చరిత్రను తిరగేస్తే పండుగలు కేవలం సంప్రదాయాలకే పరిమితం కాలేదు, తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉద్యమ కేంద్రాలుగానూ మారాయి. అందులోనూ విజయదశమి ఉత్సవాలు జాతీయోద్యమానికి అందించిన ఊపు అసమాన మైనది. బెంగాల్లో జమిందార్ల దర్పాన్ని చాటుతూ మొదలై, లార్డ్ వెస్లీ తొమ్మిది తుపాకులతో శాల్యూట్ ఇచ్చేంతగా పెరిగిన దుర్గాపూజ సంస్కృతి… కాలక్రమంలో ‘బరోయారి’ పేరున ప్రజాపూజగా, విప్లవకారులకు రహస్య సమావేశ నిలయంగా మారింది. ఉపాధ్యాయులు, మహిళలు, జానపద కళాకారులు అందరూ కలిసి దసరావేడుకలను స్వదేశీ ప్రచారానికి, ప్రజాచైతన్యానికి మలుచుకున్న తీరు భావితరాలకు స్ఫూర్తిదాయకం.
ఒకప్పుడు రాచరికపు దర్పానికి వేదికగా నిలిచిన దుర్గా నవరాత్రులు… జాతీయోద్యమ ప్రభావంతో సామాన్య ప్రజల విప్లవవేదికగా రూపాంతరం చెందాయి. ‘అమ్మవారి’ రూపంలో ‘భారతమాత’ను దర్శిస్తూ, పగటి వేషాలు, ప్రభల ఊరేగింపులు, స్వదేశీ వస్తువుల ప్రచారంతో కోట్లాదిమంది భారతీయులను ఒకే తాటిపైకి తెచ్చాయి.
అమ్మవారి పూజలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కావు..అవి దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి దిశానిర్దేశం చేసిన సాంస్కృతిక ఆయుధాలు! 1757లో ప్లాసీ యుద్ధ విజయం తర్వాత ఈస్టిండియా కంపెనీ అధికారులు, జమీందార్లు తమ ఆధిపత్యం కోసం ప్రారంభించిన దుర్గాపూజ వేడుకలు, తదనంతర కాలంలో బ్రిటీష్ పాలనపై ప్రజలు ఎక్కుపెట్టిన విప్లవాస్త్రంగా మారతాయని నాటి పాలకులే ఊహించి ఉండరు. 1930లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన సర్వజన పూజల నుండి వీధివీధినా రగిలిన పగటి వేషాలు, తోలుబొమ్మలాటల వరకు దసరా నవరాత్రులు భారతీయుల్లో స్వదేశీ స్పృహను, జాతీయ ఐక్యతను రగిలించాయి.
ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సారథ్యంలోని ఈస్టిండియా కంపెనీ సేన 1757లో జరిగిన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్పై పట్టు సంపాదించింది. భారత్లో తొలి విజయానికి ప్రతీకగా దుర్గామాతకు పూజచేసి విజయోత్సవం జరుపుకున్న దసరా ఉత్సవాలు క్రమంగా జాతీ యోద్యమానికి ఊతమయ్యాయి. అంతకు ముందు ఇళ్లకే పరిమితమైన నవరాత్రులు క్రమంగా సామాజిక రూపం దాల్చటం కీలక పరిణామం. గవర్నర్ జనరల్ లార్డ్ వెస్లీ కాళీమాతకు గౌరవ ప్రదంగా తొమ్మిది తుపాకుల శాల్యూట్ను ప్రవేశపెట్టారు. 1919లో జమీందార్లకు సంబంధం లేకుండా సామాన్య ప్రజానీకం దుర్గాపూజ నిర్వహించింది. దీన్ని బరోయారి అంటారు. అంటే 12 మందితో చేసిన పూజ అని అర్థం. అప్పుడే బాగ్బజార్లో సర్వజనపూజ మొదలైంది. వీటిలో క్రమంగా జాతీయోద్యమ నాయకులు, విప్లవనాయ కులు కూడా ప్రవేశించారు.
విజయం-ఐక్యతకు సంకేతం: విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ భావనను జాతీయోద్యమ నాయకులు పరాయి పాలన (చెడు) పై స్వదేశీ పోరాటం (మంచి) అనే కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు.
విదేశీ వస్తు బహిష్కరణ – స్వదేశీ పిలుపు: దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనలలో, మేళాలలో ‘స్వదేశీ’ వస్తువుల అమ్మకాలను ప్రోత్సహిం చారు. రాట్నం, ఖాదీ బట్టలు, స్థానిక చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శించి, విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఆయుధపూజకు కొత్త అర్థం: సాంప్రదాయ కంగా దసరారోజున చేసే ఆయుధపూజను, దేశ స్వాతంత్రం కోసం ఆత్మబలాన్ని, ఐక్యతను పెంపొం దించుకునే సాధనంగా మార్చారు.
జానపద కళారూపాలు-ప్రచార సాధనాలు: నాటి వీధి కళాకారులు పగటి వేషాల ద్వారా ఆంగ్లేయుల దోపిడీని, పన్నుల భారాన్ని నాటకీయంగా ప్రదర్శిస్తూ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించేవారు.
ప్రభల ఊరేగింపులు: గ్రామీణ ప్రాంతాల్లో దసరా వేడుకల్లో భాగంగా తీసే ‘ప్రభల ఊరేగింపులు’ ప్రజలను ఆకర్షించేవి. జాతీయ నాయకుల చిత్రపటాలు, వందేమాతరం నినాదాలు, దేశభక్తి గీతాలు ప్రధానాకర్షణగా నిలిచేవి.
సంఘంలో వివిధ వర్గాల పాత్ర, మహిళల భాగస్వామ్యం: దసరా పేరంటాలు, బొమ్మల కొలువులు వంటి సాంప్రదాయ కార్యక్రమాలు మహిళలు సమావేశమవ్వడానికి వేదికగా మారాయి. ఆ సమయంలో వారు ఖాదీ నూలు వడకడం, స్వదేశీ వస్తువులను వాడటం,జాతీయోద్యమ సందేశాలను పంచుకునేవారు.
సంప్రదాయం-సమైక్యత: అమ్మవారిని భారతమాత రూపంగా కొలిచేవారు. దుర్గాదేవిని దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే శక్తిగా పూజిస్తూనే, అప్పట్లో ‘భారతమాత’ను కూడా అమ్మవారి రూపంగా భావించి పూజించేవారు. పరాశక్తి దేశాన్ని స్వేచ్ఛాయుతంగా మారుస్తుందనే నమ్మకాన్ని పెంపొందించారు.
సాంప్రదాయం ద్వారా ఐక్యత: కులమతాలకు అతీతంగా ఊరంతా కలిసి ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా ప్రజల మధ్య ఐక్యత ఏర్పడింది. ఈ సామాజిక సమైక్యత స్వాతంత్య్ర పోరాటానికి బలమైన పునాదిగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి, సాంస్కృతిక పునాదుల ద్వారా స్వదేశీ భావజాలాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడానికి ఈ ఉత్సవాలు బలమైన సాధనంగా ఉపయోగపడ్డాయి.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో దసరా ఉత్సవాలు కేవలం మతపరమైన పండుగగా మాత్రమే కాకుండా, ప్రజలను చైతన్యపరచడానికి, ఐక్యమత్యం పెం పొందించడానికి శక్తివంతమైన వేదికగా ఉపయోగపడ్డాయి. సాంస్కృతిక పునాదులే జాతీయ ఉద్యమానికి ప్రాణవాయువుగా మారాయని నిరూపించడానికి ఈ ‘విజయదశమి’ ప్రయాణమే ప్రత్యక్ష నిదర్శనం.

జయశ్రీ ఆచంట
సీనియర్ జర్నలిస్ట్