అక్టోబర్ 4 శ్యామ్‌జీ కృష్ణవర్మ జయంతి
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను, ఆస్తులను త్యాగం చేశారు. అలాంటివారిలో ప్రముఖులు శ్యామ్‌జీ కృష్ణవర్మ. ఆయన అక్టోబర్ 4, 1857న జన్మించించారు. మార్చి 30, 1930న మరణించారు. 2003లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్‌లో జెనీవా నుండి ఆయన అస్థికలను సగౌరవంగా మనదేశానికి తీసుకువచ్చారు.
విద్యాభ్యాసం-లండన్ ప్రయాణం
శ్యామ్‌జీ కృష్ణవర్మ గుజరాత్‌లోని కచ్ జిల్లా మాండ్విలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. స్వదేశంలోనే విద్యాభ్యాసం చేశారు. సంస్కృత భాషలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. ఆ రోజుల్లో బ్రాహ్మణేతర పండితులలో ఏకైక ప్రతిభావంతునిగా నిలిచారు. ఫిలాసఫీ, సోషియాలజీ లతోపాటు న్యాయశాస్త్రం కూడా చదువుకున్నారు. భార్య భానుమతి ఆయన ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ అన్ని విధాలా సహకరించేవారు. స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్ బాంబే విభాగానికి అధ్యక్షుడిగా కొంతకాలం ఆయన సేవలు అందించారు. దయానంద సరస్వతి ప్రభావం ఆయనపై చాలా ఎక్కువగా ఉండేది. అనంతరం అనేక స్వదేశీ సంస్థానాలలో దివాన్‌గా పనిచేశారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ తర్వాత లండన్‌లో బారిస్టర్‌గా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్ వెళ్లారు.
ఇండియా హౌస్ స్థాపన
లండన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘ఇండియా హౌస్’ అనే ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. విదేశాలకు వచ్చే విప్లవకారులకు, స్వాతంత్య్ర సమరయోధులకు వసతి, భోజన సదుపాయాలతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలను శ్యామ్‌జీ కృష్ణవర్మ అందించేవారు. ఇందులో వేలాదిమంది విద్యార్థులు ఆశ్రయం పొందారు. వారిలో ముఖ్యుడు వీరసావర్కర్‌కు లండన్‌లో చదువుకోవడానికి ఉపకారవేతనాన్ని ఆయన స్వయంగా ఏర్పాటు చేశారు. అంతకుమునుపు సావర్కర్ ప్రతిభను మెచ్చి, ఆయనకు లండన్‌లో ఆశ్రయం కల్పించవలసిందిగా శ్యామ్‌జీకి బాలగంగాధర్ తిలక్ లేఖ రాశారు. ఈ విధంగా ఆయన తన సంపదనంతా స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవకారులకు, ఇండియా హోమ్‌రూల్ సొసైటీ స్థాపనకు ఖర్చు చేశారు.
ది ఇండియన్ సోషియాలిజిస్ట్ పత్రిక
స్వదేశంలో రాజకీయ, సామాజిక, ధార్మిక సంస్కరణలను తీసుకురావడం, ప్రజలను చైతన్యపరచడం కోసం లండన్‌లో ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రికను స్థాపించారు. విప్లవకారులను తయారుచేస్తున్నారని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో ఆయనపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిఘాపెట్టింది. శిక్షించాలని నిర్ణయించింది. ఆయన లా చదివిన ఇంగ్లండ్‌లోని ‘ఇన్నర్ టెంపుల్’ సొసైటీ ఆయన సభ్యత్వాన్ని రద్దుచేసింది. బ్రిటిష్ ప్రభుత్వం తనను అరెస్టు చేస్తుందని గ్రహించి, 1907లో పారిస్ (ఫ్రాన్స్)కు, 1910లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు తన కార్యస్థానాన్ని మార్చుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో స్విట్జర్లాండ్ తటస్థ విధానాన్ని అనుసరించడం వల్ల అక్కడ నుంచే ఉద్యమాన్ని నడిపారు. ఆయన మార్చి 30, 1930న పరమ పదించారు. ఆయన చివరి కోరిక మేరకు స్విస్ ప్రభుత్వం ఆయన చితాభస్మాన్ని భద్రపరిచింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, దాదాపు 56 సంవత్సరాలపాటు ఏ భారత ప్రభుత్వమూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చివరకు 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో, అప్పటి గుజరాత్ సీఎం మోదీ, జెనీవా వెళ్లారు. శ్యామ్‌జీ కృష్ణవర్మ, ఆయన భార్య భానుమతి అస్థికలను తన తలపై పెట్టుకుని స్వదేశానికి తీసుకువచ్చారు. మాండ్విలో లండన్‌లోని ఇండియాహౌస్‌ను పోలిన స్మారక స్తూపాన్ని నిర్మించారు. అక్కడ వారి చితాభస్మాన్ని ఉంచారు. అలాగే బ్రిటన్‌లోని ఇన్నర్ టెంపుల్ లా అసోసియేషన్ కూడా మోదీ పిటిషన్ మేరకు 2015లో శ్యామ్‌జీ కృష్ణవర్మ సభ్యత్వాన్ని గౌరవప్రదంగా పునరుద్ధ రిం చింది. దేశ స్వరాజ్య సిద్ధికి సర్వస్వం ధారపోసిన ఇటువంటి మహానుభావుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత.
– కె. శ్యాంప్రకాశ్