‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

ఆ మర్నాడు ప్రియ తన స్నేహితురాళ్లతో పిక్‌నిక్‌కి వెళ్లింది. ఆ ఊరికి దగ్గర్లోనే ఉన్న అడవిలోని జలపాతం దగ్గరికి వెళ్లారు. వెళ్లేముందు శ్రీధర్, కౌసల్య కూతురు ప్రియకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. అయినా ప్రతి గంటకు ఆమెతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. చివరకు ప్రియ కోపంతో ‘మాట్లాడవద్దు’ అని అమ్మానాన్నలకు చెప్పడంతో ఫోన్ చేయడం మానేశారు..

సాయంత్రం ఆరు గంటలకు పిక్‌నిక్ నుంచి వచ్చింది ప్రియ. ఎప్పుడు ఆమె బయటకు వెళ్లినా ఇంటికి రాగానే, అక్కడ జరిగిన విషయాలన్నీ తనతో ఏకరవు పెట్టే ప్రియ…ఆ రోజు ముభావంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది కౌసల్య.

ఆమెకు కూల్‌డ్రింక్ ఇస్తూ “ప్రియా! డల్‌గా కనిపిస్తున్నావు? ఒంట్లో బాగుండలేదా?” అడిగింది కౌసల్య.

“బాగానే ఉంది అమ్మా” ముభావంగా చెప్పింది ప్రియ.

“పిక్‌నిక్ బాగా జరిగిందా? అక్కడేం చూశారు? భోజనాలు బాగున్నాయా?” అడిగింది కౌసల్య ..కూతురుని ఉత్సాహపరచాలన్న ఉద్దేశ్యంతో.

“బాగానే జరిగింది” అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.

“ప్రియా! ఏమిటా పరధ్యానం? పిక్‌నిక్ గురించి, భోజనాల గురించి నేనడుగు తుంటే ఏమీ మాట్లాడ కుండా వెళతావేంటి?” కోపంగా అడిగింది కౌసల్య.

“అమ్మా! నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. తగ్గిన తర్వాత అన్నీ చెబుతానులే” అని గదిలోకి వెళ్లి మంచం విÖద పడుకుంది .

కూతురు ప్రవర్తన కౌసల్యకి వింతగా అనిపించింది. ఏం జరిగిందో అక్కడ? నలుగురు స్నేహితురాళ్లు కలిస్తే గొడవలు,పోట్లాటలు జరుగుతుంటాయి. ప్రతి దానికి వాదులాడుకుంటూ ఉంటారు. ఏదో అక్కడ గొడవ జరిగే ఉంటుంది. తరువాత అదే చెబుతుంది” అనుకుని తన పనిలో మునిగిపోయింది కౌసల్య.

సాయంత్రం శ్రీధర్ ఇంటికి వస్తూనే,“ప్రియ వచ్చిందా?” ఆతృతగా అడిగాడు భార్యను.

“ఆ! గంట క్రితమే వచ్చింది. ఎందుకో డల్‌గా ఉంది. ఏం అడిగినా చిరాకుపడుతోంది” చెప్పింది కౌసల్య.

“ఎక్కడుంది అది?” అడిగాడు.

“గదిలో పడుకుంది. లేస్తే కాఫీ ఇద్దామని చూస్తున్నాను” చెప్పింది కౌసల్య.

శ్రీధర్ ఆమె గదిలోకి వెళ్లి “ప్రియా! లేమ్మా. చీకటి పడుతోంది” అన్నాడు.

“నేను మేల్కొనే ఉన్నాను నాన్నగారూ!” అంది ప్రియ కళ్లు నులుముకుంటూ.

“మరి పడుకున్నావెందుకు? ఒంట్లో బాగుండ లేదా?” అడిగాడు.

“కొంచెం నలతగా ఉంది” అంది.

“లేచి ముఖం కడుక్కో. పడుకుంటే మరింత డల్‌నెస్ వస్తుంది” అన్నాడు ఆమె చెయ్యి పట్టు కుంటూ. ప్రియ లేచి పెరట్లోకి వెళ్లింది. అక్కడ కుండీలోని నీటితో ముఖం కడుక్కొని తువ్వాలుతో తుడుచుకుంది.

“ప్రియా! కాఫీ” కౌసల్య పిలిచింది.

“నేను కాఫీ తాగను అమ్మా” అంటూ ప్రియ డాబా విÖదకు వెళ్లడానికి మెట్లు ఎక్కసాగింది.

“ఏవండోయ్! మీ కూతురు కాఫీ తాగనంటోంది. మీరే పట్టుకెళ్లి తాగించండి. ఇవాళ దాని మూడ్ బాగున్నట్లు లేదు” భర్తను పిలిచి ఇచ్చింది కౌసల్య.

శ్రీధర్ ఆలోచిస్తూ కాఫీ గ్లాసు పట్టుకొని డాబా ఎక్కాడు. డాబా విశాలంగా ఉంది. అక్కడ నుంచి చూస్తే ఊరు, పచ్చటి పొలాలు, ఏరు అన్నీ కనిపిస్తు న్నాయి. శ్రీధర్ కళ్లు కూతురు ప్రియ కోసం వెతికాయి. ఆమె ఓ మూలనున్న సన్నజాజి పందిరి దగ్గర మొగ్గలేరుతూ కనిపించింది.

“ప్రియా! కాఫీ తాగు” అంటూ ఆమె దగ్గరికి వెళ్లాడు శ్రీధర్.

“నాన్నగారూ! నాకెందుకో ఇవాళ కాఫి తాగబుద్ధి వెయ్యటం లేదు. నోరంతా చేదుగా ఉంది” అంది ప్రియ.

“ఈ రోజు నీకేమైంది? అందుకే నిన్ను పిక్‌నిక్‌లకు వెళ్లొద్దనీ చెబుతుంటాను. అయినా నా మాట వినవు” అన్నాడు కోపంగా శ్రీధర్.

అతని మాటలకు ప్రియ మౌనం దాల్చింది. నిశ్శబ్దం అలముకుంది. శ్రీధర్ కూతురును గమనిస్తున్నాడు. ఏదో జరిగింది ప్రియకు? ఎప్పుడూ చలాకీగా తుళ్లుతూ కేరింతలు కొట్టే ప్రియ ఈరోజు డల్‌గా ఉంది. ఆమె వదనంలో నిరుత్సాహం కనిపిస్తోంది.

ఇంతలో ప్రియ అతని దగ్గరకు వచ్చింది. శ్రీధర్ ఆశ్చర్యంగా ఆమె వైపే చూడసాగాడు. ఆమె కళ్లల్లో తడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరిగిందో శ్రీధర్‌కి అర్థం కాలేదు.

“ప్రియా! ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా?” అడిగాడు.

“నాన్నా! నేనో విషయం అడుగుతాను. కోప్పడ కుండా చెబుతారా?” అంది చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.

శ్రీధర్ ఆమెని ఆశ్చర్యంగా చూడసాగాడు. ప్రియకి ఏదో జరిగింది. ఆమెకేదో సందేహం కలిగింది. ఆమె ఏం అడుగుతుందోనని అతనికి ఆతృత పెరగసాగింది.

పిక్‌నిక్‌లో ఏదైనా జరగరాని సంఘటన జరిగిందా? ఎంతో సరదాగా పిక్‌నిక్ వెళ్లిన ప్రియ ముఖంలో ఇంటికి వచ్చిన తరువాత నిరుత్సాహం, ఆందోళన కనిపించడం అతనిలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

“ఏ విషయమో చెప్పు? ఇంతకీ ఏం జరిగింది?” అడిగాడు. అతని మాటల్లో ఆతృత ధ్వనించసాగింది.

“నాన్నగారూ? నేను అమ్మకు పుట్టలేదట. నిజమేనా?” అడిగింది.

ఆ ప్రశ్నకు ఒక్కసారిగా శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు. ఆమె ప్రశ్న అతనికి అర్థ్ధం కాలేదు. ప్రియ అడిగింది నిజమేనా? తను సరిగ్గానే విన్నాడా? అతని ఆలోచనలు విపరీతంగా సాగిపోతున్నాయి.

“నువ్వేం అడుగుతున్నావు?”అడిగాడు. ఇప్పుడు అతని మాటల్లో తడబాటు కనిపించసాగింది.

“నేను అమ్మకి పుట్టానా?” అడిగింది.

“అమ్మకే పుట్టావు. అమ్మకి కాకపోతే ఇంకెవరికి పుడతావు? అయినా ఈ సందేహం నీకెందుకు వచ్చింది? ఎప్పుడు లేనిది ఏమిటీ పిచ్చి ప్రశ్న?” కోపంగా అడిగాడు శ్రీధర్.

“నా ఫ్రెండ్స్ చెప్పారు నాన్నా! నేను విÖకు పుట్టలేదుట. నన్నెక్కడి నుంచో తెచ్చి పెంచుకున్నారట. వాళ్లు ఆ మాటలంటున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను ఆ మాటలు నమ్మలేదు. అందుకే మిమ్మల్ని అడిగాను” అంది కళ్లు తుడుచుకుంటూ.

ఆమె సమాధానం అతని చెవులకు సోకింది కానీ సరిగ్గా వినిపించటంలేదు. వినిపించలేదా? లేక తన మనస్సు దానిని సరిగ్గా వినలేదా? అసలు ఏమిటీ ప్రశ్న? ఎప్పుడూ వినకూడని ప్రశ్న? అసలు ఇది నిజమేనా? ఎప్పుడూ తనతో మాట్లాడటానికే భయపడే కూతురు ప్రియ అడిగిన ప్రశ్నేనా ఇది?

అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. మస్తిష్కం మొద్దు బారిపోతోంది. ఆ ప్రశ్నకు తన దగ్గర సమాధానం ఉందా? ఏం చెప్పాలి ఆ పిల్లకు? ఏ తండ్రీ ఎన్నడూ ఊహించని ప్రశ్న? ఎప్పుడూ వినకూడని ప్రశ్న? ఏ కూతురికీ రాకూడని సందేహం.

 రాను రాను అక్కడ నిశ్శబ్దం పేరుకుపోతోంది. గాలి చప్పుడు తప్ప అక్కడంతా నిశ్శబ్దం. సూది మొనపడితే వినిపించేటంతటి నిశ్శబ్దం.

“నాన్నా! నేను మొదట నమ్మలేదు..కానీ మా ఫ్రెండ్స్‌లో ఇద్దరికి వాళ్ల అమ్మానాన్నలు నేను విÖకు పుట్టలేదనీ,నన్ను ఎక్కడినుంచో తెచ్చుకొని పెంచు కున్నారనీ’ చెప్పారట. ఆ మాటలు వినగానే చాలా బాధ వేసింది. అనవసరంగా వాళ్లతో పిక్నిక్ వెళ్లాననిపించింది.

అయినా వాళ్లు చెప్పినది నిజం కాదని నాకు తెలుసు. నిజం కాకూడదనీ ఆ దేవుడికి మొక్కాను. అది నిజం కాదనీ విÖరూ చెప్పండి నాన్నా! ఇంకెప్పుడూ మిమ్మల్ని ఈ ప్రశ్న అడగను. అమ్మని కూడా అడగను. ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే వాళ్లతో జన్మలో మాట్లాడను” ఏడుస్తూ అంది ప్రియ.

ఆమె మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి శ్రీధŠర్‌కి. అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పుడూ…కూతురు ఏ ప్రశ్న వేసినా తక్షణంలో సమాధానం చెప్పే తనకు ఇప్పుడు ఈ ప్రశ్న ఇబ్బంది పెడుతోంది.

అతన్ని ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. ఈ లోకం బయటకు కనిపించే టంతటి మంచిది కాదు. కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకునే మనుషు లున్న సమాజం మనది.

మనతో మంచిగా ఉంటూ లోపల అసూయ అనే అగ్నిపర్వతాలు దాచుకునే మనుషులుండే సమాజం ఇది. లేకపోతే చిన్నపిల్లలతో అనే మాటలేనా అవి? తన కూతురు గురించి తమ పిల్లలకు చెప్పే అవసరం వాళ్లకేం ఉంది?

దాని వల్ల పసిపిల్లల మనసులు కలుషితం అవడం తప్ప ప్రయోజనం ఏం ఉంటుంది? అవసరం అయితే నాలుగు మంచి మాటలు చెప్పాలి కానీ ఇలా విషాన్ని చిమ్మకూడదు. అందులోనూ చెప్పిన వాళ్లు ఈ సమాజాన్ని బాగుపరచడానికి బయల్దేరిన ఉపాధ్యాయులు. ఇటువంటి ఉపాధ్యాయు లతో సమాజం బాగుపడుతుందా?

శ్రీధర్ మస్తిష్కంలో పర్జన్య ఘోష. అతని గుండెల్లో కెరటాల హోరు.

“నేను మీకే పుట్టానని చెప్పండి నాన్నా? నేను మీ పిల్లనే అని చెబితే రేపు నాకు అలా చెప్పినవాళ్ల నోళ్లు మÖయించేలా గట్టిగా సమాధానం చెబుతాను” అంది ప్రియ.

ఆమె మాటలకు అతను ఉలిక్కిపడి ఆలోచన ల్లోంచి తేరుకున్నాడు. అప్పటికే అతని ముఖం చెమటతో నిండిపోయింది.

“వాళ్లు చెప్పింది అబద్ధం. నువ్వు మాకే పుట్టావు. నువ్వు నా కూతురివి. ఎవ్వరి మాటలూ నమ్మకు” అన్నాడు శ్రీధర్.

ఆతని మాటలు నూతిలోంచి వస్తున్నట్లు వినిపించాయి. అయినా అవి ప్రియ చెవులకు అమృతంలా సోకాయి. ఆ మాటలు వినగానే ఆమె మోములో చిరునవ్వు విరిసింది. కన్నీళ్లు ఆగి పోయాయి. ఆనందం మళ్లీ చెమర్చడం మొదలైంది. ఆమె ముఖంలో ఆ మార్పు స్ఫష్టంగా కనిపిస్తోంది.

వెంటనే ఆమె పరుగున తండ్రి వద్దకు వచ్చి కావలించుకుంది. శ్రీధర్‌కి స్పర్శ ఆనందాన్ని కలిగించింది. అతనిలోని పితృవాత్సల్యం ఒక్కసారిగా ఉప్పొంగింది.

ఇంతలో కౌసల్య “టిఫిన్ చేద్దురుగాని రండి” అని గట్టిగా పిలవడంతో ప్రియను తీసుకొనీ కిందకు దిగాడు.

ఆ రాత్రి భోజనాల తరువాత ప్రియకు కాసేపు లెక్కలు చెప్పాడు. కొద్దిసేపటికి “నాన్నా! నాకు నిద్ర వస్తోంది” అంటూ గదిలోకి వెళ్లిపోయింది.

కొద్దిసేపటికి పనులు ముగించుకొని, కౌసల్య భర్త దగ్గరకు వచ్చింది. ప్రతిరోజు వెన్నెల్లో డాబా మీద కబుర్లు చెప్పుకోవడం ఆ దంపతులకు అలవాటు.

ఇద్దరూ డాబా పైన చాప విÖద కూర్చున్నారు. వెన్నెల చల్లగా కురుస్తోంది. నీలాకాశంలో చంద్రుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. దూరం నుంచి కలకూజితం వినిపిస్తోంది. చల్లటి మలయమారుతం వీస్తూ హాయి గొలుపుతోంది.

కొద్దిసేపు ఆ జంట వెన్నెల్లో ఆ నీరవ నిశ్శబ్దాన్ని మౌనంగా అనుభవించారు.

ఆ తరువాత శ్రీధర్ “కౌసల్యా! మనం అనుకున్నంత జరిగింది. ఇవాళ పిక్నిక్‌లో ప్రియ స్నేహితురాళ్లు దానితో ‘అది మనకు పుట్టిన పిల్ల కాదని’ అన్నారట. అందుకే ఈరోజు అక్కడి నుంచి రాగానే అది డల్‌గా ఉంది. నన్ను సాయంత్రం డాబా మీద “నేను విÖకు పుట్టలేదా నాన్నగారూ?” అని ఏడుస్తూ అడిగింది అన్నాడు.

అతని మాటలకు కౌసల్య ఆశ్చర్యపోయింది.

“అందుకేనా మీరు అక్కడంత సేపుండి పోయారు. మరి దానికి మీరేం చెప్పారు? అయినా వాళ్లకి ఈ విషయం ఎలా తెలిసిందట? మనం ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేదు కదా?” ఆతృతగా అడిగింది కౌసల్య.

“ఇటువంటి విషయాలు దాగవు కౌసల్యా! అందరికీ తెలుస్తాయి. కాకపోతే ఎవ్వరూ మనల్ని నిజమా?కాదా? అని అడగరు. కానీ అడిగినవారికీ, అడగనివారికీ అందరికీ చెబుతుంటారు. మన ప్రియకి చెప్పింది మా సోషల్ మాస్టారుగారి అమ్మా యట. అంటే మా మాస్టారుగారే ఆ అమ్మాయికి చెప్పి ఉంటారు. కూతురుకే కాదు… తనకు తెలిసిన వాళ్లందరికీ చెప్పే ఉంటాడు. ఇలాగే అందరు మాస్టర్లకు కూడా చెప్పే ఉంటారు. మనం ప్రియని తెచ్చి పెంచుకుంటున్న సంగతి కొందరికే ఈ విషయం చెప్పాము. అయినా ఇందులో దాచ వలసినది ఏముంది చెప్పు? మనకు పిల్లలు కలగ లేదు. అందుకే ప్రియను పెంచుకున్నాము. బయట వాళ్లకి తెలిసినా పర్వాలేదు కానీ దానికే తెలిస్తే అది బాధపడుతుంది. అందుకే ఇప్పటివరకూ దానికి చెప్పలేదు.

కానీ మనం చెప్పకపోయినా దానికి స్నేహితురాళ్ల ద్వారా తెలిసిపోయింది. ప్రస్తుతానికి నేను దానికి నిజం చెప్పలేదు. ఆమె స్నేహితురాళ్లు చెప్పింది అబద్ధం అని మాత్రమే చెప్పాను. కానీ ఒకసారి అనుమానం అంటూ వస్తే అది అంత త్వరగా పోదు. అది దావానంలా దహించి వేస్తుంది. మనం నిజం చెప్పకపోతే అది లోలోపల కుమిలిపోతుంది. అది మరింత ప్రమాదం” అన్నాడు శ్రీధర్.

“ఇంతకీ విÖరేమంటారు? దానికి నిజం చెప్పేస్తారా? అలా చెబితే ఇంకేమైనా ఉందా? మా అమ్మ ఎక్కడ అని అడిగితే ఏం చెబుతారు?నన్ను మా అమ్మ దగ్గరికి తీసికెళ్లండి అంటే ఏం చేస్తారు? ఊళ్లో వాళ్లు ఏదో చెబితే మనకేంటి? మనం మాత్రం నిజం చెప్పొద్దు. లేకపోతే ఇన్నాళ్లూ ఎంతో ప్రేమతో పెంచిన మనల్ని శత్రువులుగా చూస్తుంది. అది దానికి మంచిది కాదు” అంది కౌసల్య.

“దానికి తన జన్మ రహస్యం గురించి అనుమానం కలిగింది. ఇప్పుడు ఆ విషయం మనం చెప్పకపోయినా ఆ కార్చిచ్చు లోలోపలే మండుతూ ఏదో ఒక రోజు ఆ అగ్ని బయటపడుతుంది.అలా జరగక ముందే మనం నిజం చెప్పేస్తే మంచిది. ముందు బాధపడినా, తరువాత సర్దుకుంటుంది. ఇప్పుడు దాని తల్లి ఎక్కడుందో! అసలు ఉందో, లేదో కూడా తెలియదు కాబట్టి అది వాళ్లమ్మ దగ్గరకు వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ నిజం తెలియడం వల్ల తనలో సంఘర్షణ తగ్గుతుంది” అన్నాడు శ్రీధర్.

“అంటే నిజం చెప్పేస్తారా? ఇప్పుడింత త్వరగా ఆ చేదు నిజాన్ని చెప్పకపోతే ఏం నష్టం? కొన్నాళ్లు వేచి చూద్దాము. అది కొంచెం పెద్దదైతే అర్థం చేసుకొనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడు చెప్పినా బాధ ఉండదు” సలహా ఇచ్చింది కౌసల్య.

“ఇప్పుడది చిన్నదనుకుంటున్నావు నువ్వు. కాని దాని వయస్సు పదమÖడేళ్లు. అంటే యుక్త వయస్సులోకి ప్రవేశించింది. అన్నీ అర్థం చేసుకునే వయస్సు. ఇంకా ఆలస్యం చేస్తే దాని మనసు మరింత గాయపడొచ్చు. అలా జరిగితే కోలుకోవడం చాలా కష్టం” అన్నాడు శ్రీధర్.

“మనం దాని తల్లితండ్రులం కాదు అనీ దానికి తెలిస్తే అది తట్టుకోగలదా? దానికేదైనా అయితే మనం తట్టుకోగలమా చెప్పండి?” అంది కళ్లు తుడుచు కుంటూ కౌసల్య.

“అయినా ఈ విషయం ఎప్పుడో అప్పుడు దానికి తెలియక తప్పదు. ఇన్నాళ్లూ ఆ నిజం చెప్పవలసిన అవసరం రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఈ నిజం చెప్పవలసిన రోజు ఇంత త్వరగా వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. మనం ఊహించింది ఎప్పుడూ జరగదు. అదే జీవితం.

 (సశేషం)

  •  గన్నవరపు నరసింహ మూర్తి

About Author

By editor