డ్రోన్ తయారీరంగంలో అమెరికా, చైనాలు పట్టు సాధిస్తున్నాయి. రక్షణ రంగ డ్రోన్ల ఉత్పత్తి-పరిశోధన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. డ్రోన్లు మాత్రమే రక్షణ కవచమని బీజింగ్ భావిస్తోంది. గూఢ చర్యంలో, సరిహద్దు పహారాలో, సైనిక అవసరాల్లో డ్రోన్లు విశేషంగా ఉపయోగ పడతాయనే ఉద్దేశంతో పరిశ్రమలకు డ్రోన్ల ఉత్పత్తిని అనుసంధానం చేస్తున్నాయి. డ్రోన్ రంగంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ గగనతలం నుంచే నిఘా వ్యవ స్థను పర్యవేక్షిస్తున్న అమెరికా, ప్రపంచ యుద్ధ రంగాన్ని గుణాత్మకంగానే మార్చివేసింది.
సరిగ్గా అదే సమయంలో సాంకేతిక ఆయుధ పరిశోధన-రూపకల్పన-తయారీరంగంలో, అంతరిక్ష పరిశోధన, అణ్వాయుధ తయారీ రంగంలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తల ప్రాణాలకు ఎలాంటి భద్రత లేకుండా పోతోందని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా శాస్త్రవేత్తల అపహరణ, అనుమానా స్పద మరణాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరబ్ డిజిటల్ డెయిలీ ‘పీపుల్ వాంట’ సైతం నాలుగు మాసాల క్రితం ‘హౌ ది మిస్టీరియస్ డెత్స్ అండ్ డిసప్పియరెన్సెస్ ఆఫ్ ఎలీట్ సైంటిస్ట్స్ ఫ్యూయెల్డ్ ఎ స్టార్మ్ ఆఫ్ కాన్‌స్పిరసీ’ శీర్షికన లోతైన విశ్లేషణతో ఓ కథనాన్ని ప్రచురించింది. ‘నాసా’, పెంటగాన్‌లు ఉమ్మడిగా అంతరిక్ష అణురియాక్టర్లను తయారు చేస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తల మిస్సింగ్, అనుమా నాస్పద మరణాలు అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో, గతేడాది జనవరిలో డ్రోన్ల తయారీలో చైనాకి దిశానిర్దేశం చేసిన మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఝాంగ్ దాయిబింగ్ అనుమానా స్పదంగా మరణించాడు. ఆ తర్వాత వరుసగా డ్రోన్ రంగంలో, కృత్రిమ మేధతో ఆయుధ తయారీ రంగంలో పరిశోధనలు,ఆవిష్కరణలు చేస్తున్న 9మంది శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఝాంగ్ దాయిబింగ్ మరణం తర్వాత వరుస మరణాల వెనుక ఏముందని అగ్రరాజ్యం అమెరికా ఆరా తీయడం మొదలు పెట్టింది. తైవాన్‌లోని సీఐఏ గూఢచారులను పురమా యించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాల రహస్యం బహిర్గతం కాలేదు. కాగా, వీరిని చైనా ప్రభుత్వమే.. సెంట్రల్ మిలటరీ కమిషన్ సాయంతో హతమార్చిందనే అనుమానాలకు క్రమంగా బలం చేకూరుతోంది.
చైనాతో పాటు రష్యా, అమెరికా, టర్కీవంటి దేశాలు వేరు వేరు దేశాల్లో రహస్య స్థావరాల్లో యుద్ధ డ్రోన్లను, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో శతృవు రహస్యాలు కనుగొనే, దాడి చేసే ఆయుధా లను తయారుచేస్తున్నాయి. వీటి పరిశోధన, రూపకల్పన, తయారీరంగంలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు అర్ధంత రంగా ప్రాజెక్టు వదిలి వెళ్లిపోతే, వారిని మృత్యువు వెంటాడటం ఖాయమంటారు రక్షణరంగ నిపుణులు. తమ రక్షణవిభాగాల్లో పనిచేసే శాస్త్రవేత్తలు శతృ దేశాల గూఢచారులకు చిక్కితే, రహస్యాలు బయటపడి పోతాయనే భయమే.. ఈ హత్యలకు పురి కొల్పుతోందనే వాదనలూ ఉన్నాయి.
చైనాయే కాదు అమెరికా, రష్యా, టర్కీ వంటి దేశాలు సైతం శాస్త్రవేత్తల విషయంలో ఇలాంటి క్రూరమైన పద్ధతులనే ఆశ్రయిస్తున్నాయి. గడచిన మూడున్న¹ రేళ్ల కాలంలో అమెరికా రక్షణ, అంతరిక్ష, అణ్వాయుధ పరిశోధన రంగాల్లో పనిచేస్తున్న 12మంది శాస్త్రవేత్తల్లో కొంతమంది జాడ తెలియకుండా పోయింది. మరికొందరు అనుమానా స్పదంగా మరణించారు. హఠాత్తుగా అదృశ్యమైన వారు ఏమైపోయారో తెలియని స్థితి నెలకొంది. చైనా రక్షణ పరిశోధన-ఆయధ ఉత్పత్తిరంగంలో పనిచేసే 9మంది శాస్త్రవేత్తలు సైతం ఇదే తరహాలో అదృశ్యమ య్యారు. వీరంతా..అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యా లయాల్లో శిక్షణ పొందినవారే కావడం గమనార్హం.
చైనాలో శాస్త్రవేత్తల అదృశ్యం, మరణాలు 2018లోనే మొదలయ్యాయి. చెన్ షుమ్మింగ్ అనే మైక్రో ఎలక్ట్రానిక్స్ నిపుణుడు 2018, డిసెంబర్‌లో కారు ప్రమాదంలో మరణించాడు. 2023, డిసెంబర్‌లో చౌ గాంగియాన్ అనే 51ఏళ్ల కెమికల్ ఫిజిక్స్ శాస్త్రవేత్త ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అనుమానాస్పద రీతిలో మరణించాడు.
జాతీయ రక్షణ పరిశోధన విశ్వవిద్యాలయంలో పరిశోధనా బాధ్యతలు పర్యవేక్షించే 38ఏళ్ల యువ శాస్త్రవేత్త ఫెంగ్ యాంగ్ 2023, జూలైలో జింగ్ నగరంలో కారు ప్రమాదంలో మరణించాడు. ప్రమాదం కంటే శాస్త్రవేత్త వద్దకు చేరిన కీలక ఫైల్ ఒకటి తర్వాత కనిపించకుండా పోయింది. 2024, డిసెంబర్‌లో ఝాంగ్ షియోమ్ అనే శాస్త్రవేత్త సైతం కారు ప్రమాదంలో మరణించాడు. ఉపగ్రహ ప్రయోగరంగంలో ఇతడు నిష్ణాతుడని చైనా తర్వాత రోజుల్లో ప్రకటించింది. 2024లో లీ డాంగో అనే డేటా సైంటిస్ట్ సైతం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. లీ మినియూంగ్ అనే జీవరసాయన శాస్త్రవేత్త 2025లో అనుమానాస్పదంగా మరణించాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 68 ఏళ్ల ఫ్యాంగ్ దాయినింగ్ అనే హైపర్ సానిక్ మిసైల్ శాస్త్రవేత్త దక్షిణాఫ్రికాలో అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. 56ఏళ్ల యాన్ హాంగ్ అనే హైపర్ సానిక్ మిసైల్ శాస్త్రవేత్త అమెరికాలోని ఒహాయోలో ఓ విశ్వవిద్యాలయంలో అనారోగ్య కారణాలతో మరణించాడు. హాంగ్ మరణంపై అమెరికా రక్షణశాఖ అనుమానాలు వ్యక్తం చేసింది.
2025, జనవరిలో మరణించిన ఝాంగ్ మరణం చుట్టూ అనేక అనుమానాలు ముసురుకున్నాయి. చైనాలో సెంట్రల్ మిలట్రీ కమిషన్ కనుసన్నల్లో పనిచేసిన ఝాంగ్ మరణం అనేక అనుమానాలను మిగిల్చింది.రాజీనామా చేసిన తర్వాత ఝాంగ్ స్వంతగా డ్రోన్ల తయారీకోసం ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. సొంత కంపెనీ స్థాపించిన కొన్నాళ్లకే మరణించడంతో ఝాంగ్ మరణం చుట్టు నీలినీడలు కమ్ముకున్నాయి. ఝాంగ్ మాత్రమే కాదు ఇటీవలి కాలంలో టెక్ దిగ్గజాలుగా పేరొందిన చాలామంది అనుమానాస్పదంగా మరణించారు. వీరి మరణాల చుట్టూ అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా ప్రభుత్వ ప్రమాదకర ధోరణి కారణంగా అనుమానాలు మరింతగా వ్యాప్తి చెందుతున్నాయి.
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన టెకీలు ఏదో ఒక స్థాయిలో చైనా ప్రభుత్వంతో, రక్షణ రంగ పరిశోధనల్లో భాగం పంచుకున్నవారే! రక్షణ రంగ ఆధునీకరణ కోసం చైనా ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు చేపట్టింది. టెక్నాలజీ రంగంలో సిద్ధహస్తులైన కొత్త తరం యువకులను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది. చైనా రక్షణ శాఖ సహా పీఎలఏ ముఖ్యులు, సెంట్రల్ మిలట్రీ కమిషన్ కూడా ఈ ‘ఆధునీకరణ’ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి.
అయితే వివిధ కీలక ప్రాజెక్టుల్లో భాగమైన కొంతమంది టెకీలు అంతరంగా నిష్క్రమించారు. అలా అర్ధంతరంగా ప్రాజెక్టల నుంచి వెళ్లిపోయిన వారిలో అనేకులు అనుమానాస్పదంగా మరణించారు. యుద్ధ అవసరాల కోసం రష్యా అత్యంత రహస్యంగా చైనాలో వార్‌డ్రోన్లను తయారు చేస్తోంది. బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియదు. రాయిటర్స్ వార్తా సంస్థ గతేడాది సెప్టెబర్‌లో ఈమేరకు కథనాన్ని కూడా ప్రచురించింది.
డ్రోన్ల పరిశోధన-ఉత్పత్తి ప్రాజెక్టుల తాలూకు రహస్యాలు అందులో పాల్గొన్న టెకీలకు మాత్రమే తెలుసు. సాధారణంగా చైనా ప్రభుత్వ వ్యవహారాలు ఆయా శాఖల అధికారులకు, అవసరమైన మేరకు తెలిసేలా ఉంటాయి. అధికారిక స్థాయిలో ఏర్పాటే అలా ఉంటుంది. బయటివారిని ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించిన దాఖలా లేదు. ఇప్పుడు డ్రోన్ ప్రాజెక్టుల్లో కొత్త తరం టెకీలను రిక్రూట్ చేసుకోవడంతో బీజింగ్ ప్రభుత్వానికి అభద్రత ఏర్పడింది. అందువల్లే టెకీలను మట్టుబెట్టిందనే వదంతులు కూడా ప్రచారంలో ఉన్నాయి.
ఝాంగ్ దాయిబింగ్ మాత్రమే కాదు, మరో నలుగురు టెకీలు ఇదే తరహాలో అనుమా నాస్పదరీతిలో మరణించారు. మరణం తాలూకు వార్తల్లో కూడా క్లుప్తత ఉంది. మీడియా సంస్థలన్నీ కేవలం రెండు వాక్యాలతో వార్తలను ప్రచురించాయి. వారు జీవించి ఉండగా ఆకాశానికెత్తుతూ, కీర్తిస్తూ కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలు వారి మరణం విషయంలో ఏ ఒక్క వివరాన్నీ బహిర్గతం చేయలేదు.
ఎన్‌యుడీటి ప్రభుత్వ రంగ రక్షణ పరిశోధన సంస్థ. దీని ఆధ్వర్యంలో ఓ డ్రోన్ల తయారీ పరిశోధన సంస్థను పీఎలఏలో కీలకంగా ఉండే సెంట్రల్ మిలటరీ కమిషన్ నిర్వహిస్తోంది. మానవరహిత డ్రోన్ల ప్రాజెక్టులో ఝాంగ్ దాయిబింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనేక శాస్త్రవేత్తలను వారికి విషయ తీవ్రత అర్థం కాని వయసులోనే రహస్య ప్రాజెక్టుల్లో భాగంచేసింది. అక్కడి నుంచి నిష్క్రమించడం అసాధ్యమనే భావన కలిగినప్పటికీ…కెరీర్‌ను నిర్మించుకోవాలనే సంకల్పంతో ఒక్కొక్కరూ డ్రోన్ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారు అర్ధంతరంగా తనువు చాలించారు.
ఎఐ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ సంస్థ సెన్స్‌టైమ్ ట్యాంగ్ జియావో సైతం ఇదే తరహాలో గత డిసెంబర్‌లో మృతి చెందాడు. అనారోగ్యంతో మృతిచెందినట్టు సంస్థ ప్రకటించింది. జియావో ప్రభుత్వరంగ సంస్థలకు, మరీ ముఖ్యంగా రక్షణ రంగానికి కృత్రిమ సాఫ్ట్‌వేర్ సహకారాన్ని అందిస్తున్నాడు.
పాలిమర్ మెటీరియల్ నిపుణుడు ఝౌ యాంగ్యాన్ సైతం ఇదే తరహాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. పాలిఫెనలిన్ సల్ఫైడ్‌ను మిలటరీ పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. సైనిక ఆధునీకరణ ప్రక్రియలో యాంగ్యాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో యాంగ్యాన్ సరికొత్త ఆవిష్కరణలు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో డిఫెన్స్ కాంప్లెక్స్ నుంచి వస్తూ కారు ప్రమాదంలో మరణించాడు. అన్ని మరణాల్లోనూ పోలిక, కారణాలు తెలియకపోవడం, అనుమానాస్పదంగా మరణించడం. కుటుంబసభ్యులు కూడా నోరు మెదపక పోవడంతో అనుమానాలు ముసురు కున్నాయి. కమ్యూనిస్టు పాలిత దేశాల్లో మరణం కూడా రహస్యమే!
మనోహర్ పారికర్ రక్షణరంగ పరిశోధనసంస్థ గత నవంబర్‌లో ‘చైనాస్ ఇంక్రీసింగ్ గ్లోబల్ డ్రోన్ ఫుట్‌ప్రింట’ ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. ఆసియా దేశాల్లో, డ్రోన్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలనేది చైనా లక్ష్యం. డ్రోన్ల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున టెకీలను రిక్రూట్ చేసుకుంటోంది.
అమెరికాలో అనుమానాస్పద రీతిలో మరణించిన, అదృశ్యమైన వారంతా అణ్వాయుధాల తయీరీకి సంబంధించిన ఏదో ఒక విభాగంలో ఉన్నవారే కావడంతో అగ్రరాజ్యానికి అనుమానాలు తీవ్రమయ్యాయి. శాస్త్రవేత్తలు డబ్బుకు ఆశపడి.. శత్రువు అధీనంలోకి వెళ్లిన క్రమంలో హత్యకు గురయ్యారని పెంటగాన్ ఒక దశలో అనుమా నించింది. 2026, ఏప్రిల్ 20న డేవిడ్ విల్ కాక్ అనే పరిశోధకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇదే ఏడాది రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ జనరల్ విలియమ్ మ్యాక్ ల్యాండ్ సైతం ఫోన్‌ను ఇంట్లోనే వదిలి అదృశ్య మయ్యాడు. కార్ల్ గ్రిల్ మెయిర్ అనే 67ఏళ్ల ఖగోళ శాస్త్రవేత్త, 48ఏళ్ల అణు శాస్త్రవేత్త స్టీవెన్ గార్షియాలు మిస్సింగ్ జాబితాలో ఉన్నారు. ఆరు పదుల వయసున్న మోనికా జాసింటన్ రెజా అనే ఎయిరో స్పేస్ ఇంజనీర్ మాయమయ్యాడు.
గతంలో ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా, చైనాలో జరుగుతున్న ఈ ఘటనల వెనుక కూడా అలాంటి శత్రుదేశాల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఎఫ్బీఐ, సీఐఏ వంటి అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దింపింది. అమెరికాను డేటా లీకేజీ భయం వెంటాడుతోంది. శాస్త్రవేత్తలతో పాటు వారి వద్ద ఉన్న అత్యంత రహస్యమైన డిజిటల్ డేటా కూడా శత్రు దేశాల చేతికి చిక్కిందా అన్నది ప్రధాన ఆందోళన. ట్రంప్ ప్రభుత్వం ఈ కేసును కేవలం మిస్సింగ్ కేసుగా కాకుండా, జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించి దర్యాప్తు చేస్తోంది. అమెరికాలోని వ్యూహాత్మక రంగాల్లో పనిచేస్తున్న శాస్త్ర వేత్తలను లోబర్చుకోవడం లేదా వారిని తమ దేశానికి తీసుకెళ్లడం ద్వారా అగ్రరాజ్యాన్ని బలహీన పర చేందుకు ఇలాంటి ఎత్తుగడలను వాడినట్టు చరిత్రలో అనేక దాఖలాలు ఉన్నాయి.

ప్రశాంత్ జోషి
సీనియర్ జర్నలిస్ట్