నివాళి
‘‘చారిత్రక నవలాచక్రవర్తి’’ ఆచార్య ముదిగొండ శివప్రసాద్ హైందవ జాతి, ఆంధ్ర సంస్కృతి కలకాలం గర్వించదగిన ధర్మవీరుడు. పూర్ణపురుషుడు. క్షణం కూడా వృథా చేయకుండా, కాలంతో పందెం వేసి, ముదిమిని జయించి, ధర్మపక్షాన కడ శ్వాసవరకూ పోరాడిన మహారథుడు. హైందవజాతి వైభవోజ్జ్వల ఘన చరిత్రను మథించి, తనదైన శైలిలో పరిశోధించి, సృజనాత్మక సొగసులద్ది ‘శ్రీలేఖ’, ‘శ్రావణి’, ‘శ్రీపదార్చన’, ‘తంజావూరు విజయం’, ‘నాగపూర్ణిమ’, ‘అమృతోదయం’, ‘మాలిక్ కాఫర్’ వంటి ఉత్తమశ్రేణి ఐతిహాసిక – కాల్పనిక నవలలుగా మలచిన సారస్వత శిల్పి. విశ్వనాథ, నోరి, అడవి బాపిరాజుల సాహితీ వారసత్వాన్ని విలక్షణంగా, వారికంటే ప్రచండంగా మరింత ముందుకు తీసుకువెళ్లి, అనేక తరాల నవ యువతలో జాతిగర్వాన్ని, ధర్మనిబద్ధతను పెంచిన ధన్యజీవి. అలుపెరుగని పోరాటానికి, విధర్ముల పీచమణచే పౌరుషానికి ఆయన నిలువెత్తు ప్రతీక. సాహసం ఆయన ఊపిరి. సాహితీ రంగంలో శివప్రసాద్ గారి శివతాండవం ధర్మవీరులకు గొప్ప స్ఫూర్తి.
తెలుగు సాహిత్య ప్రపంచంలో మరో మహోన్నత సాహితీ శిఖరం నేలకొరిగింది. చారిత్రక నవలా రచనకు సరికొత్త ప్రాణంపోసి, భారతీయ చరిత్ర, సంస్కృతి, సనాతన ధర్మ వైభవాలను అక్షర బద్ధం చేసిన ప్రముఖ సాహితీవేత్త, ఆచార్య డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ ఇకలేరు. అక్టోబరు 8న కన్నువ•శారన్న విషాదవార్త తెలుగు సాహిత్యాభి మానులను కలచివేసింది. 86 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఆరుదశాబ్దాలకు పైగా సాహిత్యసేవకే అంకితమై, చరిత్రను పరిశోధించి, దానికి సాహిత్య రూపమిచ్చి, తరతరాల పాఠకులకు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసిన మహ నీయుని నిర్యాణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు.
ఆర్ఎస్ఎస్ జ్యేష్ట ప్రచారకులు బాబాసాహెబ్ ఆప్టే, శ్రీరామ్సాఠేల నుంచి లభించిన స్ఫూర్తితో విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి, అడవి బాపిరాజు వంటి సాహితీ దిగ్గజాలు సమున్నత స్థాయికి చేర్చిన చారిత్రక నవలా పక్రియను తనదైన విశిష్టరచనా వైదుష్యంతో కొనసాగించిన ఆయన అక్షరతపస్వి. దేశభక్తి,ధర్మనిష్ఠ,చరిత్ర పట్ల అపారమైన ఆసక్తి, పరిశోధన పట్ల అంకితభావం, నిర్భయమైన అభిప్రాయ ప్రకటన ఆయన వ్యక్తిత్వానికి ప్రధాన లక్షణాలు. భౌతికంగా దూరమైనా, ఆయన సృష్టించిన సాహిత్యసంపద, రచనల ద్వారా అందించిన చారిత్రక చైతన్యం, తరతరాలకు మార్గదర్శకంగా నిలిచే సందేశాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఆచార్య ముదిగొండ శివప్రసాద్ 1940 డిసెంబరు 23న నేటి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సమీపాన ఆకులల్లూరు గ్రామంలో జన్మించారు. తండ్రి ముదిగొండ మల్లికార్జునరావు, తల్లి రాజేశ్వరమ్మ. ఆకులల్లూరు ఆయన మాతామహుల గ్రామం కాగా గుంటూరు సమీపంలోని తాడికొండ పితృవంశానికి చెందిన గ్రామం. బాల్యం ఈ రెండు ప్రాంతాల్లో గడిచింది. సముద్రతీర ప్రాంతమైన ఆకులల్లూరులో ప్రకృతి సౌందర్యం, గ్రామీణ జీవన విధానం, పల్లె సంస్కృతి ఆయన మనసుపై చెరగని ముద్రవేశాయి. గుంటూరు ప్రాంతంలోని సాహిత్య వాతావరణం ఆయనలో రచనాసక్తిని పెంపొందిం చింది. తాడికొండతో అనుబంధం ఉన్న జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజతో ఆయనకు ఏర్పడిన సాన్నిహిత్యం జీవితాంతం కొనసాగింది.
తెలుగు, సంస్కృత సాహిత్యాలపై ప్రగాఢమైన ఆసక్తి కలిగిన శివప్రసాద్ గారు అనేకమంది మహాపండితుల సాన్నిహిత్యాన్ని పొందారు. విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వేంకటావధాని, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు, వేదుల సత్యనారాయణశాస్త్రి, గంటి జోగిసోమయాజి తదితర సాహితీ ప్రముఖుల ప్రభావం ఆయనపై పడింది. దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద వ్యాకరణం అభ్యసించారు. ముఖ్యంగా దివాకర్ల వేంకటావధానితో ఏర్పడిన గురుశిష్య సంబంధం ఆయన జీవితంలో విశిష్టమైనది. తన సాహిత్య జీవితానికి విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రి రచనలు ప్రధానమైన ఆదర్శాలని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. పాత్రికేయ వృత్తితోనూ ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. తెలుగు పత్రికా చరిత్రలో విశిష్ట స్థానమున్న కృష్ణాపత్రిక సంపాదకవర్గంలో పని చేశారు. సాహిత్య రచనల ఎంపిక, సంపాదకత్వం, ధారావాహిక నవలల ప్రచురణ,సమీక్షలు, సాంస్కృతిక వ్యాసాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు.
1959లో హైదరాబాద్లో ఉపాధ్యాయునిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన శివప్రసాద్ తరువాత భద్రుక కళాశాల, ఓరియంటల్ కళాశాల, తదితర విద్యాసంస్థల్లో పనిచేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా నియమితులై, రీడర్, ప్రొఫెసర్ స్థాయుల్లో సేవలందించారు. సుమారు వ•డున్నర దశాబ్దాల అధ్యాపక జీవితంలో ఎందరో విద్యార్థులకు సాహిత్యాన్ని బోధించారు. పాఠ్యాంశాలను వివరించడమే కాకుండా వాటి చారిత్రక నేపథ్యం, సామాజిక ప్రాధాన్యం, భాషా సౌందర్యం, సాంస్కృతిక విలువలను విశ్లేషించి చెప్పేవారు.
సి. నారాయణరెడ్డి మార్గదర్శకత్వంలో ఆధుని కాంధ్ర కవిత్వంపై ఉద్యమాల ప్రభావం అనే అంశంపై పరిశోధించి డాక్టరేట్ పొందారు. రాజకీయ, సామాజిక, సాహిత్య ఉద్యమాలు తెలుగు కవిత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాన్ని చారిత్రక పరిణామక్రమంలో విశ్లేషించారు. సాహిత్యం సమాజానికి వేరుగా ఉండదని, సమాజం లోని పరిణామాలు భాషలోనూ, భావప్రకటనలోనూ ప్రతిఫలిస్తాయని ఈ పరిశోధన ద్వారా వివరించారు. ఒక సాహిత్య పక్రియను అధ్యయనం చేసేటప్పుడు దాని నేపథ్యంలోని సామాజిక శక్తులను పరిశీ లించాలనే పరిశోధనా దృక్పథం తరువాత ఆయన రచించిన చారిత్రక నవలల్లోనూ కనిపిస్తుంది.
తెలుగు చారిత్రక నవలా సాహిత్యంలో శివ ప్రసాద్ ప్రత్యేక అధ్యాయం. చారిత్రక నవల అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, విజయాలు, పరాజయాల వర్ణన మాత్రమే కాదని, ఒక కాలంలోని సమాజాన్ని, ప్రజల జీవన విధానాన్ని, రాజకీయ పరిస్థితులను, మత విశ్వాసాలను, కళాసంపదను సజీవంగా చిత్రించే సాహిత్య పక్రియ అని ఆయన రచనలు తెలియజేస్తాయి. చరిత్ర గ్రంథాల్లో కనిపించే సంఘటనలను కథనంగా మలచడంలో ఆయనకు విశేషమైన నైపుణ్యం ఉంది.
ఆంధ్రులకు సుదీర్ఘమైన చరిత్ర, ఘనమైన సంస్కృతి ఉన్నాయని సామాన్యులకు తెలియ జేయాలనే ఆశయంతో చారిత్రక నవలలు రచించడం ప్రారంభించినట్లు ఆయన స్వయంగా వివరించారు. తన రచనలద్వారా పాఠకుడు కేవలం వినోదాన్ని పొందడమే కాకుండా చరిత్రపై ఆసక్తిని పెంపొం దించుకోవాలని భావించారు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగరసామ్రాజ్యం, తంజా వూరు నాయకరాజులు,ముసునూరి నాయకులువంటి రాజవంశాలు, చారిత్రక వ్యక్తులను ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు. శాతవాహనుల చరిత్రపై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ప్రాచీన ఆంధ్రుల రాజకీయ వైభవం, ధాన్యకటక ప్రాంత చరిత్ర, బౌద్ధ సంస్కృతి, అప్పటి సామాజిక జీవన విధానాలు ఆయన నవలల్లో చోటుచేసుకున్నాయి. శ్రీలేఖ, శ్రావణి, వసంతగౌతమి, ఆచార్య నాగార్జున జీవితాన్ని ఆధారంగా చేసుకున్న నాగపూర్ణిమ వంటి రచనలు ఆయన చారిత్రక సృజనకు నిదర్శనాలు. శాతవాహనుల నేపథ్యంలో ఆరు నవలలు రచించినట్లు ఆయన పేర్కొన్నారు. శివప్రసాద్ 83 రచనలు చేయగా, వాటిలో 25కు పైగా చారిత్రక నవలలే ఉండటం గమనార్హం.
కాకతీయుల చరిత్రపై శివప్రసాద్ చేసిన కృషి మరింత విశిష్టమైనది. వరంగల్లు రాజధానిగా వెలుగొందిన కాకతీయ సామ్రాజ్య రాజకీయ, సాంస్కృతిక వైభవాన్ని అధ్యయనం చేశారు. కాకతీయుల సామ్రాజ్యం పతనమైన తరువాత విదేశీయులను ఎదిరించిన ముసునూరి నాయకుల చరిత్రను వెలికితీసి ప్రాచుర్యం కల్పించడంలో ఆయన కృషి ప్రశంసనీయం. తంజావూరు విజయం ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన చారిత్రక నవల. నాయకరాజుల కాలంలోని తంజావూరు సాంస్కృతిక వైభవం, తెలుగు భాషా సాహిత్యాలకు అక్కడ లభించిన ఆదరణ, రాజ్య పాలన, కళాపోషణ వంటి అంశాలు ఈ రచనకు నేపథ్యం.
ఆధ్యాత్మిక సాహిత్యంపై శివప్రసాద్కు ఉన్న అనురక్తికి శ్రీపదార్చన ఒక విశిష్ట నిదర్శనం. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించి ఈ నవలను రచించారు. అన్నమయ్య భక్తి, వేంకటేశ్వర స్వామి పట్ల ఆయన అనన్య నిష్ఠ, సంకీర్తనలలోని ఆధ్యాత్మిక తత్త్వం, ఆనాటి సామాజిక పరిస్థితులను సాహిత్య రూపంలో ఆవిష్కరించారు. శ్రీపదార్చన, చంద్రకళ (సమ్మక్క-సారలమ్మల చరిత్ర) నవలలు జాగృతి వారపత్రికలో ధారవాహికంగా ప్రచురితం కావడం ప్రశంసనీయం. ఆయన రచనా పరిధి చారిత్రక నవలలకు మాత్రమే పరిమితం కాలేదు. పట్టాభి, రెసిడెన్సీ, మహాసర్గ, బసవగీత, సమ్రాట్ పుష్యమిత్ర, సగం విరిగిన చంద్రుడు వంటి రచనలు ఆయన సాహిత్య వైవిధ్యాన్ని తెలియజేస్తాయి. సాంఘిక నవలలు, కథలు, నాటికలు, వ్యాసాలు, విమర్శలు, జీవిత చరిత్రలు, సాంస్కృతిక పరిశోధనలు వంటి అనేక పక్రియల్లో రచనలు చేశారు. ఆయన రచనల్లో అత్యంత ప్రధానమైన అంశం దేశభక్తి. భారతదేశం రాజకీయ సరిహద్దులతో కూడిన భూభాగం మాత్రమే కాదని, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంస్కృ తిక నాగరికత అని విశ్వసించారు. భారతీయుల చరిత్రను, సంస్కృతిని, స్వాతంత్య్రోద్యమంలో మహ నీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని నిరంతరం ఆకాంక్షించారు. ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, వీరసావర్కర్, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రకవ్యక్తుల త్యాగాలను గౌరవిస్తూ ప్రసంగాలు చేశారు. జాతీయ నాయకుల స్మృతిని కాపాడుకోవడం, వారి కృషిపై అధ్యయనం చేయడం సమాజ బాధ్యతగా భావించారు. స్వాతంత్య్ర సమర యోధులకు తగిన గుర్తింపు లభించాలనే విషయంపై బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. శివప్రసాద్ బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జాతీయ భావజాలవ్యాప్తికి విశేషంగా కృషిచేశారు. జాతీయవాదం, హిందూధర్మ పరిరక్షణ, సాంస్కృతిక చైతన్యం ఆయన సాహిత్య, సామాజిక జీవితంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. రాజకీయ,సాంస్కృతిక అంశా లపై తనకు ఉన్న విశ్వాసాలను నిర్భయంగా ప్రకటించే వారు. 1975 అత్యవసరపరిస్థితిలో ఎదురైన అనుభవం జీవితంలోని ముఖ్య మైన ఘట్టం. జయప్రకాశ్నారాయణ ఉద్యమం, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కొద్దిరోజులు హైదరాబాద్ ముషీరాబాద్ కేంద్ర కారాగారంలో నిర్బంధి తునిగా ఉన్నారు. ఆయన సుదీర్ఘ సాహిత్య ప్రస్థానానికి గుర్తింపుగా అనేక బిరుదులు, సన్మానాలు, పురస్కా రాలు లభించాయి. చారిత్రక నవలాచక్రవర్తి, చారిత్రక నవలా సమ్రాట్, అభినవ పాల్కురికి వంటి బిరుదులతో సాహిత్య లోకం ఆయనను గౌరవించింది. శ్రీపదార్చన నవలకు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవల పురస్కారం లభించింది. కుర్తాళం పీఠాధిపతుల చేతులమీదుగా కనకాభిషేక సత్కారం అందు కున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్ణ గండపెండేరం సత్కారం పొందారు. సినీ ప్రముఖుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా స్వర్ణకంకణ సత్కారం అందుకున్నారు. వికారాబాద్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలోనూ స్వర్ణకంకణ గౌరవాన్ని పొందారు. వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, పండిత పరిషత్తులు ఆయనను ఘనంగా సత్కరించాయి.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు కందుకూరి శివానందవ•ర్తి చేతుల మీదుగా సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున విశిష్ట వ్యక్తి పురస్కారం అందుకోవడం ఆయన జీవితంలోని విశేషమైన ఘట్టం. ఆ సందర్భంగా లభించిన ముప్పై వేల రూపాయల నగదు పురస్కారాన్ని గ్రంథాల ముద్రణ కోసం వినియోగించినట్లు ఆయన స్వీయస్మృతుల్లో పేర్కొన్నారు. ఇది సాహిత్యంపట్ల ఆయనకున్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. సన్మానాలకంటే తాను చేసిన రచనలు భావితరాలకు అందుబాటులో ఉండడమే ముఖ్యమని భావించిన రచయిత ఆయన.
ఆర్ఎస్ఎస్, జాతీయ సాహిత్య పరిషత్, ఇతిహాస సంకలన సమితి, విద్యార్థి పరిషత్, బీజేపీ, జాగృతి వారపత్రిక, తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.