జమ్మూ నగరంలోని తావీనది తీరంపై.. కమ్మతెమ్మెరల్లో సంచరిస్తుందేమో… మహారాజా హరిసింగ్ ఆత్మ మనకు తెలియదు. కానీ, తన రాజ్యం నుంచి కుట్రపూరితంగా తరిమివేతకు గురై, బొంబాయి నగరంలో ప్రవాసంలో జీవనం సాగిస్తూ…ప్రాణాలు కొడిగట్టిపోతున్న ఆఖరి ఘడియల్లో తన చితాభస్మాన్ని జమ్మూ-కశ్మీర్ అంతటా వెదజల్లాలనీ, అస్థికలను తావీనదిలో నిమజ్జనం చేయాలం టూ.. చివరికోరిక కోరిన మీదట రాజా హరిసింగ్ దేహం ప్రాణదీప్తిని కోల్పోయింది. జమ్మూ కశ్మీర్ రాజు శ్రీమాన్ ఇంద్రమహీంద్ర రాజరాజేశ్వర శ్రీహరి సింగ్…నిర్వేదంలో తన కోర్కెను వ్యక్తం చేశారా? లేదూ తను ప్రవాసంలో ఉన్నా, ఈ లోకాన్ని వీడినా…తన అస్తిత్వం జమ్మూ-కశ్మీర్ మాత్రమే అనుకున్నారా? ఇది కూడా మనకు తెలియదు.
“కళ్లు చెదిరే మంచు పర్వతాల ధవళ కాంతుల మధ్య వెలిగిపోయే కైలాసం.. రివ్వున దూసుకుపోతూ మృదువైన వస్త్రం వలె కనిపించే గంగా జలపాతం”… అంటూ కల్హణుడు వర్ణించిన కశ్మీర రాజ్యాన్ని ఏలిన డోగ్రా రాజ్‌పూత్ మహారాజు హరిసింగ్ విషాద నిష్క్రమణ గురించి తప్పక గుర్తు చేసుకోవాలి. స్మరణ అంటే కేవలం తలచుకుని కన్నీరు పెట్టుకోవడం కాదు. విస్మరణకు గురైన చరిత్రను పునర్మూల్యాం కనం చేయడం కూడా. కుట్రను వెలికితీసి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమని కూడా అర్థం చేసుకోవాలి. మహానుభావులు చాలామంది కొవ్వొత్తిలా కరిగిపోయి… చరిత్రను నిర్మించారు. తమ రక్తమాం సాలను ధారపోసి, ధనరాశులను ధారాదత్తం చేసి… ‘జాడతెలియని కథానాయకుల’ వలె వెళ్లిపోయారు. చరిత్రనిండా కుట్రదారుల విగ్రహాలే దర్శనమిస్తాయి. దేశ విభజన తర్వాత కశ్మీర్ విలీనంలో ఇలాంటి కుట్రలే జరిగాయి. ఈ కుట్రల మూలంగా సుదీర్ఘ కాలం హిమాలయ రాజ్యాన్ని ఏలిన మహారాజును తెలివిగా ప్రవాసం పంపించి, షేక్ అబ్దుల్లాకు పగ్గాలు అప్పగించారు నాటి ఘనమైన నేతలు.
ఈ కుట్రల తాలూకు చరిత్రనూ, వాటిలోని అంతస్సారాన్నీ తెలుసుకుంటూ హైందవ రాజు హరిసింగ్‌ను స్మరించుకుందాం….
1857లో జరిగిన మొదటి స్వాతంత్య్రం పోరాటం తర్వాత చివరి మొఘల్ రాజు బహదూర్ షా జఫర్‌ను రంగూన్ జైలుకు పంపారు బ్రిటీష్ పాలకులు. బర్మా జైల్లోనే జఫర్ కన్నుమూశాడు. నిజానికి స్వాతంత్య్రోద్యమానికి జఫర్ నాయకత్వం వహించలేదు. అందుకు తగిన వయసు, ఓపిక, సంపద ఏవీ ఆయన వద్ద లేవు.
మన దేశంలోని ధార్మిక అంశకు నెలవైన, సౌందర్యానికి చిరునామాగా ఉన్న వ్యూహాత్మక రాజ్యం జమ్మూ కశ్మీర్‌ను పాలించిన హిందూ రాజును మన పాలకులే ప్రవాసానికి పంపిన విషాదాన్ని చరిత్ర ఎన్నటికీ మరచిపోదు. ఒకవేళ హరిసింగ్ వంశీకులే నాడు అధికార పగ్గాలు చేపట్టి ఉంటే ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉండేదీ, అనే ప్రశ్న ఊహజనితమే కావచ్చు కానీ, అర్థరహితమైంది కాదు. జమ్మూ-సంస్థానం విలీనం వరకూ గుంటనక్కలా వేచిచూస్తున్న షేక్ అబ్దుల్లా విలీనం కాగానే నెహ్రూ, మౌంట్ బాటన్‌లతో లోపాయికారి ఒప్పందానికి వచ్చాడు. ఎందుకంటే విలీన ప్రక్రియను చేయాల్సిన అర్హత కేవలం మహారాజుదే.
నాటికి షేక్ అబ్దుల్లా అలీగఢ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి బడిపంతులు ఉద్యోగం వెలగబెడుతూ మరోవైపు ముస్లిం కాన్ఫరెన్స్ కార్యకలాపాలు చేస్తున్నాడు. 1937లో నెహ్రూ పరిచయం తర్వాత తన ప్రణాళికలను అమలు చేసేందుకు దారి సుగమం చేసుకున్నాడు. 1947నాటి కశ్మీర్ విలీనం తర్వాత కుట్ర పథకాన్ని పదేళ్ల ముందే సిద్ధం చేసుకున్నాడు.
దేశంలోని సంస్థానాల ప్రజల హక్కులకోసం బ్రిటీష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటుతో నెహ్రూ, నాడు ముస్లింకాన్ఫరెన్స్‌లో ఉన్న షేక్ అబ్దుల్లా మధ్య రాజకీయ మైత్రి, వ్యక్తిగత స్నేహం పెరిగింది. నెహ్రూతో స్నేహం పెరిగిన ఏడాదికే ముస్లిం కాన్ఫరెన్స్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి జూన్, 1938 24న ‘నేషనల్ కాన్ఫరెన్స’గా పేరును మార్చారు. కేవలం ముస్లింలనే కాకుండా అన్నివర్గాలను చేరేదీసేందుకే ఈ పేరుమార్పు తతంగం అన్నమాట. 1938-46 మధ్య ఏడేళ్ల కాలంలో సంస్థను ఒకవైపు బలోపేతం చేస్తూ మరోవైపు నెహ్రూతో లాలూచీ రాజకీయాలు నడిపాడు షేక్ అబ్దుల్లా.
అప్పటికే దేశ విభజన తాలూకు ఛాయలు క్రమంగా అలుముకుంటున్నాయి. అక్బర్‌పాలన కాలంలో దిన్ ఈ ఇలాహీ ఉద్యమాన్ని నిరసిస్తూ అహ్మద్ సర్ హింద్ ద్విజాతి సిద్ధాంతాన్ని 1600నాటికే ప్రతిపాదించి ఉన్నాడు. బ్రిటీష్ వలసవాదం తట్టాబుట్టా సర్దుకుంటున్న వాతావరణం ఏర్పడగానే ఆల్ ఇండియా ముస్లీం లీగ్ అహ్మద్ సర్ హింద్ కాలం నాటి నినాదాన్ని మరోసారి ముందుకు తెచ్చింది.
ఈ మొత్తం వాతావరణంలో షేక్ అబ్దుల్లా పాకిస్థాన్ చెప్పుచేతల్లో ఉండటం కన్నా, భారత్‌తో ఉండి మహా రాజుకు ఉద్వాసన పలకాలని వ్యూహాత్మకంగా పావులు కదిపాడు. నెహ్రూ, మౌంట్ బటన్‌లకు అనుకూలంగా వ్యవహరించాడు. ఈ ఉద్దేశంతోనే పద్ధతి ప్రకారం మహారాజు హరిసింగ్‌కు వ్యతిరేకంగా ‘క్విట్ కశ్మీర’ ఉద్యమం మొదలుపెట్టాడు. అంటే కశ్మీర్ ప్రజలను రాజుకు వ్యతిరేకంగా ఉసిగొల్పి, నెహ్రూ, మౌంట్ బటన్ లతో కలిసి పకడ్బందీ ప్రణాళిక రచించి ప్రవాసానికి పంపే ప్రణాళిక నాటికే చూచాయిగా ఉందని అర్థమ వుతుంది. ‘క్విట్ కశ్మీర’ ఉద్యమాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం షేక్ అబ్దుల్లాను అరెస్టు చేసి మూడేళ్ల శిక్ష విధించి, ఆరుమాసాలకే విడుదలచేసింది. సెప్టెంబర్ 1947, 29న విడుదలైన షేక్ అబ్దుల్లా తన అసలు ప్రణాళిక మొదలుపెట్టాడు. అక్టోబర్ 22న ‘ఆపరేషన్ గుల్ మార్గ’ పేరుతో పాక్ యుద్ధం మొదలుపెట్టింది. దీన్నే మొదటి ఇండో-పాక్ యుద్ధంగా వ్యవహరిస్తాం. ఇదే షేక్ అబ్దుల్లాకు కలిసి వచ్చింది.
అక్టోబర్ 1947, 23న మహారాజు హరిసింగ్ హుటా హుటిన ఢిల్లీకి ఎస్ ఓఎస్ పంపారు. ఎసఓఎస్ అంటే సేవ్ అవర్ షిప్ అన్నమాట. నెహ్రూ అనుంగు శిష్యుడిగా, అచ్చంగా చెప్పాలంటే ‘చేలా’గా పిలిచే వి.పి.మీనన్ 25వ తేదీన విమానంలో శ్రీనగర్ బయలుదేరాడు. బ్రిటీష్ పౌరులను విమానంలో సురక్షిత ప్రదేశానికి చేర్చాలని ఆదేశించాడు. మహారాజు హరిసింగ్‌కు మాత్రం ‘మీరు అర్జంటుగా శ్రీనగర్ వదిలిపెట్టాలి. లేదంటే పాకిస్థాన్ గిరిజన మూకలు ప్రాణాలు తీస్తాయంటూ రాజా హరిసింగ్ మాత్రం అది బెదిరింపో, సూచనో, జాగ్రత్తో తెలియని స్థితిలో ఉన్నారు.
సమయాభావం కారణంగా 26వతేదీన విలీనానికి అంగీకరిస్తూ మహారాజు హరిసింగ్ మౌంట్ బాటన్‌కు లేఖను పంపారు. చేసేదిలేక తన సామాగ్రిని తీసు కుని రాజా హరిసింగ్ బనిహల్ పర్వత శ్రేణుల గూండా బళ్లపై వెళ్లిపోయారు. నిద్రకు ఉపక్రమిస్తూ…‘నేను పంపిన ఎసఓఎస్‌కు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన తేకపోతే…నన్ను కాల్చేయమంటూ’ తన సహాయకుడిని ఆదేశించారట మహారాజు హరిసింగ్.
అక్టోబర్ 1947, 27 వతేదీ విలీనం జరిగిపోయింది. షేక్ అబ్దుల్లా ప్రధానిగా కశ్మీర్ ప్రభుత్వం ఏర్పడింది. షేక్ అబ్దుల్లా తాను కశ్మీర్ ప్రధాని కావాలన్న కుత్సితంతో నెహ్రూతో ఎలాంటి లాలూచీ రాజకీయాలు నడిపాడో…వివరిస్తూ భారత మూడో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మెహర్ చంద్ మహజన్ తన ఆత్మకథ “లుకింగ్ బ్యాక్, యాన్ ఆటోబయోగ్రీఫీ ఆఫ్ మెహర్‌చంద్ మహాజన”లో చారిత్రక ద్రోహం గురించి పూసగుచ్చినట్టూ వివరించారు కూడా. మెహర్ చంద్ మహాజన్ మహారాజా హరిసింగ్ ప్రభుత్వంలో ప్రధానిగా కూడా ఉన్నారు.
జూన్ 1947, 20 మహారాజు హరిసింగ్ బొంబాయి నగరానికి రైలులో బయలుదేరారు. ఏకైక కుమారుడు 18 ఏళ్ల కరణ్ సింగ్ జమ్మూ-కశ్మీర్ రీజెంట్‌గా నియమితుడయ్యాడు. సుమారు వందేళ్లపాటు వ్యూహాత్మక ప్రాంతాన్ని తమ సాహసంతో కాపాడిన గులాబ్ సింగ్, రణ్‌బీర్ సింగ్, ప్రతాప్ సింగ్, హరిసింగ్‌ల రాజకుటుంబాన్ని ఘనమైన స్వాతంత్య్రభారత గణతంత్ర ప్రభుత్వం ఘోరంగా అవమానించింది.1841లో వజీర్ జోరావర్ సింగ్ లాంటి డోగ్రా సైనిక వీరులు తమ ప్రాణత్యాగంతో నిలబెట్టిన గిల్గిత్-బల్టిస్థాన్ చారిత్రక భూమిని తెలిసి, తెలిసీ పరులపాలు చేశారు. అక్టోబర్ 1947, 26వ తేదీన శ్రీనగర్‌లో 1వ సిక్కు ఇన్‌ఫ్యాంట్రీ రెజిమెంట్‌కు ఇచ్చిన విందులో పాల్గొన్న వీ.పీ మీనన్, బ్రిటీష్ అధికారితో పిచ్చాపాటీ చర్చిస్తూ…గ్లాసులో మద్యం పోసుకుంటూ.. “మహారాజా హాడ్ ఫైనల్లీ పుట్ కశ్మీర్ ఇన్ ఇండియాస్ బ్యాగ్. అండ్ నౌ దట్ వియ్ హ్యావ్ ఇట” అంటే, “అంతిమంగా మహారాజు కశ్మీర్‌ను మన సంచిలో వేశాడు. ఇప్పుడిది మనది” అంటూ వ్యాఖ్యా నించాడట. ఇదీ నెహ్రూవియన్ సంస్కారం తాలూకు వ్యాఖ్య.
నాలుగు దేశాల సరిహద్దులుగల వ్యూహాత్మక భూభాగాన్ని నలుగురు రాజులు శతాబ్దంపాటు కాపాడి, ప్రమాదం పొంచిఉన్న స్థితిలో సాయం అర్థిస్తే… ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెప్పే పాలకుల మాటలు ఇంత హేయంగా ఉంటాయా అన్న వేదనతో కూడిన సందేహం కలుగుతుంది. ఈ మొత్తం క్రమంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఉన్నాడు కదా, మహారాజు హరి సింగ్ విషయంలో ఆయన పాత్ర ఏమిటనే సందేహం రావచ్చు. పటేల్ పాత్ర-ఆయనకు నాడున్న పరిమితులు, పరిధులనూ కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం…
1946 నాటికే కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలైంది. దళాలు ఆయుధాలతో గ్రామాల్లో తిరగుతున్నాయి. మరో వైపు నిజాం రాజు విలీనానికి ఒప్పుకోకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేశాడు. ఖాసీం రిజ్వీ నాయకత్వంలో రజాకార్ల దాడులు ఉధృతమయ్యాయి. దక్షిణాదిలో అతిపెద్ద సంస్థానమైన హైదారాబాదు రాజ్యంలో రెండు ప్రమాదకరమైన సాయుధ పక్షాలు సార్వభౌమాధి కారాన్ని సవాలు చేస్తున్న స్థితిలో సర్దార్ పటేల్ నిజాం లొంగుబాటు కోసం ఆపరేషన్ పోలో వ్యూహరచన ప్రయత్నాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్న క్లిష్ట సమయం అది.
జమ్మూ-కశ్మీర్‌లో పొరుగుదేశం పాకిస్థాన్‌తో పేచీని మౌంట్ బాటన్, నెహ్రూలు పరిష్కరిస్తారనే భావనలో పటేల్ ఉండవచ్చు. లేదా, ప్రతి అంశాన్ని తానే పరిష్కరించడం కూడా ఏ రకంగానూ మంచిది కాదనే అభిప్రాయమూ ఉండవచ్చు. హరిసింగ్ ప్రవాసం అంశం మాత్రం తాత్కాలికమని అని పటేల్ భావించారనే అభిప్రాయమూ ఉంది. పైగా వయసు పైబడిన స్థితి వెంటాడుతోంది.
స్వాతంత్య్ర వచ్చాక పటేల్ మూడేళ్లు మాత్రమే జీవించారు. అంతేకాదు, కశ్మీర్ విషయంలో పటేల్ జోక్యాన్ని నెహ్రూ, మౌంట్ బాటెన్‌లు ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నారనే వాదనలూ ఉన్నాయి. మౌంట్ బాటన్ లక్ష్యం సరిహద్దుల గుర్తింపులో వివాదాన్ని స్థిర అంశంగా ఉంచాలనేది. నెహ్రూ టార్గెట్ తన మిత్రుడు షేక్ అబ్దుల్లాను కశ్మీర్ ప్రధానిగా చేయాలనేది.
మహారాజా హరిసింగ్ తన 66 ఏట బొంబాయిలో ఏప్రిల్ 1964,26 కన్నుమూశారు. వ్యక్తిగత జీవితంలోనూ, రాచరికంలోనూ, ఆధునిక ప్రజా స్వామ్యంలోనూ అవమనాలు భరించి వెళ్లిపోయారాయన. మహారాజా హరిసింగ్ గురించి..ఐఏఎస్ అధికారి, రచయిత శక్తి ఎస్. చందేల్ అన్నమాటలు గుర్తు చేసుకుంటూ ముగిద్దాం. “ఇన్ ది లాస్ట్ ఫేజ్ ఆఫ్ హిజ్ లైఫ్, ది మహారాజా లివ్డ్ ఎ ఫోర్లోర్న్ లైఫ్, విత్ నో కంప్లైంట్ ఆర్ గ్రడ్జ్ ఎగెనెస్ట్ ఎనీవన్. ఓన్లీ పాష్ ఫర్ హార్సెస్ అండ్ టర్ఫ్ ఆఫ్ ముంబై కెప్ట్ హిమ్ గోయింగ్!”- (జీవిత చరమాంకంలో అనామకంగా, ఏకాకిగా ఉండి పోయారు మహారాజు. ఎవరి పట్ల కక్ష్యా, కార్పణ్యాన్ని మనసులో ఉంచుకోలేదు. బొంబాయి పచ్చిక బయళ్లను.. పరిగెత్తే గుర్రాలను ఇష్టంగా చూస్తూ ఉండటమే ఆయనకు కాస్త ఉత్సాహాన్ని, ఊరటనూ..ఇచ్చేదట…).’

ప్రశాంత్ జోషి
సీనియర్ జర్నలిస్ట్