ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల తలరాతను మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. ఒకే ఒక్క ఓటు కూడా దేశ భవిష్యత్తును, ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తుంది. ఓటు వేయడానికి ఆధారమైన ఓటర్ల జాబితా తయారీ, సవరణ అనేది ఎన్నికల పక్రియలో అతిపెద్ద సవాలు. అర్హులైన ప్రతి పౌరుడు ఆ హక్కును వినియోగించుకోవాలంటే లోపాలు లేని ఓటర్ల జాబితా ఎంతో కీలకం. మన దేశంలో పౌరుల దరఖాస్తులు, అధికారుల తనిఖీల ద్వారా జాబితాలను నవీకరిస్తుంటే, కొన్ని దేశాల్లో పౌరుల సమాచారంతో ప్రభుత్వమే నేరుగా జాబితాలను సిద్ధం చేస్తోంది. చనిపోయిన, నకిలీ ఓట్లను ఏరివేయడం నుండి కొత్త ఓటర్లను చేర్చడం వరకు ప్రపంచ దేశాల్లో ఓటర్ల జాబితాల సవరణ ఎలా జరుగుతోంది? భారత్‌తో పోలిస్తే ఇతర దేశాల్లో ఉన్న విధానాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే పాలనా విధానం అనే నిర్వచనం అందరికీ తెలుసు. ఈ వ్యవస్థలో దేశ పరిపాలనకు సంబంధించిన అత్యున్నత అధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 193 దేశాల్లో అంతర్జాతీయ సంస్థల ప్రమాణాల ప్రకారం దాదాపు 74 నుండి 87 దేశాలు పూర్తి లేదా ఎన్నికల ప్రజాస్వామ్యాలుగా గుర్తించారు. అయితే దాదాపు 140 నుండి 155 దేశాలలో ఏదో ఒక రూపంలో ఎన్నికల విధానం అమలులో ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అత్యంత కీలకమైన పునాది. పౌరులు తమ పాలకులను ఎన్నుకోవడానికి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడానికి, పాలకులను జవాబుదారీగా ఉంచడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం. మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న మిగతా దేశాల్లో ఓటర్ల జాబితాలు ఎలా తయారవుతాయి? వాటిని ఎలా తయారు చేస్తారు, ఎలా సవరిస్తారు? ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచంలోని ఇతర దేశాల విషయానికి వస్తే క్రీ.పూ. 508లో తొలి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాచీన ఏథెన్స్ నగరంలో ప్రారంభమైంది.అప్పట్లో కేవలం స్వేచ్ఛా పౌరులైన పురుషులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండేది. మహిళలు, బానిసలు, విదేశీయులకు ఓటు హక్కు ఉండేది కాదు. క్రీ.పూ. 509లో ప్రాచీన రోమన్ రిపబ్లిక్ కాలంలో పౌరులు ప్రజా అసెంబ్లీలలో ఓటు వేసి నాయకులను ఎన్నుకునేవారు. ఆధునిక ప్రపంచ చరిత్రను గమనిస్తే 1844లో రాజ్యాంగబద్ధంగా పురుషులందరికీ ఓటు హక్కు కల్పించిన తొలి దేశం గ్రీస్. అయితే ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ విప్లవం (1792) తర్వాత ఆస్తి అర్హతలతో సంబంధం లేకుండా వయోజన పురుషులందరికీ ఓటు హక్కు కల్పించే ప్రయత్నం జరిగింది. తర్వాత 1848లో ఫ్రాన్స్ దీన్ని శాశ్వతంగా అమలు చేసింది. ఆ తర్వాత 1893లో న్యూజిలాండ్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరులందరికీ సమానంగా సార్వత్రిక ఓటు హక్కు తొలిసారిగా అమల్లోకి వచ్చింది. జాతి, లింగ భేదం లేకుండా మహిళలందరికీ ఓటు హక్కు కల్పించారు. ఐరోపా ఖండంలో పౌరులందరికీ సమాన ఓటు హక్కుతో పాటు, మహిళలు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించిన మొదటి దేశం ఫిన్లాండ్ (1906).
ఓటర్ల జాబితా సవరణ ఎందుకు?
ఓటర్ల జాబితాల సవరణలో పేర్ల చేర్పులు, మరణించిన, అనుర్హుల ఓట్ల తొలగింపులు, చిరునామాల మార్పులు, వివరాలు సరిదిద్దడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఇందుకోసం భారతదేశంలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఇప్పటివరకు మొత్తం 9 సార్లు జరిగింది. 1952-1956, 1958-1961,1965-1966, 1983-1984,1987-1988, 1993, 1995, 2002-2004లలో ఓటర్ల జాబితాను సవరించారు. ప్రస్తుతం సుమారు 21 ఏళ్ల విరామం తర్వాత 2025-2026లో 9వ సారి దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియను చేపట్టారు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు సంస్థలు వివాదాస్పదంగా మార్చేశాయి. మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న మిగతా దేశాల్లో ఓటర్ల జాబితాలు ఎలా తయారవుతాయి? భారత్ ‘సర్’ పద్ధతిని ఆయా దేశాల్లో కూడా అమలు చేస్తారా? విదేశాల్లో ఓటర్ల జాబితా సవరణ ఎలా జరుగుతోందో తెలుసు కోవాల్సిన అవసరం ఉంది
అమెరికా:
అమెరికా అనగానే ప్రపంచ పెద్దన్నగా ప్రచారంలో ఉంది. అయితే ఈ దేశంలో ఇక్కడ దేశవ్యాప్తంగా ఒకే కేంద్ర సంస్థ తయారు చేసే ఏకీకృత ఓటర్ల జాబితా లేదు. ఓటర్ల నమోదు, జాబితాల నిర్వహణ ప్రధానంగా రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల అధికారుల పరిధిలో ఉంటాయి. రాష్ట్రాన్ని బట్టి ఆన్లైన్, తపాలా లేదా ప్రభుత్వ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. మరణాలు, చిరునామాల మార్పులు, అర్హతకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చి జాబితాలను సవరిస్తారు. ఒక వ్యక్తి ఓటు వేయలేదనే కారణంతోనే అతని పేరును తొలగించడానికి సమాఖ్య చట్టం అనుమతించదు. జాబితాల ప్రక్షాళన పక్రియలకూ చట్టపరమైన పరిమితులు ఉంటాయి. అమెరికాలోనూ ఓటర్ల వివరాల పరిశీలన జరుగుతుంది. కానీ అది భారత్‌లోని ఎస్ఐఆర్ తరహాలో కేంద్రీకృత పక్రియ కాదు. రాష్ట్రాల వారీగా నిరంతర నవీకరణ ఉంటుంది.
కెనడా:
కెనడాలో ఫెడరల్ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎలక్షన్స్ కెనడా అనే స్వతంత్ర సంస్థ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఎలక్టర్స్ ద్వారా నిరంతరం నిర్వహిస్తుంది. 1997లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను లెక్కించే విధానాన్ని రద్దు చేసి, శాశ్వత డిజిటల్ డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ ఓటర్ల రిజిస్టర్ ద్వారా పన్నుల శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థల సమాచారంతో ఓటర్ల వివరాలను సరిచూస్తారు. చిరునామా మారిన వారి వివరాలను ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూస్తారు.ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుండి పోలింగ్‌కు ఆరు రోజుల ముందు వరకు అధికారిక సవరణ కాలం ఉంటుంది.
ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియాలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడం, ఓటు వేయడం చట్టరీత్యా తప్పనిసరి.16,17 ఏళ్ల వయస్సు గల యువత తాత్కాలిక ఓటర్లుగా ముందస్తు నమోదు చేసుకోవచ్చు. వారికి 18 ఏళ్లు నిండగానే వారి పేర్లు ఆటోమేటిక్‌గా అసలు జాబితాలోకి చేరుతాయి. ఆస్ట్రేలియా ఎన్నికల సంఘం ప్రభుత్వ విభాగాల నుంచి లభించే సమాచారాన్ని ఉపయోగించి ఓటర్ల వివరాలను నవీకరిస్తుంది. జనన, మరణ, వివాహాల రిజిస్ట్రీ నుండి వచ్చే డేటా ఆధారంగా మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగిస్తారు. అలాగే శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోయిన వారి పేర్లను కూడా నిబంధనల ప్రకారం తొలగిస్తారు. గడువు లోపు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది.
జర్మనీ:
జర్మనీలో ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. జనాభా రిజిస్టర్ ఆధారంగానే 18 ఏళ్లు నిండిన వారి పేర్లు ఆ ఓటర్ల జాబితాలో చేరతాయి. అయితే పౌరులు తమ నివాస చిరునామాను మార్చుకున్నప్పుడు స్థానిక మున్సిపాలిటీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.ఆ సమాచారం ఆధారంగా అర్హులైన ఓటర్ల జాబితాలను రూపొందిస్తారు. ప్రతి ఎన్నికకు ముందు మొదటి నుంచి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నివాస మార్పులు, ఇతర పరిపాలనా వివరాలు నవీకరించడం ద్వారా జాబితాల కచ్చితత్వాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది.
ఇంగ్లాండ్:
బ్రిటన్‌లో వ్యక్తిగత ఓటరు నమోదు విధానం అమల్లో ఉంది. స్థానిక ఎన్నికల అధికారులు జాబితాలను నిర్వహిస్తూ, వార్షిక తనిఖీలు, ప్రభుత్వ రికార్డులను ఆధారంగా చేసుకుంటారు. ఓటర్ల జాబితాను సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా ప్రతి నెలా సవరిస్తారు.ఎవరైనా ఇల్లు మారినా, పేరు మార్చుకున్నా వెంటనే ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాలి.వేరే చోటకు వెళ్లిపోయిన వారిని లేదా మరణించిన వారిని జాబితా నుండి తొలగిస్తారు.ఎన్నికల సమయంలో పోలింగ్‌కు 12 పనిదినాల ముందు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది
ఫ్రాన్స్, స్వీడన్
ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాల్లోనూ జనాభా, నివాస నమోదు వ్యవస్థలు ఎన్నికల నిర్వహణకు ఉపయోగపడతాయి. పౌరసత్వం, నివాస అర్హత, ఎన్నికల స్వభావం, స్థానిక చట్టాల ఆధారంగా నమోదు పక్రియలు మారుతుంటాయి. స్వీడన్ తన జాతీయ జనాభా రిజిస్టర్ ఆధారంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. ఫ్రాన్స్‌లో యువత 18 ఏళ్లు నిండినప్పుడు జాతీయ సేవా (చీ••ఱశీఅ•శ్రీ •వతీఙఱమీవ) నమోదు పక్రియ ద్వారా ఆటోమేటిక్‌గా ఓటర్ల జాబితాలో చేర్చబడతారు
భారత్ ఎస్ఐఆర్ మెరుగైనది
ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఓటర్ల జాబితా సవరణ కొన్ని అంశాలలో తప్ప చాలా వరకూ మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. మన దేశంలోని ఎస్ఐఆర్ గమనిస్తే.. భారత్‌లో బూత్ స్థాయి అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లడం వల్ల నిరక్షరాస్యులు, గ్రామీణ పేదలు కూడా ఓటర్లుగా నమోదయ్యే అవకాశం కలుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో పౌరులు స్వయంగా నమోదు చేసుకోవడం లేదా పన్ను రికార్డుల ఆధారంగా జాబితాలు తయారవుతాయి. అమెరికా వంటి దేశాల్లో రాష్ట్రాలు, కౌంటీల వారీగా వేర్వేరు నిబంధనలు ఉండటం వల్ల గందరగోళం ఉంటుంది.
భారత్‌లో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు, డిజిటల్ డేటాబేస్ ఉండటం ఒక పెద్ద సానుకూలత. వలసలు, మరణాలు, దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి జాబితాను ప్రక్షాళన చేయడానికి ప్రత్యేక సమగ్ర సవరణ ఉపయోగ పడుతుందని ఎన్నికల సంఘం పేర్కొంటోంది. విపక్షాలు, విశ్లేషకులు ఈ పక్రియలో పత్రాల నిబంధనల వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పారదర్శకత కోసమే ఈ ప్రక్షాళన అని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్న భారత్ వంటి భారీ ప్రజాస్వామ్య దేశంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను సవరించే వ్యవస్థ నిర్వహణపరంగా ప్రపంచంలోనే అతిపెద్దపక్రియ. అయితే, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పౌరుల జనన, మరణ, నివాస రిజిస్ట్రీలు పక్కాగా ఉండటం వల్ల ఓటరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆటోమేటిక్‌గా జాబితాలు నవీకరించబడతాయి. భారత్‌లో ఇంకా అంతటి పటిష్టమైన పౌర రిజిస్ట్రీ అనుసంధానం లేకపోవడం వల్ల, ప్రత్యేక సవరణల సమయంలో సాంకేతిక లోపాలు, అర్హుల పేర్లు తొలగిపోయే సమస్యలు తలెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాల సవరణ అనేది పౌరుల ప్రజాస్వామిక హక్కుతో ముడిపడిన బాధ్యత. జాబితాల్లో అనర్హుల పేర్లు ఉండకూడదు. అంతకంటే ముఖ్యంగా అర్హులైన ఒక్క పౌరుడి పేరు కూడా అన్యాయంగా తొలగిపోకూడదు. అంతర్జాతీయ విధానాల్లో ఏ పద్ధతిని అనుసరించినా పారదర్శకత, ప్రజలకు అందుబాటు, అప్పీలు చేసుకునే అవకాశం, అర్హులైన ప్రతి ఓటరుకు హక్కు రక్షణ ప్రాధాన్య సూత్రాలుగా ఉండాలి. అయితే విదేశాల్లో అనుసరిస్తున్న పద్దతులను భారత్ కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఓటర్ల జాబితాల సమగ్ర సవరణను ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టడానికి ముందు నిరంతర నవీకరణ వ్యవస్థను బలోపేతం చేయాలి. జనన, మరణాల నమోదు, చిరునామా మార్పులు, ప్రభుత్వ రికార్డుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలి. ఆధార్ వంటి గుర్తింపు పత్రాలను ఉపయోగించినా, వాటి ఆధారంగా మాత్రమే ఓటు హక్కును నిర్ణయించ కుండా ఎన్నికల చట్టాలు నిర్దేశించిన అర్హతలనే ప్రాతిపదికగా తీసుకోవాలి.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్
