ఇరవై ఒకటవ శతాబ్దం ఆవిష్కరణల యుగం. నిన్నటివరకూ విద్య కోసం పుస్తకాల మీద ఆధారపడిన మనం కంప్యూటర్లు, తర్వాత స్మార్ట్‌ఫోన్లు రావడంతో వాటిమీద అతిగా ఆధారపడడం అలవాటుగా మారింది. ఈ పరికరాలు రాకముందు వ్యక్తులలో జ్ఞాపకశక్తి పదునుగా ఉండేది. ఇప్పుడు కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం, ఆ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి రావడంతో వాటిపై ఆధారపడడం మరీ ఎక్కువైంది. ముఖ్యంగా, పాఠశాలలు, కళాశాలల్లో కూడా వీటికి ప్రాముఖ్యత పెరగడం విద్యార్థులకు ఒక శాపం. డిజిటల్ పరికరాలపై అతిగా ఆధారపడ్డ విద్యార్ధులను ఏ ప్రశ్న వేసినా, కంప్యూటర్‌నో, సెల్‌ఫోన్‌నో, టాబ్‌నో సంప్రదించకుండా చెప్పలేకపోతున్నారు. ఈ పద్ధతి కారణంగా భావితరాలు సృజనాత్మకంగా ఆలోచించే శక్తిని కోల్పోవడమే కాదు, వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా లోటుపాట్లు ఏర్పడతాయి. అటువంటి తరాలు దేశానికి ఏ రకంగా ఉపయోగపడగలవు? ఈ క్రమంలో యునెస్కో ఈ డిజిటల్ చదువులపై అధ్యయనం చేసి కళ్లు తెరిపించే నిజాలు చెప్పింది.
స్మార్ట్‌ఫోన్ చదువులకు తక్షణమే ముగింపు పలకాలని యునెస్కో ప్రపంచ దేశాలకు పిలుపు నిచ్చింది. వీటివల్ల చదువులే కాకుండా పిల్లల్లో సంస్కారం, వ్యక్తిత్వం కూడా దెబ్బతింటున్నాయని యునెస్కో ఆందోళన వ్యక్తంచేసింది. “విద్యారంగంలో సాంకేతికత -2023” పేరుతో విడుదల చేసిన నివేదికలో పై విషయాలు పేర్కొంది. యునెస్కో చేసిన సూచనల అమలుకు ఫ్రాన్స్, ఫిన్లాండ్, నెదర్లాండ్ దేశాలు వెంటనే అంగీకరించాయి.
కోవిడ్ సమయంలో ఇళ్లలోకి, బడుల్లోకి విచ్చలవిడిగా చొరబడిన స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల విద్యార్థులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. “మంచి బోధకులను నియమించకుండా కేవలం కంప్యూటర్లు, వాటిలో రికార్డు చేసిన పాఠాలను అందుబాటులో ఉంచితే ప్రయోజనం ఉండదు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంవల్ల విద్యార్థులు చదువు పక్కనపెట్టి వేరే విషయాలపై దృష్టి పెట్టడం ఎక్కువయ్యింది“ అని యునెస్కో అధ్యయనం పేర్కొంది. 14 దేశాల్లో చదువులపై స్మార్ట్‌ఫోన్ల ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో 435 పేజీల నివేదిక విడుదల చేసింది.
విద్యార్థి కేంద్రంగా, ఉపాధ్యాయుడు ప్రధానంగా బోధన జరగాలని, డిజిటల్ పరికరాలను అతిగా వినియోగించడంవల్ల పిల్లల సంస్కారం, ప్రవర్తనపై దుష్ప్రభావం పడుతోందని; సైబర్ వేధింపులు పెరిగాయని యునెస్కో నివేదిక పేర్కొంది.
విద్యారంగంలో డిజిటల్ టెక్నాలజీని ప్రవేశ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాల విద్యా ప్రణాళికావేత్తలను యునెస్కో సూచించింది. బోధనలో 30%కి మించి సాంకేతికతను వినియోగించకుండా చైనా కట్టడి చేసింది.
విద్యారంగంపై “స్మార్ట“ దుష్పరిణామాలు
- స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను తరగతి గదుల్లో అతిగా ఉపయోగించడం వల్ల విద్యార్థుల ధ్యాస, ఏకాగ్రత దెబ్బతింటున్నాయి.
- మోతాదుకు మించిన సాంకేతిక వినియోగం వల్ల విద్యార్థుల్లో సామర్థ్యం దెబ్బతినడానికి, వారిలో సంస్కార లేమి ఏర్పడటానికీ అవకాశం ఉందని ఎన్నో అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బోధనలో డిజిటల్ సదుపాయాలను వినియోగిం చడంపై చాలా దేశాల్లో ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేదు. సైబర్ భద్రత గురించి 5 శాతం మందికి కూడా అవగాహన లేదు.
- సాంకేతికత కారణంగా విద్య చాలామందికి చేరువయ్యింది. అదే సమయంలో చాలామంది విద్యకు దూరమయ్యారు కూడా.
- పిల్లలు, ముఖ్యంగా విద్యార్థులలో డిజిటల్ అసమానతలు పెరిగిపోతున్నాయి. ఒకే తరగతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నవాడు, లేనివాడి మధ్య; స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా ఖరీదైన ఫోన్ ఉన్నవాడు, సాదా ఫోన్ ఉన్నవాడి మధ్య మానసిక తారతమ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది పిల్లలు మొబైల్ దొంగతనాలకు పాల్పడటానికి కారణమవుతోంది.
- డిజిటల్ టెక్నాలజీ వల్ల చదువులు మెరుగు పడ్డాయని చెప్పడానికి తగినంత అధ్యయనాలేమీ జరిగలేదు. డిజిటల్ యాప్స్ అమ్మే కంపెనీలే ఈ విషయంలో తమకు అనుకూల ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యా ప్రణాళికలపై ఇటువంటి కంపెనీ యాప్ ప్రభావం పెరుగుతుండడం విచారకరం.
స్మార్ట్‌ఫోన్లతో చదువులు అస్తవ్యస్తం
ప్రస్తుతం-అంటే కరోనా అనంతర కాలఖండంలో – పాఠశాల విద్యార్థులు, మరీ ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ఇంతకు ముందు లేవా? అంటే, అప్పుడూ ఉన్నాయి. అయితే, 30 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో ఓ ఇద్దరిలోనో, ముగ్గురిలోనో ఈ సమస్యలు కనిపించేవి. ఇప్పుడు ఆ సమస్యలు 15 నుండి 20మంది విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ సమస్యలు ఏంటంటే…
- డిస్ లెక్సియా (పదాలు చదవడంలో ఎదురయ్యే ఇబ్బంది)
- డిస్ గ్రాఫియా (చేతిరాత సరిగ్గా ఉండని పరిస్థితి)
- డిస్ కాల్క్యులియ (లెక్కలు చేయడంలో ఉండే ఇబ్బంది)
ఈ సమస్యలు ఇప్పుడు ఇంతలా పెరిగి పోవడానికి ప్రధాన కారణం.. సెల్‌ఫోన్. దీనికి విపరీతంగా ఎడిక్ట్ అయిపోవడంతో, చిన్న పిల్లల్లో లెర్నింగ్ డిజార్డర్స్ (అభ్యసన లోపాలు) ఎక్కువై పోతున్నాయి. కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం పిల్లలకు ఇచ్చిన సెల్‌ఫోన్‌ని తిరిగి వెనక్కి తీసుకునే పరిస్థితిలో లేరు చాలామంది పేరేంట్స్.
ఇవ్వకపోతే పిల్లలు ఏడుస్తారనో, అల్లరి చేస్తారనో లేకపోతే తిండి సరిగ్గా తినరనో.. ఇలా వివిధ కారణాలతో తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తూనే ఉండటంతో, చాలామంది పిల్లలలో ఈ లెర్నింగ్ డిజార్డర్స్ కనిపిస్తున్నాయి.
ఒక తరగతిలో డిస్‌లెక్సియా లేదా డిస్‌గ్రాఫియా ఉన్న పిల్లలు ఇద్దరో ముగ్గురో ఉంటే, టీచర్లు మేనేజ్ చేయగలుగుతారు. వాళ్ల సంఖ్య తరగతిలో ఉన్న విద్యార్థులలో సగానికి పైగా ఉంటే టీచర్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు.
వీటి మీద అవగాహన లేని తల్లిదండ్రులు మాత్రం మార్కులు బాగా రావాలని పట్టుబడుతూ ఉన్నారు. పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వడం పూర్తిగా మానివేస్తే కానీ ఈ సమస్యలు పరిష్కారమవ్వవు.
స్మార్ట్ నిరక్షరాస్యత
ప్రథమ్ సంస్థ దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 28 జిల్లాల్లో 14-18 ఏళ్ల వయసున్న వారిపై అధ్యయనం చేసింది. ఆ అధ్యయనం వివరాలు ఇలా ఉన్నాయి:
- వారు ఆంగ్ల భాషలో మామూలు పదాలు కూడా సరిగ్గా పలకలేకపోతున్నారు.
- వీరిలో 24.6శాతం మంది పిల్లలు రెండవ తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు, వాక్యాలను కూడా చదవలేక పోతున్నారు.
- 41.4శాతం మంది పిల్లలు గణితంలో చిన్నచిన్న భాగాహారాలను సైతం చేయలేక పోతున్నారు.
- 28.9శాతం మంది ఆంగ్లవాచకంలో చిన్న చిన్న వాక్యాలను చదవలేక పోతున్నారు.
- 39.6శాతం మంది గడియారం చూసి సరిగా సమయం చెప్పలేక పోతున్నారు.
- 43.4శాతం మందికి బరువులు, పొడవుల కొలతలు తెలియదు.
- 22.8శాతం మంది పిల్లలు నెలలో సగంపైగా రోజులు పాఠశాలలకు వెళ్లటం లేదు.
ప్రథమ్ సంస్థ అధ్యయనం చేసిన విద్యార్థులలో 83.4శాతం మంది ఇళ్లలో సెల్‌ఫోన్లు ఉన్నాయి. వీరిలో 86.5శాతం మంది సెల్‌ఫోన్లు వినియోగి స్తున్నారు.
మరి మన పిల్ల చదువులు ఇలా “స్మార్ట“గా కాక ఇంకెలా ఉంటాయి!?
యునెస్కో సూచనలు
- సాంకేతికత అనేది విద్యార్థుల, ఉపాధ్యాయుల మెరుగుదల కోసం మాత్రమే. వారిని దెబ్బతీయడానికి మాత్రం కాదు.
- సాంకేతికతను అమలు చేయటంలో నేర్చుకునేవారి అవసరాలే ప్రధానం కావాలి. బోధకులకు అవి సహాయకారిగా ఉండాలి. బోధకులు లేకున్నా పరవాలేదన్న రీతిలో సాంకేతికత అమలుచేయరాదు.
- వ్యక్తిగత స్థాయిలో ఎంత సౌకర్యంగా ఉన్నా సామాజిక దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతికపరమైన విధివిధాన నిర్ణయాలను తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలుగకుండా జాగ్రత్త పడాలి.
- వ్యాపార ప్రయోజనాలే కాదు, సమాజ శ్రేయస్సు కూడా చాలా ప్రధానమైనవన్న విషయం మరువరాదు.
- స్వల్పకాలిక ప్రయోజనాలే కాదు, దీర్ఘకాలిక నష్టాన్ని కూడా అంచనా వేయగలగాలి.
- విద్యార్థులు, బోధకుల వ్యక్తిగత సమాచార గోప్యతకు, రక్షణకు గట్టి చట్టాలు చేయాలి.
స్వీడన్ తొలి అడుగు!
“టెక్నాలజీ ఫస్ట్! ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌టాప్!” అన్నది గతంలో స్వీడన్ ప్రభుత్వ నిబంధన. మరి ఇప్పుడో తన నిబంధనని తానే రద్దుచేసింది. ప్రతి విద్యార్థి చేతిలో మళ్లీ పెన్నూ, పుస్తకం ఉండాలనీ, ప్రతి సబ్జెక్టుకూ ఒక టెక్స్ట్ బుక్ ఉండాలనీ చట్టం చేసింది.
స్వీడన్ ప్రభుత్వం తన “డిజిటల్ చదువుల” నిర్ణయాన్ని వెనక్కి ఎందుకు తీసుకుంది? కారణం.. అక్కడి పిల్లలు అరచేతిలో అందమైన ప్రపంచానికి బానిసలైపోవడంతో వాళ్ల బుర్రల్లోంచి చదువుకోవడం అన్న కాన్సెప్టే ఎగిరిపోయింది. పట్టుమని ఓ నాలుగు అక్షరం ముక్కలు కాగితంపై రాయాలంటేనే తల ప్రాణం తోకకి వస్తోంది. అసలు ఏ పని పట్ల అయినా ఏకాగ్రత అంటేనే వారికి తెలియకుండా పోయింది. అందుకే స్వీడన్ ప్రభుత్వం మళ్లీ మÖలాల్లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది.
ఇప్పుడు మనం ఉన్నది స్మార్ట్ ప్రపంచంలో. ప్రతి ఒక్కరూ డిజిటల్ పరుగులే పెడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచీ, రాత్రి పడుకునే దాకా మన ప్రతి పనీ టచ్ స్క్రీన్ తోనే. మరి అదేంటి!
తక్కిన ప్రపంచం కన్నా స్వీడన్ ఎప్పుడూ నాలుగడుగులు ముందే ఉంటుంది. ఒక దశాబ్దం పైగా డిజిటల్ ప్రపంచానికి మారు పేరుగా నిలచింది స్వీడన్. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని “మÖలాల్లోకి వెళ్లాలి” అంటోంది ఆ దేశ ప్రభుత్వం.
నిన్న మొన్నటి దాకా ట్యాబ్‌లు, కంప్యూటర్ స్క్రీన్‌లనే తరగతి గదులుగా నడిపించింది స్వీడన్ ప్రభుత్వం. కానీ 2026 లో ఆ స్వరూపమే మారిపోయింది. భారీగా నిధులు వెచ్చిస్తూ పుస్తకాలు, పెన్నుల తరగతి గదులను ఏర్పాటు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.
పుస్తకాల కోసం భారీగా నిధులు
2009 నుంచే స్వీడన్ తన విద్యా వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్ ఇవ్వడం అక్కడ పద్ధతిగా నడిచింది. అయితే, గత పదేళ్ల అనుభవంలో అక్కడి విద్యావంతులకు ఒక చేదు నిజం అనుభవంలోకి వచ్చింది. డిజిటల్ పరికరాల వల్ల విద్యార్థులలో చదివే నైపుణ్యం బాగా తగ్గిపోయింది. అక్షరాస్యతా స్థాయి బాగా పడిపోయింది. దాంతో పాటు ఏకాగ్రత కూడా బాగా తగ్గిందని పరిశోధనల్లో తేలింది.
మితిమీరిన డిజిటల్ వినియోగమే ఇందుకు కారణం అని గుర్తించిన అక్కడి ప్రభుత్వం “ఫ్రమ్ స్క్రీన్ టు బైండర” అనే నినాదంతో ముందుకి కదిలింది. అందుకే ప్రతి విద్యార్థికి ఒక్కో సబ్జెక్టుకి ఒక పాఠ్యపుస్తకం, నోట్ బుక్ ఉండాలని అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 12 కోట్ల డాలర్లను ఖర్చుపెట్టింది కూడా!
ఇది ఒక మార్పు మాత్రమే కాదు. మితిమీరిన ఆధునిక సాంకేతికత తెచ్చే అనర్థాలను ముందే గుర్తించి, మనిషి మేధను కృత్రిమ సంకెళ్ల నుంచి బయటికి లాగేందుకు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం.
అంతేకాదు, ఈ ఏడాది (2026) ఆగస్టు నుంచి స్వీడన్లో జాతీయ స్థాయిలో మొబైల్ ఫోన్ నిషేధం అమలులోకి రాబోతోంది. విద్యార్థులు ఉదయం స్కూల్‌కు వచ్చిన వెంటనే తమ ఫోన్‌లను అప్పగించాలి. రోజు మొత్తం, విరామ సమయంలో కూడా స్కూల్లో ఫోన్ లేకుండానే గడపాలి. స్వీడన్‌లో 2028 నాటికి అన్నీ విద్యాలయాలూ పూర్తిగా పాఠ్య పుస్తకాల మీదనే ఆధారపడనున్నాయి.
స్వీడన్ జీవన మంత్రం – లగోమ్ !!
‘మÖలాల్లోకి వెళ్దాం’ అన్న తన ఆలోచనని స్వీడన్ ప్రభుత్వం కేవల విద్యాలయాలకే పరిమితం చెయ్యలేదు. తమ ప్రాచీన సంస్కృతిలోని ‘లగోమ’ అనే సూత్రాన్ని మళ్లీ వెలికితీశారు. లగోమ్ అంటే “అతి వద్దు. కొరత వద్దు.. సరిపడా ఉండాలి” అని దీని అర్థం. ఈ సూత్రం ఆధారంగా స్వీడన్ దేశస్థులు అద్భుత విజయాలు సాధించారు.
అనలాగ్ రివైవల్ – మెదడుకు విరామం
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ కాలంలో మళ్లీ పాత పద్ధతులపై ఆసక్తి పెరగడాన్ని ‘అనలాగ్ రివైవల’ అంటారు. డిజిటల్ స్క్రీన్ల వల్ల వచ్చే సంతోషం కంటే, చేత్తో తాకగలిగే వస్తువులు మనకు ఎక్కువ మానసిక సంతృప్తిని ఇస్తాయి. అంతేకాదు, స్వయంగా చేత్తో రాయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కాగితం మీద చదవడం వల్ల విషయం బాగా గుర్తుంటుంది. ఇది కేవలం పాత కాలానికి వెళ్లడం కాదు. టెక్నాలజీ వల్ల కోల్పోయిన ‘స్పర్శ జ్ఞానాన్ని’ తిరిగి పొందడం.
శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి డిటాక్స్ డ్రింక్స్ వంటివి తీసుకుంటుంటారు. అలాగే స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం నుంచి మన మెదడును కాపాడుకోవడానికి డిజిటల్ డిటాక్స్ అవసరం. నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు చూస్తుం డడం వల్ల మన ఏకాగ్రత తగ్గిపోతోంది. నిద్రలేమి, ఒత్తిడి పెరుగుతున్నాయి. కాబట్టి ఈ డిజిటల్ డిటాక్స్ అనే విధానం అనుసరించాలి.
రోజూ కొన్ని గంటల పాటు ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల మనలో సృజనాత్మకత పెరుగుతుంది. కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా మాట్లాడుకునే సమయం పెరుగుతుంది. ఈ ‘అనలాగ్ రివైవల’ ద్వారా స్వీడన్ ప్రభుత్వం భావి తరాలకు కు ఒక మంచి సందేశం అందిస్తోంది. అదేంటంటే, “అత్యున్నత సాంకేతికత అవసరమే, కానీ అది మన మÖలాలను దెబ్బతీయకూడదు.”
డిజిటల్ లెర్నింగ్ అవసరం లేదా?
సాంకేతికత వద్దని ఎవరూ అనరు. కానీ అది ఎంతవరకు ఉండాలి? అనేదే ప్రశ్న. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యను అందించడానికి, కొన్ని అంశాలను సులువుగా అర్థమయ్యేలా వివరించడానికి యానిమేషన్ విధానంలో డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరం. అయితే చిన్న పిల్లలకు మొదటి దశలోనే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు అలవాటు చేస్తే, వాళ్లలో ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
స్వీడన్ ప్రభుత్వం ఏమంటోందంటే, “కోడింగ్ నేర్పండి, కానీ అది పుస్తకం చదవడం నేర్చుకున్న తర్వాతే.” కాబట్టి డిజిటల్ విద్య అనేది ఒక ‘సాధనం’ లాగా ఉండాలి తప్ప, అది ‘గురువు’ స్థానాన్ని భర్తీ చేయకూడదు. సరియైన సంతులనం పాటించడం ద్వారానే ఆరోగ్యకరమైన భవిష్యత్తును చూడగలం.
ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్
8008264690