సెప్టెంబర్ 25 జయంతి సందర్భంగా
భారత రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు వారు నిర్వహించిన పదవుల ద్వారా గుర్తుండిపోతారు. మరికొందరు తమ ఆలోచనలు, సిద్ధాంతాలు, జీవన విలువలతో తరతరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ అలాంటి మహోన్నత వ్యక్తిత్వం. నిరాడంబర జీవితం, నిస్వార్థ దేశసేవ, స్వచ్ఛమైన రాజకీయ విలువలు, భారతీయ సంస్కృతిపై అచంచల విశ్వాసం, కార్యకర్తల పట్ల అపారమైన ప్రేమ, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
1916 సెప్టెంబర్ 25న జన్మించిన దీన్ దయాళ్‌జీ చిన్ననాటి నుంచే అనేక కష్టాలను ఎదుర్కొ న్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఆయన ఎక్కడా కుంగిపోలేదు. కష్టాలను అధిగమిస్తూ దేశసేవనే తన జీవిత ధ్యేయంగా స్వీకరించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరఎసఎస్) ద్వారా సామాజిక సేవలో ప్రవేశించి, అనంతరం భారతీయ జనసంఘ్ నిర్మాణం, విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1953 నుంచి 1968 వరకు జనసంఘ్‌లో వివిధ కీలక బాధ్యతలను నిర్వహిస్తూ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేశారు.
సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిన మహనీయుడు
కేవలం సిద్ధాంతాలను పదేపదే వల్లించడం వల్ల సమాజం మారదు. సిద్ధాంతాలను ఆచరణలో పెట్టినప్పుడే అవి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు వస్తాయి. దీన్‌దయాళ్‌జీ తన జీవితంలో ఈ సత్యాన్ని నిరూపించారు.
ఆరఎసఎస్ ఏ కార్యానికి తనను నియ మించిందో, దానినే తన జీవిత కార్యంగా స్వీకరించి సంపూర్ణంగా అంకితమై పనిచేశారు. వ్యక్తిగత ఆశలు, పదవులు, ప్రయోజనాల కంటే సంస్థ, సమాజం, దేశం ఆయనకు ఎప్పుడూ ముందుండేవి.
భారతీయ రాజకీయ చింతనకు కొత్త దిశ – ఏకాత్మ మానవతా దర్శన్
స్వాతంత్య్రం అనంతరం భారతదేశం ఏ అభివృద్ధి నమూనాను అనుసరించాలి? భారతీయ సమాజ స్వభావానికి అనుగుణమైన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి? అనే ప్రశ్నలకు దీన్‌దయాళ్‌జీ తనదైన భారతీయ దృక్పథంతో సమాధానం ఇచ్చారు.
పాశ్చాత్య దేశాల సిద్ధాంతాలను యథాతథంగా అనుసరించకుండా, భారతీయ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమాజ స్వభావానికి అనుగుణంగా దేశ అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు.
క్యాపిటలిజం, కమ్యూనిజం వంటి సిద్ధాంతాల్లోని పరిమితులను అధిగమిస్తూ, వ్యక్తి-సమాజం-ప్రకృతి-పరమాత్మ మధ్య సజీవ సమన్వయాన్ని ప్రతిపాదించిన సమగ్ర భారతీయ ఆలోచనా విధానమే ఏకాత్మ మానవతా దర్శన్.
1965లో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభలో ఈ సిద్ధాంతాన్ని అధికారికంగా స్వీకరించడం ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ప్రత్యేక చారిత్రక గౌరవం. నేడు ఈ సిద్ధాంతం ఆవిర్భవించి ఆరు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా విజయవాడలో “పునర్‌దర్శనం” సమ్మేళనం (2026) నిర్వహించడం ఒక చారిత్రక సందర్భం. నాటి తరం ఆలోచనలను నేటి తరానికి అందించే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
మనిషే అభివృద్ధికి కేంద్రబిందువు
దీన్‌దయాళ్‌జీ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం సంపద పెరగడం కాదు. మనిషి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ – అన్ని కోణాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలి. వ్యక్తి అభివృద్ధి కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధితో అనుసంధానమై ఉండాలి.
ప్రకృతిని దోచుకోవడం కాదు, ప్రకృతితో సమన్వయంగా జీవించడం ఆయన ఆలోచనలో ముఖ్యమైన అంశం. అందుకే నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభం, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమతుల్యతల నేపథ్యంలో ఏకాత్మ మానవతాదర్శన్ మరింత ప్రాసంగికంగా మారింది.
ఆధునిక సాంకేతికత, ఆర్థిక ప్రగతి అవసరమే. అయితే వాటితో పాటు మానవ గౌరవం, సామాజిక బాధ్యత, ప్రకృతి పరిరక్షణ, భారతీయ విలువలు కూడా ముందుకు సాగాలి.
అంత్యోదయమే నిజమైన అభివృద్ధి
సమాజంలోని అత్యంత వెనుకబడిన వ్యక్తి అభ్యున్నతి సాధించినప్పుడే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని దీన్‌దయాళ్‌జీ విశ్వసించారు. అందుకే ఆయన ఆలోచనా విధానంలో అంత్యోదయ అత్యంత కీలకమైన భావనగా నిలిచింది.
పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, అణగారిన వర్గాలు- సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించాలి. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలి. ఇదే అంత్యోదయ స్ఫూర్తి.
నేడు దేశ అభివృద్ధిలో పేదల సంక్షేమం, సామాజిక సాధికారత, స్వావలంబన, మౌలిక సదుపాయాల విస్తరణ, చివరి వ్యక్తికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత లభించడం దీన్‌దయాళ్‌జీ ఆలోచనల సమకాలీనతను తెలియజేస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కారు
దీన్‌దయాళ్‌జీ రాజకీయ హుందాతనానికి ఆయన చూపిన అనేక సంఘటనలు నిదర్శనాలు.
1967లో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయంలో భిన్న సిద్ధాంతాలకు చెందిన పార్టీలతో రాజకీయంగా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కమ్యూనిస్టులతో రాజకీయ పోటీ ఉన్నప్పటికీ, వారిని శత్రువులుగా చూడకుండా “కమ్యూనిస్టులు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు” అనే ఉన్నతమైన రాజకీయ సంస్కృతిని ఆయన ప్రదర్శించారు.
ప్రజాస్వామ్యంలో సిద్ధాంతపరమైన భేదాలు సహజం. కానీ వ్యక్తిగత ద్వేషం, శత్రుత్వం రాజకీయాల్లో ఉండకూడదనే విలువను ఆయన తన ఆచరణ ద్వారా చూపించారు.
నేటి రాజకీయాల్లో కూడా ఈ హుందాతనం, విలువలు, పరస్పర గౌరవం మరింత అవసరం.
విమర్శలను మెట్లుగా మార్చుకోవాలని కార్యకర్తలకు సందేశం
దీన్‌దయాళ్‌జీ కేవలం సిద్ధాంతకర్త మాత్రమే కాదు. వేలాది కార్యకర్తలకు మనోధైర్యం నింపిన గొప్ప నాయకుడు.
విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, వాటినే మన బలంగా మార్చుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చేవారు.
“మనపై విమర్శలు చేస్తే కృంగిపోకూడదు. ఒక్కో విమర్శను ఒక్కో ఇటుకగా మార్చుకుని, ఒక్కో ఇటుకపై అడుగుపెడుతూ ముందుకు సాగాలి” అనే ఆయన సందేశం నేటి కార్యకర్తలకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం.
1965 యుద్ధంలో భారత్ గెలిచిన తరువాత తాష్కెంట్ ఒప్పందం జరిగింది. భారతీయ జనసంఘ్ కార్యకర్తల సభలో కార్యకర్తలు ఒప్పందానికి వ్యతిరేకంగా ‘జితాయా హమ్‌కో జంగ్ మే జై జవాన్! జై జవాన్ ` హరాయ హమ్‌కో హాల్‌హీమే హరామ్‌కోర’ (సైనికులు మనల్ని యుద్ధంలో గెలిపించారు, ఇంతలోనే ఓడించారు మనల్ని వెధవన్నర వెధవలు) అంటూ నినాదాలు ఇచ్చారు. వెంటనే దీనదయాళ్ ఉపాధ్యాయ కలుగజేసుకుంటూ కాంగ్రెస్‌పార్టీని దూషించిన పద్ధతి మంచిది కాదని, వాళ్లు మనకు శత్రువులు కారని జనసంఘ్ కార్యకర్తలను సముదాయించిన తీరు ఆయన నాయకత్వంలోని హుందాతనాన్ని, కార్యకర్తల పట్ల ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది.
రాజకీయాల్లో విలువలకు ప్రతీక
నేటి రాజకీయ వాతావరణంలో చిన్న విషయాలు కూడా తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. కానీ దీన్‌దయాళ్‌జీ కాలంలో రాజకీయ ప్రత్యర్థిపై కూడా ఒక నైతిక బాధ్యతతో వ్యవహరించే సంస్కృతి ఉండేది.
ఆర్గనైజర్ పత్రికలో అప్పటి కేంద్ర హోమ్‌మంత్రి వై బీ చవాన్‌ను ఉద్దేశించి గాడిద కార్టూన్ వేస్తే , దీనదయాళ్‌జి అలా మన దేశ మంత్రిని కించ పర్చడం తాగదని , రిజాయిండర్ (ప్రతిస్పందన)ను పత్రికలో వేయించారు.
రాజకీయాల్లో విమర్శ ఉండవచ్చు. కానీ ప్రత్యర్థిని కించపరచడం, వ్యక్తిగత దూషణలకు దిగడంకాకుండా, సిద్ధాంతాల ఆధారంగా చర్చించడం ప్రజాస్వామ్యానికి బలం.
ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏకాత్మ మానవతా దర్శన్ అధికారికంగా స్వీకరించిన చారిత్రక వేదికగా విజయవాడ నిలిచింది.
అందువల్ల ఆ సిద్ధాంతం ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విజయవాడలో నిర్వహించే “పునర్‌దర్శనం” సమ్మేళనం (2026) కేవలం ఒక కార్యక్రమం కాదు. అది ఒక ఆలోచనా పునర్విమర్శ.
నాటి తరం దేశం గురించి, సమాజం గురించి, అభివృద్ధి గురించి చేసిన ఆలోచనలను నేటి తరానికి పరిచయం చేయడం అత్యవసరం. ముఖ్యంగా యువతకు దీన్‌దయాళ్‌జీ ఆలోచనలు చేరాలి. ఆయన జీవితం, రచనలు, ప్రసంగాలు, రాజకీయ ప్రయాణంపై మరింత లోతైన అధ్యయనం జరగాలి.
వికసిత భారత్‌కు దీన్‌దయాళ్‌జీ ఆలోచనలే దిక్సూచి
నేడు భారతదేశం ప్రపంచంలో ఒక శక్తిమంతమైన దేశంగా ఎదుగుతున్న వేళ, అభివృద్ధి ప్రయాణం భారతీయ మూలాలను మరచిపోకుండా సాగాలి.
ఆర్థిక ప్రగతితో పాటు సామాజిక సమరసత, సాంస్కృతిక ఆత్మవిశ్వాసం, పర్యావరణ పరిరక్షణ, మానవ గౌరవం, స్వావలంబన ఇవన్నీ సమానంగా ముందుకు సాగాలి.
యువతకు అవకాశాలు, రైతులకు బలం, మహిళలకు సాధికారత, కార్మికులకు గౌరవం, పేదలకు భద్రత, అట్టడుగు వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలి. దేశ అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేరాలి.
ఇదే దీన్‌దయాళ్‌జీ ప్రతిపాదించిన సమగ్ర అభివృద్ధి భావనకు నిజమైన అర్థం.
స్మరణ కాదు – ఆచరణే నిజమైన నివాళి
1968 ఫిబ్రవరి 11న దీన్‌దయాళ్‌జీ భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, ఆయన ఆలోచనలు భారతీయ రాజకీయ, సామాజిక చింతనలో శాశ్వతంగా నిలిచిపోయాయి.
ఆయనను జయంతి, వర్ధంతి సందర్భాల్లో స్మరించుకోవడం మాత్రమే సరిపోదు. ఆయన చూపిన మార్గంలో నడవాలి. సమాజంలోని చివరి వ్యక్తి కోసం పనిచేయాలి. భారతీయ విలువలను గౌరవించాలి. ప్రజా జీవితంలో నిజాయితీ, నిబద్ధత, సేవాభావాన్ని పెంపొందించాలి.
దీన్‌దయాళ్‌జీ జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది – సిద్ధాంతం మాటల్లో కాదు, ఆచరణలో కనిపించాలి.
అంత్యోదయ స్ఫూర్తితో, ఏకాత్మ మానవతా దర్శన్ మార్గదర్శకత్వంలో బలమైన, సమృద్ధమైన, సమగ్ర భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత.
దీన్‌దయాళ్‌జీ ఆలోచనలు భారతదేశ గతానికి సంబంధించినవి మాత్రమే కావు. అవి భారతదేశ భవిష్యత్తుకు దిక్సూచి.
విజయవాడలో పుట్టిన ఆ ఆలోచనను మరోసారి పునర్‌దర్శనం చేసుకుని, నేటి తరానికి అందించి, వికసిత భారత్ నిర్మాణానికి దానిని ఆచరణలో పెట్టడమే పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌కి మనం అందించే నిజమైన నివాళి.
ఖాలీ సిద్ధాంత దోహరానే సే, కభీ వసుంధరా రూప సజతా నహీ। / ఆదర్శ ఆచరణ్‌మే జబ్ డాల్తాహై, తబ్‌కోsTÖ దీనదయాళ్ ఉభరతాఆతా హై।
“కేవలం సిద్ధాంతాలను పదేపదే వల్లించడం వల్ల ఈ వసుంధర (భూమి) రూపం సుందరంగా మారదు. ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టినప్పుడే ఒక దీన్‌దయాళ్ ఉద్భవిస్తాడు.”

పివిఎన్ మాధవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు,