“మొక్కే గదా అని పీకితే పీకకోస్తా”, అది ఒక సినిమా డైలాగు, సినిమా వివరాలు అప్రస్తుతం కాని ఎంత సందేశాత్మకం? చెట్టే కదా అని ప్రభుత్వాలు ఆ పనిచేస్తే వనాలు తగ్గేవికావు, వానలు దాక్కునేవి కావు. “తానె తరలి రాదా వసంతం తనదరికి రాని వనాలకోసం” వసంతం తరలివస్తుంది. వర్షాలు తన్నుకుంటూ కురుస్తాయి.

నీటికి జీవనమని పేరు. నీరే జీవులకు ప్రాణాధారం. వేసవిలో తీవ్రమైన తాపానికి సొమ్మసిల్లినప్ప్పుడు జీవరాశికి తెలిసివస్తుంది వర్షం విలువ. వర్షం మనిషిని నవ్విస్తుంది, కవ్విస్తుంది, జడిపిస్తుంది, ఏడిపిస్తుంది. ప్రాణం లేచొచ్చింది అనే అమృత భావనకు పురుడుపోస్తుంది. ఆషాఢ, శ్రావణ భాద్రపద ఆశ్వయుజ నాలుగు మాసాలు. వాటిని వానకారు అంటాం. భూమిలోంచి అదే పనిగా తేమను పీల్చుకున్న ఆకాశం వానకారు నాటికి నీటి రూపంలో బాకీ తీరుస్తుంది. ‘ఒక్క జల్లు కురిసిందా …. రెక్కలార్చుకున్నట్లే’ అని సినారె చెప్పినట్లు చినుకుల పలకరింపుతో పుడమితల్లి పులకరించి పరిమళాలను వెదజల్లుతుంది. ‘మట్టి వాసనలు’ అంటాం వాటిని, తొలకరి తొలి తడుపును ‘ఎలగోలు జల్లు’ అంటారు. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవ రాయలు వర్ష రుతువర్ణనలోలా “కుండ పోత కురిసేదాక అనుకోలేదు శ్రావణ మేఘమని” అనిపిస్తుంది.

తెలంగాణలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ విత్తనాలు సేకరించి సీడ్ బాల్స్ (విత్తనబంతులు) తయారుచేసి జల్లుతున్నది. ఎంతమంచి ఆలోచన. అడవులు సహజసిద్ధంగా తయారుకావాలి. గుంతలు తవ్వి మొక్కలు నాటి అడవులు సృష్టించాలంటే సాధ్యంకాని పని కాబట్టి, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా 2.5 కోట్ల సీడ్‌బాల్స్ (విత్తన బంతులు) విద్యార్థులు తయారుచేశారు. ప్రతీ సీడ్‌బాల్‌కు ఒక చెట్టును సృష్టించే శక్తి ఉంటుంది. ప్రతీ చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుంది. ఈ ఉద్యమంలో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

కవయిత్రి మొల్ల అయితే “కడవలతో నీళ్లు తెచ్చి ధారాపాతంగా పోస్తున్నట్లుంది” అన్నది. జడి వాన గురించి సంకుసాల నరసింహకవి తన “కవి కర్ణరసాయనం”లో మరో కోణం చూశాడు. పాలవేకరి కదిరీపతి “అంబుది తలక్రిందులుగా పట్టినట్లు” (సముద్రాన్ని బోర్లించినట్లు) అన్నాడు శుకసప్తశతిలో. అడపాదడపా వానలో తడుస్తూ ఉండండి అంటున్నారు స్క్రిన్‌విచ్ విశ్వ విద్యాలయం పరిశోధకులు, దీనివల్ల సెరోటోనిన్ హార్మోన్ విడుదలై మెదడులోని అమిగ్దలాను ప్రేరేపిస్తుంది. కాబట్టి అప్ప్పుడప్ప్పుడు చల్లగాలి పీల్చండి, తడుస్తూ ఉండండి అని వారు సూచిస్తున్నారు. జలధారలకు పాత గింజలు మొలకెత్తి వర్షానికి జోహార్లు అర్పిస్తున్నట్లుగా రెండాకులు చేతులను జోడిస్తుంది కృతజ్ఞతతో అన్నారు శేషేంద్ర శర్మ.

“బ్రతికినన్నాళ్లు ఫలములిచ్చుట కాదు / చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు త్యాగ /భావమునకు తరువులే గురువులు” అని వృక్షాల త్యాగం గురించి తెలుగు బాల శతకకర్త బోధిస్తాడు. చెట్టే కదా అని నరికేయకండి, దానికి ప్రాణం ఉంది, శక్తి ఉంది, పదిమందికి మేలుచేసే గుణం ఉందని గ్రహించండి” అంటాడు చెట్ల ప్రేమికుడు జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామవాసి సురికిసాల సత్తయ్య. అలాగే, ప్రతీ పండుగలాగానే మొక్కలునాటే పండుగ కూడా ఒకటి కావాలంటు న్నాడు ఆయన.

మనకు నిత్యం ఆక్సిజన్ అందిస్తున్న చెట్లకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ నిరూపించగా, మనుషులవలె చెట్లు కూడా మాట్లాడుకుంటాయని, అవి వాటి సామాజిక నెట్‌వర్కులో భాగమని కెనడా శాస్త్రవేత్త సుజానే సిమార్ తన పరిశోధనల ద్వారా నిర్ధారించాడు. చెట్లు “వుడ్ వైడ్ వెబ” అని పిలిచే భూగర్భ మైకోరైజల్ నెట్‌వర్క్ ద్వారా కమÖ్యనికేట్ చేస్తాయట! పోషకాలు, నీరు వంటి వాటి గురించి వాకబు చేసుకోవడం, ఏదైనా ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరించు కోడం చేస్తాయట. ఈ నెట్‌వర్క్ చెట్ల వేరువ్యవస్థలను కలుపుతుంది, ఇది మానవ మెదడులోని న్యూరాన్‌ల వంటిది.

ఈ భూమ్మీద కోటానుకోట్ల వృక్షాలుంటాయి. అయితే వాటిలో కొన్నిటి వెనుక ఆసక్తికరమైన కధలుంటాయి. మరికొన్ని వృక్షాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అలాంటి చెట్లు కొన్నిటి గురించి ఇక్కడ చూద్దాం.

సెల్యులర్ జైల్ (కాలాపానీ) అండమాన్ నికోబార్ దీవులలోని ఒక కారాగారం. బ్రిటిష్‌వారు భారత్‌లోని రాజకీయ ఖైదీలను దూరంగా ఉన్న ద్వీప సమÖహానికి తరలించే ఉద్దేశ్యంతో దీనిని ఉపయో గించారు. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న రోజులవి. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారికి జీవితఖైదు వేసి ఇక్కడకు పంపేవారు. బటుకేశ్వరదత్, యోగేంద్ర శుక్లా, వి.ఓ.చిదంబరం పిళ్ళై, వినాయక దామోదర సావర్కర్ మొదలైనవారిని ఈ జైలుకు తీసుకు వచ్చారు. ఈ కారాగార ప్రాంగణంలో ఓ రావిచెట్టు ఉంది. ఈ చెట్టు దేశ స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వేలాదిమంది అమరవీరుల త్యాగాలకు, బ్రిటిష్‌వారి అమానుష హింసకు మÖగ సాక్షి. అది చూసిన విషయాలను ఇలా చెపుతున్నది. ఈ జైలుకు తీసుకువచ్చిన సమరయోధులను కొరడాలతో కొట్టి, ఈ చెట్టు తిండి లేకుండా మలమలమాడ్చి, ఈ  నీడనే నిలబెట్టేవారు. జంతువులు కూడా చేయలేని విధంగా కొబ్బరినూనె తీయ డానికి గానుగ తిప్పేవారు. తిరస్కరిస్తే ఈ చెట్టుకే కట్టి కొట్టేవారు. ఆ సమయంలో ఖైదీలు అనుభవించిన క్షోభ, ఆక్రందనలకు ఈ రావి చెట్టు  నేటికీ సజీవసాక్షిగా అక్కడఉంది. లైటఅండ్‌మÖ్యజిక్ షో ద్వారా ఈ చెట్టు చెప్పినట్లుగా చూపుతారు.

ఉస్మానియా యÖనివర్శిటీలోని చింతచెట్టు మరో ముఖ్య సంఘటనకు సాక్షి. 1908లో హైదరాబాద్‌లో మÖసీనదికి వరదలు వచ్చాయి. అనేకమంది మరణించారు కానీ, దాదాపు 150మంది ఈ చెట్టుపెకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.

వేయిపైరుల మర్రి మరో వింత, తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో రామ్‌జీ గోండు బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బ్రిటిష్‌వారు 1860 ఏప్రిల్ నెలలో వారి సైన్యాన్ని వేయిమందిని బంధించి ఈ మర్రిచెట్టుకు ఉరిదీశారు. నాటి నుండి ఈ చెట్టును వేయి ఉరుల మర్రిగా పిలుస్తున్నారు.

మహబూబ్‌నగర్‌లో పిల్లలమర్రి సుమారు 800 ఏళ్లనాటి భారీ వృక్షం, ఒకప్ప్పుడు 4 ఎకరాలల్లో విస్తరించి ఉండేది. ఆక్రమణల కారణంగా నేడు 2.5 ఎకరాలకు పరిమితమై పోయింది. ఈ మర్రిని చూసేందుకు రాష్ట్రం నలుమÖలల నుండి పర్యా టకులు వస్తారు. ఈ ప్రాంతానికి పిల్లలు ఎక్కువగా వస్తారు, అందుకే ఇది పిల్లలమర్రిగా ప్రసిద్ధికెక్కింది.

చేవెళ్ల మండలం దామరిగిద్దలో 600 ఏళ్ల నాటి చింతచెట్టుకు బొరియ ఉంది.దానిగుండా అనారోగ్యంతో ఉన్న పిల్లలను పంపితే రోగాలు నయమవుతాయని స్థానికులు నమ్మకం. నిజామాబాద్ జిల్లా ముస్కాల్ గ్రామంలోని మర్రిచెట్టుకు కొబ్బరికాయ ముడుపు కడితే విదేశాలకు వెళ్ళేందుకు వీసాలు వస్తాయని నమ్మకం.

హైదరాబాద్‌లోని గోల్ఫ్ క్లబ్బులో 600 ఏళ్ల నాటి బావోబాబ్ చెట్టు వుంది. గోల్కొండ కోటను ఆనుకుని ఉన్న ఈ చెట్టు కాండం ఒక రహస్య గది మాదిరి వుంటుంది. ఇందులో 20మంది దాక్కునేటంత కుహరం ఉంది. దొంగలు పగటిపూట ఈ రహస్య గదిలో దాక్కుని రాత్రి సమయంలో కోట పరిసర ప్రాంతాలలో దొంగతనం చేసేవారని, ఒకరోజు పగటిపూట వంట చేస్తూ ఉండగా చెట్టు వెనుక నుండి పొగరావడం గమనించి స్థానిక ప్రజలు పోలీసులకు చెప్పగా, వెంటనే వారు ఆ చెట్టులోగల దొంగలను పట్టుకున్నారు.

నాగరకర్నూలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చీమచింత చెట్టు భారీ వర్షానికి నేల కూలింది. 2017లో స్కూల్ యాజమాన్యంతో కలిసి, ‘వట’ ఫౌండేషన్ దీనికి తిరిగి జీవం పోసింది. భారీ క్రేన్ సహాయంతో ఈ చెట్టును తిరిగి భూమిలో పాతారు. అప్పటినుండి ఏటా జూన్ 28న విద్యార్ధులు, టీచర్లు ఈ చెట్టుకు రాఖీ కడుతూ వృక్ష రక్షాబంధన్ పండుగ చేసుకుంటున్నారు. గౌతమ బుద్దునికి జ్ఞానోదయమైన రావి చెట్టు బీహార్‌లో నేటికీì ఉంది.

ఐరోపా ఖండంలోని క్రొయేషియాలోని గారిజా స్టుబికా గ్రామంలో గ్యుబెక్ లిండెన్ చెట్టు. 1573 నాటి నుండి ఉంది. జమీందార్ల దౌర్జన్యాలకు, పన్నుల పెంపునకు వ్యతిరేకంగా మటిజాగ్యు బెక్ నాయకత్వంలో వందలాదిమంది రైతులు తరలివచ్చారు. వాళ్లంతా ఈ చెట్టు క్రింద కూర్చుని కార్యాచరణ చేశారని స్థానికులు చెబుతారు. రైతులకోసం పోరాడిన మటికా గ్యుబెక్‌ను అరెస్టు చేసి మరణ శిక్ష విధించారు. రైతుల తిరుగుబాటుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ చెట్టును స్థానికులు స్వేచ్ఛాపోరాటానికి ప్రతీకగా భావిస్తారు. తరువాత ఈ వృక్షాన్ని జాతీయ ప్రకృతిస్మారక చిహ్నంగా గుర్తించారు. యÖరోపియన్ ట్రీ ఆఫ్ ది ఇయర్ గా 2019లో క్రోయేషియావారు అధికారికంగా నామినేట్ చేశారు.

ఇంగ్లండ్‌లోని అబర్‌పోర్డ్ గ్రామంలోగల ఒక చెట్టును ప్రజలు “లవ్ ట్రీ” పిలుస్తారు. దానికి కారణం సుమారు వందేళ్ల క్రితం విక్‌స్టెడ్ అనే యువకుడు నెల్లీ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కలుసుకునే దగ్గర మÖడు బీచ్ చెట్లున్నాయి, మధ్యలో ఉన్న చెట్టును పక్క చెట్లతో అంటుకట్టి తన ప్రేయసి నెల్లీ పేరును “ఎన” అనే ఆకారం వచ్చేలా పెంచాడు. తరువాత వాళ్ళు పెళ్ళి చేసు కున్నారు. ఈ చెట్టు వారి ప్రేమకు చిహ్నంగా నిలవడంతో దానిని స్థానికులు లవ్‌ట్రీగా పిలవడం ప్రారంభించారు. క్రమక్రమంగా పెళ్ళి ప్రపోజల్స్‌కు ఆ చెట్టు వేదిక అయ్యింది. 2018లో బ్రిటిష్ ట్రీ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

రెక్కలు విప్ప్పుకున్న పక్షిలా కన్పించే చెట్టు ఫ్రాన్సులోని కార్సికా ద్వీపంలోని గిసోనాసియా ప్రాంతంలో ఉంది. పోలెండ్‌లోని క్రాస్నిస్టావ్‌లో ఒక చెట్టు మోకరిల్లిన మనిషి ఆకారంలో ఉంటుంది. దీనిని నీలింగ్ ట్రీగా పిలుస్తారు.

స్పెయిన్‌లోని నవాజాస్ గ్రామంలో 1636లో పాస్టోర్ అనే వ్యక్తి ఎల్మ్ మొక్కను నాటారు. ఆయన పేరు చెట్టు పక్కన గల శిలాఫలకంపై ఉంది. గ్రామస్తులందరూ ఆ మొక్కపైగల మమకారంతో చెట్టుకు 350వ జన్మదిన వేడుకను నిర్వహించారు. ‘ఎల్మ్ ఆఫ్ నవాజాస’ పిలిచే ఈ చెట్టును స్పెయిన్ ట్రీ ఆఫ్ ది ఇయర్‌గానూ ఎంపికైంది.

స్లోవాక్ రిపబ్లిక్ దేశస్థులు కోప్‌గ్రామ శివారులో ఉన్న లైమ్ చెట్టును “గార్డియన్ ఆఫ్ గ్రేట్ మోరావియా సీక్రెట్స” అని పిలుస్తారు. 235 ఏళ్ల చరిత్ర గలిగిన ఈ చెట్టు తొలి స్లావిక్ రాజ్యమైన మోరావియా కాలం నాటిదని, తన వేర్లలో గ్రేట్ మోరావియా పూర్వీకుల కథలను రహస్యాలను కాపాడుతుందని నమ్ముతారు.

లిధువేనియాలోని స్టెల్ముజ్ గ్రామంలో 1500 ఏళ్ళ చరిత్ర గలిగిన చెట్టు ఒకటి ఉంది. చెట్టు కాండం మధ్యలో తొర్ర ఉంది, ఇది పాతాళ లోకానికి వెళ్ళేదారని పూర్వికులు నమ్మేవారు. ఆత్మలు ఇక్కడ సంచరిస్తాయని నమ్మారు. 1812లో ఓ ఫ్రెంచ్ సైనికుడు ఈ చెట్టువద్ద మరణించాడని అంటారు. ఇక్కడ ఓ అస్థిపంజరం, ఓ తుపాకీ లభించింది, దీనిని బట్టి అది నిజమని ప్రజలు నమ్ముతున్నారు.

ప్రతీ ఏటా యÖరోపియన్ ట్రీ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఎన్విరాన్‌మెంటల్ పార్టనర్‌షిప్ అసోసియేషన్ (ఈ.పి.ఎ) పోటీలు నిర్వహిస్తుంది తద్వారా పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నది.

కలప మానవ సమాజానికి ఎంతో అవసరం. అలాగని చెట్లను కొట్టేస్తూ పోతే అడవులు తగ్గిపోయి పర్యావరణానికి హాని కలుగుతుంది. అలా జరగకుండా కొద్దిపాటి స్థలంలోనే వందల ఏళ్ళపాటు ఎక్కువ చెట్లను పెంచే పద్ధతిని జపాన్ వారు కనిపెట్టారు. అదే “దైసుగి” పద్ధతి క్యాటోలోని కిటయామా చాలావరకు పర్వత ప్రాంతం, ఏటవాలు ప్రదేశం ఎక్కువగా ఉండటంతో పెద్దపెద్ద చెట్లు పెరిగేవి కావు. దాంతో క్యోటో ప్రజలు బోనసాయి టెక్నిక్ ఆధారంగా దైసుగి విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈ పద్ధతిలో సుగి చెట్టు (జపానీసు దేవదారు) ఆరేడు మీటర్ల ఎత్తు పెరిగే వరకూ వేచి చూస్తారు. తరువాత చెట్టు కాండం అరమీటరు ఎత్తు ఉండేలా చూసి పై భాగాన్ని కొట్టివేస్తారు. అప్ప్పుడు చెట్టు మొదలు ఒక వేదికలాగా వెడల్పుగా తయారవుతుంది. దానితో ఈ కాండం చుట్టూ నిటారుగా పదుల సంఖ్యలో చెట్లు పెరుగుతాయి. ఇరవై ఏళ్ళకొకసారి వాటి కలపను వాడుకుంటారు. తద్వారా కలప కొరత తీరుతుంది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.