రాష్ట్ర ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతోంది. భూములున్న సామాన్యులు లక్షలాది మంది ఆందోళనలో పడిపోయారు. దశాబ్దాల క్రితం సక్రమంగా, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలాలు, తరతరాలుగా అనుభవిస్తున్న పొలాలు, తమ పేరిట ఉన్న ఆస్తులు ఉన్నట్టుండి ‘నిషేధిత జాబితా’ (22-ఏ)లో కనిపిస్తున్నాయి. పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు, అత్యవసర వైద్య ఖర్చుల కోసమో భూములను అమ్ముకోవాలనుకునే వాళ్లకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనుకోని అడ్డంకి ఎదురవుతోంది. ఆయా భూములు బదలాయించేది లేదని, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎనఓసీ) ఉంటే తప్ప రిజిస్ట్రేషన్లు చేసేది లేదని రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు చెబుతుండటంతో అవసరార్థులకు ఎటూ పాలు పోవడం లేదు. సబ్ రిజిస్ట్రార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను ఈ సమస్య పరిష్కరించాలంటూ వేడుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్ల చట్టం 1908లో లేని ఈ నిబంధనను 1999లో అప్పటి ప్రభుత్వం సవరణ ద్వారా చేర్చింది. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఆ తర్వాత 2007లో మళ్లీ చట్ట సవరణ ద్వారా సెక్షన్ 22-ఏను తీసుకొచ్చారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా భూ క్రయవిక్రయాలను నిషేధించే అధికారం ఉంటుంది. ఒక సర్వే నంబరు లోని భూములను ఈ జాబితాలో చేరిస్తే, ఆయా భూములకు సంబంధించి అమ్మకం, కొనుగోలు, పవర్ ఆఫ్ అటార్నీ, తాకట్టు, గిఫ్ట్ డీడ్ వంటివి ఏవీ జరగవు. ప్రభుత్వ భూములు, దేవదాయ ఆస్తులు, వక్ఫ్ భూములు, పేదలకు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు, మిగులు భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు వంటి వాటిని రక్షించే ఉద్దేశ్యంతో అప్పుడు ఈ సెక్షన్‌ను చేర్చారు.
ప్రభుత్వ భూములు కబ్జాల పాలై రిజిస్ట్రేషన్ల ద్వారా చేతులు మారు తున్నట్టు గుర్తించిన హైకోర్టు, నిషేధిత జాబితాను నవీకరించాలని 2015 డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024లో మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత ఏడాది చివరిలో రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూముల వివరాలను నవీకరించి, తహసీల్దారు మొదలు కలెక్టర్ వరకు అధికారుల సంతకాలతో కూడిన జాబితాలను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ కసరత్తు జరిగిన తీరులోనే అసలు సమస్య దాగి ఉంది. వ్యవసాయ, వ్యవసాయేతర, నిషేధిత జాబితాలను ఒకేసారి అనుసంధానం చేయడంతో.. ఈ విలీన ప్రక్రియలో సాధారణ ప్రైవేటు భూములు కూడా తప్పుగా ఈ జాబితాలోకి వెళ్లిపోయాయి. పెద్ద సర్వే నంబర్లలో కొంత భాగం మాత్రమే ప్రభుత్వానికి చెందినదైనా లేదంటే కొంతభాగం కోర్టు వివాదంలో ఉన్నా, అదే నంబరు కింద ఉన్న మిగతా ప్రైవేటు భూమి మొత్తాన్నీ నిషేధిత జాబితాలో పెట్టేశారు.
గందరగోళానికి అసలు కారణం…
ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించిన భూములు, క్రమబద్ధీకరణ ద్వారా పట్టాలు పొందిన స్థలాలు వాస్తవానికి ప్రైవేటు ఆస్తులే.
కానీ, రెవెన్యూ రికార్డుల్లో వాటి మూల సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే నమోదై ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద మాత్రం బై నంబర్లతో, లేఅవుట్ నంబర్లతో రిజిస్టర్ అయి చేతులు మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు మూల సర్వే నంబర్లన్నింటినీ ఏకమొత్తంగా 22ఏలో చేర్చడంతో వాటితో లింక్ ఉన్న భూములన్నీ నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) భూములు మరో పెద్ద తలనొప్పిగా మారాయి. పట్టా భూముల్లో యూఎల్‌సీ భూమి ముక్క ఉంటే చాలు, ఆ మొత్తం స్థలానికే ముప్పు వాటిల్లుతోంది. ఇనాం, అసైన్డ్, చెరువు శిఖాం,బఫర్ జోన్ భూములతో కలిసి ఉన్న ప్రైవేటు స్థలాలను వేరు చేయకపోవడం కూడా సమస్యకు మరో కారణంగా మారింది. కోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు పూర్తయినా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరగకపోవడం, 166, 59 జీవోల ద్వారా క్రమబద్ధీకరణ పూర్తయిన స్థలాల సర్వే నంబర్లను జాబితా నుంచి తొలగించకపోవడం వంటి పరిపాలనాపరమైన లోపాలు కూడా ఈ గందర గోళాన్ని మరింత పెంచుతున్నాయి.
ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచఎంసీ) పరిధిలోని సరూర్‌నగర్ మండలంలో ఒక స్థలం సర్వే నంబరు యూఎల్‌సీ భూమి కిందికి వస్తుందంటూ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించారు. అదే మండలంలో 19/పి నుంచి 46 వరకు మధ్యలో ఉన్న అనేక ఉప సర్వే నంబర్లు 22ఏలో చేరిపోయాయి. వికారాబాద్ జిల్లాలోని ఎన్నేపల్లి, ఆలంపల్లి, శివారెడ్డిపేట, లంకా ప్రతాప్‌రెడ్డి కాలనీల్లో పలు వెంచర్లు, నివాస స్థలాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ఉప్పల్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో మేడిపల్లి, నారపల్లి, ఉప్పల్ భగాయత్, రామంతాపూర్ ప్రాంతాల్లోని అనేక సర్వే నంబర్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ కాకుండా నిలిచి పోయాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, భూదాన్, భూ పంపిణీ, సీలింగ్ భూముల సర్వే నంబర్లతో పాటే ఉన్న పట్టా భూములకు కూడా ఈ సమస్య ఎదురవుతున్నట్టు అధికారులు కూడా గుర్తించారు.
పోర్టల్ మారినా సమస్య మామూలే..
గత బీఆరఎస్ ప్రభుత్వం ‘ధరణి’ పేరుతో భూముల పోర్టల్‌ను తీసుకొచ్చింది. అది అమలులోకి రాక ముందు కేవలం 16 లక్షల ఎకరాల భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేదని, ఆ పోర్టల్ వచ్చిన తర్వాత 1955నాటి ఖాస్రా పహాణీ ఆధారంగా 22ఏను రూపొందించడంతో అనేక పొరపాట్లు దొర్లాయని నిపుణులు చెబుతున్నారు. 1955 తర్వాత కొందరు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని సాగు చేసుకుంటున్నవి, ఇళ్లు కట్టుకున్నవి కూడా ఈ జాబితాలో చేరిపోయాయని, గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన పట్టాలు సైతం సక్రమంగా రికార్డుల్లోకి ఎక్కకుండా నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌ను ఎత్తివేసి ‘భూభారతి’ పేరుతో మరో కొత్త పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. అయినా అదే తరహా పొరపాట్లు పునరావృతమవుతున్నాయని, ఇప్పుడు మొత్తం నిషేధిత జాబితా పరిధి రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు పైగానే చేరుకుందని అంచనా వేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడు తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సెక్షన్ 22ఏ, రెవెన్యూ అధికారులకు, రాజకీయ నాయకులకు ఒక ప్రైవేటు ఏటీఎంగా మారిందని ఆయా పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవ ప్రభుత్వ స్థలాలను వదిలేసి, దశాబ్దాలుగా రైతులు అనుభవిస్తున్న పట్టా భూములను ఉద్దేశ పూర్వకంగా జాబితాలో చేరుస్తున్నారని, డబ్బు ముట్టజెప్పిన వారి భూములను ఆ జాబితా నుంచి వేగంగా తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎన్‌వోసీ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసే విధానం తేవాలని, జాప్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎన్‌వోసీ జారీకి గరిష్ఠంగా 30 రోజుల గడువు విధించాలని విపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పది శాతంగా ఉన్న 22ఏ భూముల విస్తీర్ణం ఇప్పుడు 30 నుంచి 40 శాతానికి పెరిగి కోటి ఎకరాలకు చేరుకుందని, రైతుల భూములను ఉద్దేశపూర్వకంగా జాబితాలో చేర్చి, ముడుపులు తీసుకుంటేనే తొలగిస్తున్నారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర రెడ్డి విమర్శించారు. అసైన్డ్, దేవదాయ, వక్ఫ్, అటవీ భూముల సమగ్ర వివరాలను ప్రభుత్వం కోర్టుకు సైతం సమర్పించకుండా దాచిపెడుతోందని ఆయన ఆరోపించారు.
భూ యజమానులు ఏం చేయాలి?
ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో భూముల యజమానులు తమ భూమి 22ఏ జాబితాలో ఉందో లేదో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ భూములైతే ‘భూభారతి’ పోర్టల్‌లో, పట్టణ ప్రాంత భూములైÉౖతే ఐజీఆరఎస్ రిజిస్టర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు, లేఅవుట్ అనుమతి పత్రాలు, కోర్టు తీర్పు కాపీలు వంటివన్నీ భద్రంగా ఉంచుకోవడం అవసరమని, ఏ కారణంతో, ఏ జీవో ఆధారంగా తమ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారో తెలియ జేయాలంటూ సంబంధిత సబ్ రిజిస్ట్రార్ లేదా కలెక్టర్ కార్యాలయానికి లేఖ ఇవ్వాలని, తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా జాబితా నుంచి తొలగింపు కోరుతూ దరఖాస్తు సమర్పించాలని సలహా ఇస్తున్నారు. భూములకు సంబంధించి సెక్షన్ 22ఏ (1)(ఎ), (బి), (డి) కింద వచ్చే ఫిర్యాదులకు జిల్లా కలెక్టర్‌ను, (సి) కింద వచ్చే వాటికి వక్ఫ్ బోర్డు సీఈఓ లేదా దేవదాయ శాఖ కమిషనర్‌ను, (ఇ) కింద వచ్చే వాటికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎలఏ) ఏర్పాటుచేసిన కమిటీని సంప్రదించాలని సూచిస్తు న్నారు. కోర్టు ఉత్తర్వులవల్ల నిషేధిత జాబితాలో చేరితే, న్యాయవాది సాయంతో కోర్టు ద్వారానే పరి ష్కారం పొందాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో ఈ 22ఏ సెక్షన్ వివాదం తీవ్రతరం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు భూములపై యజమానులు ఆందోళన చెîందవద్దని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో కోర్టు వివాదాల్లో ఉన్న లేదా నిజంగా ప్రభుత్వానికి చెందిన భాగాన్ని మాత్రమే మినహాయించి, మిగతా పట్టా భూములకు రిజిస్ట్రేషన్లు అనుమతించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టర్లు ప్రతిరోజూ నిషేధిత జాబితా దరఖాస్తులను పరిశీలించాలని, ఆన్‌లైన్ రికార్డులను సరిచూసి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తమ ప్రభుత్వం కొత్తగా ఏ భూమిని నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి వస్తున్న సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కల్పిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ప్రకటించారు. సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదని, ఆన్‌లైన్‌లో ఉన్నదానికే ఆమోదం తెలిపేలా వారి పరిధిని కుదిం చాలని అధికారులను ఆదేశించారు. నిషేధిత జాబితా లోని దరఖాస్తులను గుడ్డిగా తిరస్కరించ కుండా, తిరస్కరణకు కారణాలను మూడు రోజుల్లోగా తెలియ జేయాలని, ప్రతి దరఖాస్తునూ తహసీల్దారుకు పంపకుండా నేరుగా కలెక్టర్‌కే పంపాలని సూచించారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించాలన్న సదుద్దేశంతో తీసుకొచ్చిన సెక్షన్ 22ఏ విమర్శల పాలవుతోందని, తగినంత క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడంతో ఈ స్థాయిలో సామాన్య పౌరులు ఇబ్బంది పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల అమలులో వేగంగా స్పందించిన ప్రభుత్వం.. ఆ ప్రక్రియ సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయకపోయిందని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తప్పులను సరిదిద్దే ప్రక్రియ మొదలైనా, అది ఎంత వేగంగా, ఎంత పారదర్శకంగా జరుగుతుందనే దానిపైనే బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందంటున్నారు. గ్రామం లేదా మండలాన్ని యూనిట్‌గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయి పరిశీలన చేపడితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068