భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
“అమ్మా ఆఫీస్ టైమవుతోంది. లంచ్ బాక్స్‌సర్దావా….?”
“ ……….”
“అమ్మా నిన్నే”
రవి గట్టిగా అరవడంతో కమల ఉలిక్కిపడింది. “ఏవిట్రా రవీ అంత గట్టిగా అరిచావు? రెడీ చేస్తున్నాను కదా..” అంది కొంచెం పరధ్యానంగానే.
“అదిగో చూడు.. ఏదో ఆలోచిస్తున్నావు. ఏమాలోచిస్తున్నావని..?” తిరిగి ప్రశ్నించాడు రవి.
“ఏమీ లేదురా ..వంట ధ్యాసే..ఇదుగో నీ బాక్స్ తీసుకువెళ్లు” అంటున్న తల్లి చేతినుండి బాక్స్ అందుకొని..“సరే వెళ్లొస్తా .. తలుపేసుకో” మంటూ ఆఫీసుకెళ్లిపోయాడు రవి.
ఆయనకు కూడా టిఫిన్, టేబుల్‌పై పెట్టి, అప్పుడు పూజ దగ్గర కూర్చుంటాను.. అనుకుంటూ వీధి తలుపు వేసొచ్చి వంటి గదిలోకి వెళ్లింది కమల.
అయిదు నిమిషాల్లో భర్త శాంతారాం..టిఫిన్ పెట్టమంటూ కమలను పిలిచి ఆరోజు పేపరు చదవసాగాడు. భర్తకు టిఫిన్ ఇచ్చేసి, పూజ గదిలో కూర్చుంది కమల.ప్రతి రోజూ ఇంచుమించుగా ఇదే సమయం అవుతుంటుంది.
శాంతారాం ఆఫీసుకెళ్లాక మిగిలిన పనులన్నీ చేసుకోవడం అలవాటు. కానీ…ఈరోజు పూజకు కూర్చున్న దగ్గర నుండి ఒంట్లో వణుకు మొదలైంది. దానికి కారణం, క్రితం రోజు పూజ ముగిసే సమయానికి, ఒక ఫోన్ కాల్ వచ్చింది.ఎవరా? అనుకొంటూ తీసి హలో అనగానే అవతలి గొంతు మాటలు వినగానే ఒళ్లంతా చెమటలుపోసి, గుండె వేగంగా కొట్టుకుంది. భయపడిపోయింది. పైగా ఎవరికీ చెప్పొద్దంటూ అవతలి గొంతులో చిన్న హెచ్చరిక కూడా వినిపించింది.
ఏం చెయ్యాలో.. పాలుపోక సతమతమవుతూ, రాత్రంతా నిద్ర పట్టలేదు. మళ్లీ ఉదయం నుండీ అదే ఆలోచన. కమల పరధ్యానానికి కారణం, ఆ ఫోన్ కాలే.త్వరగా పూజ ముగించి, టిఫిన్ తిందామని టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంతలో ఫోన్ మోగింది. భయపడుతూ ఫోన్ తీసింది.
నిన్నటి గొంతే.. నిన్న మాట్లాడిన మాటలే.. ఏమీ బదులివ్వకుండా ఫోన్ పెట్టేసింది. గుండె దడగా కొట్టేసుకుంటోంది. ఎవరికైనా చెప్తే ఏం గొడవ జరుగుతుందోననిపిస్తోంది. ఆ రాత్రి కూడా నిద్ర పట్టలేదు. ఇలాఎన్ని రోజులో తెలియడం లేదు.
***
కమల పెద్దగా చదువుకున్న మనిషి కాదు. పల్లెటూరు కావడంతో చదువుకునే అవకాశం లేదు.పదవ తరగతి వరకూ చదివించి, మేనత్త కొడుకైన శాంతారాంతో పెళ్లి చేసేసారు. కమల చిన్నతనం నుండీ భయస్తురాలు.
ముభావంగా ఉంటుంది. ఎవరితోనూ త్వరగా కలిసే మనస్తత్వం కాదు. పెళ్లయ్యాక సిటీ జీవితానికి అలవాటు పడ్డానికి చాలా సమయమే పట్టింది. ల్యాండ్ లైన్ ఫోన్‌తో కమలకు ఇబ్బందిగా ఉందని, ఈమధ్యనే రవి సెల్‌ఫోన్ కొనిచ్చాడు.ఈఫోన్‌కి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతోంది. ఇంతలో ఈ రాంగ్ కాల్. ఇలా ఎవరు తనను ఇబ్బంది పెడుతున్నారో…దీనికి పరష్కారం ఏమిటో తెలియడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామంటే, ఇంట్లోరకరకాల అనుమానాలు వస్తాయి.
ఆలోచనలతో స్థిమితం లేదు కమలకు.
***
“కమలా?ప్రసాద్ కొడుకు వడుగు ఫంక్షన్ ఉంది కదా రేపు. రవి సెలవుపెడతానన్నాడా..?” అంటున్న భర్త మాట వినగానే ఉదయమా.. పది గంటలకా..ఆ ఫోన్ వస్తుందేమో…? గుండె టక్ మని కొట్టుకుంది.”
“కమలా..ఏమన్నాడు రవి..?” రెట్టించాడు శాంతారాం.
వెంటనే తడబడుతూ “నాకు ఒంట్లో ఎలాగో ఉంది. ఈరోజు రవిని అడుగుతాను. వస్తానంటే మీరిద్దరూ వెళ్లిరండి.”
“ఏమయింది డాక్టరుకి చూపించమంటావా…?”
“అదేం లేదు కొంచెం నీరసంగా ఉందంతే.. రావాలని లేదు..” అంది కమల.
“సరేలే.. విశ్రాంతిగా పడుకో. మేం వెళ్లొస్తాములే..” అన్నాడు శాంతారాం. “హమ్మయ్య” అనుకుంటూ గాలి పీల్చుకొంది.
అయినా… ఫంక్షన్ మానుకోవడం ఎందుకూ.. అని మనసులో అనిపించినా..
ఏవిటో వెళ్లాలనిపించడం లేదు.
‘నాకే ఇలా జరుగుతోందా.?ఇంకాఎవరికైనా ఇలా జరిగిందా?వాళ్లు ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నారో…?’ అర్థ్ధం కావడం లేదు. మనసంతా గందర Áగోళంగా ఉండడంతో టి.వి. ఆన్ చేసింది. ఏదో చర్చా కార్యక్రమం. ఆడవాళ్లంతా కూర్చుని స్త్రీల సమస్యలపై చర్చిస్తున్నారు.అయిష్టంగానే వినడం మొదలుపెట్టింది.ఈ రోజుల్లో ఆడవాళ్లకు ఎదురవుతున్న రకరకాల సమస్యలను, ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో, మహిళలు గుండె నిబ్బరంతో ఎలా మసలు కోవాలో ఆ చర్చ సారాంశం.
చివరగా అందులో ఒకావిడ అవసరమైతే తనని కలవమని ఫోన్ నంబరు ఇచ్చింది. వెంటనే ఆ నంబరు రాసుకొంది కమల. ఎన్నో అరాచకాలు, అఘాయి త్యాలు విన్న తరువాత తనకొచ్చిన సమస్య చిన్నదిగానే అనిపించినా…గుండె దడ మాత్రం తగ్గడం లేదు. ‘లాభం లేదు ఈ సమస్యను ఎవరికైనా చెప్పాల్సిందే రవికోజ..ఈయనకో చెప్దామంటే.. ఇద్దరూ ఆవేశ పరులే. అమ్మో చాలా పెద్దగొడవే అవుతుంది. వద్దులే’ అనుకుంది కమల.
***
కలత నిద్రతో బాధపడుతున్న కమల అన్య మనస్కంగానే ఉంటోంది.ఏ పనిలోనూ ఉత్సాహం లేదు. తిండి సహించటం లేదు….
ఇంటికెవరొచ్చినా ముభావంగా మాట్లాడుతోంది. ఇదిగమనించిన శాంతారాం, భార్య వద్దంటున్నా డాక్టరుకి చూపించాడు.
పరీక్షలన్నీ చేసి జనరల్ వీక్ నెస్ అని మందులు రాసిచ్చారు డాక్టర్. వేళ తప్పకుండా మందులు వాడాలని, మరీ మరీ జాగ్రత్తలు చెప్పారు.
భర్త శాంతారాం, కొడుకు రవి.. కమలకు కూడా అనిపిస్తోంది తాను మానసిక రోగినైపోతున్నా నేమోనని.
ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.
***
తెల్లవారుతోందంటే భయంగా ఉంది. ఇలాంటి సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక, ఎంత మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారో! ఆడవాళ్లను ఇబ్బంది పెట్టే, దుర్మార్గ మైన మగవాళ్లు కొంచెం కూడా ఆలోచించరా?
ఈరోజు ఏమైనా సరే టి.వి.ప్రోగ్రామ్‌లో ఫోన్ నంబరు ఇచ్చిన మంగళగౌరి గారిని కలవాలి. అనుకున్నదే ఆలస్యం. వెంటనే ఫోన్ చేసి, ఆమె అడ్రస్ కనుక్కొని, అప్పాయింట్ మెంట్ తీసుకొంది. ఆ అగంతకుడు మాట్లాడిన మాటలన్నీ చెప్పాలి. గుండెల్లోని బాధనంతా దింపుకోవాలి..అనుకుంటూ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి తాళం వేసి బయల్దేరింది.
‘నేనేనా ఒంటరిగా ఇలా వెళ్తున్నాను.ఇంట్లో ఎవరికీ చెప్పకుండా. ఇంత ధైర్యం వచ్చిందా నాకూ?’అని ఆటోలో కూర్చున్నాక అనిపించింది.
జరుగుతున్నది అంతా మంగళగౌరి గారికి చెప్పాలంటే నే ఏదోలా ఉంది నిన్న ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడాడు.అలా బెదిరిస్తున్న ఆగొంతు తల్చుకోవా లంటేనే జుగుప్సగా వుంది.
“అమ్మా దిగండి” ఆటో అతని పిలుపుతో ఆలోచనల నుండి బయట పడింది. ఎవరిని కలవాలని వెళ్లిందో ఆమెనే గుమ్మంలో ఎదురైంది. తనని తాను పరిచయంచేసుకొంది.
తనకు అర్జెంటు పని ఉందని, రావడానికి సాయంత్రం అవుతుందని, ఇంకొక రోజు కలుద్దాం ఏమీ అనుకోవద్దని మరీ మరీ చెప్పి మంగళగౌరి కారులో వెళ్లిపోయింది. దిగిన ఆటోలోనే ఎక్కి తిరిగి ఇంటి కొచ్చేసింది.
***
ఇలావుండగా ఓరోజు కమల ఫ్రెండ్ భవాని ఫోన్ చేసింది. మాటల మధ్యలో ఈ మధ్య జరిగిన సంఘటన చెప్పింది భవాని. తన కూతుర్ని చాలా రోజులుగా ఎవడో ఓ పోకిరీ ఏడిపిస్తున్నాడట.మెల్లగా వాడిని ఇంటి వరకూ పిలిపించి, కాలనీలో ఆడవాళ్లందరూ కలిసి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారట.వింటున్న కమలకు భయమేసి పోయింది.
ఇదే సరైనదని భవానీ అంటూంటే …ఈ రోజుల్లో నలుగురికీ తెలిసిపోతుందే మోనని కూర్చుంటే ఎలా..?
స్త్రీలకు రక్షణ ఏదీ…ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకుంటే కుదరదు. ఎవరికి వారు పరిష్కరించుకోవాల్సిందే అనిపించింది.ఈ సంఘటన కూడా కమల మానసిక స్థితిపై కొంత ఒత్తిడి పెంచింది.
కమలలో కనిపిస్తున్న మార్పును గమనించిన శాంతారాం ఓరోజు రవికి ఫోన్ చేసాడు.
“చెప్పండి నాన్నా” అంటున్న రవితో.. “ఈ మధ్య మీ అమ్మ చాలా పరధ్యానంగా, నిరుత్సాహంగా ఉంటోందిరా! అసలే ముభావి..ఆ కొంచెం మాటలు కూడా తగ్గించేసింది. ఏదో ఆలోచనల్లో ఉంటోంది. ఎన్నడూ లేనిది. రోజూ పేపరు చదవడం, పురాణాల్లో స్త్రీల ధైర్య సాహసాలపై ప్రవచనాలు వినడం..ఆ కళ్లల్లో భయం చూస్తోంటే నా కెందుకో దిగులుగా ఉంది రవీ…!”
“మీరేమీ ఎక్కువగా ఆలోచించి కంగారుపడకండి నాన్నా.. అమ్మ పరధ్యానం, నేనూ గమనించాను. అమ్మతో నేను మాట్లాడతాను.ఆఫీసులో కొంచెం బిజీగా వున్నాను.”
“సరేలే రవీ చూద్దాం..” అంటూ ఫోన్ పెట్టేసాడు.
పాపంఅమాయకురాలు కమల. దేని గురించో నలుగుతోంది. ఆమె మనసులో ఏముందో ఎంత త్వరగా తెలిస్తే అంత బావుంటుంది అనుకున్నాడు శాంతారాం.
***
కష్టాలు, కన్నీళ్లతో పని లేని కాలం కదిలి పోతూనేవుంది. గత కొన్ని రోజులుగా కమల పరిస్థితి ఆందోళనతో నిండి ఉంది.తన ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని, రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది.
ఏ రోజుకారోజే పరిష్కారం కోసం ఎదురు చూస్తోంది.
‘ఎవ్వరికీ చెప్పొద్దని హెచ్చరిస్తున్న ఆ గొంతు ఎవరిది? తెలిసిన వాడా..?
ఇంటి చుట్టుపక్కలే వుంటాడా? ఒకవేళ చెపితే ..ఎవరికైనా హాని తలబెడతాడా ?ఇంట్లో ఉన్న ఆడవాళ్లనే ఇలా మానసికంగా హింసిస్తుంటే బయటకు వెళ్లే ఆడవారు ఇంకా ఎన్ని సమస్య లెదుర్కొంటున్నారో….’ ఎడతెగని ఆలోచనలు..
ఇంతలో ఫోన్ మోగింది. ఫోన్ సౌండ్ వినగానే దడ మొదలవుతోంది. నిభాయించుకొని ఫోన్ చూసింది. తáన చెల్లెలు రాధ. చాలా రోజులైంది చెల్లెలు మాట్లాడి. క్షేమ సమాచారాలయ్యాక, ‘ఎలా ఉన్నావు? ఎందుకో ఈ మధ్య నిన్ను చూడాలనిపి స్తోందక్కయ్యా” అన్నది రాధ.
అంతే, ఆ మాట వినగానే కమల గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఒక్క సారిగా సాగరంలా కట్టలు తెంచుకుని పొంగింది. దుఃఖం ఆగలేదు. భోరుమని విలపించింది.
కంగారుపడింది రాధ. ‘ఏమైందక్కయ్యా నీ ఒంట్లో బావుందా..? అందరూఎలా వున్నారు”? ప్రశ్నల వర్షం కురిపించింది.
కమలకు మాటలు రావడం లేదు. గొంతులో బాధ సుళ్లు తిరిగిపోతోంది. “అక్కయ్యా ఏమైందిచెప్పు…” రాధలో గాభరాఎక్కువైపోతోంది..
కొంచెం తేరుకొన్న కమల, “అందరం బానే ఉన్నాం..నీతో కొంచెం మాట్లా డాలి” అంది.
“చెప్పు ఎందుకు బాధపడుతున్నావ్? నాకు చాలా కంగారు వచ్చేసింది.అసలేం జరిగింది?”
“కొన్ని రోజులుగా ఎవడో నాకు ఫోన్ చేసి రోజుకో ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మంటున్నాడు.”
“ఎవడుs? నీకు తెలిసిన వాడా?”
“అస్సలు తెలియదు అసభ్యమైన మాటలతో బాధిస్తున్నాడు.”
“బావగారికి చెప్పావా..?”
“ఎవరికీ చెప్పొద్దని బెదిరిస్తున్నాడు..చెపితే ఎవరినేం చేస్తాడోనని, భయం పట్టుకొంది. నాలో నేనే కుమిలి పోతున్నాను.ఈ రోజు నేను ఆగలేక నీకు చెప్పేశాను.రాధా! నువ్వు మా వాళ్లెవరికీ చెప్పొద్దు…” అంది.
“సరే చెప్పనులే కానీ ఏం చేద్దామను కుంటున్నావ్….?” అడిగింది రాధó.
దానికేం జవాబివ్వాలో తెలియక మౌనంగా ఉండి పోయింది కమల. అమాయకురాలైన అక్కయ్య మనోవేదన అర్థంఅయిన రాధ పకపకా నవ్వ సాగింది.
“ఎందుకలా నవ్వుతున్నావ్?” ఆశ్చర్యంగా అడిగింది కమల.
“లేకపోతే ఏమిటిది.. ఈ రోజుల్లో ఇలాంటివి సర్వసాధారణం.భయపడుతూ కూర్చోకూడదు. గట్టిగా మాట్లాడాలి. నువ్వేకాదు చాలామంది ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యే ఇదీ నాతో సహా..” అంది రాధ తేలికగా”
‘అవునా.. నీకూ ఇలాంటి ఫోన్లు వచ్చాయా… నువ్వేం చేసావ్..?”
“వచ్చాయా ఏవిటీ?వస్తూనే ఉంటాయి. ఛెడామడా తిట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. నువ్వు కూడా గట్టిగా చెప్పు ఆ అగంతకుడికి. ఇలా ఏడిస్తే లాభంలేదు..సరేనా..!”
ఈ సమస్యను చాలా పెద్దగా ఊహించుకొని ఇన్నాళ్లూ తాను అనుభవించిన మానసిక బాధ, రాధ మాటలతో చిటికెలో తీసేసినట్టయి, మనసంతా తేలికగా అనిపించసాగింది.
“హలో..హలో..అక్కా.. ఉన్నావా ఫోన్‌లో…”
“ఆ..ఆ.. చెప్పు రాధా”
“మా అమ్మాయి అనూకి కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చిందనే శుభవార్త చెప్పాలని నీకు ఫోన్ చేసాను.”
“అవునా..!అప్పుడే అనూ ఎంత ఎదిగిపోయింది. కంగ్రాట్స్ చెప్పు.జాగ్రత్తగా ఉండమను.”
“ఈకాలం పిల్లలకు ధైర్యం ఎక్కువే అక్కయ్యా..! మనం ఏమీ చెప్పక్కర్లేదు. వాళ్లే మనకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటున్నారు. ఆ అక్కయ్యా ఒక్క నిమిషం, అనూనే ఫోన్ చేస్తోంది. ఉంటానక్కయ్యా.. నువ్వేం కంగారు పడకు” అంటూ ఫోన్ పెట్టేసింది రాధ.
రాధతో మాట్లాడాక ఎక్కడలేని ధైర్యం వచ్చినట్టయింది. తేలికగా ఊపిరి పీల్చుకొంది.
***
మరుసటిరోజు చీకట్లు వీడుతున్న తొలిపొద్దు ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. కమల మనసులో కూడా కొంత ఆందోళన తగ్గి. ఈ రోజు ఆ వ్యక్తి దగ్గర నుండి ఫోన్ వస్తే, బుధ్ధి వచ్చేటట్టు ఏ విధంగా మాట్లాడాలా అని ఆలోచనలో పడింది. యాంత్రికంగా పనులన్నీ ముగించి, పూజదగ్గర కూర్చుంది… పూజ చేస్తోంది కానీ మనసు లగ్నం కావడం లేదు. భయం భయంగానే ఉంది ఎలా? ఏమి మాట్లాడితే అవతలి వాడి నోరు మూత పడుతుంది. నిన్నటి నుండి చెల్లెలి మాటలు పదే పదే వినబడుతూనే ఉన్నాయి.
మనసులో ధైర్యాన్ని నింపుకుంటోంది. క్షణంలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.దానినిన అమలు చెయ్యాలనుకోగానే… ఫోను మోగింది. వాడే ఆ ఆగంతకుడే.. ప్రతిరోజూ చెప్పినవే చెప్పసాగాడు.
ఓపికగా విన్న తరువాత, “ఎక్కడ కలవాలి నిన్ను?” అని అడిగింది.కమల అలా అనేసరికి వాడు ఉత్సాహంతో రెచ్చిపోయి చెప్పేస్తున్నాడు.
అనడమైతే అనేసింది కానీ ఎంతో ఉద్వేగానికి లోనైంది. గొంతు తడారి పోయింది.
కమల మాట్లాడటం లేదని, “హలో..హలో” అని గట్టిగా అరుస్తున్నాడు ఆ వ్యక్తి.
చాలాప్రశాంతతను కూడగట్టుకొని ..” నువ్వెంత వెర్రి వాడవో తెలుసా …” అంది.
“ఏంది అట్లన్నవ్?” అన్నాడు.
“నువ్వెక్కడికి ఫోన్ చేస్తున్నావో తెలుసా? కలెక్టర్ ఆఫీసుకి. నువు మాట్లాడినదంతా ఇక్కడ మా ఆఫీసులో రికార్డ్ అయింది. నీ ఫోన్ నంబరు సహా..” అంటూ ఏం చెప్పాలనుకొని మనసులో ప్రణాళిక సిద్ధం చేసుకుందో గడగడా చెప్పేసి ఊరుకొంది. ఏమంటాడో విందామనుకొంది. కానీ వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ కట్ అయిపోయింది. భయపడి ఫోన్ పెట్టాశాడని అర్థమయిన కమలకు గుండెల్లో దడ తగ్గి హాయిగా నవ్వేసింది.
ఎన్ని రోజుల నుండో బాధిస్తున్న ఈ పీడ ఇంతటితో వదిలిందని మనసారా ఊపిరి పీల్చుకొంది. అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు వచ్చేసాయి. ఎంత బాధ పడ్డాను…?
ఎంత ధైర్యం పుంజుకోవాల్సి వచ్చింది?! ‘ఇలాంటి దుర్మార్గులు ఎందుకుపుడతారో’ అని తిట్టుకుంది. దీనికంతటికీ కారణం, రాధ నాకిచ్చిన ధైర్యం.సాయంత్రం భర్త శాంతారాం, కొడుకూ రవీ ఇంటికి రాగానే ఇన్నళ్లూ అనుభవించిన నరక యాతన అంతా నవ్వుతూ వివరించింది.
గ్రహణం వీడిన సూర్యబింబంలా వెలిగి పోతోంది కమల మోము. ఆమె మాటల్లో మునపటి ఉత్సాహం కనిపించింది,కమల తెలివికి వాళ్లిద్దరికీ ఆశ్చర్యం, ఆనందం కలిగింది. భయస్తురాలైన కమల సమస్యను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యస్తురాలైందని ఆమె నవ్వుతో శ్రుతి కలిపారు వాళ్లిద్దరూ…!
***
కమలకో విషయం తెలియదు.
భర్త శాంతారాం, రాధకు ఫోన్ చేసి, మీ అక్క ఏ విషయానికో భయపడు తోంది.అదేమిటో కనుక్కొని ..ధైర్యం చెప్పి, మామూలు మనిషిని చెయ్యమని చెప్పిన సంగతి…!!
– శ్రీమతి పి. భారతీకృష్ణ