పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఆగస్టు 7, 2026న మక్కాలో ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట’ అనే చారిత్రాత్మక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా ముగ్గురిపై దాడి జరిగినట్లుగానే భావించి సమష్టిగా ఎదుర్కొంటాయి. పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాపై భద్రతాపరమైన నమ్మకం తగ్గడం వంటి కారణాలు ఈ కూటమి ఏర్పాటుకు దోహదంచేశాయి. ఈ కొత్త త్రైపాక్షిక కూటమి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలపై, ముఖ్యంగా భారత్ భద్రతా వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నాటో తరహాలో ఒకరిపై దాడి జరిగితే అందరూ స్పందించేలా ఈ ఒప్పంద రూపకల్పన జరిగింది.
సౌదీ అరేబియా ఆర్థిక బలం, టర్కీ అత్యాధు నిక డ్రోన్లు, సాంకేతిక పరిజ్ఞానం, పాకిస్తాన్ సైనిక వనరులు ఈ నేపథ్యంలో కలిసికట్టుగా పనిచేస్తాయి. ఈ ఒప్పందం వల్ల ఆర్థికంగా బలహీనపడిన పాకిస్తాన్‌కు, సౌదీ ఆర్థికఅండ, టర్కీ సాంకేతి పరిజ్ఞానం బలాన్ని చేకూరుస్తాయి. సౌదీ అరేబియాతో భారత్ గత దశాబ్దకాలంగా ఇంధన, వాణిజ్య, రక్షణ రంగాల్లో బలమైన సంబంధాలను ఏర్పరుచుకుంది. అయితే, సౌదీ ఈ కొత్త ఒప్పందంలో పాక్‌తో మరింత దగ్గరవడం వల్ల భారత్-సౌదీ దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొన్ని పరీక్షలు ఎదురుకావచ్చు. టర్కీ కూడా గతంలో అనేక వేదికలపై భారత్‌కు వ్యతి రేకంగా, పాక్‌కు అనుకూలంగా ముఖ్యంగా కశ్మీర్ అంశంపై వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల, టర్కీ ఆధునిక పరిజ్ఞానం పాకిస్తాన్‌కు అందు బాటులోకి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో పాక్‌తో ఏదైనా సైనిక సంక్షోభం ఏర్పడితే భారత్ తన యుద్ధ సన్నద్ధతను, వ్యూహాలను మార్చుకోక తప్పదు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ పూర్తి నిఘా ఉంచి, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపడుతోంది. అదే సమయంలో సౌదీతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను కాపాడు కుంటూనే, పశ్చిమాసియాలో యూఏఈ, ఇజ్రాయెల్ వంటి ఇతర మిత్రదేశాలతో వ్యూహాత్మక బంధాన్ని భారత్ మరింత పటిష్టం చేసుకోవాల్సి ఉంటుంది.
పాక్‌కు దౌత్య, సైనిక మద్దతు
భారత్‌తో నిరంతరం సరిహద్దు వివాదాలు ఉండే పాకిస్థాన్‌కు ఈ ఒప్పందం వల్ల పెద్ద దౌత్య, సైనిక మద్దతు లభించినట్లయింది. భవిష్యత్తులో భారత్ గనుక పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రెíక్స్ చేస్తే, ఈ ఒప్పందం ప్రకారం టర్కీ లేదా సౌదీ జోక్యం చేసుకోక తప్పదు. టర్కీ ఇప్పటికే కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతిస్తోంది. అంతేకా కుండా, అత్యాధునిక బైరెక్టర్ డ్రోన్లు, మిలిటరీ ఎలక్ట్రానిక్స్ సాంకేతికతను పాకిస్థాన్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది, ఇది భారత రక్షణ రంగానికి సవాలుగా మారవచ్చు. ఈ కూటమికి వెనుక నుంచి చైనాలాంటి శక్తులు కూడా మద్దతిచ్చే అవకాశం ఉంది, దీనివల్ల భారత్ చుట్టూ వ్యూహాత్మక ఒత్తిడి పెరుగుతుంది. ఇక సౌదీ అరేబియా భారత్‌కు అత్యంత కీలకమైన వాణిజ్య, చమురు భాగస్వామి. భారత్ పెద్ద ఎత్తున సౌదీ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. సౌదీ అరేబియాకు భారత్‌తో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ. అందువల్ల, పాకిస్థాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చు కున్నప్పటికీ, భారత్‌తో ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పణంగా పెట్టే సాహసం సౌదీ చేయకపోవచ్చు. అయితే ఈ కూటమిలో సౌదీ ఆర్థిక బలం, టర్కీ అధునాతన రక్షణ పరిశ్రమ/పోరాట అనుభవం, పాకిస్థాన్ అణ్వస్త్ర సంపత్తి కలగలిసి ఉన్నాయి. ఇది పశ్చిమాసియా, దక్షిణ ఆసియా అంతటా ఒక శక్తివంతమైన సైనిక బ్లాక్‌గా మారే అవకాశం ఉంది. ఈ దేశాలు భద్రత కోసం ఇకపై పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా, తమ స్వంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనుకుంటు న్నాయనేందుకు ఈ ‘మక్కా డీల’ స్పష్టమైన సంకేతం. టర్కీ, పాకిస్థాన్‌లు మొదటి నుంచీ ఇజ్రాయెల్ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ కొత్త కూటమివల్ల ఇజ్రాయెల్ కూడా పశ్చిమాసియాలో తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుంది.ఈ కూటమికి దూరంగా ఉన్న యూఏఈ.. అమెరికా, భారత్, ఇజ్రాయెల్‌లతో మరింత బలమైన, సమతుల్యమైన సంబంధాలను కొనసాగిస్తోంది, ఇది భారత్‌కు కాస్త సాను కూలాంశం.
నిశితంగా గమనిస్తున్న భారత్
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం, మక్కా ఒప్పంద పరిణామాలను భారతదేశం నిశితంగా గమనించడమే కాకుండా దేశ భద్రత, ప్రాంతీయ శాంతికి భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఈ త్రైపాక్షిక కూటమి (పాకిస్థాన్-సౌదీ-టర్కీ) వల్ల ఏర్పడే వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ప్రధానంగా కొన్ని వ్యూహాలు అనుసరించే అవకాశ ముంది. ముందుగా భారత్ తనకున్న ‘స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల’ ద్వారా సౌదీ అరేబియా నుంచి స్పష్టత కోరవచ్చు. ఈ ఒప్పందంలోని ‘ఉమ్మడి రక్షణ’ క్లాజ్ కేవలం పశ్చిమాసియా/గల్ఫ్ ప్రాంతానికే పరిమితమా, లేదా భారత్-పాక్ ద్వైపాక్షిక వివాదాలకు కూడా వర్తిస్తుందా అనే దానికి లిఖిత పూర్వక లేదా స్పష్టమైన హామీని భారత్ ఆశిస్తుంది. సౌదీ అరేబియాకు భారత్‌తో ఉన్న వాణిజ్య, ఇంధన, పెట్టుబడి సంబంధాలు చాలా పెద్దవి. ఈ కూటమికి ప్రతిగా మనదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్, ఖతార్ వంటి ఇతర గల్ఫ్ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటూ సమతుల్యతను కాపాడుకునే దిశగా అడుగులు వేయవచ్చు. టర్కీ నుంచి పాకిస్థాన్‌కు అత్యాధునిక డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ బదిలీ అయ్యే ప్రమాదం ఉంది. దీనిని తిప్పికొట్టేం దుకు భారత్ స్వదేశీ రక్షణ పరిశోధనలను వేగవంతం చేస్తుంది. పశ్చిమ సరిహద్దుల్లో (అరేబియా సముద్రం, కాశ్మీర్ సరిహద్దుల్లో) భారత్ తన నిఘా, సైనిక సన్నద్ధతను మరింత పెంచుతుంది. ఈ మక్కా ఒప్పం దాన్ని ఇరాన్ ఇప్పటికే తీవ్రంగా విమర్శించింది. అందువల్ల, భారత్ చాబహార్ పోర్ట్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఇరాన్‌తో దౌత్యపరమైన, వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ సరన్ వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఒప్పందం వల్ల పాకిస్థాన్‌కు దౌత్యపరంగా కొంత బలం చేకూరిన మాట నిజమే అయినప్పటికీ, భారత్‌కు వ్యతిరేకంగా జరిగే ఏ సైనికచర్యలోనూ నేరుగా పాల్గొనే ఉద్దేశం సౌదీ లేదా టర్కీలకు ఉండే అవకాశం లేదు. కాబట్టి భారత్ దీనిపై అనవసర ఆందోళన చెందకుండా, నిశ్శబ్దంగా తన ఆర్థిక, సైనికవ్యూహాలకు పదునుపెట్టడమే ప్రధాన సమాధానం కానుంది.
భారత్ఇ-జ్రాయిల్ – యూఏఈ వ్యూహాత్మక కూటమి?
పాకిస్థాన్-సౌదీ-టర్కీల ‘మక్కా రక్షణ ఒప్పందం’ నేపథ్యంలో, దానికి ప్రతిగా భారత్, ఇజ్రాయెల్, యూఏఈ దేశాలు ఒక కొత్త అనధికారిక వ్యూహాత్మక కూటమిగా ఏర్పడే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ విశ్లేషకులు ఈ సంభావ్య కూటమిని పశ్చిమా సియాలో ముస్లిం దేశాల నాటో తరహా వ్యవస్థకు ప్రతిగా ఏర్పడబోయే ఒక శక్తివంతమైన ‘మెడిటరేని యన్ క్వాడ’ లేదా వ్యూహాత్మక నెట్‌వర్క్‌గా అభివర్ణిస్తు న్నారు. భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా దేశాలు కలిసి గతంలోనే ఐ2యూ2 కూటమిని (ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎసఏ) ఏర్పాటు చేశాయి. మక్కా ఒప్పందంవల్ల అమెరికా రక్షణ నీడపై నమ్మకం తగ్గడంతో, ఈ ప్రాంతంలో భద్రతను కాపాడుకోవడానికి భారత్, ఇజ్రాయెల్, యూఏఈలు తమ త్రైపాక్షిక రక్షణ, నిఘా బంధాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. సౌదీ అరేబియా ఈ మక్కా ఒప్పందం ద్వారా టర్కీ, పాకిస్థాన్‌లతో చేతులు కలపడం యూఏఈకి అంతగా నచ్చలేదు. యూఏఈ మొదటినుంచీ టర్కీ దూకుడును, పాక్ ఉగ్రవాద విధానాలను వ్యతిరేకి స్తోంది. అందువల్ల యూఏఈ తన రక్షణ కోసం భారత్, ఇజ్రాయెల్‌లను అత్యంత విశ్వసనీయ భాగస్వాములుగా చూస్తోంది. టర్కీ, పాకిస్థాన్‌లు నిరంతరం ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ కూటమి అణ్వస్త్రాలు కలిగిన పాకిస్థాన్‌తో ముడిపడి ఉండటం వల్ల ఇజ్రాయెల్ మరింత అప్రమత్తమైంది. అబ్రహం ఒప్పందాల ద్వారా యూఏఈతో, అలాగే రక్షణపరంగా భారత్‌తో ఇజ్రాయెల్‌కు ఉన్న బలమైన సంబంధాలు ఈ కొత్త అక్షం ఏర్పడటానికి కారణమ వుతాయి. టర్కీ అధునాతన డ్రోన్ సాంకేతికత (బైరెక్టర్ డ్రోన్లు) పాకిస్థాన్‌కు చేరితే ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి భారత్‌కు ఇజ్రాయెల్ రక్షణ సాంకేతికత (యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, ఎల క్ట్రానిక్ వార్‌ఫేర్)అవసరం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది నాటోలాంటి ఒక అధికారిక సైనిక ఒప్పందంగా కాకుండా, ఒక “ఫ్లెక్సిబుల్ సెక్యూరిటీ నెట్‌వర్క” లాగా ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఇజ్రాయెల్ హై-టెక్ రక్షణ ఆవిష్కరణలు, యూఏఈ భారీ మూలధనం, భారతదేశపు తయారీ రక్షణ సామర్థ్యాలు కలగలిసి ఉమ్మడి ఆయుధాల ఉత్పత్తికి దారితీయవచ్చు. టర్కీ-పాక్ రక్షణ కదలికలపై నిఘా ఉంచేందుకు ఈ మూడు దేశాలు తమ నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటాయి.
నకిలీ వార్తలు
విచిత్రమేమంటే మక్కా ఒప్పందం జరిగిన వెంటనే.. ‘దానికి ప్రతిగా భారత్ అధికారిక రక్షణ ఒప్పందం కోసం ఇజ్రాయెల్‌ను సంప్రదించింది’ అంటూ టర్కీ, పాక్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వార్తలను ‘ఫేక్ న్యూస’గా కొట్టిపారేసింది. భారత్ తొందరపడి ఎలాంటి అధికారిక మిలిటరీ కూటములను ప్రకటించదని, తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే తెరవెనుక సహకారాన్ని పెంచుకుంటుందని స్పష్టం చేసింది.
టర్కీకి ముకుతాడు!
పాకిస్థాన్‌తో కలిసి టర్కీ కాశ్మీర్ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం, ఇటీవలి ‘మక్కా రక్షణ ఒప్పందం’లో చేరడం వంటి పరిణామా లపై భారతదేశం తీవ్రంగా స్పందిస్తోంది. కేవలం రక్షణ నిగ్రహంతోనే ఆగకుండా, టర్కీ భౌగోళిక బలహీనతలను లక్ష్యంగా చేసుకొని భారత్ ప్రతివ్యూహాలతో గట్టి ఒత్తిడిని తీసుకొస్తోంది. టర్కీ సరిహద్దు వివాదాలు కలిగున్న దేశాలతో భారత్ రక్షణ బంధాలను అనూహ్యంగా బలోపేతం చేస్తోంది. టర్కీ మీడియా కూడా భారత్ తమపై ఒక “ప్రాక్సీ వార” నడుపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధ్యధరా సముద్రంలో టర్కీకి గ్రీస్, సైప్రస్‌లతో తీవ్ర వివాదాలు ఉన్నాయి. భారత్ ఈ రెండు దేశాలతో రక్షణ సంబంధాలను వేగంగా పెంచు తోంది. సైప్రస్, గ్రీస్ దేశాలకు భారత్ తన అత్యాధు నిక బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను, అధునాతన డ్రోన్లను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. టర్కీ మిత్రదేశమైన అజర్‌బైజాన్‌తో పోరాడుతున్న అర్మేనియాకు భారత్ పెద్ద ఎత్తున ‘పినాకా’ రాకెట్ లాంచర్లు, యాంటీ-ట్యాంక్ క్షిపణులు, రక్షణ సామాగ్రిని సరఫరా చేస్తోంది. తద్వారా టర్కీ ప్రాంతీయ ప్రభావానికి భారత్ బ్రేకులు వేస్తోంది. భారత్-పాక్ ఉద్రిక్తతల్లో టర్కీ జోక్యం చేసుకున్నప్పటి నుంచి భారత్-టర్కీల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా క్షీణించింది. భారతీయ పర్యాటకులు టర్కీకి వెళ్లడం తగ్గించారు. దీనివల్ల టర్కీ పర్యాటక ఆదాయం దెబ్బతిన్నది.
జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టర్కీకి చెందిన ‘సెలెబీ ఏవియేషన’ వంటి కంపెనీల లైసెన్సులను భారత్ రద్దుచేసింది. టర్కీ అనుసరిస్తున్న భారత్ వ్యతిరేక విధానాల వల్ల భారత్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు టర్కీ విద్యాసంస్థలతో ఉన్న అన్ని రకాల విద్యా, పరిశోధనా ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. టర్కీ అంతర్గతంగా ఎదుర్కొంటున్న కుర్దిష్ తిరుగుబాటు వంటి సున్నితమైన అంశాలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించే వ్యూహాన్ని భారత్ పరిశీలిస్తోంది. అదే సమయంలో, టర్కీకి నష్టం జరుగుతోందని గ్రహించిన అంకారా, దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత భారత్‌తో ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ (ఎఫ్ ఓసీ) చర్చలను తిరిగి ప్రారంభిం చాల్సి వచ్చింది. భారత్‌ను ప్రసన్నం చేసుకోవడానికి టర్కీ ప్రభుత్వం భారత్‌కు మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సలీండోలాను అప్పగించింది. గతంలోలా కాకుండా, తన సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే సదరు దేశపు శత్రు దేశాలకు ఆయుధాలు ఇచ్చి మరీ బుద్ధి చెప్పగలనని భారత్ టర్కీ విషయంలో నిరూపిస్తోంది. ఈ భౌగోళిక రాజకీయ వ్యూహం టర్కీని తీవ్ర అత్మరక్షణలో పడేసింది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్