అక్టోబర్‌ 2 ‌లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి జయంతి


లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి జీవితం యువతకు దిక్సూచి. ఆయన జీవితంలోని ప్రతి ఘట్టవ• నవతరానికి స్ఫూర్తి. దేశానికి రెండవ ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు శాస్త్రి జీవిత ప్రస్థానాన్ని పరిశీలించినవారికి ఆయన అసాధారణ వ్యక్తిత్వం ఎటువంటిదో అర్థమవుతుంది. ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి దేశంలోని అత్యున్నత పదవిని చేపట్టే వరకూ సాగిన ఈ ప్రస్థానం శీలం, నడవడిక, బాధ్యత, స్వచ్ఛత, సహనం, సామరస్యాలకు సంబంధించిన పాఠాలను బోధిస్తుంది.

ఆయనది మొదటి నుంచి నిరాడంబర, నిస్వార్థ జీవితమే. ప్రధానమంత్రి పదవిలో తుదిశ్వాస విడిచేనాటికి ఆయనకు సొంత ఇల్లంటూ లేదు. స్థలాలు, పొలాలు, ఇతర ఆస్తిపాస్తులు, బ్యాంక్‌ ‌బ్యాలెన్సులు ఏమీ లేవు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరి రోజున కూడా ఆయన దగ్గరున్నవి ఒకటి రెండు దుస్తులు, కొన్ని పుస్తకాలు, బ్యాంక్‌ ‌రుణంతో కొన్న చిన్నపాటి కారు మాత్రమే. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన లాల్‌బహదూర్‌ ‌పాఠశాలకు వెళ్లి చదువుకోవడానికి రోజూ గంగానదిని దాటాల్సి వచ్చేది. పడవ ప్రయాణానికి డబ్బులు చెల్లించడం వల్ల తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశ్యంతో, ఆయన రోజూ గంగానదిని ఈదుకుంటూ వెళ్లి, అవతలి ఒడ్డున ఉన్న పాఠశాలకు వెళ్లేవారు. వ్యక్తిగత పరిశ్రమ ద్వారా ఆర్థిక, భౌతిక కష్టనష్టాలను ఎలా అధిగమించవచ్చో ఆయన యువతకు తన సొంత అనుభవాల ద్వారా నిరూపించారు. రైల్వే మంత్రిగా ఉండగా ఒక రైలు ప్రమాదం జరిగినందుకు జవాబుదారీ వహించి ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.

సంకుచితత్వానికి అతీతం

కాయస్థ కులంలో పుట్టిన లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి ఏనాడూ తన కులం గురించి చెప్పుకోలేదు. కులాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకో లేదు. ఆయన యవ్వనంలోకి ప్రవేశించిన తొలినాళ్లలోనే తన కులాన్ని తెలియజేసే శ్రీవాస్తవ అనే ఇంటి పేరును వదులుకున్నారు.సంస్కృతంలో అత్యున్నత స్థాయి కోర్సును పూర్తి చేసినందుకు అప్పట్లో బెనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయం అందించిన శాస్త్రి అనే బిరుదు మాత్రం ఆయనకు జీవితాంతం కొనసాగింది. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం చోటు చేసుకున్నప్పుడు, దాదాపు అదే సమయంలో దేశంలో ఆహార సంక్షోభం తలెత్తి నప్పుడు ఆయన ‘జై జవాన్‌, ‌జై కిసాన్‌’ అనే నినాదంతో దేశ ప్రజలను ఉత్తేజపరిచారు. దేశం ఆహార సంక్షోభం నుంచి బయటపడడానికి ఆయన అప్పట్లో ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాల పొదుపు కోసం ప్రజలు ఒక పూట ఆహారాన్ని మానేయాలని పిలుపునిచ్చారు. దేశభక్తిని నిరూపించుకోవాలన్న పక్షంలో కొద్దిపాటి వ్యక్తిగత త్యాగాలు కూడా అవసరమని, దేశం స్వయంసమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని ఆయన చెప్పేవారు. ఆయన నియమ నిబంధనలకు, నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి. ఈ విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూకు కూడా ఎదురు తిరిగిన వ్యక్తి ఆయన. ఒకసారి నెహ్రూ సోదరి కృష్ణ హతీసింగ్‌ ‌విదేశాల నుంచి ఫోక్స్ ‌వేగన్‌ ‌కారును దిగుమతి చేసుకున్నారు. అయితే ఆమె ఆ కారుకు దిగుమతి సుంకం చెల్లించడానికి నిరాకరించారు. ఆమె సాక్షాత్తూ ప్రధాని సోదరి అయినందువల్ల కస్టమ్స్ అధికారులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉండి పోయారు. లాల్‌బహదూర్‌శాస్త్రికి ఈ విషయం తెలిసి, హతీసింగ్‌ ‌దిగుమతి సుంకాన్ని చెల్లించ వలసిందేనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక నెహ్రూ తన సొంత డబ్బులు చెల్లించి తన సోదరికి కారును అప్పగించారు. ఆయన సన్నగా, పొట్టిగా ఉండేవారు కానీ నైతికంగా మాత్రం మహా బలవంతుడు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అతిరథ మహారథు లందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. కేవలం 18 నెలలు మాత్రమే ప్రధాన మంత్రిగా పనిచేసినప్పటికీ, దేశాన్ని సరైన మార్గంలో పురోగతి చెందించారు. సంక్షోభ సమయాల్లో ఆయన దేశాన్ని గట్టెక్కించి ముందుకు నడిపించిన తీరు అప్పటికీ, ఇప్పటికీ పాలకులకు మార్గదర్శకమే అవుతుంది. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన జూన్‌ 11,1964‌న ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘ఏ దేశానికైనా ఏదో ఒక సమయంలో నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ, మనకు మాత్రం అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. మనం కుడి, ఎడమల వైపు చూడవలసిన అవసరం లేదు. మనం ముక్కుసూటిగా, నేరుగా వెళ్లిపోగలం. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. మనకు స్వేచ్ఛా, స్వాతంత్య్రా లున్నాయి. మనది సామ్యవాద ప్రజాస్వామ్య వ్యవస్థ. అన్ని దేశాలతోనూ స్నేహ సంబంధాలు, ప్రపంచ శాంతే మన లక్ష్యాలు’’ అంటూ దేశానికి దిశానిర్దేశం చేశారు. నైతిక బలం, స్థితప్రజ్ఞత, చిత్తశుద్ధి, నిస్వార్థ సేవ, నిరాడంబరత, వినయ విధేయతలు కరవవుతున్న ఈ రోజుల్లో లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి జీవితం నిజంగా అందరికీ ఆదర్శప్రాయమైంది. ముఖ్యంగా యువతీ యువకులకు ఆయన జీవితం ఒక దిక్సూచి లాంటిది. ‘‘నిరాడంబర జీవితం, ఉన్నత స్థాయి ఆలోచనలు’’ అంటూ ఆయన ప్రవచించిన జీవన సూత్రం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1966లో తాష్కెంట్‌లో ఆయన హఠాత్తుగా కాలధర్మం చెందడంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది.

జి.రాజశుక
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.