నేటి సమాజంలో మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థికస్వేచ్ఛ మాత్రమే కాదు… తమ భావాలను, సంతోషాలను, హక్కులను స్వయంగా నిర్దేశించుకునే స్వయంప్రతిపత్తి. ఇటీవల ముంబై బస్తీల నుంచి డిజిటల్ స్క్రీన్ల వరకు మహిళలు తీసుకొస్తున్న సాంస్కృతిక, సామాజిక మార్పు సమాజంలో మహిళా పాత్రకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. నాలుగుగోడలకే పరిమితమైన అనుభవాలను సమాజపు వెలుగులోకి తెచ్చే సృజనాత్మక విప్లవంగా మారుతోంది. సంప్రదాయ పరిధులను దాటి, సరికొత్త సాంకేతిక వృత్తుల్లో అడుగుపెడుతున్న మహిళలు తమ స్వీయ అనుభవాలనే ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. తమ ఆనందాన్ని హక్కుగా పొందుతూ ముందుకు సాగుతున్నారు.

సాధారణంగా చూపే కష్టాలు, పేదరికంలాంటి అంశాల కంటే భిన్నంగా మహిళలు తమ రోజువారీ జీవితంలో ఆనందాన్ని, స్వేచ్ఛను, హక్కులను ఎలా వెతుక్కుంటారు అనే ఇతివృత్తంతో ఒక  ప్రసిద్ధ డాక్యుమెంటరీ ఇప్పుడు మహిళా లోకాన్నే కాదు సినిమా ప్రియులనూ అమితంగా ఆకట్టుకుంటోంది. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎసఎస్) మీడియా అండ్ కల్చరల్ స్టడీస్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, జాతీయ అవార్డు గ్రహీత, దర్శకురాలు డాక్టర్ శిల్పి గులాటీ మార్గదర్శకత్వంలో తెరకెక్కిన 72 నిమిషాల “మస్త్ మహిళా మండలి” డాక్యుమెంటరీ సమాజంలో మహిళల స్వేచ్ఛ, ఆనందం, హక్కులపై ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరిస్తూ విశేష ఆదరణ పొందుతోంది.

ముంబైలోని మురికివాడలు, వెనుకబడిన వర్గాలలో మహిళల, సమాజాల సాధికారత కోసం పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోరో ఇండియా, టిఐఎసఎస్ నిర్మాణ భాగస్వామ్యంలో మస్త్ మహిళా మండలి తెరకెక్కింది. మహిళల సినిమాలు అంటే ఎప్పుడూ బాధ్యతలు, కష్టాలు, దుఃఖాలు, పేదరికం వంటివే ఉండాల్సిన అవసరంలేదంటూ…వారి ఇష్టాలు, ఆత్మవిశ్వాసం ఈ డాక్యుమెంటరీలో ప్రతిబిం బిస్తుంది. ముఖ్యంగా మహిళలు తమకు ఇష్టమైన రీతిలో రోజువారీ జీవితాన్ని గడపడాన్ని కూడా కోరుకుంటారని ఈ సినిమా చెప్తుంది.

“మస్త్ మహిళా మండలి”లో మహిళలు, నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా వారివంతు పాత్రలను పోషించారు. ముంబైలోని ఈస్ట్‌వార్డ్ వర్కింగ్ క్లాస్ ప్రాంతాలకు చెందిన 10మంది మహిళా కమ్యూనిటీ లీడర్లు తామే స్వయంగా స్మార్ట్‌ఫోన్‌లు, సెల్ఫీస్టిక్‌ల సహాయంతో తమ రోజువారీ జీవితాన్ని ఫీచర్-లెంత్ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు.  టిఐఎసఎస్ ప్రొఫెసర్‌గా ఉన్న శిల్పి గులాటీ మహిళలకు దాదాపు 18 నెలలపాటు ఫిలింమేకింగ్‌లో శిక్షణ ఇచ్చి, కో-డైరెక్టర్‌గా, కో-ఫెసిలిటేటర్‌గా, ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. సాధారణంగా పేదరికం, కష్టాలను చూపే డాక్యుమెంటరీలకు భిన్నంగా మహిళలు తమ కష్టాల నడుమ స్నేహం, హాస్యం, డ్యాన్స్, విహారయాత్రలు ద్వారా ఆనందాన్ని ఎలా వెతుక్కుంటారు అనేది ఇందులో చూపించారు. ఫీచర్ డాక్యుమెంటరీ వివిధ అంతర్జాతీయ, జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది, మహిళా సాధికారతకు, పార్టిసిపేటరీ ఫిల్మ్‌మేకింగ్‌కు నిదర్శనంగా ప్రశంసలు అందుకుంది.

డాక్టర్ శిల్పి గులాటీ కేవలం ఒక విద్యావేత్త లేదా డాక్యుమెంటరీ దర్శకురాలు మాత్రమే కాదు. సమాజంలో అంచులకి నెట్టివేసిన మహిళలకు తమ గొంతును తామే వినిపించేలా ధైర్యాన్ని, సాంకేతికతను అందించిన మార్గదర్శి. ఆమె ప్రయాణం, ఆలోచనాధోరణి నేటితరం మహిళలకు అనేక కోణాల్లో స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయి. సాధారణంగా మురికివాడలు లేదా బస్తీలలోని మహిళల జీవితాలను చూపే చిత్రాలు కేవలం వారి కష్టాలు, పేదరికం, కన్నీళ్లను మాత్రమే ఆవిష్కరిస్తాయి. కానీ శిల్పి గులాటీ ‘మస్త్ మహిళామండలి’ ద్వారా ఆ మూస ధోరణిని తిరగరాశారు. సాధారణ గృహిణులు, కమ్యూనిటీ లీడర్లుగా ఉన్న మహిళల చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు పెట్టి, దాదాపు 18 నెలలపాటు శిక్షణ ఇచ్చి తమ కథలను తామే చిత్రీకరించుకునేలా చేశారు. ఒక మహిళకు కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, తమ కథను చెప్పే స్వేచ్ఛ ఇవ్వడం నిజమైన సాధికారత అని ఆమె నిరూపించారు.

మహిళల హక్కులు అంటే కేవలం చట్టాలు, పోరాటాలు మాత్రమే కాదు, వారి రోజువారీ జీవితంలో ఆనందం, స్నేహం, నవ్వులు కూడా భాగమేనని ఆమె తన సినిమాల ద్వారా తెలియజేశారు. కష్టాల నడుమ కూడా డ్యాన్స్ చేయడం, విహారయాత్రలకు వెళ్లడం, కలిసి నవ్వుకోవడం ద్వారా మహిళలు తమ మానసిక ఒత్తిడిని ఎలా జయిస్తారో చూపించి, సమాజంలో ఒత్తిళ్ల మధ్య కూడా  సంతోషంగా జీవించడమనే భావనను సమాజానికి పరిచయం చేశారు. ముంబైలోని టిఐఎసఎస్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎంతోమంది విద్యార్థులలో సామాజిక స్పృహను, నాన్-ఫిక్షన్ ఫిల్మ్‌మేకింగ్ పట్ల అనురక్తిని పెంపొందిస్తున్నారు. సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి పనిచేస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శిల్పి గులాటీ దర్శకత్వం వహించిన “తాళా ద కుంజీ” డాక్యుమెంటరీకి 2017లో ఉత్తమ సామాజిక కథా చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా లభించింది.

ఆమె సినిమాలు కేవలం వ్యాపారాత్మకమైనవి కావు. తక్కువ బడ్జెట్‌లో ప్రజా సమూహాలను భాగస్వాములను చేస్తూ ‘పార్టిసిపేటరీ ఫిల్మ్‌మేకింగ’ పద్ధతిలో సామాజిక మార్పు కోసం చిత్రాలను నిర్మించడం ఆమె శైలి. సాంకేతికత, కళ, సామాజిక బాధ్యతలను మేళవించి మహిళల జీవితాల్లో స్వయంప్రతిపత్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపిన శిల్పి ప్రయాణం ప్రతి మహిళ తనలోని సృజనాత్మక శక్తిని గుర్తించి ముందడుగు వేయడానికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.

జయశ్రీ ఆచంట

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.