ఉన్నత జ్ఞానం పొంది, ఆర్ధిక శాస్త్రవేత్త కావాలన్నది బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితాశయం. విదేశాలకు వెళ్లడానికి ముందు బరోడాలో చదువు కుంటూనే ఉద్యోగం చేశారు. అదే సమయంలో అస్పృశ్యత చేదు ఫలాలను రుచి చూశారు. నేటి ఇతర కులాలవారికి ఆ చేదు అనుభవాలు అర్థం కావు. తోటివారి సమతకోసం ఉద్యమించాలని ఆయన నిర్ణయించుకున్నారు. చదివిన చదువులతో ఆంగ్లేయ ప్రభుత్వానికి సేవ చేయాలనుకుంటే ఆయనకు ఎన్నో ఉన్నత పదవులు లభించేవి. కానీ ఆయన అటు వెళ్లలేదు. చదువు పేరున విదేశాల్లో ఉన్న సమతను రుచి చూశారు. తాను చేపట్టిన ఉద్యమాలు హింస దారి పట్టకుండా చూశారు.
1969లో ఉడిపి ధర్మ సమ్మేళనంలో అస్పృశ్యత ధర్మ సమ్మతం కాదు, సమానత మన మంత్రం అని గురూజీ ధర్మాచార్యులతో ప్రకటింపచేశారు. ఇది జరిగి దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ మంత్రం ఎంతవరకు అమలు అయింది? ఇంకా అనేక గ్రామాల్లో అందరికీ దేవాలయ ప్రవేశం లేదు. కులాలవారీగా శ్మశానాలు దాదాపు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు పట్ల అంబేడ్కర్ ఆలోచనలతో మనం విభేదించవచ్చు. అలాగని అన్నింటిని మనం అధ్యయనం చేయలేము.స్వర్గీయ దత్తోపంత్ ఠేంగ్డే వంటి మహనీయుల మార్గమే మన మార్గం కావాలి. అంబేడ్కర్ అనుయాయులలో కొందరు ఆయన ఆలోచనలకు భిన్నంగా నడుస్తున్నారు. మన పోరాటం అంబేడ్కర్‌పై కారాదు. మన పోరాటం ఆయన ఆలోచనలకు పక్కదారి పట్టిస్తున్న వారికి మాత్రమే పరిమితం కావాలి.
కల్పిత నాయకుడు కాదు
అనుయాయులు సైతం(వ్యతిరేకులు సరే) అర్థం చేసుకోలేకపోయిన ఉన్నత నాయకుడు డా.అంబేడ్కర్. రక్తపాతం లేకుండా సామాజిక సమతను రాజ్యాంగ బధ్ధం చేసిన రాజ్యాంగరూపకర్త. ఆర్థిక సమత కోసం రష్యా, చైనాలలో; రాజకీయ సమత కోసం ఫ్రాన్స్ లో(ఫ్రెంచి విప్లవంలో) సామాజిక సమత కోసం (వర్ణవివక్షకు వ్యతిరేకంగా) అమెరికాలో పెద్ద ఎత్తున రక్తపాతాలే చోటు చేసుకున్నాయి. మనదేశంలో డా.అంబేడ్కర్ నేతృత్వంలో అస్పృశ్యతా నిర్మూలన, సామాజిక సమత కోసం జరిగిన ఉద్యమాల్లో ఎక్కడా రక్తపాతం జరగలేదు. అందరి సహకారంతో సామాజిక, రాజకీయ సమత రాజ్యాంగబధ్ధం అయ్యింది. రక్తపాత ఉద్యమాలను ఆయన ఎప్పుడూ సమర్థించలేదు. అస్పృశ్యత బాధ అర్థమైనవారికే అస్పృశ్యతా నిర్మూలన ఉద్యమాల అవసరం అవగతమవుతుంది. అంబేడ్కర్ బ్రాహ్మణ వ్యతిరేకి కాదు. ఆయన బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకి. మహద్ చెరువు పోరాటంలో వారి వెంట కొందరు బ్రాహ్మణులు ఉన్నారు. వారిని తొలగిస్తే పోరాటానికి మద్దతు ఇస్తామని బ్రాహ్మణేతర సంఘాలు తెలిపాయి. అయినా దానికి ఆయన అంగీకరించలేదు. 1954లో ఔరంగాబాద్‌లో సిద్ధార్థ కళాశాలను ప్రారంభించారు. దానికి ప్రిన్సిపాల్‌గా ఒక బ్రాహ్మణుడిని నియమించారు. దానికి వివరణ ఇస్తూ నా ఎస్సీ పిల్లలకు చదువు కావాలి. ఆ జ్ఞానం ఆ ప్రిన్సిపాల్ వద్ద ఉంది. వారు నా పిల్లలకు జ్ఞానం అందించడం కోసం తయారుగా ఉన్నారు. ఇంక మీకెందుకు అభ్యంతరం? అని నియామకం పట్ల అభ్యంతరం తెలిపినవారిని ఎదురు ప్రశ్నించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఎందరో ఉన్నారు, (బి.ఎన్. రావు, అంబేడ్కర్, ఉప సంఘాల సభ్యులు, అధ్యక్షులు డా.బాబూరాజేంద్రప్రసాద్. రాజ్యాంగసభ్యుల అందరి సర్వసమ్మతితోనే రాజ్యాంగం తయారు అయింది) భారత రాజ్యాంగం మన అందరికీ వందనీయమైనదే! రాజ్యాంగం నా వల్లే తయారైందని ఆయన ఎప్పుడూ చెప్పకోలేదు. రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్నవారంతా పరస్పరం గౌరవించుకున్నారు. ప్రశంసించుకున్నారు. ఆనాడు వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మనమే వారిని విడివిడిగా చూస్తున్నాం. కొందరి వెంటబడి వాద, వివాదాలు చేసుకుంటున్నాం. తెలుగు గడ్డపై జరిగిన వాద,వివాదాలు ఇక చాలు. మహనీయులందరూ మనవారే.
కాంగ్రెస్‌తో కష్టం
డా.అంబేడ్కర్ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే కాలం నుండి 1956 వరకు (రాజ్యాంగ రచన చేసే కాలం మినహా) అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ, అంబేడ్కర్ అభిప్రాయాలు పూర్తిగా భిన్నమైనవి. కాంగ్రెస్ నిమ్న కులాలకు ఏమి చేసింది? అనే పుస్తకాన్ని ఆయన రాసారు. అయితే ఆనాటి కాంగ్రెస్ పెద్దల చొరవ వల్లే ఆయన రాజ్యాంగ సభ సభ్యులు,డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ అయ్యారు. నెహ్రూతో విభేదించి న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశారు. భండారా లోకసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించింది.
కమ్యూనిస్టులతో విభేదాలు
నిమ్న వర్గాలు,పేదల కోసం పనిచేసినప్పటికీ మార్క్స్ ఆలోచనా ధోరణితో అంబేడ్కర్ పూర్తిగా విభేదించారు.1925-56 వరకు, అంబేడ్కర్‌పైన, భారత రాజ్యాంగంపైన కమ్యూనిస్టు నాయకులు పార్లమెంటు లోపల,బైటా తీవ్ర విమర్శలు చేశారు. 1980 తర్వాత అంబేడ్కర్‌ను కమ్యూనిస్టులు నెత్తిమీద పెట్టుకున్నారు. ఆయన ఆలోచనలకు తమ ఆలోచనలను జోడించి, అంబేడ్కర్ ఆలోచనలలో గందరగోళం సృష్టించారు. ఉదా: మూలవాసుల సిద్ధాంతం,ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలపై ఉభయుల అభిప్రాయాలు భిన్నధ్రువాలు. సత్యమూర్తి వంటివారు అంబేడ్కరిజం, మార్క్సిజంలను జోడించి నూతన ఆలోచనా ధోరణికి కృషి చేశారు. అక్టోబర్, 1956లో బౌద్ధ ధర్మ జాతీయ మహాసభ ఖాట్మండూలో జరిగింది. ఈ సందర్భంగా బౌద్ధిజమా? మార్క్సిజమా? పేరిట డా. అంబేడ్కర్ చేసిన ప్రసంగం మార్క్సిస్టు ఆలోచనలతో ఆయన ఎంతగా విభేదించిందీ విశదీకరిస్తుంది. ఆయన మనుస్మృతిని దహనం చేశారు, హిందూ వ్యతిరేకి, ఆయన వల్లే రిజర్వేషన్లు వచ్చాయి వంటి వివిధ కారణాలతో మనస్సులో అంబేడ్కర్‌ను వ్యతిరేకించే కొందరు అగ్రకులాలలో ఉన్నారు. అయినప్పటికీ సామాజిక స్పృహతో ఉన్న అనేకమంది అగ్రకులాలవారు అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నారు (వీరి సంఖ్య తక్కువేమీ కాదు).
ఆరఎసఎస్‌తో అనుబంధం
1925లో ఆరఎసఎస్ ప్రారంభమైంది. 1939లో, పూనాలో ఆరఎసఎస్ కార్యకర్తల శిబిరానికి రావాల్సిందిగా డా.అంబేడ్కర్‌ను ఆరఎసఎస్ ప్రముఖులు ఆహ్వానించారు. మే 12, 1939న తన సహచరుడు బాలాసాహెబ్ సాలుంకేతో కలసి పూనాలోని ఆరఎసఎస్ కార్యకర్తల శిబిరానికి అంబేడ్కర్ వచ్చారు.అక్కడే ఆరఎసఎస్ సంస్థాపకులు డా.హెడ్గెవార్‌తో ఆయనకు పరిచయమైంది. శిబిరాన్ని ఉద్దేశించి అంబేడ్కర్ ప్రసంగించారు. ఆనాటి వివరాలను తన ఆత్మకథలో బాలాసాహెబ్ సాలుంకే(2వ లోకసభ సభ్యులు) వివరంగా రాసారు. నవంబర్ 7, 1949న ఢిల్లీలో అంబేడ్కర్‌ను ఆరఎసఎస్ రెండవ సర్ సంఘచాలక్ మాధవ సదాశివ గోల్వాల్కర్( గురూజీ) కలిశారు.1954లో భండారా లోకసభ ఉప ఎన్నికల్లో అంబేడ్కర్ అభ్యర్థి త్వానికి మద్దతుగా, జనసంఘ్ ఎన్నికల ఏజెంట్‌గా దత్తోపంత్ ఠేంగ్డే పనిచేశారు. 1950`1956 మధ్యకాలంలో దత్తోపంత్ ఠేంగ్డే, అంబేడ్కర్ ఉభయులు పలుమార్లు సమావేశ మయ్యారు. ఏప్రిల్ 14,1983న అంబేడ్కర్ జయంతిని పురస్క రించుకొని పూనాలో సామాజిక సమరసతా మంచ్‌ను (సామాజిక సమత, అస్పృశ్యతా నిర్మూలనల కోసం) దత్తోపంత్ ఠేంగ్డే ప్రారంభించారు. డా.అంబేడ్కర్‌కు, ఆరఎసఎస్‌కు అనుసంధానకర్తగా దత్తోపంత్ ఠేంగ్డే పనిచేశారు.
అంబేడ్కర్‌కు అనుకూల పవనాలు
విద్యావంతులుగా అనేక ఉన్నత స్థానాల్లోకి ఎస్సీలు వచ్చారు. 1980 తరువాత గ్రామ, గ్రామాన, వివిధ బస్తీల్లో అంబేడ్కర్ విగ్రహాలు వెలిశాయి.ఆయన జయంతి కార్యక్రమాలను వివిధ సంస్థల వారు,వివిధ రాజకీయ పార్టీల వారు చేయసాగారు. చట్టసభల్లో ఎస్సీ,ఎస్టీల స్వరానికి ప్రాధాన్యం పెరిగింది. కొందరు అంబేడ్కర్‌వాదుల దూకుడు (అసత్య ప్రచారం) ఆయన వ్యక్తిత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నది. అంబేడ్కర్ అంటే ఇష్టం లేనివారు ఆయన సాహిత్యాన్ని చదవకపోవచ్చు. వారే కనుక చదివి ఉంటఏ అంబేడ్కర్‌ను గౌరవించేవారు. కడకు మేము అంబేడ్కర్ అనుయాయులం అని చెప్పుకునే వారే ఆయన సాహిత్యాన్ని సరిగ్గా చదవకపోతే ఎలా? ఆయన హృదయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా?
1935లో భార్య రమాదేవిని అంబేడ్కర్ కోల్పోయారు. జీవితాంతం ఎలాంటి మచ్చ లేకుండా, ఆదర్శంగా జీవించారు.1937లో డా.శారద (సవిత)తో ఆయనకు స్నేహం కుదిరింది. ఉభయుల మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు నడిచాయి. 1948లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటికే అంబేడ్కర్ ఆరోగ్యం దెబ్బ తినింది. ఆమె అందించిన సేవల వల్లే నేను 10 ఏళ్లు అదనంగా జీవించానని అంబేడ్కర్ స్వయంగా రాసుకున్నారు. డిసెంబరు 5, 1956న చివరి రాత్రి Budhha & His Dhamma పుస్తకం ముందుమాటలో ఈ వాక్యాలను రాసారు. ఈ వాక్యాలను కొందరు అంబేడ్కర్ మేధావులు పుస్తక ప్రచురణలో తొలగించారు. ఆ వాక్యాలను తీసివేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారు? మరి కొందరు అంబేడ్కర్ భక్తులు సవితే అంబేడ్కర్ ను చంపించారని దుష్ప్రచారం చేశారు. ఇది తప్పుడు ఆరోపణ అని అంబేడ్కర్ మరణానంతర వైద్య రిపోర్టులో తేలింది కదా! అంబేడ్కర్ మరణానంతరం రాజ్యసభ సీటు ఇస్తామన్నా సవిత తీసుకోలేదు. డా.అంబేడ్కర్ కులాంతర వివాహాలను ఆకాంక్షించారు. ఆయన అదే పని చేశారు. సవితమ్మను కొందరు అంబేడ్కర్‌వాదులు జీవితాంతం వేధించారు. ఆమె ఆంధ్రా యÖనివర్సిటీకి వస్తే కొందరు అంబేడ్కర్‌వాదులు నిరసన ప్రదర్శన చేశారు. అంబేడ్కర్‌లో బ్రాహ్మణ వ్యతిరేకత లేదు. కానీ కొందరు అంబేడ్కర్ అనుయాయులలో బ్రాహ్మణ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. డా.అంబేడ్కర్ మనస్సులో ఉన్న కోరిక మేరకు అంబేడ్కర్ బౌధ్ధ ధర్మం తీసుకోవడంలో సవిత సహకరించడంతో పాటు, ఆమె కూడా బౌధ్ధం స్వీకరించారు కదా! సవిత మాత్రమే కాదు ఆమె సోదరులూ కులాంతర వివాహాలు చేసుకున్నారు(మరిన్ని వివరాలకు సవితా అంబేడ్కర్ ఆత్మ కథను చదవగలరు).
అధికారభాషగా సంస్కృతం
సెప్టెంబరు 10, 1949న రాజ్యాంగ రూపకల్పన సమయంలో హరిజన సేవక సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని డా.అంబేడ్కర్ ఏర్పాటు చేశారు. అధికార భాషగా సంస్కృత భాషను ప్రతిపాదించారు. మొదటి 15 సంవత్సరాలు అధికార భాషగా ఆంగ్లం ఉండాలని, ఆనంతరం దాని స్థానంలో సంస్కృతం ఉండాలని, అధికార భాషకు అవసరమైన అన్ని అర్హతలూ సంస్కృతానికి ఉన్నాయని వివరించారు ఆ సమావేశంలో బీపీ¾ మౌర్య వంటి అంబేడ్కర్ అనుయాయులే ఆయన చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించారు. అందరి అభిప్రాయాలను గౌరవించిన అంబేడ్కర్ తన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. అయితే సంస్కృతం ప్రాచీనమైన భాష, మంచి వ్యాకరణంతో కూడుకున్నది, అత్యంత శాస్త్రీయమైనది,అంబేడ్కర్‌కు ఉన్న అవగాహన మాకు లేకపోవడం వల్ల ఆనాడు తప్పు చేశామని తర్వాతి కాలంలో సంస్కృతభారతి జాతీయ సంఘటనా కార్యదర్శి కృష్ణశాస్త్రితో బీపీ మౌర్య అన్నారు. దేశ జాతీయ భాషగా ఉండాల్సిన అర్హత సంస్కృతానికి ఉందని పత్రికా ప్రకటన(ది టైమ్స్ ఆఫ్ ఇండియా) చేశారు. దళితుడైన కారణంగా చిన్ననాట సంస్కృతం నేర్చుకునే అవకాశం అంబేడ్కర్‌కు లభించలేదు. అయినప్పటికీ సంస్కృత భాష అభ్యున్నతికి ఆయన కృషి చేశారు. ఆయన అనుయాయులుగా చెప్పుకుంటున్నవారికి ఇప్పటికీ ఆపాటి అవగాహన లేకపోవడం విచారకరం.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛగా ఉండాలా, వద్దా?
క్రైస్తవ మతం స్వీకరించిన కొందరు ఎస్సీలు తమకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతున్నారు. వారి కోరికకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించరాదని, రాజ్యాంగ నిర్ణయాన్ని కొనసాగించా లని డిమాండ్ చేస్తూ ఐదు సంవత్సరాల క్రితం ఎస్సీ అయిన కర్నే శ్రీశైలం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయనపై ఎస్సీ సమాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేయడం ఎంతవరకు సబబు? ఇలాంటి దూకుడు చర్యల వల్ల ఎస్సీల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది.
పుస్తక ప్రచురణపై వివాదం
‘రిడిల్స్ ఆఫ్ హిందూయిజమ’ పేరిట అంబేడ్కర్ రాసిన పుస్తకంలోని అంశాలతో మేము ఏకీభవించటం లేదు. అయినప్పటికీ పుస్తకాన్ని ప్రచురించాలి అని సమరసతా మంచ్ ప్రకటించింది. 1978 తరువాత అంబేడ్కర్ సమగ్ర సాహిత్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించసాగింది. ఆ సందర్భంగా ముద్రితంకాని కొన్ని రాత ప్రతులు దొరికాయి. వాటిలో పైన ప్రస్తావించిన పుస్తకం కూడా ఉంది. తన మనస్సుకు నచ్చినప్పుడు కొన్ని అంశాలపై అంబేడ్కర్ రచనలు చేసేవారు. కొన్నింటిని ముద్రణకు పంపేవారు. కొన్నింటిని పంపేవారు కాదు. అయితే 1985లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ప్రచురించదలచింది, ఆ పుస్తకంలో రాముడు, కృష్ణుడిపై విమర్శలు ఉన్న కారణంగా శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. పుస్తక ప్రచురణపై వివాదం ఏర్పడింది. పుస్తకంలోని అంశాలను సమరసతా మంచ్ ప్రముఖులు చదివారు. అందులోని అంశాలతో మేము ఏకీభవించనప్పటికీ పుస్తక ప్రచురణ పట్ల మాకెలాంటి అభ్యంతరం లేదు. డా.అంబేడ్కర్ భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తాం అని వారు పేర్కొన్నారు. పుస్తకం ప్రచురితమైంది. అనంతరం ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు. ఇలాంటి విషయాల్లో ఆరఎసఎస్ సంయమనం పాటిస్తుంది అని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
అంబేడ్కర్ మనవారే
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయ నాయకుడు, విద్యావంతుడు,జ్ఞాని,బహు రంగాల్లో పండితుడు,కేవలం ఎస్సీ వర్గాల ప్రజలకే కాక మన అందరికీ వందనీయుడు. ఆయన జీవనం,ఆలోచనల పట్ల కొందరికి భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. తెలంగాణలో కొత్తగా విడుదల కానున్న పుస్తకాన్ని నిషేధించాలా? వద్దా? అన్నది ఉన్నత న్యాయస్థానా లకు వదిలివేయటం మంచిది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో, వివిధ ఉద్యమాల విషయంలో వివిధ మహాపురుషుల, సంస్థల అభిప్రాయాలు (expressions,strategies) భిన్నంగా ఉండవచ్చు. అంతమాత్రాన దేశద్రోహులుగా పరిగణించతగదు. అంబేడ్కర్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. అంతమాత్రాన ఆయనపై ఆంగ్లేయ పాలనకు అనుకూలుడుగా ముద్రవేయతగదు. బాబూ జగ్జీవన్‌రామ్ వంటి అనేక మంది ఎస్సీ నాయకులు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వారు ఎస్సీ నాయకులు కారా? 1942లో ద్వితీయ ప్రపంచ సంగ్రామం ప్రారంభం అయింది. కాంగ్రెస్ క్విట్ ఇండియా నినాదం ఇచ్చింది. త్వరలో భారతదేశం స్వాతంత్య్రం పొందుతున్నది, యుద్ధంలో విజయ అనుభవాలు మనం పొందాలి, భారతీయులు పెద్ద సంఖ్యలో సైనికులుగా చేరండి, యుధ్ధంలో పాల్గొనండి అంటూ ఆశ్చర్యంగా అంబేడ్కర్, సావర్కర్ ఒకే రకంగా పిలుపు ఇచ్చారు. డా.అంబేడ్కర్ విశిష్టతను ఏస్సీయేతరులకు అర్థం అయ్యేలా ప్రయత్నించడం, వారికి నచ్చచెప్పడం మనముందు ఉన్న పెద్ద పని. అంబేడ్కర్ పట్ల అతి భక్తి భావంతో ఎస్సీలను గుప్పిట్లో దాచుకొనే ప్రయత్నాన్ని కొందరు ఎస్సీ నాయకులు మానాలి. అంబేడ్కర్ జయంతికి అన్ని కులాల వారికి నచ్చ చెప్పి పిల్చుకువస్తే, మా అంబేడ్కర్ జయంతికి మీరు (ఇతర కులాల వారు)ఎందుకు వచ్చారని ఇతరులను అవమానించిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఇది సరి కాదు. హమారా ప్రసాద్ వ్యవహారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు.
శ్యామ్ ప్రసాద్
జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత