భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు అసోం మేఘాలయా, త్రిపుర, మిజోరాం అనే నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల పరిపాలనకు సంబంధించిన ప్రత్యేక అధికారాలను (స్వయం ప్రతిపత్తిని) గురించి తెలియజేస్తుంది. ఈ ప్రాంతాల సంస్కృతిని, హక్కులను పరిరక్షించడానికి రాజ్యాంగం లోని ఆర్టికల్ 244(2), 275 (1)ల క్రింద షెడ్యూలును చేర్చారు. స్వయంప్రతిపత్తి మండళ్లను (ఎడిసిఎస్- అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్), ప్రాంతీయ మండళ్లను (ఎఆర్సిఎస్) ఏర్పాటు చేస్తుంది.
ఈ 6వ షెడ్యూలు చేర్చడం వెనుక పెద్ద యుద్ధమే జరిగింది. దానికి నాయకుడు గోపీనాధ్ బోర్డోలోయ్. ఈయన నేతృత్వంలోని ఒక ప్రత్యేక కమిటీ కృషి అనన్యం. దీనిని ‘నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ (అస్సాం) ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ’ అని పిలుస్తారు. ఈయన అస్సాం మొదటి ముఖ్యమంత్రి కూడా. గిరిజన సంస్కృతి దెబ్బతిన కుండా వారికి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని ఈ కమిటీ గట్టిగా సిఫార్సు చేసింది. ఈ కమిటీలోని సభ్యుడు మేఘాలయాకు చెందిన జె.జె.నికోలస్ రాయ్ గిరిజన తెగల స్వయంపాలన గురించి రాజ్యాంగ పరిషత్‌లో బలమైన వాదన వినిపించాడు. ఇతర సభ్యులు రూపేనాథ్ బ్రహ్మ ఎ.వి.దక్కర్లు అడవుల రక్షణ గురించి ప్రత్యేక చట్టాలుండాలని వాదించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ డా।। బాబా సాహెబ్ అంబేడ్కర్ ఈ కమిటీ నివేదిక ప్రకారమే 6వ షెడ్యూలును రాజ్యాంగంలో చేర్చారు.
ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోపీనాధ్ బోర్డోలోయ్. అసోం తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ గాంధేయవాది, అసోం రక్షకుడుగా పేరొందారు. భారత్ – పాకిస్తాన్ విభజన సమయంలో అస్సాం పాకిస్తాన్‌తో కలవకుండా అడ్డుకున్న ఆయనకు భారతరత్న అవార్డుతో గౌరవించారు.
గోపీనాధ్• బోర్డోలోయ్ అస్సాంలోని రహాలో బుద్దేశ్వర్ బోర్డోలోయ్, ప్రణేశ్వరి దంపతులకు 1890 జూన్ 6న జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి లా పట్టా తీసుకుని, గౌహతీలో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1920 సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరి ప్రజలను చైతన్య పరిచారు. ఆ సమయంలో 1922లో జైలు శిక్ష అనుభవించారు. 1930 ఉప్పు సత్యాగ్రహం నుండి గాంధేయవాదిగా మారాడు. 1946లో అస్సాం ప్రీమియర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) ముగిశాక, బ్రిటన్ ప్రధాని అట్లీ భారతదేశానికి క్యాబినెట్ మిషన్‌ను పంపారు. స్వాతంత్య్రానంతరం భారత్‌కు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయడం , తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దాదాపు 389 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన. అలాగే ప్రావిన్సుల ఆధారంగా భారతదేశాన్ని 3 గ్రూపులుగా, అంటే అవి ఎ, బి, సి గ్రూపులుగా చేయడం.
ఎ. గ్రూపు మద్రాసు, బొంబాయి, యునైటెడ్ ప్రావిన్స్స్, ఒడిశా హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాలు.
బి. గ్రూపు పంజాబ్, సింధు, వాయవ్య సరిహద్దు ప్రాంతాలు. ఇవి ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలు.
సి. గ్రూపు బెంగాల్, అస్సాం, ఈశాన్య భారతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం.
క్యాబినెట్ మిషన్ 1946 నాటి గ్రూప్-సిలో అస్సాంను బెంగాల్‌తో కలిపి ఉంచేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించగా, ఈ గ్రూపింగ్ విధానాన్ని లోకప్రియ గోపీనాధ్ బోర్డోలోయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అస్సాం ప్రత్యేకత, భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వాన్ని, మరీ ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ నిర్ణయాలను వ్యతిరేకించి పోరాడాల్సి వచ్చింది.
అసోంకు చెందిన ప్రత్యేక భాషా సాంస్కృతిక గుర్తింపు, స్వయంప్రతిపత్తి దెబ్బతింటాయని, బెంగాల్ జనాభా ఎక్కువ ఉండటంవల్ల స్థానిక గిరిజనులు, అసోమీలు మైనారిటీలుగా మారతారని ఆయన వాదించారు. అంతకంటే ప్రమాదం అస్సాంను తూర్పు పాకీస్తాన్ (నేటి బాంగ్లాదేశ్)లో కలపడానికి నెహ్రూ, జిన్నాలు సుముఖంగా ఉన్నారని గ్రహించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన బోర్డోలోయ్ బిజోయ్ చంద్ర భగవతి, మహేంద్ర మోహన చౌదరి అనే ప్రతినిధులను శ్రీరాంపూర్ (బెంగాల్)లో మహాత్మాగాంధీని కలిసి వివరించమని చెప్పి, క్యాబినెట్ మిషన్ గ్రూపింగ్ ప్లాన్వల్ల అస్సాం ఉనికి ఏవిధంగా ప్రమాదంలో పడుతుందో వివరిస్తూ లేఖ రాశాడు. ఆయన రాసిన లేఖలో ప్రధానాంశాలు:
ఎ) బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన గ్రూపింగ్ ప్లాన్ ప్రకారం అసోంను ముస్లిం మెజారిటీ ఉన్న బెంగాల్‌తో కలిపి గ్రూప్ ‘సి’లో ఉంచారు. దీనివల్ల అసోం తన ప్రత్యేకతను కోల్పోయి బెంగాల్ ప్రావిన్స్ ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది.
బి) జవాహర్లాల్ నెహ్రూలాంటి వారు గ్రూపింగ్ ప్లాన్ ఒప్పుకోవాలని అస్సాంపై ఒత్తిడి తెస్తున్నారు. గ్రూప్ సిలో రాజ్యాంగ పరిషత్తులో బెంగాల్‌కు 60 సీట్లు, అస్సాంకు 10 సీట్లు మాత్రమే కేటాయించారు. దీనివల్ల రాజ్యాంగం తయారు చేసేటప్పుడు బెంగాల్ నాయకులే అసోం భవిష్యత్తును నిర్ణయిస్తారు. కాబట్టి ఈ క్లిష్టసమయంలో కాంగ్రెసు హైకమాండు మనసును మార్చగల శక్తి, అసోం ప్రజలను కాపాడ గలగిన చొరవ ఒక్క గాంధీజీకి మాత్రమే ఉంది. కనుక, వెంటనే జోక్యం చేసుకొని, అసోంకు న్యాయం చేయాలి.
హరిజన్ పత్రికలో ‘గాంధీజీస్ అడ్వైస్ టు అస్సాం’ (అస్సాంకు గాంధీ సలహా) శీర్షిక ప్రచురితమైన గాంధీజీ సందేశ సారాంశం..
‘‘అసోం తన ఆత్మను (స్వయం ప్రతిపత్తిని) ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. ఈ ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగానైనా సరే అసోం తన హక్కులను కాపాడుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే అసోంలో మనుషులు లేరని, కేవలం బొమ్మలు మాత్రమే ఉన్నాయని నేను భావిస్తాను’’.
‘‘బెంగాల్ ప్రావిన్స్ ఏదో ఒక విధంగా అసోంపై ఆధిపత్యం చెలాయించాలనుకోవడం పూర్తిగా అనుచితమైన ప్రతిపాదన. ఒకవేళ ఇప్పుడు సరిగ్గా స్పందించకపోతే, అసోం కథ ముగిసిపోతుంది’’.
‘‘కాంగ్రెసు హైకమాండుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామని మీరు అస్సలు భయపడకండి. బోర్డోలోయ్‌కు నా తరుపున చెప్పండి – నా మనసులో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెసు పెద్దలు చెప్పినా, చివరికి గాంధీ స్వయంగా వచ్చి మిమ్మల్ని వద్దని వారించినా సరే… మీ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఈ గ్రూపింగ్ ప్లాన్‌ను వినవద్దని అస్సాం ప్రజలకు స్పష్టం చేయండి.’’
అలాగే గాంధీజీ అస్సాంకు ఇచ్చిన సలహాలు
(ఎ) సత్యాగ్రహ మార్గం, (బి) రాజ్యాంగ సభ నుండి నిష్క్రమణ
(సి) ఆత్మరక్షణే ముఖ్యం – ‘‘కాంగ్రెసు మిమ్మల్ని రక్షిస్తుందని నమ్మి కూర్చోవద్దు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒంటరిగానైనా పోరాడండి’’ అని బోర్డోలోయ్ లో ధైర్యాన్ని నింపారు.
1946 డిసెంబరులో జవహర్లాల్ నెహ్రూ గ్రూపింగ్ వివాదం తీవ్రంగా ఉన్న సమయంలో బోర్డోలోయ్‌కు లేఖలు వ్రాశారు. వాటి సారాంశం -‘‘జాతీయ దృక్పథం అవసరం, క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ను తిరస్కరిస్తే బ్రిటిష్‌వారు అధికార బదిలీని నిలిపివేసే ప్రమాదముంది.’’ ఈ రకంగా, నెహ్రూ భావించి తాత్కాలికంగా గ్రూపింగ్‌లో చేరాలని, గ్రూప్ ‘సి’లో బెంగాల్‌తో కలిసి సమావేశాలకు హాజరు కావాలని, అక్కడ ప్రావిన్షియల్ రాజ్యాంగం తయారయ్యాక, అసోంకు నచ్చకపోతే ఆ గ్రూపు నుండి బయటకు వచ్చే హక్కు ఉందని, ముస్లింలీగ్ నాయకుడు మొహమ్మద్ ఆలీ జిన్నా ఈ ప్లానును అడ్డుకోవడంవల్ల నింద కాంగ్రెసు మీద పడుతుందని, కాంగ్రెసు పార్టీ అసోం ప్రయోజనాలను ఎప్పటికీ బలి పెట్టదని సూచించాడు. నెహ్రూ లేఖ వ్యూహాత్మక, రాజకీయ కోణంలో సాగగా, గాంధీజీ సమాధానం మాత్రం అసోం హక్కుల కోసం నైతిక సత్యాగ్రహ కోణంలో సాగింది. బోర్డోలోయ్ చివరకు గాంధీజీ సలహానే పాటించి బ్రిటిష్ ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించాడు. గాంధీజీ మద్దతుతో 1946 జూన్ 15న అస్సాంలో యాంటీ గ్రూపింగ్ డేని ఘనంగా నిర్వహించారు. చివరకు 1946 జూలై 16న అసోం శాసనసభ ఈ గ్రూపింగ్ విధానాన్ని ఏకగ్రీవంగా తిరస్కరించింది. అసోంకు ప్రత్యేకమైన భాష, సంస్కృతి వారసత్వం ఉన్నాయని బెంగాల్‌తో కలవడం వలన అసోమీలు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని, పైగా ముస్లిం లీగ్ ఈ గ్రూపింగ్ విధానాన్ని అడ్డుపెట్టుకుని భవిష్యత్తులో అస్సాంను కూడా ఈస్ట్ పాకిస్తాన్ (బాంగ్లాదేశ్)తో కలిపేందుకు కుట్ర పన్నిందని బోర్డోలోయ్ ఆరోపించారు.
అసోం ప్రీమియర్ (ముఖ్యమంత్రి)గా ఉన్న బోర్డోలోయ్ ఈ కుట్రలను ముందే ఊహించి, బ్రిటిష్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. 1946 జూలైలో అసోం ప్రజలను, విద్యార్ధులను, స్థానిక నాయకులను ఏకం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త నిరసన ఉద్యమాన్ని ప్రారంభించారు.
అసోంను తూర్పు పాకిస్తాన్లో విలీనం చేయడం కోసం జిన్నా, ముస్లిం లీగ్ పెద్ద పన్నాగమే వేశారు. బెంగాల్ అసెంబ్లీలో ముస్లిమ్ లీగ్ బలం ఎక్కువగా ఉండేది. బెంగాల్, అసోం కలిస్తే ఏర్పడే ఉమ్మడి శాసనసభలో ముస్లిం సభ్యులే ఎక్కువ కాబట్టి లీగ్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుంది. దీనిని ఉపయో గించుకుని అసోంకి నచ్చక పోయినా వారిపై ముస్లిం లీగ్ నిర్ణయాలను బలవంతంగా రుద్దవచ్చని జిన్నా ప్రణాళిక.
1946 జూలై,10న జవహర్లాల్ నెహ్రూ ఒక విలేకరుల సమావేశం పెట్టి రాజ్యాంగ సభ ఏర్పాటయ్యాక, ఈ గ్రూపింగ్ విధానాన్ని మార్చే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని ప్రకటించారు. రాజ్యాంగ పద్ధతుల ద్వారా పాకిస్తాన్ రాదని గ్రహించిన జిన్నా అదే జూలై చివరలో చారిత్రాత్మకమైన ‘‘డైరెక్ట్ ఏక్షన్ డే’’ 1946, ఆగస్టు16న చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏవిధంగా నైనా సరే ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని సాధించడమే దీని లక్ష్యం. దీనికి మరో పేరు కలకత్తా మహా నరమేధం (గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్)లో కేవలం 72 గంటల్లో దాదాపు 4000మంది మరణించారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు, మూడు రోజుల పాటు ఘోరమైన దాడులు, లూటీలు, హత్యలు జరిగాయి. బెంగాల్‌లోని నోవాఖాలీ (నేటి బంగ్లాదేశ్) లో హిందువులపై భారీ ఎత్తున దాడులు జరిగాయి. దాని పర్యవసానంగా 1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్య్ర రాజ్యాలు ఏర్పడ్డాయి.
కలకత్తా నరమేధంలో నాటి బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షహీద్ సుహ్రావర్దీ ఆగస్టు 16, 1946 నాడు శెలవు దినంగా ప్రకటించి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశాడు. దానితో 16 ఆగష్టు, 17 ఆగస్టున విపరీతమైన నరమేధం జరిగింది. అందుకే చరిత్రకారులు ఆయనను కలకత్తా కసాయిగా పిలిచారు.
గోపీనాధ్ బోర్డోలోయ్ అసోంను పాకిస్తాన్లో చేరనీయకుండా రక్షించాడు. గిరిజన హక్కులు, సంస్కృతి, భూములు, అడవులను కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్ధులను ఆదుకుని స్వతంత్ర అసోంలో ఆహార కొరతను అధిగమించడానికి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. గౌహతి విశ్వవిద్యాలయం, అసోం మెడికల్ కాలేజీల నిర్మాణానికి పునాదులు వేశాడు. అందువలన అసోం ప్రజలు లోకప్రియ బిరుదుతో గౌరవించారు. 1999లో భారత ప్రభుత్వం ‘భారత రత్న’ బిరుదునిచ్చి గౌరవించారు. ఆయన 1950 ఆగస్టు 5 న మరణించారు. ఆగస్టు 5ను అసోం వారు ‘లోకకళ్యాణ్ దివస్’ను జరుపుకుంటారు. ఆయన స్మారక కట్టడాలకు వస్తే గౌహతీ విమానా శ్రయం దగ్గర ఆయన విగ్రహం ఏర్పాటుచేశారు. గోపీనాధ్ బోర్డోలోయ్ మెమోరియల్ హాల్‌ను ఆయన స్వస్థలమైన అసోంలోని రహాలో నిర్మించి 50 విలువైన వస్తువులు భద్రపరిచారు. భారత పార్లమెంట్ హౌస్‌లో నిలువెత్తు విగ్రహం నిర్మించారు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు