లోకహితం కోసం జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, దుష్టశిక్షణ,శిష్ట రక్షణకు ప్రతీక విజయదశమి. పశుత్వంపై మానవత్వపు విజయమే ఈ పర్వదిన సందేశం. ఆ రోజు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయని పురాణాలూ పేర్కొంటున్నాయి. శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమినాడే ‘విజయ’ ముహూర్తం వస్తుంది. ఆనాటి నక్షత్రోదయం కాలాన్ని విజయ కాలంగా పరిగణిస్తారు. అమ్మవారు శరన్నవరాత్రి పూజలు అందుకుని వీడ్కోలు తీసుకునే సమయానికి ‘విజయం’ అని పేరు. ఆ రోజునే క్షీరసాగర మథనంతో అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
విజయదశమి పరంపరాగతంగా వస్తున్న ఆధ్యాత్మిక,సాంస్కృతిక చిహ్నాలలోఒకటి. విజయదీక్ష, త్యాగభావాలను మన రక్తనాళాల్లో పొంగించి ధర్మరక్షణకు కటిబద్ధులుగా చేసే పర్వదినం. నైరాశ్యం,దౌర్బల్యంతో కుంగిపోయే వారిని ఈ పర్వదినం అనేకసార్లు తట్టిలేపింది. పురాణ, చారిత్రక పురుషులు ఈ పండుగ స్ఫూర్తితో విజయాలు సాధించారు.
విజయదశమిని ‘దసరా’ అని వ్యవహరిస్తారు. దశవిధ పాపాలను హరించేది కనుక ‘దశహరా’ అనే పదం కాలక్రమేణ ‘దసరా’గా వాడుకలోకి వచ్చిందన్నది పెద్దల మాట. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని కాపాడడమే ఈ పండుగ పరమార్థమని, దసరానాడు ‘రావణ కుంభకర్ణుల ప్రతిమల దహనం’ అని, ‘రామలీల’ అని ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది అందరి పండుగ. ఒక కాలంలో రాజులు, చక్రవర్తుల జైత్రయాత్రల ఆరంభానికి సుముహూర్తంగా ఉన్న ఈ ‘దశమి’ (క్షత్రియ పండుగ)కాలక్రమంలో అన్ని వర్గాల వారికి శుభదినమైంది. ఆయా వృత్తుల వారు తమ వృత్తిపరమైన వస్తువులు/సాధనాలను పూజిస్తారు.
శక్తి పూజ జాతి మనుగడ శ్రీరామరక్ష అనే సత్యాన్ని ప్రతిపాదించేది విజయదశమి.మనిషిలో స్పూర్తిని జాగృతపరిచి, వారిలోని కర్తవ్యదీక్షను తట్టిలేపి విజయతీరాలవైపు నడపడమే విజయదశమి పరమార్థం. శక్తి సంగ్రహణతో ధర్మరక్షణకు సుసంఘటితంగా పాటుపడాలని, మనిషి ధర్మాన్ని కాపాడితే, ధర్మం మనిషిని కాపాడుతుందన్నది విజయదశమి సందేశం.ఈ పండుగ యుగయుగాలుగా వివరిస్తున్న సందేశం ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమివరకు శరన్నవరాత్రులలో వివిధ అవతారాలలో అమ్మవారిని అర్చించి, దశమినాడు అపరాజితగా (రాజ రాజేశ్వరీదేవి) ఆరాధిస్తారు. జగన్మాత ఉగ్రరూపంతో ప్రభవించి మహిషాసురుని మర్దించిన తరువాత, ఆ రూపానికి భీతిల్లిన దేవగణం, ‘ఈ రూపం మహిషాసురుడు లాంటి రాక్షస సంహారానికి దాల్చినదే. లోకాలనేలే తల్లివి.. నిన్ను ఇలా ఎలా దర్శించగలం’ అన్న విన్నపానికి కరుణించిన అంబ రాజారాజేశ్వరిగ సింహాస నైశ్వర్యగా అనుగ్రహించింది.ఆమె విజయానికి అధి దేవత. జయంతో పాటు మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. పూర్వ చక్రవర్తులు, రాజులు జైత్రయాత్రకు బయలుదేరే ముందు అపరాజిత దేవిని అర్చించేవారు.
శమీపూజ, సీమోల్లంఘన, శకుంత(పాలపిట్ట) దర్శనం విజయదశమి నాటి వేడుకలు. అపరాజితాదేవవి శమీ వృక్షంలో అభయ ప్రదాయినిగా కొలువై ఉంటుందంటారు. ఈ వృక్షాన్ని అగ్ని స్వరూపంగా భావిస్తారు. యాగ సందర్భంగా నిప్పు రాజేయడానికి శమీ దారువునే (శమీ గర్భా దగ్నిం మంథతి) ఉపయోగిస్తారు.వేదకాలంలో అపరాజితా దేవి ఆరాధనతో విజయదశమి ఉత్సవం రంభమైందని పెద్దలు చెబుతారు. ‘శమీ శమయతే పాపం శమీ శత్రువినాశనీ/అర్జునస్య ధనుర్దారీ/రామస్య ప్రియదర్శినీ’ (పాపాలను పోగొట్టి శత్రువులను పరాజయం పాలుచేయగలవు. అర్జునుడు ధనుస్సును నీ దగ్గరే (జమ్మిచెట్టుపైన) రాముడికి ప్రియం చేకూర్చావు..) శ్లోకాన్ని పఠిస్తూ, ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శనిదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. త్రేత,ద్వాపర యుగాల్లో శమీ పూజకు ప్రాముఖ్యం ఉంది. రావణ సంహరణ తరవాత అయోధ్యకు, అయోధ్య వెళ్లే ముందు శమీవృక్షాన్ని పూజించాడని వ్రతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే అర్జునుడు అజ్ఞాతవాసం తరువాత జమ్మి చెట్టును,దానిపై గల ఆయుధాలను పూజించాడు. ఈ యుగంలో జమ్మిని పూజించి దాని ఆకులను (బంగారం) పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందుతారు. ముఖ్యంగా, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ సంప్రదాయం కనిపిస్తుంది. దేవీనవరాత్రి దీక్షాపరులు విజయదశమి నాడు దీక్ష విరమించి, ఊరి పొలిమేరలు వెళ్లి పాలపిట్ట దర్శనంతో తిరిగివస్తారు.
విజయవాడ కృష్ణానదిలో కనకదుర్గమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అలంపురం జోగులాంబ, వరంగల్లో భద్రకాళి, శ్రీశైలం భ్రమరాంబ తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.
దేవయుగంలో విజృంభించిన మహిషాసురుడిని, శుంభనిశుంభులను మించిన అసురీశక్తులు, రావణుడికి మించిన దానవులు – అవినీతి, అక్రమ దారులు, పరపీడకులు… ఇలా ఏదో రూపంలో స్వైర విహారం చేస్తున్నారు. స్వార్థచింతన, అక్రమ ఆర్జనలు, నీతిబాహ్య ప్రవర్తకుల విజృంభణ పెరిగిపోతోంది. వీరిని గెలవగల/అరికట్టగల అనుపమశక్తి, పురాణ పురుషులు, చారిత్రక•వీరుల వంటి శౌర్యసాహసాలు అవసరం. అపరాజితాదేవి వాటిని అనుగ్రహించాలని ప్రార్థిద్దాం.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్