సూపర్ ఎల్‌నినో 2026లో గంభీరమైన రూపుదాలుస్తోందని అందరం వింటున్నాం. మన దేశంపై ఇది చూపబోయే విపరీత ప్రభావం విశదమైంది… అయితే ఈ విషయంలో మన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ, మన స్పందన సంగతేంటి? ‘అయ్యవారోచ్చేసారు, పూజకేర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు’ అన్నట్లుందా మన వైఖరి! చోటు చేసుకుంటున్న వాతావరణ విపరీత మార్పులను గురించి ఒక వార్త తెలిసిన తరువాత కూడా ఇంకా ఆ సమయం రాలేదు కదా! నిజంగా అంతటి విపరీత పరిణామాలుంటాయా! చూద్దాంలే వచ్చినప్పుడు అన్న ఒక నిర్లిప్తత మనలో కొంత ఉండటం కద్దు! కానీ ఎల్‌నినో విషయంలో అలాంటి నిర్లిప్తత పనికిరాదు! ఈ సూపర్ ఎల్‌నినో వల్ల గడచిన 150 ఏళ్లలో మొదటిసారి తీవ్ర వాతావరణ కష్టాలను ఎదుర్కోబోతున్నామన్నది శాస్త్రజ్ఞుల,పర్యావరణ నిపుణుల అంచనా! కాబట్టి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు ఈ ఘోర విపత్తును ఎదుర్కోవడానికి పూర్తి సన్నాహం కావాలి అన్నది నిర్వివాదాంశం.
సర్ ఫ్రాన్సిస్ బేకన్ అనే ఒక 15 వ శతాబ్దపు బ్రిటిష్ తత్వవేత్త,రాజకీయ వేత్త, రచయిత` ‘Read not to contradict and confute; nor to believe and take for granted; nor to find talk and discourse; but to weigh and consider. (అంటే, వ్యతిరేకించడానికి, ఖండించడానికి చదవవద్దు; గుడ్డిగా నమ్మడానికి చదవవద్దు; కేవలం మాటలు, చర్చలు కోసమే చదవవద్దు; కానీ ఆచితూచి, పరిశీలించడానికి చదవాలి.)
ఆయనే ఇలా కూడా అన్నాడు – Crafty men condemn studies, simple men admire them and wise men Use them. (జిత్తులమారి వారు అధ్యయనాలను ఖండిస్తారు, సామాన్యులు వాటిని ఆరాధిస్తారు, వివేకవంతులు వాటిని ఉపయోగించు కుంటారు.)
పై రెండు వాక్యాల నుంచి ‘to weigh and consider, wise men use them’ అన్న వాక్యాలను మనం ఇప్పుడు ఎల్‌నినో విషయంలో ఆచరించాల్సిన సమయం ఆసన్నమైంది.
సూపర్ ఎల్‌నినో భారత్‌లో మానవాళిపై ముఖ్యంగా రెండు తీవ్ర ప్రభావాలను చూప బోతోంది.. అవి, వర్షాభావం, అధిక వేడి, నీటి కొరత, వేడిగాలుల వంటి తాపాలు, విద్యుత్ కొరత లేదా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు. దక్షిణ ప్రాంతంలో తీవ్ర తాపం, ఉత్తర ప్రాంతంలో తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలుండొచ్చని ఒక అంచనా! వీటిని మనం తట్టుకుని నిలబడడానికి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు ఏం చేయగలమన్నది ప్రస్తుతం ఆలోచించి,ఆచరించవలసిన విషయం.
1.మొదటిగా ఎల్‌నినో సమయంలో నీటి లభ్యత ఎలా ఉండబోతోంది / నీటి అభావాన్ని తట్టుకోవడం : గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పటికే గడచిన కొన్ని దశాబ్దాలుగా అటు భూగర్భ జలాలు, ఇటు నదులలో పారే నీరు తగ్గిపోతోంది. ప్రపంచ వాతావరణ సంస్థ తన ప్రపంచ నీటి వనరుల పరిస్థితి 2025 అన్న నివేదికలో అనేక దేశాలను ప్రస్థావిస్తూ భారత్‌లో కూడా భూగర్భ జలాల స్థాయి గణనీయంగా తగ్గి పోతోందని, గత కొన్ని దశాబ్దాలుగా వర్షా కాలంలో భూమిలోకి చేరే నీటి పరిమాణాల కంటే మనం తోడుతున్న నీరే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొనడం విదితమే. ఇప్పటి సూపర్ ఎల్‌నినో సందర్భంగా నీటి లభ్యత ఒక ప్రధాన సమస్యగా మారబోతోంది అని మనం అనుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఈ విషయం మీద సమగ్ర ప్రత్యేక అధ్యయనం చేసి (ఇప్పటికే చేయకపోతే) ప్రజలను నీటి సమస్యనుండి ఎలా కాపాడాలో ప్రణాళికలు తయారు చేసి నీటి వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అవసరమయితే తాగు నీరు, వ్యవసాయం, ఆరోగ్యం, పశుపాలన, దైనందిన అత్యవసర కార్యకలాపాలకు తప్ప మిగిలిన అవస రాలకు నీటి వాడకాన్ని చాలావరకు నియంత్రించాలి.
ఈ క్రమంలో ప్రజల బాధ్యత ఏమిటంటే : తాగడానికి, స్నానానికి, వంటకు, ఇంటి పశుపోషణకు, మితంగా బట్టలు ఉతకటం లాంటి అత్యవసరాలకు మాత్రమే మితంగా నీటిని, తరువాత తిరిగి వర్షాలు పడేవరకు వాడితే మంచిది .మన ఇంటి బోర్ వాటర్ అయిపోతే ఈ ఎల్‌నినో కాలంలో నీరు ఎవ్వరూ సరఫరా చేయలేరు.
ఇక పారిశ్రామిక, వాణిజ్య కలాపాలు చేసే నీటి వినియోగాన్ని ఎల్‌నినో సమయంలో అత్యవసర పరిమాణంలో మాత్రమే వినియోగిస్తే మంచిది. లేకపోతే ఉన్న నీరు ఖాళీ అయిపోతే ప్రజలందరూ కష్టపడాల్సొస్తుంది. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
ఇక సినిమా షూటింగులు, పబ్బులు, స్టార్ హోటల్ వ్యవస్థ, లాడ్జెస్, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, ఫంక్షన్ హాళ్లు, ధార్మిక సంస్థలు మొదలైన కార్యకలాపాలలో నీటివినియోగం పొదుపుగా జరగాలి, అప్పుడే నీటిని ఎల్‌నినో పూర్తయ్యేవరకు జాగ్రత్తగా వాడుకోవడం సాధ్యమవుతుంది. టూకీగా చెప్పాలంటే ఈ కాలంలో మనకు ఇంకో గంగను భూమిమీదకు తీసుకు రావడానికి మరో భగీరథుడు లేడు. శంకర భగవత్పాదులు తల్లి కోసం పూర్ణానదిని మళ్లించినట్లు మళ్లించడం మనకు సాధ్యం కాదు కదా.
అలాగే ఇటీవల “డౌన్ టు ఎర్త” అనే పత్రిక తరుగుతున్న నీటి నిలువలను “మన సేవింగ్స్ అకౌంట్‌లో తరిగిపోతున్న నీటి నిల్వలు” గా అభివర్ణించిది. ఇది ఎంత చక్కటి ఉపమానమో కదా!
- విద్యుత్ సంక్షోభం తలెత్తవచ్చు
మన భారతదేశంలో ప్రస్తుతం ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 5000 నుంచి 7000 లీటర్లు నీరు కావాలని గణాంకాలు చెబుతు న్నాయి. తలసరి విద్యుత్ వినియోగం చూస్తే 2024-2025 లో 1,460 కిలో వాట్‌లుగా ఉంది. అంటే ఒక వ్యక్తికి 1.460 మెగావాట్ విద్యుత్తు కావాలి. ఇక 140 కోట్లమంది ఉన్న మన భారతదేశంలో ఎంత విద్యుత్ కావాలి, ఎల్‌నినో వల్ల నీటి కొరత వస్తే ఎంత విద్యుత్ ఉత్పత్తి చెయ్యగలం, ప్రజలకెంత విద్యుత్ అందించగలం అన్నది ప్రభుత్వాలు అంచనా వేయగలగాలి. తద్వారా ఈ సమయంలో ప్రాంతాల వారీగా ఎంత విద్యుత్ లభ్యత ఉంటుంది, ప్రజలు ఏ విధంగా విద్యుత్ పొదుపుగా వాడాలి అన్నది తెలియాలి.
విద్యుత్ వాడకాన్ని ఎలా నియంత్రించాలి అన్న దానిమీద ప్రభుత్వం మార్గదర్శకాలు ఇప్పుడే విడుదల చేయాలి అంతే గాని ఈ విషయాన్ని ప్రజలకే వదిలేస్తే విద్యుత్ వాడకపు నియంత్రణ “తాడు తెగిన బర్రె యాజమని మాట వినదన్నట్టుగా” అయి ప్రజలు ఎల్‌నినో సమయంలో విద్యుత్తును జల్సాగా వాడితే అసలుకే ముప్పు రావచ్చు కదా!
పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకీకరణ, వాణిజ్య కార్యకలాపాలు ముఖ్యంగా ఎక్కువ విద్యుత్ ఉపయోగించే షోరూమ్స్, మాల్స్, రిక్రియేషన్ సెంటర్స్, జిమ్స్, సినిమా థియేటర్లు, సెలూన్లు, స్పాలు, లాండ్రీలు, మ్యారేజ్ హాల్స్, ఇళ్లలో ఏసీలు మొదలైనవి ఈ ఎల్‌నినో దశ ముగిసేదాకా తమ కార్యకలాపాలను చాలా వరకు నియంత్రియించుకుని విద్యుత్ ఆదా చేసి, దైనందిన అత్యవసరాలకు మిగిల్చి ఉంచితే ఆ సమయంలో తలెత్తే విద్యుత్ సంక్షోభం నుంచి కొంత వరకు సురక్షితంగా గట్టెక్కవచ్చు.
- ఎల్‌నినో వల్ల ఉత్పన్నమయ్యే వేడి, తాపాలు
ఎల్‌నినో వల్ల ఈ ఏడాది డిసెంబర్‌లోనే వేసవి కాల పరిస్థితులేర్పడతాయని నిపుణుల అంచనా! తత్ఫలితంగా అధిక వేడిమి, తాపం కలుగుతుంది. దీనివల్ల వృద్ధులు, చిన్న పిల్లలు ఎక్కువ కాలం వేడి పీడనానికి, డీహైడ్రెషన్‌కీì, వడ దెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి విద్యుత్ సంక్షోభం, నీటి కొరత కూడా తోడైతే కూలర్లు, ఫాన్లు, ఏసిలు వాడకపోవడంవల్ల హీట్‌స్ట్రెస్ నుండి ఉప శమనం లేక ఎక్కువమంది హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉంది. ఈ విషయం మీద ప్రభుత్వం, హాస్పిటల్ యజమాన్యాలు ఒక తాటిపై కొచ్చి ప్రకృతి విపత్తయిన ఈ సమయంలో వేడిమికి గురై హాస్పిటల్ పాలయే వాళ్లకు మానవతా దృక్పదంతో ఉచిత వైద్యం అందచేస్తే బాగుంటుంది. అలాగే ఈ చికిత్సకుప యోగించే మందులు, ఓఆరఎస్ లాంటి ఉపశమన ద్రవాలు ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో కాస్ట్ టూ కాస్ట్ బేసిస్‌గా సరఫరా చేస్తే దేశ సేవ చేసిన వారవుతారు (కరోనా వాక్సిన్ లాగ). వృద్ధులని, బాలలని ఈ విపత్తు నుంచి గట్టేక్కించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి.
ఇక రెండో రకపు విపత్తు ఏమిటంటే, సూపర్ ఎల్‌నినో వల్ల దేశంలో కొన్ని ప్రాంతాలలో అత్యధిక వర్ష పాతం, ఆకస్మిక వరదలు వచ్చే అవకా శాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు కదా. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేంద్ర, రాష్ట్ర స్థాయిలో) పూర్తిగా సన్నధ్ధమై ఆయా ప్రాంతాలలో జన ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా పూర్తిగా ప్రణాళికాబద్ధంగా (హుదూద్ తుఫాను సమయంలో విశాఖపట్టణంలో తీసుకున్న సమర్ధ వంతమైన నివారణ చర్యలలాగా) పనిచేసి ప్రజలకు తోడ్పడాలి. దీనికి అవసరమైన పూర్తి సహాయం, మార్గదర్శనం అటు ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం, ఇటు స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేసి ఎల్‌నినో ప్రభావాల నుండి దేశం గట్టెక్కాలి.
పై ఆలోచనలు, సూచనలు సామాన్య పౌరుని ఆశలు / ఆకాంక్షలకు ప్రతిబింబాలు. అలాగే దేశం లోని విజ్ఞులు, శాస్త్రజ్ఞులు, పర్యావరణ నిపుణులు, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛందŠ సంస్థలు మొదలైన వారు ఈ పర్యావరణ అత్యవసర పరిస్థితి (environmental emergency)పై కలిసికట్టుగా పనిచేసి అమూల్యమైన సాంకేతిక, సహాయక, ప్రజారోగ్య సంక్షేమ సహాయక చర్యలు చేపట్టి ఈ సూపర్ ఎల్‌నినో దుష్ప్రభావాలనుండి దేశ ప్రజలను గట్టెక్కించగలిగితే అదే పదివేలు కదా!
“సర్వేజనాః సుఖినోభవంతు”
మహావాది రామకృష్ణ