సంతృప్తితో, హుందాగా, తక్కువతో తృప్తిగా, ప్రశాంతంగా జీవించే కళే మినిమలిజం.

నేటి కాలంలో మన జీవితాలు సౌకర్యాలతో నిండిపోయినా, మనసులు మాత్రం ప్రశాంతంగా లేవు. అవసరాలను మించిన వస్తువులు, సదుపాయాలు, ఆడంబరాలు పెరిగిపోవడంతో మనిషి జీవితంలో సంతోషం కరువై, అసంతృప్తి పెరిగిపోతోంది. కొత్త ఆఫర్లు, ఆన్‌లైన్ సేల్స్, ఆకర్షణీయమైన ప్రకటనలు, సామాజిక పోలికలు, ఇవన్నీ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ కొనిపించేలా చేస్తున్నాయి. ఇంటి నిండా సరుకులు, వస్తువులు ఉన్నా, మనిషి ఆనందంగా ఉండలేక, మనసులో తెలీని వెలితితో జీవితాలు బరువెక్కుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న నవ జీవన విధానం ‘మినిమలిజం’. మినిమలిజం అంటే  కోరికలను అణచుకోవడం కాదు, జీవితాన్ని నిరాకరించడం కాదు. మనకు నిజంగా అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకుని, మిగతా భారాన్ని తగ్గించు కోవడం. ఎంతో నిండు మనసుతో తమ  వసతు లను ఇతరులతో పంచుకోవడం, దానధర్మాలు చేయడంలో సంతృప్తి పొందడం.

ఆకర్షణకు లొంగిపోకుండా మనం గిరిగీసుకున్న పరిధిలో జీవించడమే  మినిమలిజం.

నేటి కాలంలో షాపింగ్ ఒక వినోదంగా మారిపోయింది. ఇంకా కొంతమందికి షాపింగ్ ఒక స్ట్రెస్ బస్టర్. దీనితో అవసరం లేని సరుకు పోగుచేయ డమే కాకుండా, నిజంగా అవసరమున్న వారికి అవి అందకుండా చేస్తున్నాం. వాటి ధరలు ఆకాశానికి పెరిగిపోయి సామాన్యుడికి అందకుండా చేస్తున్నాం.

ఒక కుటుంబాన్ని ఊహించండి. ప్రతి నెలా కొత్త దుస్తులు, డెకరేషన్ వస్తువులు, చిన్న చిన్న గ్యాడ్జెట్లు కొనుగోలు చేస్తుంటారు. కొద్ది కాలానికే ఇంట్లో అల్మారాలు నిండిపోతాయి. ముఖ్యమైన వస్తువులు పెట్టడానికి చోటే లేకుండా చేసుకుంటున్నాం.

గత కొన్నేళ్లుగా రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆడంబరాలకు పోయి, ప్రతీ చిన్న వేడుకలో ఏదోఒకటి అతిథులకు ఇవ్వటం అలవాటైపోయింది. దీనివల్ల కూడా సరుకు అమ్మకాలు, కొనుగోలు రెండూ బాగా ఊపందుకున్నాయి. ఇళ్లు నిండి పోతున్నాయి, మనసులో తృప్తి ఆవిరైపోతోంది.

మినిమలిజం అలవరచుకుని, “ఈ వస్తువు లేకుంటే నిజంగా నా జీవితం అసౌకర్యంగా మారుతుందా?” అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు సమాధానం కచ్చితంగా దొరుకుతుంది.   ఈ ప్రశ్నకు నిజాయతీగా సమాధానం చెప్పగలిగితే కొనుగోళ్లలో సగం తగ్గిపోతాయి. అంతేకాదు మన ఇళ్లల్లో అటకెక్కిన సామాను కూడా మనకు ఇక అవసరంలేదని స్పష్టమౌతుంది.

 వంటగది, వస్తువుల నిల్వ గదిగా మారకూడదు, ఇంట్లో ఎక్కువగా నిండిపోయే ప్రదేశాల్లో వంటగది ఒకటి. వివిధ పరిమాణాల పాత్రలు, అరుదుగా ఉపయోగించే పరికరాలు, ఒకే పని చేసే అనేక వస్తువులు, చివరకు వాటిని ఉంచడానికే స్థలం సరిపోదు.

ఒక ఇంట్లో ఐదు రకాల కత్తులు, మూడు మిక్సర్లు, ఎన్నో బౌళ్లు ఉన్నా రోజూ వాడేవి కొన్ని మాత్రమే. ఇంకా విశేషమేమిటంటే, ఇంటికి నలుగురు అతిథులు వస్తే వెంటనే క్యాటరర్, డిస్పోసబల్ అంటూ పరుగులు తీస్తున్నారు. దీనితో మన ఇంట్లో పెద్ద సరుకులు, పాత్రలు ఉపయోగించడం తగ్గిపోయింది.

మినిమలిస్టిక్ వంటగది అంటే

  1. తరచుగా ఉపయోగించే పాత్రలకే ప్రాధాన్యం.
  2. బహుళ ఉపయోగాలు ఉన్న వస్తువుల ఎంపిక.
  3. ఏడాదికి ఒక్కసారి కూడా ఉపయోగించని వాటిని దానం చేయడం.
  4. నిల్వల నియంత్రణ.
  5. అటక మీద సామాను చేరవేయక పోవడం.

దీంతో వంటగది శుభ్రంగా ఉండటమే కాదు, పనిభారం కూడా తగ్గుతుంది. దుమ్ము ధూళి, పురుగులు చేరకుండా ఇంటిని సుబ్రంగా ఉంచ గలుగుతాము.

కొత్త కొత్త గ్యాడ్జెట్లు మన జీవితాన్ని సులభతరం చేస్తాయని భావిస్తాం. కానీ చాలాసార్లు వాటిని నిర్వహించడమే కొత్త పని అవుతుంది. మినిమలిజం చెబుతుంది, పని తగ్గించే వస్తువులను ఉంచండి, పని పెంచేవాటిని కాదు.

నగలు విలువ జ్ఞాపకాలలోనా, బరువులోనా, లేదా వాడుకోవడంలోనా? ఇది నిజంగా మనం ప్రశ్నించుకోవలసిన విషయమే. బంగారు నగలు, గంట బంగారాలు, పంచలోహాల నగలు, ఇంకా అనేక రకాలుగా ముత్యాలు, పగడాలు ఇతర పూసలతో నగలు.  నగలు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. కానీ కొన్నిసార్లు అవసరానికి మించి కొనడం ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది. పెళ్లిళ్లు, వేడుకలు, పోలికలు, వీటి కారణంగా చాలామంది తమ సామర్థ్యానికి మించి నగలు కొనుగోలు చేస్తారు.

మినిమలిజం నగలను వ్యతిరేకించదు. కానీ ఇలా ఆలోచించమంటుంది:

  1. నిజంగా ధరించే నగలు ఎన్ని?
  2. భద్రపరచడానికే ఉన్నవి ఎన్ని?
  3. పెట్టుబడి కోసం కొంటున్నామా? లేక ప్రదర్శన కోసమా?

కొన్ని నాణ్యమైన, ఉపయోగకరమైన నగలు చాలాసార్లు సరిపోతాయి.

ఇంకా పెద్ద ఎత్తున మనమందరం పోగు చేస్తున్నది వివిధ రకాల బట్టలు,  చీరలు. కనీసం ఒక మహిళకు  రెండువందల చీరలు, ఇతర బట్టలు సామాన్యమైపోయింది. వీటికి స్వస్తిపలికి, పేదవారి అవసరాలు తీర్చడం ఎంతైనా ముఖ్యం. ఈరోజుల్లో గుడ్విల్ స్టోర్స్, ఛారిటీ హౌస్ అని ఎన్నో ఉన్నాయి. మనకి ఎక్కువైనా సరుకులు అక్కడ ఇస్తే వారు అవసర మున్న వారికి ఎంతో హుందాగా అందజేస్తారు.

ఖర్చుల నియంత్రణ, స్వేచ్ఛకు మొదటి అడుగు. చాలామంది ఎక్కువ సంపాదిస్తే సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. కానీ ఖర్చులు కూడా అదే వేగంతో పెరుగుతాయి. మినిమలిజం మనకు ఆదాయం పెంచమని కాకుండా, అనవసర ఖర్చులు తగ్గించమని చెబుతుంది. దీనివల్ల మనం అవసరం లేని సంపాదన, డబ్బు వ్యామోహం తగ్గించుకుని న్యాయమైన జీవితానికి అలవాటుపడతాం.

కొన్ని క్రొత్త అలవాట్లు మనం వదులుకొని, పాత మార్గాలు, అవే మంచి మార్గాలని తెలుసుకోవలసిన అవసరం ఎంతోవుంది.

 పిల్లలకు ఇవ్వాల్సింది వస్తువులు కాదు,  విలువలని తెలుసుకోవాలి, ఎవరి అవసరాలను వారు గుర్తించి కొనుగోలు చేసే స్వతంత్రం, అవకాశం వారికే వదిలేయాలి. పిల్లల ప్రతి కోరిక వెంటనే తీర్చడం ప్రేమకు గుర్తు కాదు. పిల్లలకు వస్తువుల కంటే విలువలు నేర్పడం ముఖ్యమైనది. వారికి నేర్పాల్సింది, వస్తువుల సంరక్షణ, అవసరాన్ని గుర్తించడం, పంచుకోవడం,

సాదాసీదా జీవనంలో ఆనందం. ఇవే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన జీవనానికి పునాది వేస్తాయి. మినిమలిజం అంటే జీవితంలో రంగులు తగ్గించడం కాదు, గందరగోళం తగ్గించడం. తక్కువ వస్తువులు, తక్కువ ఖర్చులు, తక్కువ ఒత్తిడి, కానీ ఎక్కువ సమయం, ఎక్కువ ప్రశాంతత, ఎక్కువ స్వేచ్ఛ.

మన ఇల్లు నిండిపోవడం కంటే మన మనసు నిండిపోవడం ముఖ్యం. అవసరానికి మించిన ప్రతి వస్తువు కొన్నిసార్లు మన సమయాన్ని, డబ్బును, మనశ్శాంతిని తీసుకుంటుంది. కాబట్టి ఈరోజే ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం,‘కొనుగోలు చేయడానికి ముందు ఆలోచిద్దాం, అవసరం లేనిదాన్ని వదులుకుందాం, అవసరమన్న వారికి అందిద్దాం, తక్కువతో అనందంగా జీవిద్దాం.’

  • డా॥ జె.పి. భారతి కాజా

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.