అంతరించిపోతున్న అరుదైన ‘బట్టమేక పక్షి’(గ్రేట్ ఇండియన్ బస్టర్డ్)  సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. ఒకప్పుడు ఈ పక్షులకు స్వర్గధామంగా ఉన్న నంద్యాల జిల్లా రోళ్లపాడు అభయారణ్యంలో వీటి సంఖ్య గణనీయంగా క్షీణించింది. అయితే, ఇటీవల ఆదోని సమీపంలో ఇవి మళ్లీ ప్రత్యక్షం కావడంతో అటవీశాఖలో కొత్త ఆశలు చిగురించాయి. వీటి ఉనికిని కాపాడేందుకు  ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్ర అటవీ అధికారుల బృందం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లి, గుడ్ల పొదుగుదల, కృత్రిమ గర్భధారణ విధానాలపై ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. అక్కడి నుంచి కొన్ని గుడ్లను, పక్షులను రోళ్లపాడుకు తీసుకువచ్చి, ఇక్కడి సహజ గడ్డి మైదానాల్లో వదిలి వాటి సంతతిని అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటే ‘లెసర్ ఫ్లోరికన’ (గడ్డి నెమలి) జాతిని కూడా సంరక్షిస్తూ, రోళ్లపాడు అభయారణ్యానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన, వేగంగా అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ‘బట్టమేక పక్షి’ (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) ఒకటి. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా స్వేచ్ఛగా విహరించిన ఈ పక్షులు, నేడు ఉనికి కోసం పోరాడుతున్నాయి. బట్టమేక పక్షి రూపం ఎంతో విశిష్టమైనది. దీని శాస్త్రీయ నామం ‘ఆర్డియోటీస్ నైగ్రిసెప్స’. పొడవాటి తెల్లటి మెడ, దాని చుట్టూ తెలుపు, నలుపు ఈకలతో కూడిన హారం, గోధుమ వర్ణపు వీపు, తలపై నల్లని టోపీ ఆకారంతో ఈ పక్షి ఇట్టే ఆకర్షిస్తుంది.ఈ పక్షిఎగిరే తీరు కూడా విలక్షణంగా ఉంటుంది. సరిగ్గా విమానం తరహాలో ముందుగా నేలపై కొంతదూరం పరుగులు తీసి, ఆ తర్వాత గాల్లోకి లేచి స్థిమితంగా, లయబద్ధంగా తన విశాలమైన రెక్కలను కదిలిస్తూ గగన విహారం చేస్తుంది. ఇవి అత్యంత బలిష్టమైన పక్షులు. సుమారు మీటరు పొడవు ఉండి, 15 నుంచి 18 కిలోల బరువు తూగుతాయి. వీటి రెక్కల పొడవు 210 నుంచి 250 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇవి ఒక నిర్దిష్టమైన ఎత్తులో మాత్రమే విహరిస్తాయి. అయితే

 పదుల సంఖ్యలో…

దేశంలో ఒకప్పుడు ఈ పక్షులు బాగా కనిపించేవి. సుమారు 11 రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉండేది. 1960వ దశకంలో వెయ్యి పక్షులుండేవి. 2008 నాటికి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వీటి సంఖ్య 300 లోపు తగ్గింది. ప్రస్తుతం ఆ సంఖ్య దారుణంగా 150కి పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా బట్టమేక పక్షి జాతులు ఉండగా, మనదేశంలోనే 4 జాతులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవాటిలో అత్యధిక శాతం పక్షులు రాజస్థాన్‌లోనే ఉన్నాయి. కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి చాలా నామమాత్రంగా మిగిలాయి. సాధారణంగా బట్టమేక పక్షులు జనసంచారం లేని గడ్డి మైదానాలు, వ్యవసాయ యోగ్యమైన పొలాల్లో సంచరిస్తుంటాయి. ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. వివిధ పంటల కోత పూర్తయిన తర్వాత మిగిలిన మోములు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు, ఎలుకలు, పాములను ఇవి తింటాయి. తద్వారా పంట పొలాలను రక్షించడంలో ఇవి అదృశ్య రైతు మిత్రులుగా, పర్యావరణ సమతుల్యతను కాపాడే రక్షకులుగా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పక్షులు గుంపులుగా కాకుండా ఎక్కువగా ఒంటరిగానే సంచరిస్తుంటాయి.

 అరుదుగా వృద్ధి

 ఈ పక్షుల సంతతి అత్యంత అరుదుగా వృద్ధి చెందుతుంది. బట్టమేక పక్షులు సాధారణ పక్షుల్లా ఆడ, మగవి జతకట్టి తిరగవు. కేవలం ఎదురైన సందర్భంలో మాత్రమే ఇవి కలుస్తాయి. సాధారణంగా మార్చి, సెప్టెంబరు మధ్య కాలంలో ఇవి గుడ్లు పెడతాయి. ఆడపక్షి ఏడాదికి కేవలం ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. అరుదుగా రెండు గుడ్లు పెడతాయి. ఈ గుడ్డును దట్టమైన పొదల్లో పెట్టి 25 నుంచి 30 రోజుల వ్యవధిలో పొదుగు తాయి. ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు ప్రత్యేకంగా గూడు ఏమీ తయారు చేసుకోవు. ఒకసారి గుడ్డు పెట్టాక మళ్లీ రెండేళ్ల పాటు తన సంతానం కోసమే గడుపుతుంది. 15-16 ఏళ్ల సగటు జీవితకాలం ఉండే ఒక ఆడపక్షి, తన జీవితంలో కేవలం నాలుగైదు గుడ్లు మాత్రమే పెడుతుండటం వీటి సంతతి పెరగకపోవడానికి ప్రధాన కారణం.

రోళ్లపాడులో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

బట్టమేక పక్షికి ప్రధాన ఆవాసంగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు సమీపంలో ఉన్న ‘రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం ఆఫ్రికన్ సవన్నా గడ్డి మైదానాలను పోలి ఉండటంతో, 1979లో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ప్రతినిధులు దీనిని బట్టమేక పక్షులకు అనువైన కేంద్రంగా గుర్తించారు. ప్రముఖ పక్షిజాతి శాస్త్రవేత్త సలీం అలీ చొరవతో 1980లో వీటి సంరక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. 1988లో సుమారు 9.37 చదరపు కిలోమీటర్ల (927 హెక్టార్లు) విస్తీర్ణంలో అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. 1989లో ఇక్కడ సుమారు 150 బట్టమేక పక్షులు ఉండేవి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ, 2020లో చివరిసారిగా ఇక్కడ ఒకే ఒక్క పక్షి కనిపించింది. ఒకప్పుడు రోళ్లపాడు పరిసరాల్లో విస్తారంగా ఉన్న గడ్డిభూములు, వేరుశనగ పంటలు ఈ పక్షులకు చక్కటి ఆవాసంగా ఉండేవి. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాయుశక్తి (విండ్ ఎనర్జీ) కోసం ఏర్పాటు చేసిన గాలిమరలు, వందలాది ఎకరాల్లో వెలసిన సౌరశక్తి (సోలార్ పవర్) ప్లాంట్లు, విద్యుత్ లైన్లు వీటి ఆవాసాలను ఆక్రమించాయి.

 దూరంగా ఉన్నవాటిని చూడగలిగి, ఎదురుగా ఉన్నవాటిని స్పష్టంగా చూడలేకపోవడం ఈ పక్షికి ఉన్న ఒక ప్రధాన లోపం. దీనివల్ల గాలిలో విహరిస్తున్నప్పుడు విద్యుత్ తీగలు సమీపానికి వచ్చేవరకు అవి గమనించలేవు. అప్పటికప్పుడు తమ భారీ శరీరాన్ని దిశ మార్చలేక, తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు వేరుశనగకు బదులు మొక్కజొన్న సాగు పెరగడం, రసాయన మందుల వాడకం, వీధి కుక్కలు గుడ్లను తినేయడం వంటివి వీటి మనుగడకు ముప్పుగా మారాయి. 2020 ఆగస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బట్టమేక పక్షుల జాడ కానరాలేదు. ఐదారేళ్ల క్రితం ఒక పక్షి వచ్చి గుడ్డు పెట్టి వెళ్లినా, ఆ గుడ్డు పొదగలేదు. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టులో ఆదోని పరిసర ప్రాంతాల్లో రెండు బట్టమేక పక్షులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ప్రముఖ బర్డ్ వాచర్ గఫూర్ స్వయంగా అక్కడికెళ్లి పరిశీలించి, అవి బట్టమేక పక్షులేనని నిర్ధారించారు. దీంతో అటవీశాఖలో మళ్లీ ఆశలు చిగురించాయి.

రాజస్ధాన్‌లో పక్షుల అభివృద్ధి కేంద్రం

రాజస్థాన్ రాష్ట్ర పక్షిగా ఉన్న బట్టమేక పక్షిని (స్థానికులు గోదావన్ అంటారు) కాపాడుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో 2018లో జైసల్మేర్‌లో (సామ్ సిటీ) బట్టమేక పక్షి కృత్రిమ గర్భధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2022లో రామ్‌దేవరా గ్రామంలో మరో కేంద్రాన్ని నెలకొల్పారు. ఇక్కడ అడవిలో దొరికిన గుడ్లను తీసుకొచ్చి ఇంక్యుబేటర్లలో పొదిగిస్తున్నారు. ఆడపక్షితో కలవకుండానే మగపక్షి వీర్యాన్ని సేకరించి, కృత్రిమ గర్భధారణ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. 2024లో ఈ విధానం ద్వారా ఒక ఆడపక్షి పుట్టడం చారిత్రాత్మక విజయం. ప్రస్తుతం ఈ రెండు కేంద్రాల్లో 45 పక్షి పిల్లలు పెరుగుతున్నాయి.

 రాజస్థాన్‌కు ఏపీ అధికారుల బృందం

మళ్లీ రోళ్లపాడు అభయారణ్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చి బట్టమేక పక్షుల ఉనికిని సుస్థిరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అటవీ అధికారుల బృందం (ఎఫ్‌డీపీటీ, ఆత్మకూరు డీడీ, సబ్ డీఎఫ్‌వో, ఎఫఆర్‌వో) త్వరలో రాజస్థాన్ లోని జైసల్మేర్‌కు వెళ్లనుంది. అక్కడ బట్టమేక పక్షుల గుడ్ల పొదుగుదలలో అనుసరిస్తున్న కృత్రిమ విధానాలపై వీరు శిక్షణ తీసుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి కొన్ని పక్షులతో పాటు, గుడ్లను కూడా రోళ్లపాడుకు తీసుకురానున్నారు. ఇక్కడి గడ్డి మైదానాల్లో వాటిని వదిలి, సంతతిని పెంచేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నారు. వీటితో పాటే లెసర్ ఫ్లోరికన్ (గడ్డి నెమలి) జాతిని కూడా అభివృద్ధి చేయనున్నారు. కృత్రిమ గర్భధారణ, బ్రీడింగ్ కేంద్రాల ద్వారా పక్షుల సంఖ్య పెంచుతున్నప్పటికీ, సంరక్షకుల చేతుల్లో పెరిగిన పక్షులు అడవిలో సహజంగా బతికే సామర్థ్యాన్ని 60 నుంచి 70 శాతం కోల్పోతున్నాయని పర్యా వరణవేత్తలు హెచ్చరిస్తు న్నారు. భారీ విద్యుత్ ప్రాజెక్టులు, వ్యవసాయ మార్పుల వల్ల పక్షులు వలస వెళ్లడం మానేయడంతో ఇన్‌బ్రీడింగ్ (ఒకే రక్తసంబంధం ఉన్న పక్షుల మధ్య కలయిక) పెరిగి పిల్లలు లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కేవలం కృత్రిమ పద్ధతులపైనే ఆధారపడకుండా, రోళ్లపాడు, జైసల్మేర్ లాంటి వాటి సహజసిద్ధమైన ఆవాసాలను, గడ్డి మైదానాలను మానవ జోక్యానికి, పారిశ్రామికీకరణకు దూరంగా రక్షించినప్పుడే ఈ అద్భుతమైన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతి భవిష్యత్ తరాలకు దక్కుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.