ఖరీఫ్ సీజన్ సగం ముగిసినా తగిన మేరకు వర్షాలు పడక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నైరుతి రుతుపవనాలు వచ్చి నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో చాలా చోట్ల వానలు లేవు. అడపాదడపా పడే చిరుజల్లులు భూమిలో తేమను పెంచడానికి, పంటలు ఆరోగ్యంగా ఎదగడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. జూన్ పూర్తిగా నిరాశపరిచినా జూలైలో కురిసిన కొద్దిపాటి వానలు రైతుల్లో ఆశలు రేపినా, ఆగస్టు రెండు వారాలు గడుస్తున్నా వాతావరణం అనుకూలించలేదు.
వానల కోసం ఆకాశం వైపు, సాగునీటి కోసం రిజర్వాయర్ల వైపు రైతులు నిరాశగా ఎదురు చూస్తున్నారు. నారు పోసిన వారు, అలాగే నాట్లు వేసిన రైతులందరూ తమ పైరు ఎండిపోతుందే మోనని తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. పŸసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలం పుంజుకుంటున్న ‘ఎల్‌నినో”వాతావరణ మార్పుల వల్లే వానలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామమే రైతుల ప్రస్తుత సంక్షోభానికి మూల కారణం.
భూమధ్యరేఖకు ఇరువైపులా విస్తరించిన మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా పెరగడాన్నే వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్‌నినోగా పిలుస్తారు. సముద్ర జలాల్లో చోటుచేసుకునే ఈ మార్పు, భూమిపై వాతావరణ పీడన స్థితిగతులను తారుమారు చేసి, గాలుల ప్రవాహ దిశనే మలుపు తిప్పేస్తుంది. దీని ఫలితంగా భారత ఉపఖండంపై రుతుపవనాల బలం తగ్గిపోయి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా పడిపోతుంది. కొన్నేళ్లకోసారి పునరావృతమయ్యే ఈ ప్రకృతి పరిణామం అంతర్జా తీయంగా అనేక దేశాల్లో వాతా వరణ గతిని మారుస్తుండగా, ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సేద్యాన్ని బాగా దెబ్బతీస్తోంది.
జూన్‌లో దారుణ పరిస్థితి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతులకు నిరాశ కలిగించింది. జూన్‌లో సగటు వర్షపాతం కంటే 38 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి. సాధారణంగా జూన్‌లో సుమారు మూడు అల్పపీడన వ్యవస్థలు ఏర్పడి సగటున 11 రోజుల పాటు వర్షాలు పడతాయి. కానీ ఈ ఏడాది జూన్‌లో ఒక్క అల్పపీడన వ్యవస్థ కూడా ఏర్పడలేదు. దీంతో 1901 తర్వాత దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన జూన్‌గా ఇది ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం 688 మండలాలకు గాను, 586 మండలాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటుండగా, ఇందులో సుమారు 157 మండలాల్లో అత్యల్ప వర్షపాతం, 429 మండలాల్లో మోస్తరు లోటు నమోదైంది.102 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాలు అత్యధికంగా నష్టపోగా, కోస్తా జిల్లాల్లోనూ పరిస్థితి పెద్దగా మెరుగ్గా లేదు. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షపాత లోటు యాభై శాతానికిపైగా నమోదవగా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోనూ డెబ్భై శాతం వరకు లోటు ఏర్పడింది. కోస్తాంధ్రలో సగటున నలభై నాలుగు శాతం, రాయలసీమలో నలభై ఆరు శాతం, రాష్ట్ర వ్యాప్తంగా సగటున నలభై ఎనిమిది శాతం వర్షపాత లోటు నమోదవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
వరిసాగుపై ప్రభావం
ఈ వర్షాభావ ప్రభావం ప్రధానంగా వరి సాగుపై పడింది. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో పదమూడు లక్షల ఎకరాలకుపైగా వరికి నీటి లభ్యతపై స్పష్టత కొరవడింది. నదులకు ఎగువ ప్రాంతాల నుంచి చెప్పుకోదగ్గ ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టుల్లో నిల్వలు ఆశాజనకంగా లేవు. ఈ ప్రభావం కర్నూలు జిల్లాపై మరింత ఎక్కువగా పడింది. దేశవ్యాప్తంగా పేరుగాంచిన కర్నూలు సోనా బియ్యం రకం ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేసీ కెనాల్, తెలుగుగంగ వంటి ప్రధాన కాలువల కింద వరి సాగును పూర్తిగా నిలిపివేసి, తక్కువ నీటితో పండే మొక్కజొన్న, మినుము వంటి పంటల వైపు మళ్లాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. దీనితో ఆ ప్రాంతంలో సాధారణంగా సాగయ్యే విస్తీర్ణంలో ఒక్క శాతం కూడా ఈసారి నాట్లు పడలేదు.
ప్రత్యామ్నాయ పంటలవైపు చూపు
మరోవైపు, నీటి లభ్యత సందిగ్ధంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, కంది వంటి మెట్ట పంటల వైపు మొగ్గు చూపు తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కర్నూలు జిల్లా ఈ మార్పులో ముందంజలో ఉండగా, పల్నాడు, ఎన్టీఆర్, అనంతపురం, గుంటూరు జిల్లాలు సైతం పత్తి సాగు వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే పత్తి సాగు కూడా చాలావరకు వర్షాధారమే గనుక, తగినంత వర్షం లేకపోతే మొలక,ఎదుగుదల దశల్లోనే పంట దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్, పెట్టుబడి-ఆదాయ లెక్కలను బేరీజు వేసుకుని రైతులు ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ, వర్షాలు సకాలంలో కురవకపోతే ఈ ప్రత్యామ్నాయం కూడా వారిని నిరాశపరిచే ప్రమాదం ఉంది.
క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నారుమళ్లు ఎండిపోకుండా కాపాడుకునేందుకు కొందరు దూరప్రాంతాల్లోని బోర్లు, చెరువుల నుంచి బిందెలు, డ్రమ్ముల్లో నీళ్లు మోసుకొస్తుంటే, మరికొందరు మురుగు కాలువల్లో నిలిచిన కొద్దిపాటి నీటిని మోటార్లతో తోడి పంటలకు అందిస్తున్నారు. వర్షం కోసం పలుచోట్ల ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఆచారాలు సైతం నిర్వహి స్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, నిర్దేశిత లక్ష్యంలో నలభై శాతం విస్తీర్ణంలో మాత్రమే ఇప్పటివరకు పంటలు సాగులోకి వచ్చాయి. వేరుశనగ వంటి పంటలైతే లక్ష హెక్టార్లలో ఇంకా విత్తనం కూడా పడని దుస్థితి నెలకొంది.
జాలైలో కాస్త మెరుగు
ఇదిలా ఉంటే జూలైలో పరిస్థితి కాస్త మారింది. నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా పుంజుకోవడంతో వర్షాలు ఊపందుకున్నాయి. ఫలితంగా ఖరీఫ్ సాగు లోటు కొంత తగ్గింది. అయితే ఇంతటితో ముప్పు తొలగిపోయినట్లు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రబీ పంటలపై ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయమే వెన్నెముకగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఈ పరిణామాలు దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. పంట దిగుబడులు తగ్గితే గ్రామీణ ఆదాయాలు క్షీణించి, రైతులు తీసుకున్న పంట రుణాల చెల్లింపులపైనా ఒత్తిడి పెరుగుతుంది. దుకాణాలు, చిన్న వ్యాపారాలు, రవాణా వంటి అనుబంధ రంగాలపైనా దీని ప్రభావం పరోక్షంగా పడుతుంది. ఒక సీజన్ కుంటుపడితే దాని పర్యవసా నాలు వచ్చే ఏడాది సాగు ప్రణాళికలపైనా కనిపిస్తా యని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇంతటి సంక్షోభాన్ని అధిగమించేందుకు రైతులకు ప్రభుత్వ తోడ్పాటు అత్యవసరం. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు, కాలువలపై ఆధారపడ్డ కౌలు రైతులకు ప్రత్యేక పరిహారం ప్రకటించాల్సిన అవసరం ఉంది. వర్షపాత లోటు తీవ్రంగా ఉన్న మండలాలను అధికారికంగా కరవు ప్రాంతాలుగా ప్రకటించి, తక్షణ సాయం అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జులై చివరి వారం లేదా ఆగస్టు మధ్య వర్షపాత పరిస్థితిని అంచనా వేసి కరవు మండలాల ప్రకటనపై నిర్ణయం తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. పంటల బీమా పథకాన్ని మరింత మందికి చేరువ చేయడం, నష్టపోయిన రైతులకు వేగంగా పరిహారం అందేలా చూడటం కూడా ప్రస్తుత తరుణంలో కీలకం. దీర్ఘకాలిక పరిష్కారంగా బిందు, తుంపర సేద్యం వంటి నీటి పొదుపు పద్ధతులను మరింతగా ప్రోత్సహించడంతో పాటు, చెరువులు, కుంటల పూడికతీత ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కూడా ముఖ్యమే.
ప్రస్తుతానికి అన్నదాతల ఆశలన్నీ రాబోయే వారాల్లో కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మెరుగైన వర్షపాతం నమోదైతే తప్ప, ఈ ఖరీఫ్ సీజన్ గట్టెక్కడం కష్టమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయినప్పటికీ, నేలతల్లిని నమ్ముకుని ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుం టున్న రైతన్నల పట్టుదల, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి కొండంత అండగా నిలుస్తోంది. ప్రభుత్వం, రైతులు, స్థానిక సంస్థలు కలిసికట్టుగా అడుగులు వేస్తే, ఎల్‌నినో సవాళ్లను సైతం అధిగమించి ఈ కష్టకాలం నుంచి రాష్ట్రం త్వరగా బయటపడగలదన్న విశ్వాసం రైతాంగంలో ఇంకా సజీవంగానే ఉంది. చినుకు కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నా, ఆ నమ్మకమే వారిని ముందుకు నడిపిస్తోంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్