో మరిన్ని కుంకీ ఏనుగులు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక అటవీ శాఖను కోరగా, ఆ రాష్ట్రం అంగీకరించింది. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా కుంకీ ఏనుగుల అప్పగింత పత్రాలను పవన్ కల్యాణ్‌కు అందజేశారు. దేశంలోనే అత్యధికంగా వ•డువేల ఆరువందల తొంభయ్ ఐదు ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయి. తొలి విడతగా నాలుగు కుంకీ ఏనుగులను, వాటికి శిక్షణ ఇచ్చే మావటీలు సహా ఆంధప్రదేశ్‌కు తరలించగా, మరో రెండింటిని త్వరలో పంపనున్నారు. వీటిని పలమనేరు సమీపంలోని ముసలిమడుగు శిబిరంలో ఉంచి, స్థానిక అటవీ పరిస్థితులకు అలవాటు పడేలా నెల రోజులపాటు శిక్షణ ఇచ్చారు. దీనికోసం తొంభై లక్షల రూపాయలు వెచ్చించారు. ఈ నెలలోనే జయంత్, అభిమన్యు కుంకీ ఏనుగులను శ్రీకాకుళం గుచ్చిమి శిక్షణ శిబిరానికి తరలించారు.
ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల కారణంగా నెలకొంటున్న వర్షాభావ పరిస్థితుల వల్ల శేషాచలం వంటి దట్టమైన అడవుల్లో సైతం నీటి వనరులు ఎండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు దాహంతో, ఆకలితో అలమటిస్తూ అడవిని వదిలి జనావాసాల్లోకి రావడం, మానవ-వన్యప్రాణి సంఘర్షణకు దారితీస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతుల పంటలను, ప్రాణాలను కాపాడటానికి కుంకీ ఏనుగులు అటవీ శాఖకు ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగప డుతున్నాయి. అడవి ఏనుగుల దాడుల నుంచి రైతులను రక్షించడంలో ‘‘ఏనుగులకు ఏనుగులే సమాధానం’’ అనే విధానం విజయవంతం అవుతోందని కుంకీల వృత్తాంతాలు స్పష్టం చేస్తున్నాయి.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్