మానవ నాగరికతకు, జీవకోటికి నదులు జీవనాధారాలు. భూమిపై జీవం నిలవడానికి నీరు అత్యంత అవసరం. ఈ నీటి వనరులలో నదులు ప్రధానపాత్ర పోషిస్తాయి. నదులను భూమి సిరలు అని కూడా అంటారు. ప్రాచీనకాలం నుండి మానవ నాగరికతలన్నీ నదీతీరాల దగ్గరే పుట్టి అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు సింధు నాగరికత భారత్‌లో మెసపొటేమియా నాగరికత (యూఫ్రటీస్‌ ‌టైగ్రిస్‌ ‌నదుల ఒడ్డున) ఇరాక్‌లో, ఈజిప్టులో (నైలు నది నాగరికత) చైనాలో (హోయాంగ్‌ ‌హో నాగరికత). స్థిరమైన జీవనానికి కావలసిన ఆహారం, నీరు, రవాణా అన్నీ ఒకేచోట లభించడంతో నదీ తీరాలలోనే నాగరికతలు వర్ధిల్లాయి.
నదులు మానవులకు తాగునీరు, సాగునీరు అందించడంతో పాటు చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి, జలవిద్యుత్‌, ‌రవాణా మొదలైన అనేక విషయంలో ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నాయి. నదులను దేవతలుగా పూజిస్తారు. కాశీ, భద్రాచలం, హరిద్వార్‌ ‌వంటి పుణ్యక్షేత్రాలు నదీ తీరాల్లోనే వెలిశాయి. అయితే మానవ తప్పిదాలవల్ల నదులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. నదులను కాపాడుకోవడం మన బాధ్యత. కాలుష్యాన్ని అరికట్టేందుకు కఠినచర్యలు తీసు కోవాలి. నదులు స్వచ్ఛంగా ఉంటేనే మన భవిష్యత్తు బంగారం అవుతుంది.
ఆల్ప్రెడ్‌ ‌టెన్నిసన్‌ అనే ఆంగ్ల కవి ఒక సెలయేరు గురించి రాస్తూ, ‘మెన్‌ ‌మే కమ్‌ అం‌డ్‌ ‌మెన్‌ ‌మే గో, బట్‌ ఐ ‌గో ఆన్‌ ‌ఫర్‌ ఎవర్‌’ ‌మనుషులు రావచ్చు, పోవచ్చు. (పుడతారు, చనిపోతారు) కాని నేను (సెలయేరు) మాత్రం ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటాను అంటూ తన గురించి చెప్పుకుం టుందంటాడు.
గ్రామీణ ప్రజలలో చాలామంది జీవనోపాధి కోసం నదలుపై ఆధారపడి ఉండటం వలన నదులపై జానపద గీతాలు అనేకం ఉన్నాయి. ‘బాట’ అంటే బెంగాలీలో నది కాబట్టి ఈ నదలుపై పాడే పాటలను ‘బాటయాలీ పాటలు’ అని పిలుస్తారు. అలాగే సిమ్లా కొండల్లో పాడే జానపద గీతాలు, కేరళలోని కొన్ని పాటలు, అస్సాంలోని ‘బరమహిగీత్‌’. ఇవన్నీ నదులపై రాసిన కవితలే.
నది గలగలల కన్నా గొప్ప సంగీతం ఉండదు. అలల సవ్వడిలో తడిసిపోని కవీ ఉండడు. నది చేసే గాయాలకూ, నది చుట్టూ రాజకీయాలకూ కొదువ లేదు. నదిని దోసిట్లోకి తీసుకుంటే ఎన్ని పాటలో! నది పాడే పాటల్లో జీవం, జీవనం, గమనం, గమ్యం.. ఎన్నెన్ని చరణాలో, కలం నిండా నదిని నింపుకుని కవిత్వమై ప్రవహించిన కొన్ని చరణాలనైనా విందాం, పుడితే నదిగానే పుట్టాలి అంటారు బెల్లి యాదయ్య, ‘నదికీ ఒక భాష ఉంది’ అన్నారు గౌరునాయుడు మాస్టారు. నదికొక భాష ఉంది, నదికొక నాగరికత ఉంది. నదికొక బాధ్యత ఉంది. అక్షరాల్ని దిద్దినట్లు అలల్ని దిద్దకపోతే, కెరటాలతో కరచాలనం చేయకపోతే నది ఎప్పటికి అర్ధం కాదు.
నీటి ప్రాజెక్టుల మీద నీటి పువ్వు కవితను రాశారు ఒద్దిరాజు. ‘నది అంటే నడుస్తున్న సంపద/ నీటిని మూటగట్టి/ పొలాల్లో విప్పితే/ అది సీతాకోక చిలుకల గుంపవుతుంది’ అంటారు.
నదీజలాల విషయంలో ఆచితూచి అడుగు వేయకపోతే ఆ నీళ్ళల్లోనే నిప్పులు పుట్టుకొస్తాయి. అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చురేపే నదీ జలాలు పొరుగుదేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారడంలో వింతేముంది. వాయు కాలుష్యం ఎంత ప్రాణనష్టం కలిగించిందో ప్రపంచం చూసింది. ఇక నీటి కాలుష్యాన్ని త్వరగా అరికట్టకపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదాన్నే చవి చూడాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించడానికి, ప్రకృతి సమతౌల్యతను కాపాడడానికి ఎందరో మహానుభావులు కృషి చేశారు. వారిలో వన్య ప్రాణుల సంరక్షణకు కృషి చేసిన అమెరికావాసి జాన్‌ ‌ముయిర్‌, ‌రసాయన పురుగు మందుల వాడకాన్ని వ్యతిరేకిస్తూ ‘‘సైలెంట్‌ ‌స్ప్రింగ్‌’’ అనే పుస్తకం రాశాడు అమెరికావాసి అయిన రాచెల్‌కార్సన్‌. ‌చింపాజీల జీవన విధానంపై పరిశోధనలు చేసిన జైన్‌ ‌గుడాల్‌, ‌బ్రిటన్‌ ‌వాసి. ‘ఆఫ్రికా అడవుల పెంపకం కోసం గ్రీన్‌ ‌బెల్ట్ ‌మూవ్‌మెంట్‌ ‌నడిపిన వంగరి మాతాయ్‌ ‌కెన్యావాసి. ఈమెకు నోబెల్‌ ‌శాంతి బహుమతి లభించింది. నదులకు కాలుష్యరహితంగా జీవించే హక్కు ఉందని కోర్టులో కేసు వేసి గెలిచిన మారీలూజ్‌, ‌పెరూ దేశవాసి.
భారతదేశ పర్యావరణవేత్తలు విషయానికి వస్తే, చెట్టు నరకకుండా కాపాడిన చిప్కో ఉద్యమాన్ని సుందర్‌లాల్‌ ‌బహుగుణ ప్రారంభించారు. భారతదేశంలో పక్షుల సంరక్షణకు కృషి చేసిన సలీం ఆలీ, అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఒంటరిగా ఓ పెద్ద అడవినే పెంచి, ‘ఫారెస్ట్ ‌మాన్‌ ఆఫ్‌ ఇం‌డియా’గా ప్రసిద్ధి చెందిన జాదవ్‌ ‌పాయంగ్‌… ‌కర్ణాటకలో వేలాది మర్రి చెట్లను నాటిన సాలు మరద తిమ్మక్క… రాజస్థాన్‌ ఎడారిలో నీటిని నిలువచేసి, ఎండిపోయిన నదులను పునరుజ్జీవింపజేసిన రాజేంద్రసింగ్‌… ‌పశ్చిమ కనుమల పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన మాధవ్‌ ‌గాడ్గిల్‌ ‌సహా పలువురు కనిపిస్తారు. .
దేశంలో నదీజలాల కాలుష్యం తీవ్రమై పర్యావరణ, ఆరోగ్య సమస్యగా మారింది. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, పట్టణాల మురికినీరు శుద్ధి చేయ కుండా నదుల్లోకి వదలడమే ప్రధాన కారణం. భారత రాజ్యాంగం ప్రకారం స్వచ్ఛమైన నీటిని పొందే హక్కు ప్రాధమిక హక్కు. కాగా, నదీ జలాలకు సంబంధించి భారత్‌లో కొన్ని కీలక తీర్పులు చూద్దాం…
1. సుభాష్‌ ‌కుమార్‌ ‌వర్సెస్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ‌బీహార్‌ 1991 ‌బొకారో నదిలోకి టాటా స్టీల్‌ ‌కంపెనీ వ్యర్ధాలను వదలడంపై కేసు, ఆర్టికల్‌ 21 ‌ప్రకారం జీవించే హక్కు, కాలుష్యం లేని స్వచ్ఛమైన నీరు, గాలి పొందే హక్కు ప్రతి పౌరుడి ప్రాధమిక హక్కు అని కోర్టు స్పష్టం చేసింది.
2. ఎం.సి. మెహతా వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా కాన్పూర్‌లో తోళ్ల పరిశ్రమలు తమ తోళ్ల వ్యర్ధాలను గంగానదిలోకి వదలడంపై తీర్పు.
3. వెల్లూరు సిటిజన్స్ ‌వెల్ఫేర్‌ ‌ఫోరమ్‌ ‌వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా (1996) / పాలార్‌ ‌నది కేసు 2025. వెల్లూరు జిల్లాలో తోళ్ళ పరిశ్రమ వల్ల భూగర్భజలాలు కలుషితం కావడంపై కేసు.
4. ఎం.సి.మెహతా వర్సెస్‌ ‌కమల్‌ ‌నాధ్‌ 1997 ‌హిమాచల ప్రదేశ్‌లో ఒక ప్రయివేటు మోటెల్‌, ‌హోటల్స్ ‌నిర్మాణం కోసం బియాస్‌ ‌నదీ ప్రవాహాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పుడు వచ్చిన తీర్పు.
5. నదుల కాలుష్యంపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న కేసు: యమునా నదితో పాటు దేశవ్యాప్తంగా నదుల్లోకి మురుగునీరు వదలడంపై కేసు.
తెలుగు రాష్ట్రాల్లో మూసీనది, కృష్ణా, గోదావరి నదులలోకి పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరును వదలడంపై 2021లో వేసిన కేసులో ఫిబ్రవరి 2026 న తీర్పు వచ్చింది. దీని ప్రకారం నదుల కాలుష్యనివారణ పర్యవేక్షణను నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌కు పర్యావరణ వివాదాలను పరిష్కరించే హక్కు ఇచ్చింది.
అంతర్జాతీయ నీటి కాలుష్య వివాదాలు (ఇంటర్నేషనల్‌ ‌వాటర్‌ ‌పొల్యూషన్‌ ‌డిస్ప్యూట్స్) అనేవి రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఒకే నది, సరస్సు లేదా సముద్ర భాగం కలుషితం కావడంవల్ల తలెత్తే సమస్యలకు సంబం ధించినవి. ఒక దేశం పారిశ్రామిక వ్యర్థాలను లేదా వ్యవసాయ వ్యర్థాలను నదిలోకి వదిలినప్పుడు, ఆ నది ప్రవహించే తదుపరి దేశం (డౌన్‌ ‌స్ట్రీమ్‌ ‌కంట్రీ) తీవ్రంగా నష్టపోతుంది. దీనివల్ల దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు తలెత్తుతాయి.
డాన్యూబ్‌ ‌నదీ వివాదం ఇక్కడ ప్రస్తావించదగినది. ఈ నది ఐరోపాలోని హంగరీ-స్లోవేకియా దేశాల మధ్య పారుతుంది. ఈ నదిపై నిర్మించిన డ్యాములు, వదిలే పారిశ్రామిక వ్యర్ధాల వల్ల నీటి నాణ్యత తగ్గి, వివాదం నెలకొంది. అలాగే రైన్‌ ‌నది కాలుష్యం, 1986లో స్విట్జర్‌ల్యాండ్‌లోని ఒక రసాయన కర్మా గారంలో జరిగిన ప్రమాదం వల్ల టన్నుల కొద్ది విషరసాయనాలు రైన్‌ ‌నదిలో కలిశాయి. ఇది ఫ్రాన్స్, ‌జర్మనీ, నెదర్లాండ్‌ ‌దేశాల మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. ఇలాంటి వాటి పరిష్కారానికి హెల్సింకీ నియమాలు, యు.ఎన్‌.‌కన్వెన్షన్‌ ‌నియమాలు (1997) ఉన్నాయి, దీని ప్రకారం అంతర్జాతీయ నదులకు పర్యావరణానికి హాని కలుగకుండా అవతలి దేశానికి నష్టం రాకుండా నీటిని వినియోగించుకోవాలని చెబుతుంది.
అమెజాన్‌ ‌నదీ కాలుష్య సమస్య, ఇది పర్యావరణం విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దీనిలో అక్రమ బంగారు మైనింగు, పారిశ్రా మిక వ్యర్థాలు, పారిశ్రామిక మురికి, వ్యవసాయ రసాయినాల విడుదల, చమురు లీకేజీ, పెరూ, ఈక్విడార్‌ ‌వంటి దేశాల మధ్య అమెజాన్‌ ‌పరివాహక ప్రాంతాల గుండా వెళ్ళే పైపులైన్‌ ‌లీకులు, ప్లాస్టిక్‌ ‌వాడకం, బంగారు గనుల్లో వాడే పాద రస వ్యర్ధాలను నదిలో పారవేయడం కాలుష్యానికి కారణం అవుతున్నాయి. చెట్లు నరికి వేయడం వలన కూడా నదికి నష్టం జరుగుతుంది. వీటితో అరుదైన జంతుజాలం నశించిపోతున్నది.
పెరూ దేశంలోని మారానోన్‌ ‌నది అమెజాన్‌ ‌నదికి ప్రధాన ఉపనది. ఇది అక్కడి గిరిజనులకు (కుకామా తెగకు) అది నది మాత్రమే కాదు, వారి సంస్కృతికి ప్రతిరూపం. కానీ కొన్ని దశాబ్దాలుగా చమురు త్రవ్వకం, ఈ నది గుండా వేసిన చమురు పైపు లైన్ల లీకేజీ కారణంగా ఈ నీరు విషతుల్యంగా మారింది. ఆ నది నీరు త్రాగిన వారి రక్త పరీక్ష చేయగా ఆ రక్తంలో పాదరసం, సీసం వంటి ప్రమాదకర లోహాన్ని గుర్తించారు. మోరీలూజ్‌ అనే మహిళ స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దానితో మోరీలూజ్‌ ‌తన తోటి వారిని కలుపుకొని ‘‘హుయ్నా కానీ కమత హువారకానా’’ అనే పేరుతో మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి ‘‘ఎర్త్ ‌రైట్స్ ఇం‌టర్‌నేషనల్‌’’ ‌వంటి అంతర్జాతీయ సంస్థల సాయంతో 2021లో పెరూ ప్రభుత్వం, చమురు సంస్థలపై కోర్టులో కేసు వేశారు. నదులకు కూడా జీవించే హక్కుంది, దానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని వాదించగా, 2024లో కోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. అంతేకాదు, నది తరుపున మాట్లాడటానికి, దాని హక్కులను కాపాడటానికి గిరిజనులను గార్డియన్లుగా నియమించింది. ఇప్పుడు అక్కడ మైనింగ్‌ ‌చేయాలన్నా, పైపు లైన్‌ ‌వేయాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ తీర్పు ప్రపంచ పర్యావరణ చట్టాల్లోనే ఒక పెను విప్లవంగా చెప్పొచ్చు. మారిలూజ్‌ను 2025లో గోల్డ్‌మేన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ‌ప్రైజ్‌తో సత్కరించారు.
నాగరికతలు పుట్టింది నదీ తీరాల్లో.. వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తే మనిషి మనుగడే లేకుండా పోతుంది. దీన్ని ప్రజలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు గుర్తించాలి. లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది, ఆర్సనిక్‌, ‌ఫ్లోరైడ్‌, ఐరన్‌, ‌నైట్రేట్‌ ‌వంటివి నదును కలుషితం చేయకుండా చర్యలు తీసు కోవలసిన బాధ్యత ప్రభుత్వాలది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.