భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘అయ్యయ్యో, స్టౌ అంతా నూనె మరకలు, గట్టంతా కూరముక్కలు, మెతుకులు.., పొద్దున్నే కదా శుభ్రంగా తుడిపించాను, వంటిల్లు అంతా ఇంత గందరగోళం చేస్తే నేనెట్లా వేగేది? ఇదుగో వింటున్నారా? మిమ్మల్నే…’ వంటింట్లో నుండి తారస్థాయిలో విన్పిస్తున్న సరోజ అరుపులకి ఉలిక్కిపడ్డారు ఒకేసారి సిస్టమ్‌ ‌మీద పని చేసుకుంటున్న కిరణ్‌, ‌గదిలో పడుక్కున్న జానకమ్మ, బాల్కనీలో కూర్చున్న పరంధామయ్య.

 కోడలు వచ్చేసినట్లుంది, అయ్యో! గట్టు తుడుద్దామనుకుని మర్చిపోయానే..తన మతి మరుపుకు తిట్టుకుంటూ, తడబడుతూ గబగబ ఇంట్లోకి నడిచాడు పరంధామయ్య.

‘చేసిపెట్టిన వంట ఏదో ఒకటి తినెయ్యచ్చుగా నాన్నా!మళ్లీ వండుకుంటా• రెందుకు?’ సిస్టమ్‌ ‌దగ్గర నుండి లేచి హాల్లోకి వస్తూ విసుక్కున్నాడు కిరణ్‌.

‘ఆఁ, ‌నాకు పని తక్కువైపోదూ మరీ..’వ్యంగ్యంగా అంది సరోజ.

‘అయ్యో, అదేం మాటమ్మా? నేను చపాతీలు తినలేనని నా కోసం అన్నం, కూర వండారు మీ మామగారు’ మంచం మీద నుండి నెమ్మదిగా లేచి వస్తూ అంది జానకమ్మ.

 ‘అంటే నేను చపాతీలు అంత రాళ్లలా చేసానా?’ మళ్లీ గయ్యిమంది సరోజ .!

 ‘అబ్బబ్బా.. మీ ఇద్దరి మధ్యా పడలేక పోతున్నాను బాబూ’ విసురుగా బయటకు వెళ్లిపోయాడు కిరణ్‌.

‘ఇం‌ట్లో ఉండే కోడళ్లకే వండిపెడుతున్నారు అత్తగార్లు. అలాంటిది బయట ఉద్యోగం చేసి అలసిపోయి వచ్చే నాకు చేసిపెట్టేది లేకపోగా పని కల్పిస్తున్నారు’ అంటూ మామగారి వైపు చూస్తూ రుసరుసలాడింది సరోజ.

‘తుడుద్దామనుకుని మర్చిపోయానమ్మా’ అంటూ తప్పు చేసినట్లు తలవంచుకున్న భర్తను చూసి జానకమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా నా అనారోగ్యం వల్లే కదా..అని గొణుక్కుంటూ గదిలోకి వెళ్లిపోయింది.

పరంధామయ్య పాలిపోయిన ముఖంతో మళ్లీ బాల్కనీ లోకి వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు.

* * *

జానకమ్మ మొన్నమొన్నటిదాకా ఆరోగ్యంగానే ఉండేది. ఇంటిపనంతా చక్క బెట్టేది.ఉద్యోగస్థురాలైన కోడలికి, కొడుకు, మనవళ్లు, మనవరాలికి, భర్తకి ఎవరికి కావల్సినట్టు వాళ్లకి వండిపెట్టేది. అదేమిటో ఈమధ్యనే విపరీతమైన కీళ్లనొప్పులు, ఆయాసం పట్టుకున్నాయి. పనిచేయలేకపోతోంది.

మధ్యాహ్నం ఆవిడ చపాతీ తినలేక అవస్థ పడుతుంటే పరంధామయ్య చూస్తూ ఊరుకోలేక అన్నం వండుతూ, అరటికాయలు కనిపిస్తే అవి కూడా కుక్కర్‌లో ఉడకబెట్టాడు.

పరంధామయ్య భోజనప్రియుడు. స్వతహాగా మంచి ఆరోగ్యవంతుడు,నిత్యం వ్యాయామం చేసేవాడు అవటంతో, వయస్సు 75 ఏళ్లు పైబడినా అనారోగ్యం ఆయన దరి చేరలేదు. కొన్ని నెలల క్రితందాకా భార్య చేసిన రుచికరమైన వంట తిన్నవాడూ, ఏదో కొంత పాకశాస్త్ర ప్రావీణ్యం ఉన్నవాడూ అవటంతో ఆవపెట్టి అరటికాయ కూర చేసి, చారు కాచి, భార్యకు కంచంలో వడ్డించాడు.

‘అయ్యో, మిమ్మల్ని కూడ కష్టపెడుతున్నాను చివరకి. అన్నం ఒక్కటీ వండితే ఏ పచ్చడో వేసుకుని తినేదాన్నిగా’ అంది జానకమ్మ.

‘పోన్లే జానకీ! ఇన్నాళ్లూ నువ్వు మాకు చెయ్యలేదూ? ఇప్పుడైనా నన్ను చేయనీ. నిజం చెప్ప మంటావా? నీ వంకతో నేను కూడా ఈరోజు తృప్తిగా భోజనం చేస్తున్నాననుకో. రోజూ ఈ చపాతీలు, ఆ హోటలు వంటలు తిని, తినీ జిహ్వ చచ్చిపోయింది’ అంటూ నవ్వాడు.

ఇదీ.. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన విషయం. ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేసింది సరోజ.ఆలోచనలో పడ్డాడు పరంధామయ్య. అయినా ఎప్పటికప్పుడు తానూ,జానకీ సర్దుకుపోతూనే ఉన్నాం కదా!

ఉదయం తొమ్మిదింటికి ఆఫీసుకు వెళ్లిన కోడలు మళ్లీ సాయంకాలం ఆరింటికి ఇంటి కొస్తుంది. కొడుకు వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ అం‌టూ రాత్రి పన్నెండు దాకా ఆ కంప్యూటర్‌ ‌ముందే ఉంటాడు. భోజనానికి వేళపాళా కుదరటం లేదు. సరోజ తనకు వీలైన రోజు వండుతుంది, లేదంటే బయట నుండి తెప్పిస్తుంది.

ఆ మసాలా కూరలు,బిర్యానీ, పలావ్‌, ‌రోటీలు నోటికి రుచించకపోయినా, ఫ్రిజ్‌లో దాచి మళ్లీ అవే పెడుతున్నా చేసేదేమీ లేక తింటూనే ఉన్నారు. ఇంక వీకెండ్‌ అం‌టూ పార్టీలకు, సినిమాలకు వెళ్లే హడావిడిలో తామిద్దరి కోసం ఉడికీ ఉడకని అరకొర వంట. అంతకూ సాయం చెయ్యాలని జానకి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చేతులు, కాళ్లు పట్టు లేక ఒకటి రెండుసార్లు వస్తువులు పాడయ్యాయని సరోజ ఆవిడని వంటింట్లోకి రానివ్వటం లేదు.

ఒకరోజు,దేవుడి మందిరం బోసిగా ఉంటోందని, దీపం పెడుతూ ఉండమని సరోజకి చెబుతున్న జానకమ్మని ‘ఉద్యోగం చేసేదానికి ఎలా కుదురు తుందమ్మా? అలాంటి చాదస్తాలన్నీ పెట్టుకోకు’ అంటూ కసిరాడు కిరణ్‌.

‌పిల్లలది కూడ వాళ్ల ధోరణేదో వాళ్లది. ముందు నుండీ పిల్లల్ని అత్తమామలకు చేరువ కాకుండా కట్టడి చేసింది సరోజ. పైగా ఇంటర్‌ ‌నేషనల్‌ ‌స్కూల్స్‌లో చదువులు. ఇంగ్లీషు భాష అలవాటు కావాలని ఇంట్లో కూడ పిల్లలు ఇంగ్లీషులోనే మాట్లాడాలని నియమం పెట్టింది.చిన్నతనం నుండి పిల్లలకు అదే అలవాటైంది. అసలే దూరంగా ఉండే పిల్లలు బామ్మకి ఇంగ్లీషు రాకపోవడంతో మరీ దూరమైపోయారు. తనతో ఎప్పుడైనా రెండు మాటలు మాట్లాడతారు.

‘మాతృభాష రాకపోతే ఎలా? తెలుగు నేర్పుతాను, నేర్చుకోండి’ అని ఒకసారి తాను అంటుండగా విన్న సరోజ ‘‘మామయ్యగారూ, ఇప్పుడు వాళ్లకి తెలుగు రాకపోతే కొంపలేమీ మునిగిపోవు.ఈ కాలానికి ఉపయోగపడే చదువు నేర్చుకుంటున్నారు చాలు’ అంటూ తన మాటలను కొట్టిపడేసింది.

ఆడపిల్లంటే మహాలక్ష్మితో సమానమని అంటుంది జానకి. మనవరాలికి జడ వెయ్యాలని, కాటుక, బొట్టు, పువ్వులు పెట్టి అలంకరించాలని సరదా తనకి. ఒకసారి జడ వెయ్యబోతుంటే, ఈ రోజంటే మీరున్నారు కనుక వేస్తారు, తరువాత రోజూ నేనెక్కడ వెయ్యగలను? పైగా ఈ రోజుల్లో జుట్టెవరూ పెంచుకోవటంలేదు. స్కూలుకి వెళ్లే పిల్ల. దానికెందుకు జుట్టు? అని చెవుల దాకా కత్తిరించేసింది.

‘బాచ్డ్ ‌హెయిర్‌తో బొట్టేమిటి? బాగుండదు’ అంటూ జానకి ఆశలన్నింటి మీద నీళ్లు జల్లేసింది సరోజ.

ఇదంతా ఆలోచిస్తుంటే పరంధా మయ్యకి ఇంతకీ తామెవరు ఈ ఇంటిలో? సొంత తల్లిదండ్రులా లేక పరాయివాళ్లా? లేక అతిథులా? కాలాన్ని బట్టి ఈ తరం పిల్లల పద్ధతులు, జీవన శైలి మారి ఉండవచ్చు. ఆలోచనలు, అభిప్రాయాలలో తేడా ఉండవచ్చు. అంతమాత్రాన కన్నవాళ్లు కానివాళ్లు అయిపోతారా? పని చెయ్యగలిగినంత కాలమే వాళ్లను చూస్తారా? తరువాత చేదయిపోతారా? జానకి చెయ్యలేక పోయినా..తాను చెయ్యగలిగిన పనులేవో తాను చేస్తూనే ఉన్నాడు కదా! వాళ్ల జీవితాలకు తామేమీ అడ్డం రావటం లేదే! ఏదో తమకున్న అనుభవ జ్ఞానాన్ని వాళ్లకు పంచాలని, నాలుగు మంచి మాటలు చెప్పాలని అనుకోవడం తప్పా? వాళ్లు చెప్పింది చేయటం తప్ప, అసలు తమకు మాట్లాడే హక్కే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. అనుబంధాలు పెరగటం మాట అటుంచి, ఆత్మీయమైన పలకరింపే కరవు అవుతోంది. చివరకు పరంధామయ్య ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి. ఏదో నిర్ణయానికి వచ్చినట్లు లేచాడు.

రాత్రి భోజనాల దగ్గర ‘‘కిరణ్‌, ‌నేను అమ్మను తీసుకుని ఊరికి వెళ్లిపోదామని అనుకుంటున్నానురా’’ అన్నాడు.

 ‘అదేమిటి నాన్నా! కోడలు ఏదో చిన్నమాట అంది అనీ…సరోజ ముఖం చూస్తూ మాట మధ్యలోనే ఆపేసాడు కిరణ్‌.

 ‘అదేమి లేదురా.. నాకే ధ్యాస అటువైపు మళ్లింది. అలవాటైన ఊరు కదా! అక్కడే ఉండాలన్పిస్తోంది’ అన్నాడు.

‘మరి అత్తగారికి ఎవరు చేస్తారో అక్కడ?’ కొంచెం వ్యంగ్యంగా అంది సరోజ.

 అదేమి పట్టించుకోకుండా పరంధామయ్య నవ్వుతూ,‘నేనున్నాను కదమ్మా,, అయినప్పటికి పుట్టి పెరిగిన ఊళ్లో మనుషులకు కొదవేమిటమ్మా?’ అన్నాడు. ఇంకేమి అనలేక ‘సరే మీ ఇష్టం నాన్నా’ అనేసి గదిలోకి వెళ్లిపోయాడు కిరణ్‌. ‌సరోజ కూడ వెనకాలే వెళ్లిపోయింది.

‘నువ్వు ఏమంటావు జానకీ?’ అడిగాడు పరంధామయ్య.

‘జానకివెళదామండీ.. నాకు కూడ వెళ్లాలని ఉంది’ అంది.

‘‘పోనీలేరా, మంచిపనే చేసావు. సొంత ఊళ్లో సొంత ఇంటిలో ఉన్న స్వేచ్ఛ, ఆనందం ఇంకెక్కడా ఉండవు.నాకు కూడ మళ్లీ మంచి కాలక్షేపం. రాఘవ, నారాయణ కూడ ఇక్కడికే వచ్చేసార్రా’ పరంధామయ్యను చూసి ముఖం వెలిగిపోతుండగా అన్నాడు రాజారాం.

పరంధామయ్య, రాజారాం బాల్యమిత్రులు ‘కాఫీ తీసుకోండి అన్నయ్యా! మిమ్మల్ని చూసినప్పటి నుండి ఈయన ఆనందానికి పట్టపగ్గాలు లేవు’’ అంటూ కాఫీ అందించింది రాజారాం భార్య వర్ధనమ్మ.

‘ఏమ్మా! బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు?’ కుశల ప్రశ్నలు వేసాడు పరంధామయ్య.

 ‘బాగున్నారన్నయ్యా! అమ్మాయి, అల్లుడు బెంగుళూరులో ఉంటున్నారు. అబ్బాయి, కోడలు మనవళ్లు ఇక్కడే ఉంటున్నారు. వదిన ఎలా ఉంది?’ అంది వర్ధనమ్మ

 ‘ఏమిటోనమ్మా! జానకి ఆరోగ్యమేమిటో అంత బాగుండటం లేదు’ అన్నాడు పరంధామయ్య.

‘నువ్వేం దిగులు పడకురా!మన నారాయణ కొడుకు విశ్వం డాక్టరే కదా! ఇక్కడే ప్రాక్టీసు పెట్టాడు. మంచి హస్తవాసి ఉన్నవాడు. వాడికి చూపిద్దాం’ అన్నాడు రాజారాం ధైర్యం చెప్తూ.

 నారాయణ,రాఘవ హైస్కూల్‌ ‌నుండి కాలేజీ వరకు వీళ్లిద్దరితో కలిసి చదివారు. నలుగురిదీ అరమరికలు లేని స్నేహం.

మరునాడు స్నేహితులందరు నారాయణ ఇంట్లో కలుసుకున్నారు. నారాయణ, రాఘవ చిరకాల మిత్రుడు పరంధామయ్యను చూసి ఎంతో సంతోషించారు. నారాయణకు ఇద్దరూ కొడుకులే. పెద్దవాడు డాక్టర్‌, ‌రెండోవాడు లాయరు. కోడళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ కలిసే ఉంటున్నారు. పెద్ద ఇల్లు. మనవలు, మనవరాళ్లతో సందడిగా ఉంది.రాఘవకు ఇద్దరూ కూతుళ్లే. పెద్దమ్మాయి,అల్లుడు ఈ ఊళ్లోనే ఉంటున్నారు. రెండో అమ్మాయి,అల్లుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు.

వర్ధనమ్మ, నారాయణ భార్య సుశీలమ్మ, రాఘవ భార్య సీతమ్మ అందరూ వంటింట్లో చేరి కబుర్లు చెప్పుకుంటూ భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఆత్మీయత, అనుబంధం చూస్తుంటే జానకమ్మకి కూడ ఒంట్లో ఎక్కడ లేని ఓపిక వచ్చి, పనిలో పాలు పంచుకుంది. ఆ భోజనాలయ్యాక మిత్రులు నలుగురూ డాబా మీద చేరారు.

పాతరోజులు,అనుభవాలు గుర్తుకు తెచ్చుకుని ఆనందించారు. కాసేపటికి విషయం పిల్లల మీదకు మళ్లింది.!

 ‘ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా నారాయణా! నీ కొడుకులు నీతోనే కలిసి ఉంటున్నారు’ అన్నాడు పరంధామయ్య.

 ‘అవును..ఈ రోజుల్లో మీలాంటి ఉమ్మడి కుటుంబం ఉందంటే చాలా గ్రేట్‌’ అన్నాడు రాజారాం.

‘నాదేం లేదు, అదంతా మా కోడళ్ల గొప్పతనమేరా.. నాకు వాళ్లు కోడళుకాదు, బకూతుళ్లే అనుకో..ఏం చెప్పినా వింటారు!’

‘అదేరా మరి అదృష్టం అంటే..! నీ అభిప్రాయా లతో వాళ్లవి కలవటమే. కానీ చాలా కుటుంబాలలో పరిస్థితి ఇలా లేదు’ అన్నాడు రాఘవ.

‘అవును నిజమేరా! కాలాన్ని బట్టి పిల్లల పద్ధతులు ఆలోచనలు మారుతున్నాయి. పాత తరం చాదస్తాలు అంటూ మన మాటలను, పద్ధతులను, అలవాట్లను పూచికపుల్లల్లా తీసిపారేస్తున్నారు. వాళ్ల జీవితాలకి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో మంచిమాట ఏదైనా చెప్పబోతే…‘మీరా మాకు చెప్పేది? మీకేం తెలుసు?’ అన్నట్లు ఒక చూపు చూస్తున్నారు. కాలంతో పాటు మనం మాత్రం మారడం లేదా? నూతన సాంకేతిక పరికరాలను ఉపయోగించటం పిల్లల దగ్గర నుండి నేర్చుకోవడం లేదా? కొత్త పద్ధతులకు అలవాటు పడటంలేదా? వాళ్లు మాత్రం పాతలోని మంచిని ఎందుకు స్వీకరించటం లేదు?

చిన్నతనంలోనే కాదు..పెళ్లిళ్లయ్యి సంసారాలు ఏర్పడ్డాక కూడ మనం పెద్దవాళ్ల మాటకు, ఇష్టాలకు విలువనిస్తూ, వాళ్లంటే గౌరవంతో, భయభక్తులతో పెరిగాము. ఇప్పుడు చిన్నవాళ్ల అభిప్రాయాలకు, అభిరుచులకు,వాళ్ల జీవనశైలికి అనుగుణంగా సర్దుకుని పోతున్నాము. కాలానికి తగ్గట్లు మనని మనం మలచుకుంటున్నాము.

‘‘పుత్రోత్సాహంబు తండ్రికి….’ అన్నట్లు, కొడుకులను పెద్ద చదువులు చదివించి, వాళ్లు మంచి ఉద్యోగాలు చేస్తూ, పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడి మంచిపేరు తెచ్చుకుంటే చూసి వాళ్లతో కలిసి మురిసిపోవాలనే మన ఉత్సాహాన్ని వాళ్ల ప్రవర్తన నీరు కార్చేస్తోంది…’..

 ఇంకా ఏదో చెప్పబోతున్న పరంధామయ్య మాటలకు అడ్డుపడుతూ, ‘ఓఁ.. ఈ పద్యం నాకు పూర్తిగా వచ్చు,మా తాతయ్య నేర్పారు’ అంటూ ఆ పద్యమంతా గడగడ చెప్పాడు, అక్కడ పడిన బంతి తీసుకోవడానికి వచ్చిన ఓ పిల్లవాడు.

పరంధామయ్య ఆశ్చర్యంగా చూశాడు వాడి వైపు. ఆరేడేళ్లు ఉండవచ్చేమో ఆ పిల్లవాడికి. మెరిసే కళ్లతో, పాలబుగ్గలతో, తెల్లగా, ఎంతో అందంగా, తెలివిగా కనిపించాడు. ఇంచుమించుగా అదే వయస్సులో ఉన్న ఇంకో నలుగురు పిల్లలు వాడితో పాటు వచ్చారు. అప్పుడు నేనూ నేర్చుకున్నాను,నాకు దాని భావం కూడ గుర్తుంది’ అంటూ ఇంకో పిల్లవాడు అభినయం కూడ చేస్తూ భావం చెప్పి, మనం మంచి పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకుంటే అమ్మానాన్నలకు సంతోషమట.. ఇది కూడ తాతయ్య చెప్పాడు కదరా’ అన్నాడు.

‘పరంధాముడూ! ఇదుగో ఇలాంటివి ఈ పిల్లలకి నేర్పరా!ఆ నైతిక విలువలు, జీవిత సత్యాలు. నీ ఆవేదన తీరుతుంది, మనశ్శాంతిగాను ఉంటుంది’ అన్నాడు పరంధామయ్య భుజం మీద చెయ్యి వేస్తూ రాజారాం.

 ‘అవును,మా కోడలి దగ్గర ట్యూషన్‌కి ఈ చుట్టుపక్కల పిల్లలు చాలామంది వస్తారు.నువ్వూ చెప్పవచ్చు.తనకి సహాయంగా కూడ ఉంటుంది ఏమంటావు మాష్టారూ?’ నవ్వుతూ అన్నాడు నారాయణ.

‘అనేందుకు ఏముంది? వాడి ముఖం చూడు, ఎలా వెలిగిపోతోందో!’ అంటూ..

 ‘ఈ అంకుల్‌కి బోలెడన్ని పద్యాలు, కథలు వచ్చు. రేపటి నుండి మీకు నేర్పుతారు’ అని పిల్లలతో అన్నాడు రాఘవ.

 అది విని పిల్లలంతా సంతోషంగా ‘ఓఁ, రోజూ స్కూలు అయిపోగానే వచ్చేస్తాం’ అన్నారు. నేర్చుకోవటానికి వాళ్లు చూపించే ఉత్సాహానికి ముచ్చట వేసింది పరంధామయ్యకి.

వీళ్లే కదా రేపటి తరానికి ప్రతినిధులు!

పసిమొగ్గలుగా ఉన్నప్పుడే వీళ్లలో మానవతా విలువలను, నైతికతను పెంపొందించగలిగితే, సంస్కారవంతులుగా, మన సంస్కృతీ సంప్రదాయా లకు వారసులుగా తీర్చిదిద్దగలిగితే ఒక వినూత్న తరం తయారవుతుంది. అవును..వీళ్లే ఈ జాతికి ఆశాకిరణాలు! ఎదురుగా ఖాళీ స్థలంలో ఆడు కుంటున్న పిల్లలను చూస్తూ అనుకున్నాడు.

ఇంతలో విసురుగా గాలి వీచింది. చెట్ల నుండి పండుటాకులు రాలి డాబా మీద పడ్డాయి. పరంధామయ్య తలెత్తి ఆ చెట్ల వైపు చూసాడు. క్రింద భాగంలో అప్పుడప్పుడే మొలకెత్తుతున్న నవనవలాడే చిగుళ్లు కనిపించాయి. ఇంకా రాలుతున్న పండు టాకులు ఆ చిగుళ్లకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అన్పించింది పరంధామయ్యకి.

‘తాము పండుటాకులైతే, ఈ పిల్లలు కొత్త చిగుళ్లు. ఆ చిగుళ్లే ఆకులై, కొమ్మలై ప్రకృతికి పచ్చదనాన్నిస్తే, ఈ పిల్లలే నవతరానికి ప్రతినిధులై జాతికి జవసత్వాలను ఇస్తారు’ అనుకున్నాడు తృప్తిగా పరంధామయ్య.

– తాతిరాజు జ్యోత్స్న

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.