ప్రశాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హిందూ పండిట్ల కుటుంబాలు తమ స్వస్థలాలకు రావడాన్ని ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాలకుపైగా తాము నిర్మించుకున్న ఆజాదీ పేకమేడలు కూలిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులైన కొందరు పండిట్‌లను  బెదిరిస్తూ లేఖను విడుదల చేసింది లష్కరే తోయిబా ముసుగు సంస్థ యూఎల్‌సీ. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో వచ్చిన అద్భుత మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసిన తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలతో సమాన హోదాను పొందాయి. భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో వర్తింపజేయడం, ప్రత్యేక జెండా రద్దు, కేంద్ర చట్టాల అమలు, శాంతిభద్రతలు మెరుగవడం, పర్యాటకరంగ వికాసం, మౌలిక వసతులు అభివృద్ధి చెందడం వంటి కీలక మార్పులు వచ్చాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజల మాదిరిగానే కశ్మీర్ లోనూ అందరికీ సమాన హక్కులు, ఆస్తులు కొనుగోలు చేసే వెసులుబాటు, మహిళలకు సమాన ఆస్తి హక్కులు దక్కాయి.

అభివృద్ధి పథంలో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాలు, భారీ పెట్టుబడుల వల్ల ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ప్రైవేట్ పెట్టు బడులు, పర్యాటకరంగం పుంజుకోవడం, ప్రభుత్వ నియామకాల ద్వారా స్థానిక యువతకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు దాదాపు రూ. 80,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. గడిచిన కొన్ని ఏళ్లలోనే దాదాపు రూ.15,000 కోట్ల మేర ప్రైవేట్ పెట్టుబడులు క్షేత్రస్థాయిలో అమలయ్యాయి, దీని ద్వారా సుమారు 65,000మందికి పైగా యువతకు పారిశ్రా మిక రంగంలో నేరుగా ఉద్యోగాలు లభించాయి. జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెల క్షన్ బోర్డ్ ద్వారా దాదాపు 36,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారు. అదనంగా ప్రభుత్వ విభాగాల్లో అవసరమైన సేవలకు వివిధ కంపెనీల ద్వారా వేలాది పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. యువతను కేవలం ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారిగా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు, లోన్ గ్యారెంటీలను అందిస్తోంది.

మహిళా సాధికారత

మహిళలు నేతృత్వం వహించే స్టార్టప్‌లకు, స్వయం సహాయక సంఘాలకు సబ్సిడీలతో కూడిన రుణాలు ఇస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పెరిగింది. జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పడటంతో ఏటా 2 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శిస్తున్నారు. భద్రత మెరుగవ్వడంతో దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. జీ-20 వంటి అంతర్జాతీయ సదస్సులు కూడా అక్కడ నిర్వహించారు. హోటళ్లు, రవాణా, హౌస్‌బోట్లు, గైడ్‌లతో పాటు స్థానిక హస్తకళల విక్రయాలు పెరగడంవల్ల లక్షలాదిమందికి పరోక్ష ఉపాధి దొరుకుతోంది. కొత్త ‘ఫిల్మ్ పాలసీ’ ద్వారా సినిమా షూటింగ్‌లు కూడా పెరిగి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

కశ్మీర్ లోయను అనుసంధానించే చినాబ్ రైల్వే బ్రిడ్జి వంటి భారీ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంవల్ల వేలాదిమంది స్థానిక కార్మికులు, ఇంజనీర్లకు ఉపాధి దొరికింది. ఐఐటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అక్కడ ఏర్పాటు కావడంతో స్థానిక యువత నైపుణ్యాలు పెరిగి, జాతీయ-అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో కూడా సులభంగా ఉద్యోగాలు సాధించగలుగు తున్నారు

ఉగ్రవాదం తగ్గుముఖం..

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ భారత దేశంలో శాశ్వత అంతర్భాగంగా మారిందనే స్పష్టత రావడంతో, వేర్పాటువాద భావజాలం క్రమంగా నీరు గారింది. ఆల్‌పార్టీ హురియత్ కాన్ఫరెన్స్‌వంటి వేర్పాటువాద సంస్థల అగ్ర నాయకులను గృహ నిర్బంధం చేయడం లేదా జైలుకు పంపడంతో లోయలో అల్లర్లు సృష్టించే శక్తులు బలహీనపడ్డాయి. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు 75 %, రాళ్ల దాడులు 90% తగ్గుముఖం పట్టాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం అనుసరించిన కఠినమైన వ్యూహాలు, స్థానిక పరిస్థితులలో వచ్చిన మార్పుల కారణంగా ఇది సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స’ విధానాన్ని ప్రకటించింది. ఉగ్రవాదుల ఏరివేతకు నిరంతరం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంట నిఘా పరికరాలు, అధునాతన డ్రోన్ల సహాయంతో సరిహద్దు దాటి వచ్చే చొరబాట్లను గట్టిగా అడ్డుకుంటున్నారు. ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అందుతున్న విదేశీ నిధుల మూలాలను ఎనఐఏ, ఈడీ పూర్తిగా అడ్డుకు న్నాయి. దేశ వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే సంస్థల, వ్యక్తుల ఆస్తులను జప్తు చేయడం ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ల ఆర్థిక వెన్నుముకను విరిచారు.

కశ్మీరీ పండిట్లకు బెదిరింపు లేఖలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా జమ్మూ కశ్మీర్ పునాదులు కోల్పోయిన ఉగ్రవాదులు తిరిగి ఉనికిని చాటుకోవడానికి తాపత్రయ పడుతు న్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌లోయలో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ ఉద్యోగులు తమ పద్ధతులు మార్చుకో వాలని హెచ్చరిస్తూ యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ (యూఎల్‌సీ) సంస్థ పేరిట ఓ ఆన్‌లైన్ బెదిరింపు లేఖ విడుదలైంది. ఈ లేఖలో రెవిన్యూ శాఖకు చెందిన ఆరుగురు కశ్మీరీ పండిత ఉద్యోగుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి.

బెదిరింపు లేఖతో పాటు వారి ఫోన్లకు మెసేజీలు కూడా వస్తున్నాయి. కాశ్మీరీ పండిట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుంటామని ఈ సంస్థ హెచ్చరించింది. వారు కశ్మీర్ నుంచి జమ్మూకు వెళ్లినా తమను తప్పించుకోలేరని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆస్తుల విషయంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ చర్యలతో ఈ ఉద్యోగులకు సంబంధం ఉందని, అందుకే వారికి ఇస్లామిక్ ఉగ్రవాదులు బెదిరింపులు పంపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా పేర్కొంటున్నారు.

ఉగ్రవాదులకు, తమ సంస్థకు మద్దతు ఇస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కశ్మీర్‌లోని మసీదు నిర్వాహకులు హిందువులను ఇస్లాంలోకి మార్చాలని, లేదా వారు రాష్ట్రాన్ని విడిచివెళ్లేలా చేయాలని బెదిరించినట్లు సమాచారం. ఈ నిబంధ నలను పాటించని వారిపై హింసకు పాల్పడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో పనిచేస్తున్న పోలీసులను కూడా యూఎల్‌సీ హెచ్చరించినట్లు సమాచారం. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయడంవంటి చర్యలు తీసుకుంటున్న జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు డీజీపీని కూడా లేఖలో హెచ్చరించినట్లు సమాచారం. ఈ లేఖను ‘అహ్మద్ బిలాల’ పేరుతో విడుదల చేశారని తెలుస్తోంది. అతడిని యూఎల్‌సీ మీడియా కోఆర్డినేటర్‌గా, ‘సోల్జర్ ఆఫ్ రెసిస్టెన్స’గా పేర్కొన్నారు.

లష్కరే తోయిబా ముసుగు సంస్థ

యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ అనేది లష్కరే తోయ్యిబా ముసుగు సంస్థగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ వర్ధంతి సందర్భంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసినప్పుడు ఈ బృందం తొలిసారిగా వెలుగులోకి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. గత నెలలో దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉన్న ఒక ఇటుక బట్టీ వద్ద ఇద్దరు వలస కార్మికులు మరణించిన వారం రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కశ్మీర్ లోయలో పనిచేస్తున్న పండిట్ ఉద్యోగులకు వచ్చిన ఉగ్ర బెదిరింపులపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తంచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పండిట్ ఉద్యోగుల భద్రతను తక్షణమే సమీక్షించి తగినచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఉద్యోగులకు ఆగస్టు 25 వరకు అడ్మినిస్ట్రేటివ్ సెలవులు మంజూరు చేశారు. గతంలో సాగిన లక్షిత దాడులను దృష్టిలో ఉంచుకుని, ఈ లేఖలో పేర్లున్నవారిని ఇప్పటికే జమ్మూకు తరలించారు.

పునరాగమనాన్ని అడ్డుకునే కుట్ర!

జమ్మూ కశ్మీర్‌లో పండిట్ల పునరావాసం, పునరా గమనాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద సుమారు 6,000 మంది కాశ్మీరీ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 1990లో వేర్పాటు వాద ఉద్యమం కారణంగా నిర్వాసితులైన పండిట్ల పునరాగమనం, పునరావాసానికి వీలు కల్పించడం దీని లక్ష్యం. కాగా, 2022లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు పండిట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో వారిని జమ్మూ ప్రాంతానికి బదిలీచేయాలని భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత వారిని శ్రీనగర్, ఇతర ప్రధాన పట్టణాల్లోని సురక్షిత ప్రాంతాలకు మార్చారు.

కశ్మీర్ లోయలో మూడు దశాబ్దాల పాటు హిందూ పండిట్లను ఇస్లామిక్ తీవ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, ముష్కరులు చిత్ర హింసలు పెట్టారు. అనేక మందిని బలవంతంగా మతం మార్చేశారు. ఈ ఘోరాలను చూడలేక పెద్ద ఎత్తున పండిట్లు సొంత నేలను వదిలేసి కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడ్డ సానుకూల వాతావరణం నేపథ్యంలో అనేక పండిట్ కుటుంబాలు తిరిగి లోయకు చేరుకుంటున్నాయి.

ఇటీవల ‘ప్రగాష్ హెరిటేజ్ టూర’ కింద విదేశాలతో పాటు ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్న కాశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం అనంత నాగ్‌లోని చారిత్రాత్మక మార్తాండ్ సూర్యదేవాలయాన్ని సందర్శించింది. ఈ పర్యటనలు తరాల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడు కోవడానికి ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.

ఉనికి కోల్పోతామనే భయం

కశ్మీరీ పండిట్లు తిరిగి లోయలోకి రావడం వల్ల సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ఇది తమ ఉనికికి, వేర్పాటువాద అజెండాకు ముప్పు అని ఉగ్ర వాద సంస్థలు భావిస్తున్నాయి. అందుకే వారి పునరావాసాన్ని అడ్డుకోవడానికి, సమాజంలో భయం సృష్టించడానికి ఆ సంస్థలు పండిట్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడు తున్నాయి. కశ్మీరీ పండిట్లు స్వస్థలాలకు తిరిగి వచ్చి ఇక్కడే జీవించడం, ఉపాధి అవకాశాలు పొందడం లోయలో తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడింద నేందుకు సంకేతం. ప్రభుత్వ చర్యలపై నమ్మకం ఏర్పడి మరి కొంత మంది పండిట్లు వస్తే తమ కార్యాచరణను దెబ్బ తీస్తుందని ఉగ్రవాద సంస్థలు సహించలేకపోతున్నాయి. ప్రభుత్వ పునరావాస ప్యాకేజీలు విజయవంతం కావడం వారికి మింగుడు పడటం లేదు. పండిట్లు తిరిగి స్థిరపడితే మతపరమైన విభజన రాజకీయాలు, ఉగ్రవాద అజెండా బలహీన పడతాయని ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు భయపడుతున్నారు. ఈ కారణంగానే ఉద్యోగుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో కూడిన లేఖలు విడుదల చేసి, వారిలో భయం పుట్టించి లోయను వీడేలా చేయాలని చూస్తున్నాయి. భద్రతా బలగాలతో నేరుగా పోరాడలేక, నిరాయుధులైన పౌరులను టార్గెట్ చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. లష్కరే తోయ్యిబా బెదిరింపుల వెనుక కశ్మీరీ హిందూ కుటుంబాల్లో భయాందోళనలు సృష్టించి, వారు తిరిగి కాశ్మీర్ లోయకు రావడాన్ని నిరుత్సాహపరిచే ఉద్దేశం ఉండొచ్చని స్పష్టమై పోయింది.

క్రాంతిదేవ్ మిత్ర

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.