భారతీయ సాంప్రదాయ వివాహాలలో వధువు అలకరించుకునే ప్రతి ఆభరణం వెనుక కేవలం ఆడంబరం లేదా ఆచారం మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య విజ్ఞానం దాగి ఉంది. పూర్వీకులు అందించిన ఈ సంప్రదాయాలు ప్రాచీన ఆయుర్వేదం, ఆక్యుప్రెజర్‌ ‌వంటి శాస్త్రీయ  విజ్ఞానంతో ముడిపడి స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పండగైనా, పెళ్లయినా మంగళకరంగా,  ఆచారంగా భావించే ఆభరణాలు శరీరంలోని రక్తం ప్రసరించే నాడులను, ప్రెజర్‌ ‌పాయింట్లను ప్రేరేపించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

మంగళ సూత్రం: బంగారం శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా పెళ్ళిలో వధువుకు ధరింపజేసే బంగారు మంగళసూత్రం ఛాతీ భాగంలో హృదయ స్థానానికి దగ్గరగా ఉండటంతో గుండె పనితీరును మెరుగుపరచి, రక్తప్రసరణ సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. బంగారు గొలుసులో నల్లపూసల కలయిక రొమ్ము భాగంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది.

పాపిట బిళ్ల : మన సంప్రదాయంలో బొట్టు, పాపిట బిళ్ల ధరించే స్థానం సరిగ్గా ఆజ్ఞా చక్రంపై ఉంటుంది. షట్చక్రాలలో ఆరవది, అత్యంత శక్తివంత మైనది ఆజ్ఞా చక్రం. రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఉండే ఈ చక్రం.. మనస్సు, నాడీ వ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థను నియంత్రించే ప్రధాన కేంద్రం. ఈ భాగంలో ఒత్తిడి కలగడం వల్ల ఆక్యుప్రెజర్‌ ‌బిందువు ప్రేరేపితమై రోజంతా మెదడు చురుగ్గా, ప్రశాంతంగా పనిచేస్తుంది. నుదుటి మధ్యభాగంలో ఉండే  ‘ఆజ్ఞా చక్రం’ స్థానంలో పాపిట బిళ్ల తాకడం వల్ల మానసిక ఒత్తిడి, కంగారు తగ్గి నాడులు ప్రశాంత పడతాయి. ఇది మెదడు పనితీరును, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

ముక్కుపుడక: ఆయుర్వేదం ప్రకారం ముక్కుపై ఉండే కొన్ని నాడులు స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. మహిళలు ముక్కు కుట్టించుకోవడం, ఆ స్థానంలో బంగారు ముక్కు పుడక ధరించడం వల్ల ప్రసవ వేదన తగ్గుతుందని, నెలసరి సమస్యలు నియంత్రణలో ఉంటాయని శాస్త్రం చెప్తుంది.

గాజులు: సాధారణంగా అమ్మాయిలకు చిన్న వయసు నుంచే ఆభరణాలతో అలంక రించడం మన సంప్ర దాయంలో ఒక ఆచారంగా వస్తోంది.  మణికట్టు భాగంలో గాజుల రాపిడి వల్ల ఆక్యుప్రెజర్‌ ‌బిందువులు ప్రేరేపితమై రక్తప్రసరణ పెరుగుతుంది. గాజుల శబ్దం, ఒత్తిడివల్ల మహిళల్లో హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది.

వడ్డాణం: హిందూ సంప్రదాయంలో స్త్రీలు నడుముకు ధరించే  శోభాయమా నమైన ఆభరణం వడ్డాణం. సాంప్రదాయ హోదాతో పాటు ఆయుర్వేద, ఆక్యుప్రెజర్‌ ‌విజ్ఞాన శాస్త్రాల ప్రకారం వడ్డాణం ధరించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు మెండుగానే ఉన్నాయి. పొత్తికడుపు, నడుము భాగాన్ని వడ్డాణం గట్టిగా పట్టి ఉంచడం వల్ల గర్భాశయానికి స్థిరత్వం లభిస్తుంది. ఇది గర్భాశయం జారే సమస్యలను నివారించి, గర్భాశయ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది.అలాగే వడ్డాణం ధరించడం వల్ల నడుము, వెన్నుముక నిటారుగా ఉంటాయి. ఇది నడుము భాగంలో కొవ్వు చేరకుండా శరీరం సరైన ఆకృతిలో ఉండేలా చేస్తుంది. బరువైన చీరలు, ఆభరణాలు ధరించినప్పుడు వెన్నుముకపై పడే అనవసర ఒత్తిడిని సమంగా పంపిణీ చేసి, నడుము నొప్పి రాకుండా కాపాడుతుంది.

గజ్జెలు: స్త్రీలు కాళ్లకు ధరించే ఆభరణం గజ్జెలు. వీటినే అందియలు, పట్టీలు అనికూడా అంటారు. లోహశాస్త్రం పరంగా అంది యలు ధరించడం వెనుక అనేక శాస్త్రీయ కార ణాలున్నాయి. ముఖ్యంగా కాళ్లకు ధరించే గజ్జెలను ఎప్పుడూ వెండితోనే తయారు చేస్తారు. వెండి శరీరంలోని అధిక వేడిని గ్రహించి, నాడీ వ్యవస్థను చల్లబరుస్తుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రిస్తుంది. నడిచేటప్పుడు వెండి పట్టీలు మడమలకు రాపిడి కలిగించడం వల్ల కాళ్లలోని ఎముకలు దృఢపడతాయి. కాళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెండి శరీరానికి తాకడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మడమల వద్ద ఉం డే నాడులపై పట్టీల ఒత్తిడి పడటం వల్ల కాళ్లకు రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. గజ్జెల సవ్వడి నుంచి వచ్చే మధురమైన శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని నింపుతుంది. గర్భవతులు గజ్జెలు ధరించడం వల్ల ఆ శబ్ద తరంగాలు కడుపులోని బిడ్డపై మంచి ప్రభావం చూపుతాయి. శాస్త్రీయంగా బంగారం శరీరంలో ఉష్ణాన్ని పెంచితే, వెండి చల్లదనాన్ని ఇస్తుంది. కాళ్లకు వెండి ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.

వంకీలు: మహిళలు భుజం కింద, మోచేతి పైభాగంలో ధరించే అత్యంత ప్రసిద్ధ సాంప్రదాయ ఆభరణం వంకీలు. చేతి పైభాగంలో గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థకు అనుసంధానమైన కొన్ని కీలకమైన ఆక్యుప్రెజర్‌ ‌బిందువులు ఉం టాయి. వంకీ ధరించినప్పుడు ఆ ప్రదేశంలో కలిగే తేలికపాటి ఒత్తిడి నాడీ వ్యవస్థను ప్రేరేపించి, రోజంతా చేతులు అలసిపోకుండా ఉత్సాహంగా ఉం చుతుంది. వంకీ సరైన ఒత్తిడివల్ల భుజాల నుంచి చేతుల చివరి వేళ్లవరకు రక్త ప్రసరణ సమర్థవంతంగా జరుగుతుంది. భుజాలు, మోచేతులు, మెడ భాగంలో ఉండే కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజంతా పనులు చేయడంవల్ల వచ్చే భుజం నొప్పులు రావు. వంకీలు సాధారణంగాఇంగ్లీష్‌ అక్షరాల్లోని ‘వి’ ఆకారంలో ఉంటాయి. ఈ వి-షేప్‌ ‌డిజైన్‌ ‌చేతి కండరాలపై సమానమైన ఒత్తిడిని పంపిణీ చేస్తుంది. ఇది చేతి ఆకృతిని అందంగా చూపడమే కాక, రక్తం ఒకే చోట గడ్డ కట్టకుండా చూస్తుంది. పూర్వకాలం వంకీలపై నాగు పాము ఆకారం కుండలినీ శక్తికి,  రక్షణకు సంకేతం.

మెట్టెలు: వివాహితలు కాళ్ల వేళ్లకు ధరించే అత్యంత పవిత్రమైన, ఆభరణం మెట్టెలు. దీని వెనుక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు అద్భుతమైన ఆక్యుప్రెజర్‌, ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. కాలి రెండో వేలులోని ఒక ప్రధాననాడి గర్భాశయం ద్వారా గుండెకు అనుసంధానమై ఉంటుంది. నడిచేట ప్పుడు రెండో వేలుపై మెట్టెల ఒత్తిడి పడటం వల్ల గర్భాశయానికి సమర్థవంతంగా రక్తప్రసరణ జరిగి గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళలు ఈ మెట్టెలు ధరించడం వల్ల ఋతుక్రమం క్రమబద్ధీకృతమవుతుంది. ఆక్యుప్రెజర్‌ ‌బిందువు ప్రేరేపితమవ్వడం వల్ల మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. కాళ్ల నుంచి గుండెకు ప్రసరించే నాడులపై తేలికపాటి ఒత్తిడి పడటంవల్ల శరీరంలో రక్తపోటు సమతులంగా ఉంటుంది. నడిచేటప్పుడు వెండి మెట్టెలు నేలకు తాకడం వల్ల భూమిలోని ధనాత్మక శక్తి శరీరంలోకి ప్రసరించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం గర్భాశయానికి వెళ్లే ముఖ్యమైన నాడి పాదంలోని రెండో వేలులోనే ఉంటుంది. అందుకే రెండో వేలుకే ఈ మెట్టెలు ధరిస్తారు.

భారతీయ సనాతన సంప్రదాయంలో భాగమైన ప్రతి ఆచారం, మహిళలు ధరించే ప్రతి ఆభరణం వెనుక ఆధ్యాత్మికత మాత్రమే కాక, ఆయుర్వేద, శాస్త్రీయ విజ్ఞానం దాగుంది. బాహ్య సౌందర్యంతో పాటు అంతర్గత ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ ఆచారాలను ఆడంబరంగా మాత్రమే కాక, వాటి వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను అవగాహన చేసుకుని తర్వాతి తరాలకు అందించడం మన బాధ్యత.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.