మక్కా నిషేధిత గగనతలానికి దక్షిణంగా హౌతీలు ప్రయోగించిన డ్రోన్‌ను విజయవంతంగా కూల్చివేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తాము కేవలం సౌదీ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని యెమెనుకు చెందిన హౌతీలు అంటున్నారు.  మక్కాపై దాడి చేసామని సౌదీనే అబద్ధాలు ప్రచారం చేస్తోందని వారు ప్రకటించారు. దాడిని సాకుగా చూపి ముస్లిం దేశాల మద్దతును కూడగట్టడానికి, హౌతీలను పూర్తిగా ఏకాకులుగా చేయడానికి సౌదీ ప్రయత్నిస్తోంది. కానీ షియా ముస్లింలకు కూడా మక్కా పవిత్ర పుణ్యక్షేత్రమన్న సంగతి మరచిపోకూడదు!  హౌతీలు సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధాన్ని విధించారు. ఎర్రసముద్రంలోని సౌదీ చమురు నౌకలు, సౌదీ విమానాశ్రయాలపై దాడులు పెంచారు. వీరికి ఇరాన్ మద్దతు ఇస్తున్న విషయం జగద్వితం. కష్టకాలంలో ఒకరికి ఒకరం అండగా ఉందాం అనే తీర్మానంతో మక్కాలో రక్షణ ఒప్పందంపై సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ దేశాలు ఇటీవల సంతకాలు చేశాయి. అయితే హౌతీల దాడిపై టర్కీ కొంతకాలం మౌనం వహించింది. అనంతరం సౌదీ అరేబియాకు సాంకేతిక, సైనిక మద్దతును ఇచ్చేందుకు ఆ దేశం ముందుకు రావడం గమనార్హం.

ఇది ఒప్పందం క్రియాశీలకతను వెల్లడిస్తోంది. సకాలంలో చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో యెమెన్‌లోని హౌతీ సీనియర్ అధికారి మహమ్మద్ అలీ బుకైతీ స్పందిస్తూ, తమపై దాడులకు దిగితే, ఉక్కు పిడికిలితో సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఒప్పందంపై సంతకం చేయడం వల్ల సౌదీ అరేబియా దౌత్యపరంగా పూర్తిగా ఇరుక్కుపోయిందని చెప్పలేము. కానీ అది ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. అయితే, ఇది జరిగిన కొద్ది రోజులకే సౌదీపై దాడులకు హౌతీలు దిగడంతో, ఒప్పంద కూటమి అసలు రంగు బయట పడింది. అది కేవలం “రక్షణాత్మక”  ఒప్పంద మేనని, వేరే దేశంలోకి వెళ్లి తాము దాడి చేసేది లేదని (అంటే యెమెన్‌లోని హౌతీలపైకి సైన్యాన్ని పంపేది లేదని) పాక్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని తన రక్షణ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఒక మార్గంగా చూస్తోందే తప్ప, సౌదీ కోసం అరబ్ యుద్ధాల్లో నేరుగా తలదూర్చ డానికి టర్కీ  సిద్ధంగా లేదు. సౌదీకి ఇరాన్, హౌతీల నుంచి ముప్పు ఉంది. కానీ, ఒప్పందంలో భాగస్వాములైన పాక్,  టర్కీ దేశాలు ఇరాన్‌తో సరిహద్దులను పంచుకుంటున్నాయి. చాలాకాలంగా దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇరాన్‌తో నేరుగా యుద్ధానికి దిగడానికి ఈ రెండు దేశాలు సముఖంగా లేవు. అందువల్ల హౌతీల దాడులపై  స్పందించడానికి వెనుకాడుతున్నాయి. ఆపద సమయంలో ఈ కొత్త మిత్రులు ముఖం చాటేయడం సౌదీకి మింగుడుపడటం లేదు.

ఇజ్రాయిల్‌తో రహస్య చర్చలు

తన భద్రతరీత్యా అమెరికా, ఇజ్రాయిల్‌లతో అత్యంత రహస్యంగా దౌత్య, సైనిక చర్చలకు సౌదీ ఉపక్రమించింది. అమెరికా సెంట్రల్ కమాండ్  మధ్యవర్తిత్వంతో సౌదీ`ఇజ్రాయిల్ సైనిక అధికారులు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరిపారు. జర్మనీలో జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో సౌదీ, ఇజ్రాయిల్, యూఏఈ, అమెరికా రక్షణ విభాగాధిపతులు పాల్గొని ప్రాంతీయ భద్రతపై చర్చించినట్లు సమాచారం. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ మోహరించారు? వారి తదుపరి వ్యూహాలు ఏమిటి? అనే విషయాలపై తన అత్యాధునిక ఇంటెలిజెన్స్ (గూఢచార) సమాచారాన్ని సౌదీ అరేబియాకు ఇజ్రాయిల్ అందిస్తోంది. హౌతీల ముప్పును ఎదుర్కొనేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడారు. దీనిలో భాగంగానే, ఇటీవలే అమెరికా సౌదీ అరేబియాతో ఒక చారిత్రాత్మక “పౌర అణుఒప్పందం” పై సంతకం చేసింది. దీని ద్వారా సౌదీకి అణు సాంకేతికత లభిస్తుంది. ఓమన్ (మస్కట్) వేదికగా అమెరికా అధికారులు కూడా హౌతీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికా, ఇజ్రాయిల్ నౌకలపై దాడులు చేసేది లేదని హౌతీలు హామీ ఇచ్చారు అయితే సౌదీ అరేబియా నౌకలను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని కుండబద్దలుకొట్టారు. ఈ పరిణామం సౌదీ అరేబియాను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో తమతో అధికారికంగా చేతులు కలపాలని, అబ్రహామిక్ ఒప్పందంపై సంతకం చేయాలని ఆ దేశంపై  అమెరికా, ఇజ్రాయిల్‌లు ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదా ఇచ్చే వరకు ఇజ్రాయిల్‌తో అధికారిక సంబంధాలు పెట్టుకునేది లేదని సౌదీ స్పష్టం చేసింది. కేవలం హౌతీల ముప్పు నుండి తనను కాపాడుకోవడానికి మాత్రమే రెండు దేశాల రహస్య సైనిక సహకారాన్ని సౌదీ వాడుకుంటోంది.

చమురు రవాణా దిగ్బంధం

హౌతీలు ఎర్రసముద్రంలో (బాబ్ ఎల్ మండెబ్), ఇరాన్ పర్షియన్ గల్ఫ్‌లో (హార్ముజ్ జలసంధి) చమురు రవాణాను దిగ్బంధం చేయడంతో సౌదీ అరేబియా తీవ్రమైన భౌగోళిక-రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే విజన్ 2030  ప్రాజెక్టుల భారీ వ్యయం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సౌదీకి, ఈ తాజా సముద్ర దిగ్బంధం, మౌలిక వసతులపై దాడులు గోరుచుట్టుపై రోకటి పోటులా మారాయి. హౌతీల డ్రోన్ దాడుల కారణంగా సౌదీ తన అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీనితో పాటు లాజిస్టిక్స్ (రవాణా) నెట్‌వర్క్ స్తంభించి పోవడంతో, నిల్వ ఉంచే సామర్థ్యం లేక చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించారు. ప్రస్తుతం సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి 1990 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. పర్షియన్ గల్ఫ్ (హోర్ముజ్ జలసంధి) మూతపడటంతో, సౌదీ అరేబియా తన చమురును దేశం గుండా వెళ్లే ‘ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన’ ద్వారా ఎర్రసముద్రంలోని యాన్బు  పోర్టుకు తరలించి అక్కడి నుండి ఎగుమతి చేసేది. అయితే, ఇటీవల హౌతీలు జరిపిన డ్రోన్ దాడిలో ఈ పైప్‌లైన్ కూడా దెబ్బతిని మూతపడింది. పైప్‌లైన్ మరమ్మతులకు యుద్ధ వాతావరణం వల్ల ఆటంకం కలుగుతుండటంతో, ప్రపంచ సరఫరాలో దాదాపు 4% సౌదీ చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అంతర్జాతీయ సాగర సంబంధిత బీమా కంపెనీలు పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్ర ప్రాంతాలలో ప్రయాణించే నౌకలకు ‘యుద్ధం వల్ల ముప్పు’నకు బీమాను అందించే సదుపాయాన్ని రద్దు చేశాయి. దీనివల్ల సౌదీ నుండి చమురు తీసుకెళ్లడానికి చమురు నౌకలు ముందుకు రావడం లేదు. తగ్గిన చమురు ఎగుమతుల వల్ల సౌదీ బడ్జెట్ లోటు తీవ్రంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), రేటింగ్ సంస్థల అంచనా ప్రకారం సౌదీ ఆర్థిక లోటు దేశ జీడీపీలో 5.2% నుండి 6%కి చేరవచ్చు. విజన్ 2030 మెగా ప్రాజెక్టుల (ఉదాహరణకు ‘నియోమ’ సిటీ) నిర్మాణాన్ని ఆపలేక, చమురు ఆదాయం తగ్గడంతో సౌదీ అరేబియా భారీగా అప్పులు చేస్తోంది. 2026 చివరి నాటికి సౌదీ ప్రభుత్వ అప్పులు జీడీపీలో 32.7% కి పెరగనున్నాయి. గ్లోబల్ మార్కెట్లో చమురు సరఫరా తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లు దాటిపోయింది. ఇది కొంతవరకు సౌదీకి మేలు చేసినప్పటికీ, రవాణా మార్గాలు మూసుకుపోవడం వల్ల ఆ పెరిగిన ధరల పూర్తి లాభాన్ని సౌదీ అందుకోలేకపోతోంది.ఈ సముద్ర దిగ్బంధం  మరికొన్ని వారాల పాటు ఇలాగే కొనసాగితే, సౌదీ అరేబి యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూడక తప్పదు.

ప్రకటనలకే పరిమితం

ఇస్లామిక్ దేశాల కూటమి  కేవలం ప్రకటనలకే పరిమితం కావడం, రక్షణ ఒప్పందం చేసుకున్న పాకిస్తాన్, టర్కీలు క్షేత్రస్థాయిలో సైనిక సహాయానికి ముందుకు రాకపోవడం వల్ల సౌదీ అరేబియా తీవ్ర నైరాశ్యానికి గురైన మాట వాస్తవం. అలాగని ఇది సౌదీ అరేబియా శాశ్వత పతనం కాదు. దీనిని తాత్కాలికమైన వ్యూహాత్మక ఎదురుదెబ్బగా మాత్రమే చూడాలి. రవాణా మార్గాల పునరుద్ధరణ ,చమురు ధరలు బారెల్‌కు 100 డాలర్లకు పైనే ఉండటం వల్ల సౌదీకి మళ్లీ వేగంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. మక్కా ఒప్పందం ద్వారా పాక్, టర్కీల నుండి సైనిక రక్షణ ఆశించి సౌదీ భంగపడింది. ఇప్పుడు ఈ దేశాల ద్వంద్వ వైఖరిని సౌదీ కూడా గ్రహించింది. అందుకే, ఇప్పుడు అది తన వ్యూహాన్ని మార్చింది. పాక్, టర్కీలను నమ్ముకోకుండా అమెరికా, ఇజ్రాయిల్,  భారతదేశం వంటి ప్రధాన దేశాలతో బలమైన రక్షణ, ఇంటెలిజెన్స్, ఆర్థిక సంబంధాలను ఏర్పరుచుకుంటోంది. చమురుపై మాత్రమే ఆధారపడకుండా టూరిజం, టెక్నాలజీ, మైనింగ్ రంగాలలోకి మారాలనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆలోచన పూర్తిగా విఫలం కాలేదనేది సుస్పష్టం.

సౌదీ, ఇరాన్‌ల ప్రత్యక్ష పోరు

సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య ప్రాంతీయ ఆధిపత్య పోరు భవిష్యత్తులో మరింత తీవ్రమైన ముఖాముఖి పోరాటంగా  మారే అవకాశం ఉంది. గతంలో ఇరు దేశాలు కేవలం హౌతీలు, హిజ్బుల్లా వంటి సంస్థల ద్వారా పరోక్షంగా పోరాడేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఈ పోరును సరికొత్త మలుపు తిప్పుతున్నాయి. సౌదీ అరేబియా ఇకపై కేవలం యెమెన్‌లోని హౌతీలపై మాత్రమే కాకుండా, ఈ దాడులకు అసలు కారణమైన ఇరాన్ భూభాగంపై లేదా వారి సైనిక నౌకలపై నేరుగా దాడులు చేసే వ్యూహాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా ఇప్పుడు స్పష్టంగా రెండు బలమైన కూటములుగా విడిపోయే అవకాశం ఉంది. మొదటిది ఇరాన్ కూటమి. ఇందులో ఇరాన్, హౌతీలు, హిజ్బుల్లా (లెబనాన్), సిరియా ఇరాక్‌లోని కొన్ని షియా బృందాలు ఉంటాయి. వీరికి రష్యా, చైనాల పరోక్ష దౌత్య మద్దతు లభిస్తుంది. ఇక రెండవది సౌదీ – ఇజ్రాయిల్ – అమెరికా కూటమి. ఇరాన్ ముప్పును ఉమ్మడిగా ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, అమెరికాలు ఒక అనధికారిక రక్షణ కూటమిగా ఏర్పడుతున్నాయి. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్, అమెరికా ఆయుధాలు, సౌదీ ఆర్థిక బలం కలిసి ఇరాన్‌ను అణచివేయడానికి ప్రయత్నిస్తాయి.ఇరాన్ ఇప్పటికే అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.దీనికి ప్రతిచర్యగా, సౌదీ అరేబియా అమెరికాతో కుదుర్చుకున్న సరికొత్త పౌర అణు ఒప్పందం (123 ఒప్పందం) ద్వారా భవిష్యత్తులో సొంతంగా అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకోనుంది. అంటే, ఈ రెండు దేశాల ఆధిపత్య పోరు భవిష్యత్తులో అణు క్షిపణుల పోటీకి దారితీసే అవకాశం ఉంది.ఇరాన్ తన ఆర్థిక ఆంక్షలను తట్టుకోవడానికి ప్రపంచ చమురు మార్కెట్‌ను గందరగోళంలో పడేసే వ్యూహాన్ని కొనసాగిస్తున్నది. సౌదీ చమురు రవాణాను ఎంతగా దెబ్బతీస్తే, అంతగా ఇరాన్ పైచేయి సాధిస్తుంది. ఇందుకు ప్రతిగా అమెరికా సహాయంతో సౌదీ అరేబియా ఇరాన్ ఆర్థిక వనరులను పూర్తిగా దెబ్బతీయడానికి ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై మరింత కఠినమైన చమురు ఆంక్షలు  విధించేలా ఒత్తిడి తీసుకురాకమానదు!

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.