తెలంగాణలో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యం.. రైస్ మిల్లులకు చేరిన తర్వాత పరిణామాలపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యం గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. ధాన్యం రికార్డుల్లో చూస్తే ఒక లెక్క.. గోదాముల్లో చూస్తే మరో లెక్క కనిపించడం, మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం పేరుకుపోవడం వంటి పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లింగ్ వ్యవస్థపై అనుమానాలను పెంచుతున్నాయి. ఇటీవలి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలతో క్రమంగా అక్రమాలు బయటపడుతున్నాయి. వీటినిబట్టి చూస్తే.. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చినవి మచ్చుకు కొన్ని మాత్రమే అయి ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే పెద్దమొత్తంలో ధాన్యం లెక్క తప్పిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి వ్యవసాయ సీజన్‌లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఆ ధాన్యాన్ని మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం అప్పగించిన తర్వాత, నిర్దేశిత నిబంధనల ప్రకారం బియ్యంగా మార్చి పౌరసరఫరాల శాఖ లేదా ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగితే రైతుల ప్రయోజనం, ప్రభుత్వ ఆహార భద్రతా వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ మూడింటికీ భరోసా ఉంటుంది. కానీ మిల్లుల వద్దే ధాన్యం మాయమవుతున్నట్లు తనిఖీల్లో వెల్లడవుతున్న పరిణామాలు.. ఈ వ్యవస్థలోని పర్యవేక్షణ లోపాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా ధాన్యం వ్యత్యాసాలు గుర్తించారు. తొలి దశలో ఆరు జిల్లాల్లోనే సుమారు 52 కోట్ల రూపాయల విలువైన సన్నధాన్యం గల్లంతైందని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మిల్లుల్లో నిల్వలు, రికార్డులను పరిశీలించగా ఈ వ్యత్యాసాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మిల్లుల్లో ఇలాంటి తనిఖీలు జరిగితే అక్రమాల విలువ వేల కోట్ల రూపాయలకు చేరవచ్చని వారి అంచనా. అంతేకాదు.. ఆ తర్వాత కొనసాగించిన తనిఖీల్లో మరిన్ని రైస్ మిల్లుల్లో సీఆరఎం అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత కూడా కొనసాగిన సోదాల్లో ఈ అక్రమాల విలువ దాదాపు 600 కోట్ల రూపాయలకు పైమాటే అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.

రికార్డుల్లో ధాన్యం.. గోదాములు ఖాళీ

మిల్లింగ్ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే మార్గాలు చాలానే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కేటాయింపుల మేరకు ధాన్యం మిల్లుల్లో ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తూ, వాస్తవానికి కొంత ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం బస్తాల సంఖ్య, తూకాలు, తేమ శాతం, స్టాక్ రిజిస్టర్లు, ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదైన వివరాలు, గోదాముల్లోని భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసాలు తనిఖీల్లో బయట పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో నాసిరకం ధాన్యంతో మార్పిడి చేయడం, తేమ శాతం పేరుతో అధిక కోతలు చూపడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మిల్లింగ్ తర్వాత బియ్యం రికవరీ తక్కువగా వచ్చిందని చూపించి, వాస్తవంగా లభించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలా జరిగితే నేరుగా ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలగడమే కాకుండా, ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యం లభ్యతపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు

సీఎంఆర్ వ్యవస్థలో ప్రస్తుత సీజన్ అక్రమాలే కాకుండా పాత బకాయిల సమస్య కూడా తీవ్రంగా ఉందని తనిఖీల్లో బయటపడుతోంది. ఉదాహరణకు 2022-23 సంవత్సరానికి సంబంధించిన లెక్కలే చూసుకుంటే.. 10 లక్షల టన్నులకు పైగా బియ్యం ఇంకా రైస్ మిల్లుల నుంచి రావాల్సి ఉందని తెలుస్తోంది. ఈ అక్రమాలు ఎంతో కాలంగా జరుగు తున్నాయనడానికి ఇది నిదర్శనమని అంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన రైస్ మిల్లుల నుంచి భారీ మొత్తంలో ధాన్యం బకాయిలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఇక్కడే ప్రభుత్వ పర్యవేక్షణపై కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండల, జిల్లా స్థాయిలో రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు మిల్లుల్లో ధాన్యం నిల్వలు, సీఎంఆర్ బియ్యం రికవరీని పరిశీలించాల్సి ఉంది. కానీ హైదరాబాద్ నుంచి వెళ్లిన విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టేవరకు భారీ వ్యత్యాసాలు గుర్తించకపోవడం పర్యవేక్షణ వ్యవస్థ పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది.

గత ప్రభుత్వ హయాం నుంచీ ఇదేతీరు?

ప్రస్తుతం అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న అనేక అంశాలు ఇప్పుడు మాత్రమే మొదలైనవి కావన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ బకాయిలు, ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు, మిల్లర్ల డిఫాల్ట్ వంటి సమస్యలు గత ప్రభుత్వ హయాం నుంచే కొనసాగు తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో అధికారులు ఇలాంటి అక్రమాలను గుర్తించినప్పటికీ పై స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ధాన్యం రికార్డులకు, వాస్తవ నిల్వలకు తేడాలు ఉన్నా చర్యలు తీసుకోక పోవడం, ప్రభుత్వ ధాన్యం విక్రయించినా కేసులు నమోదు చేయలేదన్న ఆరోపణలు ఈ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి.

అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పరిణామాలకు బాధ్యత వహించాల్సిందే అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచి పోయినప్పటికీ గత ప్రభుత్వ హయాం నుంచే పేరుకుపోయిన బకాయి లను, అక్రమాలను, మిల్లర్ల వ్యవహారాలను సమీక్షించి ఉంటే, ఇంత పెద్ద మొత్తంలో వ్యత్యాసాలు బయటపడే పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలను విస్తృతం చేయడం, డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలకు సిద్ధమవడం కొంత ఊరట కలిగిస్తున్నా, ఇన్నాళ్లుగా కొనసాగిన పర్యవేక్షణ లోపాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వ పెద్దలపై ఉందంటున్నారు.

కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం?

రాష్టంలో గత కొన్నేళ్లుగా జరుగుతోన్న మిల్లర్ల అక్రమాల వ్యవహారంపై తాజాగా విజిలెన్స్ నివేదికల నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ కఠిన చర్యలకు సిద్ధమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయడం, తీవ్రమైన అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించే దిశగా చర్యలు చేపట్టడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, సీఎంఆర్ అక్రమాల వ్యవహారంలో ఇప్పటికే పలుచోట్ల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వ ధాన్యం మళ్లించిన డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి లెక్కలు మాత్రమే కాకుండా, గత 10 నుంచి 12 ఏళ్ల సీఎంఆర్ కార్యకలాపాలపై ప్రత్యేక ఆడిట్, బకాయిల రికవరీ, బ్లాక్‌లిస్టింగ్, బ్యాంకు గ్యారంటీల అమలు, ఆస్తుల జప్తు, విస్తృత విజిలెన్స్ తనిఖీలు, క్రిమినల్ కేసుల నమోదుపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు, భవిష్యత్తులో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు క్యూఆర్ కోడ్ గన్నీ బ్యాగులు, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ముందు ఉన్నాయి. అయితే, ఇవి కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేస్తేనే ఇప్పటికైనా ఈ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందా?

మరోవైపు, విజిలెన్స్ దాడులు ముమ్మరం కావడంతో రాజకీయ జోక్యం మొదలైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కొందరు మిల్లర్లు తమకు దగ్గరగా ఉండే ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం కీలకమని, అలా చేస్తేనే అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని కొందరు అధికారులు అంటున్నారు. రాజకీయ సంబంధాలు, పలుకుబడి, ఒత్తిళ్లతో అక్రమాలపై చర్యలు తీసుకోవడం మానేస్తే, కుక్కతోక వంకర మాదిరిగానే తయారవుతుందన్న సందేహాలు వినిపిస్తున్నాయి. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి సేకరిస్తోంది. ప్రభుత్వ గోదాము లకు చేరాల్సిన ఆ బియ్యాన్ని దారి మళ్లించడం అంటే ప్రజల ఆస్తికి నష్టం కలిగించ డంతో పాటు ప్రభుత్వాన్ని మోసం చేసినట్లే భావించాలని అంటున్నారు.

ముఖ్యమంత్రికి బీజేపీ అధ్యక్షుడి బహిరంగ లేఖ

ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ పరిణామంతో రైస్ మిల్లుల్లో సీఎంఆర్ అక్రమాల అంశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నుంచి మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం, తిరిగి వచ్చిన బియ్యం మధ్య తేడాలను పరిశీలిస్తే సుమారు 500 కోట్ల రూపాయల విలువైన దాదాపు 90 వేల టన్నుల ధాన్యం విషయంలో అక్రమాలు జరిగి ఉండొచ్చని రామచందర్ రావు సందేహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి చేరలేదన్న ఆరోపణలపై పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు జరిపించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ధాన్యం కొనుగోలు వ్యవస్థ రైతుల జీవనాధారంతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థకు కీలకమని పేర్కొన్న రామచందర్ రావు, కొనుగోలు, రవాణా, నిల్వ, కస్టమ్ మిల్లింగ్ దశల్లో పర్యవేక్షణ, జవాబు దారీతనాన్ని బలోపేతం చేసే సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు.

ప్రస్తత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ముందు అసలు అగ్నిపరీక్ష ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో జరిగిన అక్రమాలను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలకు ముగింపు పలకడంతో పాటు, ప్రస్తుత పర్యవేక్షణ లోపాలకు కూడా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఆడిట్, మిల్లులవారీగా స్టాక్ ధృవీకరణ, డిజిటల్ ట్రాకింగ్, క్రమం తప్పని తనిఖీలు, బకాయిల పూర్తి రికవరీ, దోషులపై వేగవంతమైన చట్టపరమైన చర్యల వంటివన్నీ అమలు చేసినప్పుడే సీఎంఆర్ వ్యవస్థపై తిరిగి ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

  • సుజాత గోపగోని

సీనియర్ జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.