భగవద్గీతలో కృష్ణుడు ‘కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో’ (నేనే కాలాన్ని, లోకాలను క్షయం చేసేవాడిని) అని అంటాడు. అంటే, సమయాన్ని గౌరవించడం అంటే భగవంతుడిని గౌరవించడమే.
ఈ ప్రపంచంలో ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ ప్రకృతి సమానంగా ఇచ్చిన ఆయుధం రోజుకు 24 గంటలు మాత్రమే. ఆ సమయాన్ని ఎవరు సమర్థవంతంగా వినియోగించు కుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. ‘కాలం కలిసి వస్తేనే ఏదైనా సాధ్యం’ అంటారు. కానీ ఆ కాలం కలిసి రావాలన్నా, మనం ప్రస్తుత సమయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.
‘యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా (భగవద్గీత – ఆరవ అధ్యాయం) సరైన సమయంలో ఆహారం తీసుకోవడం, సరైన సమయంలో నిద్రించడం, మేల్కొనడం పనులు చేయడం ఎవరైతే పాటిస్తారో, వారి దుఃఖాలన్నీ నశిస్తాయి. అంటే, ఒక క్రమశిక్షణ కలిగిన దినచర్య ఉండాలని, ఏ పనిని ఆ సమయంలోనే చేయాలని ఆయన స్పష్టం చేశాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు విషాదంలో మునిగిపోయి నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడినప్పుడు, కృష్ణుడు అతనికి వర్తమాన కాల ప్రాముఖ్యతను గుర్తుచేశాడు. ‘రేపు’ అనే దాని గురించి ఆలోచించి ఈరోజు చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదని హితవు పలికాడు. కృష్ణుడు తన జీవితంలో ఎప్పుడూ సమయపాలనను విస్మరించ లేదు. కృష్ణుడు రాయబారిగా వెళ్ళినప్పుడు అత్యంత చాకచక్యంగా సమయాన్ని బట్టి వ్యవహరించాడు. సూర్యాస్తమయంలోపు జరగాల్సిన పనులను, ప్రకృతి ధర్మాలను గౌరవిస్తూనే తన కార్యాలను పూర్తి చేసేవాడు.
మహాభారతంలో ధర్మరాజుకి, యక్షుడికి మధ్య జరిగిన సంభాషణ, కాలం ప్రాముఖ్యతను, ‘కాలపురుషుడి’ తత్త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. కాలపురుషుడు ఎవరికీ కనిపించడు, కానీ అతని ప్రభావం ప్రతి అణువు మీద ఉంటుంది. సృష్టించడం, పెంచడం, చివరకు తనలో లీనం చేసుకోవడం ఈ వ•డు పనులను కాలం అలసట లేకుండా చేస్తుంది. ధర్మరాజు దృష్టిలో కాలం అంటే కేవలం గంటలు కాదు, అది ‘నియతి’ (ణవ•ఱఅ•). ప్రతిరోజూ కళ్లముందే ఎంతోమంది మరణిస్తున్నా, మనం మాత్రం శాశ్వతంగా ఇక్కడే ఉంటామని అనుకుంటాం. ‘ప్రపంచంలో ఆశ్చర్యకరమైనది ఏమిట’ని యక్షుడు అడిగినప్పుడు, ‘కాలపురుషుడు పరిగెత్తుతున్నా మనం గమనించకపోవడమే’ అతిపెద్ద ఆశ్చర్యమని ధర్మరాజు అంటాడు. కాలపురుషుడు మన ఆయుష్షును ప్రతి క్షణం హరిస్తున్నా, మనిషి తన ధర్మాన్ని విస్మరించి బ్రతుకుతాడు. కాలపురుషుడి ధాటికి అన్నీ నశించినా, ధర్మం మాత్రం శాశ్వతంగా ఉంటుందని ధర్మరాజు నమ్మకం. కాలం మారినా, యుగాలు మారినా సత్యం, అహింస, ధర్మం వంటి విలువలు మారవు. అందుకే కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండాలంటే ధర్మాన్ని ఆశ్రయించడమే ఏకైక మార్గమని ఆయన బోధన. ధర్మరాజు వివరణ ప్రకారం, కాలపురుషుడు అత్యంత బలవంతుడు. ఆయన ముందు రాజులు, సామాన్యులు అందరూ సమానమే. ఈ కాలపురుషుడి వేగాన్ని అర్థం చేసుకున్నవాడే జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు.
ధర్మరాజు కాలాన్ని ఒక వంటవాడితో పోలుస్తాడు. ఈ ప్రపంచం ఒక పెనం వంటిది. సూర్యుడు అగ్ని, పగలు రాత్రులు ఇంధనం (కట్టెలు). ఈ కాల పురుషుడు ప్రాణులనే పదార్థాన్ని ఆ పెనం మీద వేసి నిరంతరం వండుతున్నాడు. ‘అస్మిన్ మహామోహమయే కటాహే.. కాలః పచతి భూతాని…’ అంటే, ఈ అజ్ఞానమనే బాండీలో కాలం సమస్త ప్రాణులను మృత్యువు వైపుకు తీసుకెళ్తూ వండుతోంది. ఏ ప్రాణీ దీని నుండి తప్పించుకోలేదు.
కాలాన్ని దాచుకోవడం సాధ్యంకాదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని నియంత అన్నాడొక తాత్వికుడు. నిజమే. కాల పురుషుడు ఎప్పుడు ఎవరికి ఆనందం పంచుతాడో, విషాదం కలిగిస్తాడో ఊహించలేం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయపాలన మనిషి జీవితంలో విలువైనవి. ఎందుకంటే కాలమే జీవితం గనక. మనిషి జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది. విద్యార్థి దశలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే విజ్ఞానం పెరుగుతుంది, వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది.
‘పేద కుటుంబంలో జన్మించిన మీరు ఇంత సంపన్నులెలా అయ్యార’ని ఒక కోటీశ్వరుణ్ని ప్రశ్నిస్తే ‘కాలం ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకునే కళ తెలిసిన వాణ్ని’ అని బదులిచ్చాడట. కాలం ఒక ప్రవాహం వంటిది. దాన్ని నిలువరించలేం. చాలామంది గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని పట్టించుకోరు. ఆలస్యం, నిర్లక్ష్యం వంటి అలవాట్లు కాలాన్ని వృథా చేస్తాయి. ఇవి భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కాలం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి వ్యక్తి ప్రధాన బాధ్యత. కాలాన్ని సక్రమంగా వినియోగించు కున్నవారే జీవితంలో విజయశిఖరాలను అధిరోహిస్తారు.
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక చాలా అవసరం. రోజువారీ పనులకు ఒక పట్టిక తయారు చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి, అనవసర మైన పనులను దూరంగా పెట్టాలి. ఈ విధంగా క్రమశిక్షణతో జీవిస్తే సమయం మనకు అనుకూలంగా మారుతుంది.
ప్రస్తుత యుగంలో సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాలం వేగంగా గడుస్తోంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అవసరమైన మేరకు ఉపయోగపడినా, అవి అధికంగా వాడితే కాలాన్ని వృథా చేస్తాయి.సాంకేతిక సాధనాలను మన అవసరాలకు మాత్రమే పరిమితం చేయాలి. మహాను భావుల జీవితాలను పరిశీలిస్తే వారు కాలానికి ఎంత విలువిచ్చారో అర్థమవుతుంది. వారి జీవితాలు మనకు కాల ప్రాముఖ్యతను బోధిస్తాయి.
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, లక్ష్యసాధన సులభమవుతుంది. ప్రతి రోజును ఒక అవకాశంగా భావించి, కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. సమయం మన జీవితంలో అత్యంత విలువైన వనరు. దాన్ని ఎలా వినియోగిస్తామన్నదే మన విజయాన్ని లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది. సమయాన్ని సక్రమంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించడాన్నే సమయ పాలన అంటారు. ఇది ప్రతి వ్యక్తికి అవసరమైన ముఖ్యమైన నైపుణ్యం.
సమయం భగవంతుడు మనకు ఇచ్చిన అవ•ల్యమైన వరం. ప్రతి క్షణం ఆయన కృపతోనే మనకు లభిస్తోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే భగవంతుని ఆశీస్సులను గౌరవించినట్లే. మన పురాణాలు, ఇతిహాసాలు సమయ ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్తాయి. శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని బోధిస్తూ, ప్రతి క్షణాన్ని ధర్మమార్గంలో వినియోగించాలని ఉపదేశించాడు. రామాయణంలో శ్రీరాముడు తన సమయాన్ని ప్రజాసేవకు, ధర్మ పరిరక్షణకు అంకితం చేసి ఆదర్శంగా నిలిచాడు. వీరి జీవితాలు సమయ పాలనకు ఉత్తమ ఉదాహరణలు.
భక్తి భావనతో సమయపాలన పాటించే వ్యక్తి తన రోజు ప్రార్థనతో ప్రారంభి స్తాడు. ఉదయం లేవగానే భగవంతుని స్మరించుకోవడం మన మనసుకు శాంతిని ఇస్తుంది. ఆ తరువాత చేయాల్సిన పనులను ధర్మబద్ధంగా, క్రమశిక్షణతో నిర్వర్తిస్తాడు. పని కూడా ఒక యజ్ఞంలా భావించి, ఫలాపేక్ష లేకుండా చేయడం నిజమైన భక్తి. సమయ పాలనలో నియమిత జీవనం చాలా ముఖ్యం. శాస్త్రాలు చెప్పినట్లుగా, నియమమే భక్తికి వ•లం. నియమం ఉన్నచోటే నియంత్రణ ఉంటుంది, నియంత్రణ ఉన్నచోటే ఆధ్యాత్మిక వికాసం జరుగుతుంది. నేటి కాలంలో భౌతిక ఆకర్షణలు మన సమయాన్ని ఎక్కువగా ఆక్రమిస్తున్నాయి. కానీ భక్తిమార్గంలో నడిచేవారు తమ సమయాన్ని జపం, ధ్యానం, సేవ వంటి సత్కార్యాలకు కేటాయిస్తారు. ఇతరులకు సహాయం చేయడం కూడా భగవంతుని సేవగానే భావిస్తారు. ఈ విధంగా సమయాన్ని వినియోగిస్తే జీవితం పవిత్రమవుతుంది.
సమయ పాలనతో కూడిన భక్తి జీవితం మనకు ఆత్మశాంతిని ప్రసాదిస్తుంది. మన కర్తవ్యాలు సక్రమంగా పూర్తవుతాయి. భగవంతునిపై విశ్వాసం బలపడుతుంది. ప్రతిరోజు ఒక సాధనలా మారి, జీవితం ఒక సాధ్య మార్గంగా పరిణమిస్తుంది. సమయం భగవంతుని ప్రసాదం. దానిని భక్తి, క్రమశిక్షణ, ధర్మంతో పాలించ గలిగినవారే నిజమైన ఆధ్యాత్మిక సంపదను పొందుతారు.
కాలం ఎవరి కోసం ఆగదు. అందుకే ‘రేపటి పని ఈరోజే చేయండి. నేటి పని ఈ క్షణమే ప్రారంభించండి, రేపేమవుతుందో ఎవరికి తెలుసు’ అంటాడు కబీర్. సమయాన్ని క్రమశిక్షణతో వాడితే, అది ఒక శిల్పి చేతిలో ఉలిలా మన జీవితాన్ని అందంగా మలుస్తుంది. విద్యార్థికి చదువులో, నిపుణుడికి కెరీర్‌లో విజయానికి పునాది వేస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ‘సమయం’ ఒక వైద్యుడిలా పనిచేస్తుంది. ఎంత పెద్దగాయాన్నైనా మానిపే శక్తి కాలాంతరంలోనే ఉంటుంది.
సమయం ఒక ఖాళీ కాగితం లాంటిది. మన చర్యలే దాని మీద అక్షరాలు. నిన్నటి పేజీని మార్చలేం, రేపటి పేజీ ఇంకా రాలేదు. చేతిలో ఉన్న ఈ పేజీలో ఏం రాస్తామన్నదే మన వ్యక్తిత్వం. వింటి నుండి విడిచిన బాణం, నోటి నుండి జారిన మాట, గడిచిపోయిన కాలం..ఈ వ•డూ తిరిగి రావు. సమయం అనే ఆయుధాన్ని ప్రయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయం ఒక సామాన్యుడిని సైతం విజేతగా మారుస్తుంది.
యుద్ధరంగంలోనైనా, జీవితరంగంలోనైనా ‘టైమింగ్’ అనేది కీలకం. ఒక్కోసారి ఏమీ చేయకుండా వేచి ఉండటం కూడా సమయం అనే ఆయుధాన్ని వాడటమే. ఓర్పుతో సమయం కోసం వేచి చూడటం శత్రువును బలహీనపరుస్తుంది. ‘సమయం ఎవరికోసం ఆగదు, కాబట్టి ధర్మాన్ని పాటించడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండాల’నేదే శ్రీకృష్ణుని ప్రధాన సందేశం.
కాలం నీ చేతిలో ఉంటే విజేతవి, నువ్వు కాలం చేతిలో చిక్కితే బాధితుడివి.

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008577834