గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్ ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండవ సర్‌సంఘచాలక్‌గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్ భారతదేశం పర్యటించి భారతీయ ఆత్మను అర్థం చేసుకున్న గొప్ప సామాజికవేత్త. వారు ఆజన్మాంతం భారతజాతి నిత్య యవ్వనానికి ప్రేరణదాతగా వివిధ సందర్భాలలో యువకులకు ఇచ్చిన మార్గదర్శనం, స్ఫూర్తి నేటికి కూడా అర్థవంతమైనదే.
దేశం వికాసం జ్ఞానం పాత్ర: నీ చదువుపై దృష్టి కేంద్రీకరించు. మన యువకులు పరిజ్ఞానాన్ని విదేశాలలో ఆర్జించి శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చెయ్యాలి. తద్వారా వాళ్లు మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలలో సమానంగా అభివృద్ధి చేయాలి.
మన పురాణాలలో కచ దేవయానుల కథ ఉంది. అందులో దేవగురువు బృహస్పతి కుమారుడైన కచుడు మృతసంజీవనీ విద్యను నేర్చుకొనడానికై రాక్షసుల గురువు శుక్రాచార్యుని వద్దకు వెడతాడు. విద్యను సాధించి తిరిగి దేవలోకానికి తిరుగు ప్రయాణం అవుతుండగా అతడిని శుక్రాచార్యుని కుమార్తె దేవయాని వివాహమాడగోరుతుంది. కచుడు అందుకు అంగీకరించదు. ఎందుచేతనంటే అతడు వచ్చినది విద్యనేర్వడానికే గాని భార్యను సంపాదించు కొనడానికి కాదు.
విద్యార్థి జీవనం ఆదర్శవంతంగా ఉండాలి : మీరు చదువును నిర్లక్ష్యం చెయ్యడం ఉచిదం కాదు. తమ బాధ్యతలను తగురీతిలో అర్థం చేసుకున్నవారివల్లనే ఉత్తమ కార్యాలు జరగగలవు. పనిచేసే సమయంలో పరిచయంలోకి వచ్చే వారెవరంటే కుటుంబం, పొరుగువారు, సహాధ్యాయులు, విద్యాలయం అధికారులు. వీరందరితోను ఉత్తమరీతిలో వ్యవహరిస్తూ జీవితంలోని ఈ అన్ని అంశాలలోను ఆదర్శాలను నెలకొల్పడం అవసరం. కనుక మంచి విద్యార్థి జీవనం- అనగా మంచి రీతిలో ఉత్తీర్ణులు కావడం, అందు నిమిత్తమై నియమానుసారంగా చదవడం ఆవశ్యకం.
పత్రికా రచన సరైన రీతిలో ఉండాలి : మీరు ఉన్నత విద్య కొరకై అమెరికా వెడుతున్నారు. మీరు అక్కడ చేసే అధ్యయనంలో కృతార్థులై చక్కని పత్రికా రచన చేయగల నిపుణులై తిరిగి రావాలని కాంక్షిస్తున్నాను. సమాజానికి హాని కలిగించేటంత నీచస్థాయి పత్రికారచన ప్రస్తుతం మన దేశంలో కానవస్తూంది. ఎంతో ప్రాముఖ్యం గల ఈ రంగంలో కాస్త సంయమనం, వివేకం అవసరం.
సంఘం సత్ప్రవర్తనను ఉత్పత్తి చేసే కార్ఖానా
‘‘సంఘంలో సత్ప్రవర్తన గురించి ఏ పాఠాలూ బోధించబడవు. ఇక్కడ ఉండేది ప్రత్యక్షమైన, సజీవమైన ఆదర్శాలు. ఇది దేశం కొరకై సర్వస్వాన్ని త్యాగం చేసి, యావచ్ఛక్తితో సమాజసేవ చేసే ఒక చైతన్యయుక్తమైన మహాయోజన. ఇది ఒక కార్ఖానా. నేను ఈనాడు ఒక విశ్వవిద్యాలయంలో నిలబడి ఉన్నాను. విశ్వవిద్యాలయం కేవలం జ్ఞానాన్ని ఇస్తుంది. సచ్ఛీలతను ఇవ్వని జ్ఞానం చెత్తబుట్టలో పారెయ్యదగినది. స్వార్థచింతనను తుచ్ఛంగా భావించి త్యజించి దేశం కొరకై సర్వస్వార్పణ చేసే ప్రవృత్తి ఏ జ్ఞానంవల్ల కలుగదో అటువంటి జ్ఞానాన్ని అందించే విద్యా ప్రణాళిక నిరర్థకం. ఈనాడు ఉన్న పరిస్థితి క్లిష్టమైనదే, కాని ఆశాశూన్యమైనది కాదు. నేడు విద్యార్జన చేస్తూన్న విద్యార్థులు రేపు సమాజానికి ఉపయోగపడతారు. వట్టి మాటలతో కాదు, తమ నిస్వార్థ సేవతో జాతీయ శీలపు ప్రత్యక్షాదర్శాలను సమాజంలో నిలబెడతారు. ఈ ఆశతోనే నా అభిప్రాయాలను మీ ముందు వెల్లడిస్తున్నాను.
అధిక ప్రాముఖ్యం గల సమస్య: ఈ మన యువకుల మహావిశాల సముదాయాన్ని మహనీయ సమాజ రచనకు యోగ్యులుగా, గుణసంపన్నులుగా, నాగరికులుగా తీర్చిదిద్దడం ఎలాగన్నదే నేటి నిజమైన సమస్య. యాంత్రికమైన ఆలోచనలవల్ల, పై పూత చర్యలవల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ పడికట్టు మాటలు ఏ ప్రయోజనాన్ని కలిగించవు. ఉదాహరణకు ఈ ప్రశ్న మాలికలో శైక్షణిక సంస్థలు, బోధకుల-విద్యార్థుల నిష్పత్తి, వారి పరస్పర సంబంధాలు, వసతి గృహ వ్యవస్థ మొదలైన విషయాల గురించిన ప్రశ్నలు ఉన్నాయి. కాని ఈ ప్రశ్నలు సమస్య మూలం వరకు వెళ్లేవిగా లేవు. సంస్థలు ఎలా నడుస్తున్నాయన్న దానికన్నా విద్యా బోధన ఈ లక్ష్యంతో, ఏ ఆశయంతో జరుగుతోంది, గుణసంపద విషయంలో అధ్యాపకుల స్థాయి, వసతి గృహ ప్రముఖుల స్థాయి ఎటువంటిది – అన్న ప్రశ్నలు మరింత ముఖ్యమైనవి. దేశమంతటిలో వీటి చుట్టూ ఎటువంటి వాతావరణం ఉందీ అన్న విషయాన్ని మనం సమర్థవంతంగా పరిశీలించాలి.
దృశ్య శ్రవ్య సాధనాలు : నేటి విద్యాబోధనలో దృశ్య – శ్రవ్య సాధనాల జోరు ఎక్కువగా ఉంది. ఇది సరైనదే. బోధనలోను, శీల నిర్మాణంలోను ఈ సాధనాలు చాలా ఉపకరిస్తాయి. కాని నేడు ఈ సాధన శక్తిని దుర్వినియోగం చెయ్యడమే ఎక్కువగా జరుగు తోంది. పత్రికలలో, గోడలమీద, ఇళ్లపైన ఎక్కడెక్కడ దృష్టి వాలుతుందో అక్కడల్లా ప్రకటనలు ప్రత్యక్షమౌ తున్నాయి. రేడియోల ద్వారా, ఆంప్లిఫైయర్ల ద్వారా, ట్రాన్సిస్టర్ల ద్వారా అశ్లీల గీతాల హోరు చెవులను దిమ్మెక్కించేస్తోంది. ఎప్పుడు చూసినా కోలాహలమే. చెవులకు, కళ్లకు అడుగడుగున ఉద్రేకపరచే పాటలు, బొమ్మలు ఎదురౌతున్నాయి. వీటివల్ల యువకుల మనస్సులలో నైతికస్థాయి ఎంత దిగజారగలదో ఊహించుకోవడం కష్టంకాదు.’’
మౌలిక దృక్కోణం : మనం ఆలోచించే పద్ధతిని సరిచేసుకోవాలి. మన జీవితం మూల భూతమైన తత్త్వాన్ని మనసులలో ప్రతిష్ఠించుకోవలి. వ్యక్తి జీవితాన్ని, రాష్ట్ర జీవితాన్ని పరిపూర్ణం చేసే విలువలను మనం స్వీకరించాలి. ఇదే ప్రస్తుత కాలపు ఆవశ్యకత. ఈ విలువల లోపమే ఇప్పుడు విద్యార్థు లలో క్రమశిక్షణా రాహిత్యం ఇతర సామాజిక దోషాల మూలాలతో పెనవేసుకొని ఉంది. విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యపు సమస్యను దానిలో ముడిపడి విషయాల నుంచి వేరుచేసి చూసి పరిష్కారాన్ని వెతకడంవల్ల ఏ ఉపయోగము ఉండదు. దీని పరిష్కారానికి మనం లోతైన చర్యలు చేపట్టక పోయినట్లయితే, ఇతరమైన పైపై నివారణ చర్యలు ఏ సత్ఫలితాలను ఇవ్వవు.’’
ప్రగతి అంటే ఏమిటి?: శ్రీ గురూజీ అలహాబాదు యూనివర్సిటీకి ఆహ్వానించబడ్డారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ‘‘ప్రగతి అంటే ఏమిటి? ప్రతి కదలిక ప్రగతి అవుతుందా? ఒకడు కొండశిఖరం మీద నుండి కిందపడి – చూడండి, నేనెంత ప్రగతి సాధించానో అంటే ఎలా ఉంటుంది? ఎవరైనా నాయకుడు దేశాన్ని గోతిలో దింపు తూన్నట్లయితే అతడు నాయకుడు కాడు. శిఖరానికి చేరుకోవడానికి అడ్డదారులుండవు. ఒక్కొక్క అడుగూ బలంగా వేస్తూ పైకి ఎక్కవలసి ఉంటుంది. కష్ట పడాలి, సాధన చెయ్యాలి, అప్పుడు శిఖరాన్ని చేర గలగుతాము. శిఖరం మీద నుంచి కిందకు అడ్డదారి ఉంటుంది.పై నుంచి కిందపడడం సులువే’’ అన్నారు.
సత్ప్రవర్తనతో తల్లిదండ్రులు అనుకూలం చేసుకోవాలి: ఇండోర్ సంఘశిక్షావర్గలో శ్రీ గురూజీ రాజస్థాన్ నుంచి వచ్చిన యువకార్యకర్తలతో సంభాషిస్తున్నారు. ఒక స్వయంసేవకునితో మాట్లాడుతూండగా అతడు తన ఇంటి వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలియవచ్చింది. అతడు తన తల్లిదండ్రులకు తగిన మర్యాదనిచ్చి మాట్లాడటం లేదు. తన తండ్రికి సంఘం అంటే సదభిప్రాయం లేదన్న కారణంతో ఆ స్వయంసేవకుడు ఇంట్లో సరిగ్గా ప్రవర్తించటం లేదు. అతడిని ఉద్దేశించి శ్రీ గురూజీ ఇలా అన్నారు: ఇంట్లో తల్లిదండ్రులను, ఇతర పెద్దలను గౌరవిస్తూ, సంఘకార్యాన్ని మనసులో దృఢంగా నిలిపి ఉంచుకుంటూ ఇంటి పనులన్నిటినీ సక్రమంగా నిర్వర్తించడం స్వయంసేవకుని మొదటి కర్తవ్యం. తల్లిదండ్రుల ఆజ్ఞని ఉల్లఘించకూడదు. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి సంఘకార్యానికే పూర్తిగా అంకితంకావాలన్న కోరిక మనస్సులో బలంగా ఏర్పడితే అప్పుడు మాత్రమే కాస్తోకూస్తో తల్లిదండ్రుల మాటను పాటించక పోవడం, ప్రచారక్ గానో పని చెయ్యడం జరుగుతుంది. అలా మొదట్లో కాస్త ఘర్షణ ఏర్పడినా, తమ కుమారుని జీవితంలో సంఘకార్యానికే పూజ్యస్థానం ఉందని, తన జీవితాన్ని శీల పరిపూర్ణం చేసుకొని సమాజ సేవలో వినియోగించాలన్న ఏకైక వాంఛ మాత్రమే అతడిలో కనబడుతూందని అర్థమయ్యాక ఆ తల్లిదండ్రులు కూడా తప్పకుండా సంఘాన్ని ప్రశంసిస్తారు. వారు కూడా కోరుకునేది తమ కుమారుని సంతోషాన్నే, సంఘ కార్యంతో మాత్రమే అతడికి సంతోషం కలిగినట్లైతే వారు కూడా సంఘం పట్ల అనుకూల భావం గలవారే అవుతారు.
జాతీయ భావ జాగరణలో చాలా విషయాలు ఇమిడిఉంటాయి. మన వారసత్వం, ఉన్నత పరంపర, జాతీయ దృష్టికోణం మొదలైన అనేక విషయాలు అందులోకి వస్తాయి. ఇతర దేశాల పట్ల మన వైఖరి కూడా దానికి సంబంధించిన అంశమే. జాతీయ భావజాగరణకు భారత్‌లో ప్రయత్నం జరగటంలేదు. ఇది దయనీయ పరిస్థితి. ఇండో నేషియాలోను, మలేషియాలోను సీత (వాళ్లు సిందా అంటారు), శ్రీ రామచంద్రుని చిత్రకథలను ప్రచు రించి తమ ప్రాచీన పరంపర గురించిన అవగాహ నను కొత్తతరంవారికి అందించే ప్రయత్నాలు చేస్తు న్నారు. ఈ పుస్తకాలను నేను చూశాను. తమ ఆరాధనారీతి ఇస్లాం అయినా తమ పరంపర హిందూ పరంపర అని అక్కడి పరిపాలకులు అర్థం చేసుకుంటున్నారు.
ఇలాంటి పుస్తకాలనే క్రైస్తవ మిషనరీలు ప్రచు రించి బాలబాలికల మస్తిష్కాలలో క్రైస్తవ సిద్ధాంతాల ప్రభావాన్ని నింపేందుకు ప్రయత్ని స్తూన్నట్లు మీరు గమనించే ఉంటారు. ఈ మిషనరీలు ఒక కొత్త ఎత్తుగడను ప్రారంభించారు. తమ కథలలోని పాత్రలకు వాళ్లు రాముడు, కృష్ణుడు, గోవిందు మొదలైన పేర్లు పెడతారు. కాని కథలలోని విషయం మాత్రం క్రైస్తవ సిద్ధాంతాలకు సంబంధించినదై ఉంటుంది.
దేశభక్తి వ్యాపారంకాదు : ఒకప్పుడు సంఘ సంస్థాపకులైన డాక్టర్జీ ఇంటిగోడ కూలిపోయింది. దాన్ని మళ్లీ ఎప్పుడు కడతారని ఎవరో అడగగా ‘‘మెల్లి మెల్లిగా అది జరుగుతుంది’’ అని జవాబిచ్చారు. ఆ ప్రశ్నించిన వ్యక్తి ‘‘సమాజం కోసం ఇంత పనిచేస్తు న్నారు. ఒక్కగోడ కట్టుకోవడానికి మీ దగ్గర డబ్బు లేదు. ఫలానా ఆయనను చూడండి, ఆయన ఏకంగా ఇల్లు కట్టుకున్నాడు, మోటరు కారు కొనుక్కు న్నాడు. ఆయన దేశభక్తుడు కూడా. మీరు చూస్తే ఇలానే ఉన్నారు’’ అన్నాడు. డాక్టర్జీ ‘‘నేను అలాగే మరణి స్తాను. దేశభక్తితో నేను వ్యాపారంచెయ్యను’’ అన్నారు.
తల్లి కోరిక : ఈనాటి సంకట గ్రస్తమైన ఘడియలలో జన్మించినందుకు మనమెంతో అదృష్టవంతులమని భావించుకోవాలి. శాంతి, సమృద్ధి, సంపద, శక్తి గల దేశంలో జన్మించడమే అదృష్టమని మనవారు అనుకుంటారు. ఇలా ఆలోచించేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. అమెరికా, ఇంగ్లండు, మొదలైన దేశాలలోని బోగవిలాసాలకు ప్రలోభపడి అక్కడకు వెళ్లి జీవిస్తూ ఉంటారు. కాని నిజమైన వీరత్వం ఉన్న యువకులు మరొక రకంగా ఆలోచిస్తారు.
ఈ దేశంలో జీవిస్తూ కష్టాలను, లోటును, ఆపదలను ఎదుర్కొని తమ ప్రయత్నాల ద్వారా సంఘర్షణ ద్వారా వాటిని అధిగమించి సౌభాగ్యంవైపు పయనించే అవకాశం తమకు లభించి నందుకు వారు భగవంతునికి ధన్యవాదాలు చెబుతారు. వైభవం, సమృద్ధి ఉన్న సమయంలో పుట్టి ఉంటే మన జీవితాలకు కేవలం పుట్టడం, కొంత కాలం సుఖ సౌకర్యాలతో జీవించడం, ఏదో ఒకనాడు మరణించడం మాత్రమే అర్థంగా ఉండేది. కాని ప్రతికూల పరిస్థితులలో మనలోని సర్వోన్నత శక్తి సామర్థ్యాలను, గుణసంపదను ప్రదర్శించి , మన పౌరుషాన్ని పరీక్షకు నిలిపి, లోకం ముందు భవ్య ప్రచండ వ్యక్తిత్వంతో నిలబడే అవకాశం లభిస్తుంది. మనలోని సంపూర్ణ ఔన్నత్యాన్ని సాధన లోకి తెచ్చి మానవ మేధస్సు ఊహించగల అత్యధికమైన ఎత్తును ఎగిరి అందుకునే సదవకాశం లభిస్తుంది.
నేడు మన దేశమాతకు కావలసినది తన పుత్రులు అటువంటి శ్రేష్ఠ యువకులుగా, త్యాగ ధనులుగా, అంతకుమించి శౌర్యధనులుగా, పౌరుష సంపన్నులుగా తయారుకావడం. నరుని (శాశ్వత పౌరుషం) నారాయణుని (శాశ్వత జ్ఞానం) సంయోగం జరిగినప్పుడు విజయం నిశ్చితమని అర్థం చేసుకోవాలి. అటువంటి ప్రభావ సంపన్నులైన పురుషులే చరిత్రను నిర్మిస్తారు.