‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
ఉద్యోగం విషయంలో నాకు సంతృప్తిగా ఉన్నా, నా భార్య కౌసల్య అనారోగ్యం ఆందోళన కలిగించ సాగింది. ఆమె మామÖలు మనిషి కావడానికి ఏం చేయాలో పాలుపోలేదు.
కాలం భారంగా గడుస్తోంది. ఆ సమయంలో ఒకరోజు అనుకోకుండా నేనిది వరకు పనిచేసిన కెంగువ నుంచి ఉత్తరం వచ్చింది. అది గౌరి రాసింది.
మేస్టారు గారికి..,
“మీరు వెళ్లిపోయి మÖడు సంవత్సరాలవు తోంది. విÖరు పంపిన విÖ పెళ్లి శుభలేఖ అందింది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల పెళ్లికి రాలేకపోయాను. ఇక అసలు విషయానికొస్తే… ఇంటినుంచి వెళ్లి పోయిన ధరణి ఇప్పటివరకూ తిరిగి రాలేదు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు కొద్దిగా మారాయి. పోలీసుల వేధింపులు తగ్గాయి. అయినా.. ధరణి, దాని మొగుడు సోమన్న జాడ తెలియలేదు. వాళ్లు చనిపోయారనీ, దళంలో చేరిపోయారనీ, వాళ్లు ఇంక తిరిగి రారనీ రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
ఇప్పటికీ నా కుటుంబ పరిస్థితి ఏం బాగుండ లేదు. జీతాలు కూడా సరిగ్గా రావటం లేదు. నా పిల్లలతో పాటు ధరణి కూతురు వనజని కూడా సాక వలసి వస్తోంది. దాన్ని ఎలా పెంచాలో అర్థం కావటంలేదు. ఆ పిల్లని చూస్తే కడుపు తరుక్కు పోతోంది.
ముఖ్య విషయం….నాకు అత్యవసరంగా పదివేల రూపాయలు సహాయం కావాలి. ఇక్కడ అప్పులు వాళ్లు వేధిస్తున్నారు. ఊళ్లో తలెత్తుకు తిరగలేక పోతున్నాను.ఈ ఉత్తరం అందిన వెంటనే మొత్తాన్ని మనియార్డరు చేయగలరు. దాంతో అప్పులు తీర్చి, మీ డబ్బును సాధ్యమైనంత త్వరగా తీర్చేస్తాను. నన్ను నమ్మి ఈ సాయం చేయగలరు. విÖ భార్యను అడిగానని చెప్పండి.
ఇట్లు
– గౌరి”
ఆ ఉత్తరం చదివిన తరువాత నా మనస్సు భారమైంది. ముఖ్యంగా ధరణి జాడ తెలియలేదు అనే విషయం బాధ కలిగించింది.
ఇంటికొచ్చి ఆమె అడిగిన డబ్బు పంపిద్దామనుకున్నాను. కానీ నాకెందుకో ఆ ఊరు వెళ్లి గౌరిని కలిసి ఆ మొత్తాన్ని ఇవ్వాలని అనిపించింది. నిజానికి నేను అక్కడ పనిచేసిన రెండు సంవత్సరాలు గౌరి కుటుంబం నాకు బాగా సహకరించింది. ఈ కష్ట సమయంలో ఆ ఊరు వెళ్లి స్వయంగా ఆ డబ్బు అందచేయాలని నిర్ణయించుకున్నాను.
ఆ విషయాన్ని నేను కౌసల్యకి చెబితే తను కూడా వస్తానంది. చాలా రోజులుగా డిప్రెషన్‌లో ఉన్న తను కొన్నాళ్ల పాటు ఊరు మారితే ఆరోగ్యం, మనసు కుదుట పడొచ్చు అనే ఆలోచన కలిగింది.
ఆ మర్నాడు నేను, కౌసల్య కెంగువ బయలు దేరాం. ఆ ఊరు చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది. కౌసల్య కొండ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది.
మమ్మల్ని చూసి గౌరి చాలా ఆనందపడింది. ముఖ్యంగా కౌసల్యను చూసి సంతోషపడింది. గౌరి దగ్గర పెరుగుతున్న వనజని చూసి నాకు చాలా జాలి కలిగింది. ఆమె అమ్మానాన్న ఎక్కడున్నారో? అసలు బతికున్నారో లేదో?
ఆ పిల్లను కౌసల్య ఒక్క క్షణం కూడా వదలకుండా ముద్దు చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
ఆ రాత్రి కౌసల్య నాతో, వనజను పెంచు కుందామని చెప్పింది.
“కౌసల్య! మనకు పెళ్లై మూడేళ్లే అయింది. ఇంకా పిల్లలు పుట్టడానికి మనకు వయసుంది. అప్పుడే తొందరెందుకు?” నచ్చచెప్పాలని ప్రjáత్నించాను.
తనకు సంతాన కలిగే అవకాశం లేదని డాక్టర్ల చెప్పినప్పటికీ సముదాయించే ప్రయత్నం చేశాను.
“నాకు పిల్లల పుట్టరని డాక్టర్లు చెప్పారు కాబట్టి ఎన్నాళ్లు ఎదురు చూసినా ప్రయోజనం ఉండదు. ఇది చేదు నిజం. దీన్ని మనం జీర్ణించుకోక తప్పదు. పిల్లల్ని పెంచుకోవాలంటే ఇదే సరియైన సమయం. ఊహ తెలియని పిల్లల్ని చేరదీస్తే వాళ్లు మనల్ని తల్లితండ్రులుగా భావిస్తారు. లేకపోతే కేవలం పెంచుకున్న పిల్లలుగానే మిగిలిపోతారు. గౌరితో ఈ విషయం మాట్లాడండి. ఒకవేళ ధరణి గానీ తిరిగొస్తే ఆ పిల్లను తిరిగి ఆమెకిచ్చేద్దాము. నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. పిల్లని పెంచుకుంటే నాకు ఆ బాధ తప్పుతుంది” అంది కౌసల్య.
“గౌరి నన్ను పదివేల అప్పు అడిగింది. ఇప్పుడు మనం ఈ పిల్ల పెంపకం గురించి మాట్లాడితే తప్పుగా అనుకుంటుందేమో? మనం అందుకే ఇక్కడికి వచ్చామని భావించే అవకాశం ఉంది” అన్నాను.
“ఇక్కడికి వచ్చేవరకు వనజ అనే పిల్ల ఉందన్న సంగతే నాకు తెలియదు. ఇంక పెంచుకునే ఆలోచన ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ఆ దానిని పెంచడం గౌరికి కూడా కష్టమే. అసలే ఆమె ఆర్థికంగా కష్టాలు పడుతున్నది. వనజ ఇక్కడే పెరిగితే దాని బతుకు పాడౌవుతుంది. అదే మనం పెంచితే ఆమె జీవితం బాగుపడుతుంది. మనం పెంచుకోవడం కంటే, ఆ పిల్ల జీవితం బాగుపడటం ముఖ్యం.
అప్పుడు ధరణి కూడా సంతోషిస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారనీ ఆలోచిస్తే ఏ పనీ చేయలేం. మనం చేసే పని మంచిదా?కాదా? అన్నదే ముఖ్యం. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. కాదనను. కానీ ఆ పిల్ల భవిష్యత్తు కూడా ముఖ్యం. అనుకునేవాళ్లు అనుకుంటూనే ఉంటారు. ఓసారి గౌరిని అడిగి చూడండి. అయినా దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి ఎందుకు రప్పించాడో? దీని వెనుక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. ఆలోచించండి” చెప్పింది కౌసల్య.
కౌసల్య మాటలు నన్ను ఆలోచనల్లో పడవేసాయి..
ఆ రోజు రాత్రి గౌరితో ఆ విషయం చెప్పాను. నా మాటలకు ఆమె మరోలా అనుకుంటుందని అనుకున్నాను…కానీ చాలా సంతోషించింది.
“మాస్టారూ! ఈ పిల్లని ఏం చెయ్యాలా? అని ఇంతకాలం ఆలోచిస్తున్నాను. దాని అమ్మానాన్న ఏమయ్యారో…తిరిగి వస్తారో లేదో తెలియదు? నాకు దాన్ని పెంచి పెద్ద చేసే స్తోమత లేదు. అలా అని ఆ పసిదానిని వదిలేయలేను. మీకు పిల్లలు లేరంటున్నారు కాబట్టి తీసికెళ్లి పెంచుకోండి. పెంచుకోవడానికిదే సరియైన వయస్సు. ఇంకా పెద్దదైతే దానికన్నీ తెలిసిపోతాయి. అప్పుడు విÖతో కలియదు. ఏదో పెంపకానికి వెళ్లినట్లు ఉంటుంది. ఇప్పుడు వాళ్లమ్మ వచ్చినా అది పోల్చుకోలేదు. దాన్ని విÖరు తీసికెళ్లి పెంచితే కొన్నాళ్లకు మిమ్మల్నే తన తల్లితండ్రులనుకుంటుంది. ఒకవేళ అదృష్టం బాగుండి దాని అమ్మానాన్నలొస్తే విÖరు ఆ పిల్లని తిరిగి ఇచ్చేయ్యాలి. ఆ షరతు విÖదే తీసికెళ్లండి.
కానీ వాళ్లొస్తారనీ నాకైతే నమ్మకం లేదు. ఒకసారి దళంలో కలిసిన వాళ్లు వెనక్కి రాలేరు. వచ్చినా సమాజం తమలో కలుపుకోదు. గూడు విడిచి ఎగిరి పోయిన పక్షి తిరిగి వచ్చినా మిగతా పక్షులు ఒప్పుకోవు. దాన్ని అంటరా నిదానిగా, శత్రువగానే చూస్తాయి. మనుషుల విషయంలోనూ అంతే.అవన్నీ ఆలోచించకుండా మీరు పిల్లను తీసికెళ్లి దాన్ని బాగా పెంచండి.
కనీసం దాని జీవితమైనా బాగుపడుతుంది.తల్లి ప్రేమంటే నాకు బాగా తెలుసు. పిల్లలు కలగని వాళ్ల బాధ నేనెరుగుదును. కాబట్టి విÖరు దీన్ని తీసికెళ్లి పెంచుకోండి” అంది గౌరి కళ్లనీళ్లు తుడుచుకుంటూ.
ఆమె మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఇక కౌసల్య ఆనందానికైతే హద్దులే లేవు.
“గౌరీ! నీ మనసు చాలా గొప్పది. తల్లి కాలేకపోయిన నాలాంటి వాళ్ల మనసు బాగా అర్థం చేసుకున్నావు. నేను ఈ పిల్లని తీసికెళ్లి గొప్పగా పెంచుతాను. ఒకవేళ వాళ్ల అమ్మ ధరణి వస్తే స్వయంగా వచ్చి పాపను అప్పచెబుతాను. దానిని తల్లికి దూరం చేసే పాపానికి ఒడిగట్టను. ఈరోజు నుంచి ఇది నా కూతురు.
“నా పేదరికం వల్ల ధరణి లేని సమయంలో దానికి చెప్పకుండా వనజను విÖకు ఇచ్చి తప్పు చేస్తున్నానేమో అనే బాధ జీవితాంతం నన్ను వెంటాడుతనే ఉంటుంది. దీనిని మీ పెంపకానికి ఇస్తూ, మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకైతే తెలియదు.అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. మంచైనా చెడైనా నేనే దానికి బాధ్యురాలిని” అంది గౌరి శూన్యంలోకి చూస్తూ.
ఆ రాత్రి మేమిద్దరం …వనజని తీసుకొని మా ఊరు వచ్చేశాం.
ఆ పాపను చూసి నా తల్లితండ్రులు, చుట్టాలు ఆశ్చర్యంతో ‘తను ఎవర’ని అడిగారు. ‘ఆ పిల్ల ఒక అనాథ’ అని చెప్పాను.
పాపకు ప్రియ అని పేరు పెట్టాము. ఆ తరువాత నేను డీఎస్సీ పరీక్ష రాసి బీఈడీ టీచర్‌గా ఎంపిక అయ్యాను. అప్పుడు నన్ను మావూరి హైస్కూల్లోనే సైన్స్ టీచరుగా వేశారు” చెప్పాడు శ్రీధర్.
* * *
“ఇదీ జరిగిన కథ. అలా నువ్వు నీ తల్లితండ్రులకు దూరమై మా దగ్గరకు చేరావు. నువ్వు వచ్చిన దగ్గర్నుంచీ మన ఇంట్లో అన్నీ శుభాలే జరిగాయి. ముఖ్యంగా మీ అమ్మ బెంగ తీరింది. అమ్మను కాలేనేమోనని బెంగ పెట్టుకున్న మీ అమ్మ ముఖంలో ఆనందం పొంగింది. ఆమెలో గూడుకట్టుకున్న విషాదం పటాపంచలైంది. ఆనందం ఉప్పొంగింది. ఇన్నేళ్లలో మేమెప్పుడూ నిన్ను పెంపుడు కూతురులా చూడలేదు. అసలు నిన్ను గౌరి దగ్గరి నుంచి తెచ్చుకున్నామన్న ధ్యాసే మాకు లేదు. మా కడుపున పుట్టిన బిడ్డగా భావించి ఎంతో ప్రేమగా పెంచుకున్నాము. కానీ లోకులు కాకులు. వాళ్లు ఎవర్నీ సుఖంగా ఉండనియ్యరు. ఎదుటి వాళ్ల దుఃఖమే వాళ్లకు ఆనందం. ఎదుటివాళ్ల ఏడుపులో ఆనందాన్ని వెతుక్కుంటారు.లేకపోతే నీకు ఇప్పుడు నీ తల్లి గురించి చెప్పవలసిన అవసరం ఏముంది? ఏ ప్రయోజనం ఆశించి వాళ్లు అలా చెప్పారో అర్థం కావటం లేదు. దీనివల్ల ప్రశాంతంగా సాగిపోతున్న మన జీవితాల్లో అశాంతి, ఆందోళన మొదల య్యాయి.
నీ లేత గుండెలో చెప్పలేని దిగులు, ఆందోళన, దానివల్ల చదువు విÖద కుదరని ధ్యాస. అయినా నీ తల్లి గురించి నువ్వు తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు. నిన్ను మాతో తెచ్చుకున్న తరువాత కనీసం పదిసార్లు కెంగువ వెళ్లి మీ పెద్దమ్మ గౌరిని కలిసాను.
మీ అమ్మనాన్నలు తిరిగి రాలేదని, వాళ్ల కోసం ఆ ఊరంతా ఎదురు చూస్తోందనీ ఆమె చెప్పింది. నేను వెళ్లినప్పుడల్లా నీ ఫోటోలు ఆమెకు చూపించే వాడిని. వాటిని చూసి ఆమె చాలా సంతోషించేది. ధరణికి నీ గురించి తెలిస్తే ఎంతో ఆనంద పడుతుందనీ చెప్పేది. మీ అమ్మనాన్నలు మీ ఊరు తిరిగొస్తే నేను నిన్ను తీసికెళ్లి వాళ్లకి అప్పచెప్పాలనీ అనుకున్నాను.
కానీ వాళ్లు ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్లు వస్తే తెలియచేస్తానని గౌరి చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగుండక కుటుంబం గడవడం కోసం మీ పెద్దమ్మ చాలా అప్పులు చేసింది.ఇప్పుడు నువ్వు అక్కడికి వెళితే ఆమెకు ఆర్థికంగా భారమవుతావు.” వివరంగా చెప్పాడు శ్రీధర్.
శ్రీధర్ మాటలు విన్న ప్రియ మౌనం దాల్చింది. ఆయన చెప్పిన తన తల్లితండ్రుల కథ బాగా బాధ కలిగించింది.జన్మనిచ్చిన వారిని చూడాలన్న గట్టి కోరిక కలిగింది. ‘తన అమ్మానాన్న ఎలా ఉంటారు?అసలు వాళ్లు బతికున్నారా?’ ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమెని వేధించసాగాయి. ప్రియకు ఆమె తల్లితండ్రుల గురించి చెప్పడానికి మొదట శ్రీధర్ సంశయించాడు. చెబితే ఆమె ఎలా ప్రతిస్పంది స్తుందోనని మధన పడ్డాడు ?
ఇన్నేళ్ల తరువాత కొందర ఆమెలో అనుమాన బీజం నాటారు. అవి మొలకెత్తి మానుగా మారక తప్పదు. అసలు అనుమానం అనేది చాలా ప్రమాదకరమైనది. ఒకసారి అది మొదలైతే దహించి నాశనం చేసే వరకూ వదలదు.
మనిషికి కొంత వయస్సు వచ్చిన తరువాత సమస్యల పట్ల అవగాహన కలుగుతుంది. అప్పుడు వాటిని అర్థం చేసుకొనీ పరిష్కారాల కోసం అన్వేషించే శక్తి వస్తుంది. కానీ ప్రియది ఇప్పుడిప్పుడే కౌమారం దాటి యవ్వనంలో ప్రవేశిస్తున్న వయస్సు. ఇప్పుడు ఆ లేత హృదయం ఏ సమస్యల్నీ తట్టుకోలేదు. నవ్వుతూ తుళ్లుతూ చదువుకొనే వయస్సు. మనస్సు స్వచ్ఛంగా ఉండే వయస్సు. అసూయ, ద్వేషాలు ఎరుగని వయస్సు.
అటువంటి తరుణంలో ఆమె దల్లితండ్రుల గురించి అనుమానం నాటు కుంటే అది పెనుప్రళయంగా మారే ప్రమాదం ఉంది.
శరీరంలో గుచ్చుకున్న బాణాలను బయటకు తీయవచ్చు కానీ మనసుకు కష్టం కలిగించే మాటలను తొలగించడం అంత సులభం కాదని చెబుతారు. అది నిష్టుర సత్యం.
ఇప్పుడు శ్రీధర్ ఆలోచనలు కూడా అలాగే సాగుతున్నాయి. ఇన్నాళ్లూ కష్టం నీడ కూడా తెలియకుండా కూతుర్ని పెంచాడు. ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఈ అనుమానం నిజంగా ఒక కల్లోలం లాంటిది. దీన్ని సరియైన సమయంలో తొలగించకపోతే ఆమె జీవితం కష్టాలమయమయ్యే ప్రమాదం ఉంది.
శ్రీధర్ ఈ వారం రోజులుగా ప్రియని జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నాడు. ఇది వరకు లేని ఆందోళనను ఆమె ముఖంలో గమనించాడు.
ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది.ఆ దంపతులు సరిగా మాట్లాడుకోవడం మానేసారు.
ప్రియ ఎప్పుడు ఏ ప్రశ్న వేసి తమని ఇరుకున పెడుతుందోనని గాబరా పడుతున్నారు.
ఆ సమయంలోనే ధరణి నుంచి శ్రీధర్‌కి ఉత్తరం వచ్చింది. దానిని చూసి శ్రీధర్ నమ్మలేక పోయాడు.
ఆమె అజ్ఞాతంలోకెళ్లి పది సంవత్సరాలకు పైగా అయింది. ఆమె తిరిగి వస్తే వనజను అప్పగించాలని పెట్టిన షరతుతో శ్రీధర్ దంపతులలో గుబులు రేపుతోంది. ఇన్నేళ్లు సొంత కూతురిలా సాకిన ప్రియని అప్పచెప్పడం ఎలా? అని ఆ దంపతలు మధనపడుతున్నారు.
(సశేషం)

గన్నవరపు నరసింహ మూర్తి