ఆగస్టు 6న ముంబైలో జరిగిన “ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స” వేదికపై యువతతో సంభాషిస్తూ, అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడం అనేది కొత్త తరంపై విశ్వాసం, సామాజిక సంవాదం, సాంస్కృతిక విలువల ద్వారా మాత్రమే సాధ్యమని ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల నుండి 15 నుండి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 2,000 మంది హైస్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సామాజిక, రాజకీయ, ప్రపంచ, విద్య, సాంస్కృతిక పరిస్థితులపై యువతతో అభిప్రాయాలను మోహన్ భాగవత్ పంచుకున్నారు.

భారతీయ దృక్పథం నుండి ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్రను నొక్కి చెబుతూ, దేశపు కొత్త తరం (జెన్‌జెడ్, జెనఆల్ఫా) భవిష్యత్తుకు ప్రతినిధులనే స్పష్టమైన సందేశాన్ని అందించారు. వారిని అనుమానంతో చూడటం కాకుండా, వారికి ఆత్మీయత, సంభాషణ, మార్గదర్శకత్వం అవసరం అని అన్నారు. అంతేకాకుండా, జాతీయ భద్రత, విద్యా సంస్కరణలు, ఎల్‌జీబీటీక్యూ వర్గం, మహిళల భాగస్వామ్యం, ఉపాధి, రిజర్వేషన్లు, సుస్థిర అభివృద్ధి వంటి సమకాలీన అంశాలపై సంఘ్ దృక్పథాన్ని ప్రముఖంగా వివరించారు.

చర్చలోని ముఖ్యాంశాలు

–           యువత దేశ వ్యతిరేకులు కారు. వారి డిమాండ్లు సమంజసమైనవి. వ్యవస్థాగత సంస్కరణలకు చర్చ ‘తాము ఇందులో భాగమే’ అనే భావన చాలా అవసరం.

–       విద్య అనేది వ్యాపారం కాదు. దానిని ఆ విధంగా కాకుండా భిన్నంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. విద్య బడ్జెట్‌కు జీడీపీలో 6% కేటాయించాలనే ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ఉంది.

–     ఎల్‌జీబీటీక్యూ వర్గం మన సమాజంలో అంతర్భాగం. వివాహ వ్యవస్థకు బదులుగా, స్వలింగ జంటల కోసం ప్రత్యేక చట్టపరమైన విధానం ఉండాలి.

–          దేశ నిర్మాణంలో పురుషులతో సమానమైన పాత్రను మహిళలు పోషించాలి.

–          వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు అవసరం. ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదు.

–         మానవత్వమే అత్యంత ప్రధానమైనది. పాకిస్థాన్ పౌరులందరూ శత్రువులు కారు. సామరస్యం, చర్చలే అంతిమ లక్ష్యాలు కావాలి.

యువత – ప్రజాస్వామ్య హక్కులు

–       నీట్ పరీక్షా పత్రం లీక్ ఇతర అంశాలపై యువత చేపట్టిన నిరసనల గురించి ప్రస్తావిస్తూ, వారి ఆవేదన పూర్తిగా సమంజసమైనదేనని భాగవత్ స్పష్టం చేశారు.

–              యువత దేశ వ్యతిరేకులు కారు: జెన్ జీ తరానికి చెందిన యువత ఉద్యమాలు లేదా నిరసనలలో పాల్గొంటున్నంత మాత్రాన, వారు దేశ వ్యతిరేకులని అర్థం కాదు. వారు మన సమాజంలోనూ, దేశంలోనూ ఒక భాగం. మన తదుపరి తరానికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

– ఆత్మీయత-సంభాషణ: అర్థవంతమైన, ఫలవంతమైన సంభాషణకు ఆత్మీయ భావన అత్యవసరం. అటువంటి ఆత్మీయత ఆధారంగా సంభాషణ జరిగినప్పుడు మాత్రమే ఒకరి సమస్యలను మరొకరు నిజంగా అర్థం చేసుకోగలరు. ఇతర అన్ని పరిపాలనా మార్గాలు మూసుకుపోయినప్పుడు, ప్రజాస్వామ్యంలో నిరసనలు, ప్రదర్శనలు సంభాషణకు ఒక చట్టబద్ధమైన మాధ్యమంగా మారతాయి.

తరాల మధ్య అంతరం – నిజాయితీ

పూర్వపు తరాలతో పోలిస్తే, నేటి జెన్ జెడ్, జెన్-ఆల్ఫా తరాల వారు మరింత సూటిగా, తార్కికంగా ప్రశ్నలు అడుగుతున్నారు. నవతరం తమ పూర్వీకుల కంటే ఎక్కువ నిజాయతీ కలిగి ఉందని సర్‌సంఘ చాలక్ పేర్కొన్నారు. ఒకవేళ ఏ తరాన్ని నమ్మాలనే ఎంపిక వస్తే, తాను జెన్‌జెడ్ తరానికే ప్రాధాన్యత నిస్తామని ఆయన తెలిపారు. మేము జెన్ జెడ్ వయస్సులో ఉన్నప్పుడు మా తరం స్వభావం ఏమిటంటే పెద్దలు చెప్పింది అంగీకరించేవాళ్లం. ప్రశ్నించేవాళ్లం కాదు అని అన్నారు.

నిరసన కూడా సంభాషణే

నిరసన కూడా ఒక రకమైన సంభాషణే అని భాగవత్ చెప్పారు. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం. ఇలా అర్థం చేసుకుంటే సరే. మన మధ్య చర్చ జరుగుతుంది. మీకు ఇబ్బంది ఉంటే లేదా నాకు ఇబ్బంది ఉంటే, దాన్ని పరిష్కరించే అధికారం మీ చేతుల్లో లేదా నా చేతుల్లో ఉంటే, అది జరగకపోతే నేను అరుస్తాను అని అన్నారు.

పెల్లెట్ గన్‌లపై పూర్తి సమాచారం లేదు

విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ, భాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్‌లు వాడిన విషయంపై పూర్తి సమాచారం లేదు. ఈ పరిస్థితి వెనుక కారణాలను చూడాలి. వాస్తవ సమాచారం లేకుండా మాట్లాడలేము. కొన్ని వాస్తవాలు రిపోర్టుల ఆధారంగా మాట్లాడుతున్నాం. ఈ ఉద్యమంలో కొంతమంది సామాజిక వ్యతిరేకులు ఉన్నారని కూడా రిపోర్టులు ఉన్నాయి. కానీ ప్రామాణిక సమాచారం లేకుండా చెప్పలేము అని మోహన్ భాగవత్ అన్నారు. ముందుగా సంభాషణ జరిగి ఉంటే పరిస్థితి తీవ్రమయ్యేది కాదా అని అడిగినప్పుడు జరగకూడని విషయం జరిగితే ఎక్కడో తప్పు ఉండాలి. అందుకే అది జరుగుతుంది. తప్పు ఎవరిది, ఏమిటి అనేది వేరే విషయం. కానీ లోపం ఉంది. దాన్ని సరిదిద్దుతారు. సరిదిద్దాలి అని నేను నమ్ముతున్నాను అని తెలిపారు. 140 కోట్ల దేశజనాభాలో సగానికి పైగా 35 కంటే తక్కువ వయస్సువారున్నారు. 2029 సాధారణ ఎన్నికల నాటికి అతి పెద్ద ఓటు వర్గంగా జెన్ జెడ్ మారనుంది అని అన్నారు.

విద్యా వ్యవస్థ – నవతరం నిర్మాణం

విద్యా విధానంలో సమూల సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెబుతూ, విద్య అనేది వ్యాపారం కాదని, అది జీవితానికి అత్యవసరమైన అంశమని, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అది అందు బాటులో ఉండాలని భాగవత్ పేర్కొన్నారు. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 6 శాతాన్ని విద్య కోసం ఖర్చు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌కు మద్దతు తెలుపుతూ, ఇది పూర్తిగా సమంజసమైనదని, దీనిని అమలు చేయడం సాధ్యమేనని అన్నారు. విద్య అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, అది మొత్తం సమాజం సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. సంఘ్‌కు అనుబంధంగా ఉన్న ‘విద్యా భారతి’ సంస్థ సుమారు 23,000 పాఠశాలలను విజయవంతంగా నిర్వహిస్తుండటం దీనికి ఒక ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణతోనే విద్యా సంస్కరణలు ప్రారంభం కావాలి. కేవలం పాఠశాలలను నిర్వహించడం లేదా ఆదాయాన్ని ఆర్జించడం విద్య లక్ష్యం కాకూడదు. భావితరాల వారిలో ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే దాని ప్రధాన ఉద్దేశ్యం. దీనికి ఎల్లప్పుడూ ఏదో ఒక ఉద్యమం అవసరం లేదు. సామాజిక చైతన్యం ద్వారా కూడా సంస్కరణలను సాధించవచ్చని అన్నారు.

రిజర్వేషన్ గురించి

రిజర్వేషన్‌ను అనంతకాలం కొనసాగించాలా లేదా తగ్గించాలా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ గురించి ఏమి అనుకున్నారో చూడండి. నిజాయతీగా ఆయన సలహా పాటిస్తే సమస్య ఉండదు. రిజర్వేషన్ సామాజిక కారణాల వల్ల ఉంది. సామాజిక వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్ కొనసాగుతుంది అని భాగవత్ అన్నారు.రిజర్వేషన్ పొంది పరిస్థితి మెరుగైనవారు ఉదారంగా దాన్ని వదులుకోవాలి. అటువంటి ఆలోచన ఇప్పటికే కొంతమంది లబ్ధిదారుల్లో వస్తోంది. అన్ని సంక్షేమ చర్యలు సరిగ్గా అమలైతే రిజర్వేషన్ అవసరం త్వరగా ముగుస్తుందని తెలిపారు.

హింసాత్మక కంటెంట్‌కు ఎక్కువ లైక్‌లు!

నియమాలు చేయడం సరే. కానీ వాటి పట్ల ప్రజల వైఖరి మారితేనే అవి విజయవంతమవు తాయి. చాలా చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. సమాజం అంగీకరిస్తేనే చట్టాలు ప్రభావవంతంగా ఉంటాయి. రోల్ మోడల్స్ మారాలి. లక్షలాది మంది అనుచరులు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రామాణిక వనరుల నుంచి సమాచారం ధృవీకరించాలి. ఏదైనా నిషేధిస్తే లోపాలు ఉంటాయి. నిషేధం మాత్రమే పరిష్కారం కాదు. జెన్‌జెడ్ హింసను అంగీకరించదు. అయినా హింసాత్మక కంటెంట్‌కు ఎక్కువ లైక్‌లు ఎందుకు వస్తాయి? దీన్ని ఆలోచించాలి, విశ్లేషించాలి. ఈరోజు సాంకేతికత మన ముఖాలు, స్వరాలు ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టించగలదు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చేది ఏదైనా వెంటనే నమ్మకుండా ప్రామాణిక వనరుల ద్వారా దానిని ధృవీకరించాలి అని ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ అన్నారు.

 ఎల్‌జీబీటిక్యూ – సమాన లింగ వివాహం

ఎల్‌జీబీటీక్యూ లేదా ఎలాంటివారైనా మన సమాజంలో భాగం. మన సమాజంలో వారిని ఆదరించే సంప్రదాయం ఉంది. వివాహం అనేది ఇద్దరు కలిసి జీవించడానికి సృష్టించిన సౌకర్యం కాదు. అది కుటుంబాన్ని సృష్టించే సామాజిక సంస్థ. కుటుంబం సమాజ ప్రాథమిక యూనిట్. తర్వాతి తరాలను మంచి పౌరులుగా తయారు చేస్తుంది. ప్రస్తుత వ్యవస్థను భంగపరచి కొత్త వ్యవస్థలు లేకపోతే సంఘర్షణలు వస్తాయి. చట్టాలు సమాజాన్ని నిర్దేశించవు. సమాజం చట్టాలను నిర్దేశిస్తుంది. ముందు సమాజాన్ని సిద్ధం చేయాలి. ఈ దశలో వివాహ వ్యవస్థను మార్చితే ఇతర దుష్పరిణామాలు వస్తాయి. సమాన లింగ వివాహం అని చెప్పకండి. సమాన లింగ సహచరులు ఎలా కలిసి జీవించాలో వ్యవస్థ తయారు చేయాలి. దానికి చట్టం చేయవచ్చు. సమాజం దాన్ని అంగీకరిస్తుంది అని భాగవత్ అన్నారు.

నేను నాయకుడ్ని కాదు

నాయకత్వం అంటే ప్రసంగాలు చేయడం, ఎన్నికలు గెలవడం, ప్రజల ముందు నిలబడడం కాదు. నిజమైన నాయకులు వెనుక నుంచి నడిపిస్తారు. లోపలి నుంచి పని చేస్తారు. నేను నన్ను నాయకుడిగా చూడను. కార్యకర్తగా చూస్తాను. నాయకత్వం లక్ష్యం ప్రజలను వెలుగు వైపు నడిపిం చడం. మరింత మంది నాయకులను సృష్టించడం. నేనే నడిపించడం కాదు. నా నాయకత్వం నాయకు లను సృష్టించాలి అని సర్‌సంఘచాలక్ అన్నారు.

పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు

సంఘర్షణ కాలంలో ప్రభుత్వం చేసేదానికి మద్దతు ఇవ్వాలి. దీనికి పాకిస్తాన్ చైనా దేశాలు రెండు ఉదాహరణలు. సంఘర్షణలను ఎదుర్కొంటూ , భేదాలను నియంత్రణలో ఉంచడం అనేది భారతీయ పరిష్కారం. శాశ్వత ద్వేషం పరిష్కారం కాదు. పాకిస్తానీయులంతా మన శత్రువులు కాదు. మానవత్వం ఒక్కటే ఉండాలి అని భాగవత్ అన్నారు.

ఉపాధి – కార్మిక గౌరవం

ఉపాధి అంటే ఉద్యోగం మాత్రమే కాదు. వ్యవస్థాపకత్వం, నైపుణ్యాలు కూడా. చేతి పనికి గౌరవం లేదు. కార్మిక గౌరవం తిరిగి సాధించాలి. అందరూ సర్వీస్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇష్టపడుతున్నారు. చేతి పనులు చేసినా సంపదను సృష్టించవచ్చు. సంపాదించవచ్చు. విలాసవంతమైన జీవితానికి గ్యారంటీ లేదు.కానీ గౌరవప్రదమైన జీవితం సాధ్యమే. చేసే వృత్తి చిన్నదైనా, పెద్దదైనా సమాజం ఆ వృత్తిని, దానిని చేసేవారిని గౌరవించాలి అని ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ దిశగా మార్పు ఇంటి నుంచే మొదలు కావాలి. ప్రభుత్వం వేరే విధంగా ఆలోచిస్తుంది. వారిపై వేరే ఒత్తిళ్లు ఉంటాయి. సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి అని మోహన్ భాగవత్ చెప్పారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.