దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ చట్టం ఒక్కటే అయినా… అమలు  మాత్రం ఒకేలా  ఉండటం లేకపోవడమన్నది కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారుతోంది. ఎవరి మీద నిబంధనలు రుద్దాలి? ఎవరి విషయంలో ఆంక్షలు అమలు చేయాలి? అన్న విషయంలో అధికారులకు, సంబంధిత విభాగానికి క్లారిటీ ఉన్నట్లు వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక వర్గానికి మాత్రమే బలవంతంగా వాటిని పాటించేలా ప్రతియేటా మార్గదర్శకాలు, ఉత్తర్వులు వెలువడుతూ ఉంటాయని బాధిత వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

సుప్రభాతానికి ఆంక్షలు… శబ్దానికి మౌనం? డెసిబెల్‌కు మతం ఉంటుందా? రాత్రి 10 గంటల నిబంధనకు వర్గం ఉంటుందా? అంటే.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన హక్కులను కల్పిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. మతం, కులం, వర్గం, ప్రాంతం ఆధారంగా వివక్షకు తావులేదు. ఇది రాజ్యాంగ పుస్తకాల్లోని సూత్రం మాత్రమే కాదు… ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారం. అయితే… ఈ సమానత్వం అమలులో కూడా కనిపిస్తోందా? అంటే ఖచ్చితంగా కాదనే వారే ఎక్కువ మంది ఉంటారు.

ముఖ్యంగా శబ్ద కాలుష్య నియంత్రణ విషయంలో ఈ ప్రశ్న అందరి మదిని తొలిచేస్తుంది. ప్రార్థనా మందిరాలు, పండుగలు, భజనలు, జాగరణలు, ఊరేగింపులు.. ఇలా ఏ సందర్భమైనా శబ్ద నియంత్రణ నిబంధనలు ఒకే విధంగా వర్తించాలన్నది చట్టం చెబుతోంది. కానీ, ఆచరణలో మాత్రం నిబంధనల అమలు పై వర్గాల మధ్య తేడా కనిపిస్తోందనే విమర్శలు, ఆరోపణలు ప్రతి యేటా వినిపిస్తున్నాయి.

ఒకచోట మైక్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇంకోచోట అదే మైక్ గంటల తరబడి మోగుతుంది. ఒకచోట డీజే వాహనం సీజ్ అవుతుంది. ఇంకో చోట శబ్ద పరిమితులను ఎవరు కొలుస్తున్నారో కూడా అర్థం కాదు. సమానత్వం అంటే ఇదేనా? అన్న ప్రశ్నలకు ఈ పరిణామాలే ఆజ్యం పోస్తున్నాయి.

ఆగిపోయిన సుప్రభాతం

ఒకప్పుడు నగరాలు, పల్లెల్లో, పట్టణాల్లో తెల్లవారుజామున ప్రజలు ఇంకా పూర్తిగా మేలుకోకముందే  ఆలయాల నుంచి వినిపించే సుప్రభాతాలు ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించేవి. తెల్లవారుజామున ఆలయ గంటలు, స్తోత్రాలు, భజనలు… ఇవన్నీ ఆ రోజుకు అద్భుతమైన బాట వేసేవి. ఎన్నో కుటుంబాల దైనందిన జీవితంలో అవి భాగంగా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది. శబ్ద కాలుష్యంపై అవగాహన పెరిగింది. నిబంధనలు వచ్చాయి. కోర్టుల నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. ఇవన్నీ అవసరమే. ఎందుకంటే ఎవరి ఆధ్యాత్మిక ఆచారం పేరుతో మరొకరి నిద్రకు, ఆరోగ్యానికి, ప్రశాంతతకు భంగం కలగకూడదనేది ఆహ్వానించదగినదే. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమ వుతోంది. నిబంధనలు నిజంగా అన్ని శబ్దాలను నియంత్రిస్తున్నాయా? లేక కొన్ని శబ్దాలనే నియంత్రిస్తున్నాయా? ఉదయం ఆలయంలో మైక్ పెట్టడానికి అనుమతి లేదని ఆర్డర్ వస్తుంది. శనివారం జరిగే భజనకు పరిమితులు విధిస్తారు. పండుగ సందర్భంగా డీజే పెట్టొద్దని హెచ్చరికలు వస్తాయి. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ సిస్టమ్ ఆపాలని ఆదేశాలు వస్తాయి. ఇవన్నీ చట్టబద్ధమైన నిబంధనలైతే అంతటా అమలు కావాలి. కానీ, అదే నిబంధనలను ఇతర సందర్భాల్లో ఎందుకు అదే కఠినంగా అమలు చేయడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు ఉండరు.

డెసిబెల్‌కు మతం ఉంటుందా?

శబ్దాన్ని కొలిచే డెసిబెల్ ఒక శాస్త్రీయ కొలత. దానికి మతం ఉండదు. శబ్దం హిందూ ప్రార్థనా మందిరం నుంచి వచ్చినా, ముస్లిం ప్రార్థనా మందిరం నుంచి వచ్చినా, క్రైస్తవ ప్రార్థనా మందిరం నుంచి వచ్చినా… శబ్ద ప్రభావం మాత్రం మనిషి చెవిపై ఒకే విధంగా పడుతుంది. అయితే నిబంధనల అమలులో కూడా అదే కనిపించాలి. వృద్ధులకు నిద్ర అవసరం. విద్యార్థులకు చదువు అవసరం. చిన్నారులకు ప్రశాంతమైన వాతావరణం అవసరం. అనారోగ్యంతో ఉన్నవారికి విశ్రాంతి అవసరం. వారి చెవులకు వినిపించే శబ్దం ఏ మతానికి చెందినదో వారికి ముఖ్యం కాదు. శబ్దం శబ్దమే. అందుకే శబ్ద కాలుష్య నియంత్రణను మతపరమైన సమస్యగా కాకుండా పౌర హక్కుల సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది.

‘సుప్రీంకోర్టు చెప్పింది’… కానీ అమలు చేసే వారెవరు?

శబ్ద కాలుష్యంపై భారతదేశంలో ఇప్పటికే చట్టపరమైన వ్యవస్థ ఉంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు, అలాగే సుప్రీంకోర్టు తీర్పులు శబ్ద నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పరచాయి. రాత్రి సమయంలో లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ వినియోగంపై పరిమితులు ఉన్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు, నిశ్శబ్ద మండలాలకు వేర్వేరు శబ్ద పరిమితులు ఉన్నాయి. అంటే, చట్టం అస్పష్టంగా ఏమీ లేదు. కానీ , దానిని అమలు చేయడంలోనే అసలు సమస్య దాగి ఉందని జరుగుతున్న  పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు చర్య తీసుకోవాలి. అది ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా, ఏ సంస్థకు చెందిన వారైనా, ఏ పండుగ సందర్భమైనా సరే,  అధికారుల పని ఎవరి విశ్వాసాన్ని కొలవడం కాదు. ఎవరి మతాన్ని నిర్ణయించడం కాదు. చట్టం అమలవుతోందా లేదా అనేది నిర్ధారించడం. కానీ, ఇప్పుడు ఆది జరగడం లేదన్నది ఒక వర్గం వారు ప్రత్యేకంగా వినిపిస్తున్న రోదన

పండుగలకే తెరుచుకునే నిబంధనల పుస్తకం

కేవలం ఏదైనా పండుగ వచ్చిందంటేనే  నిబంధనల పుస్తకం తెరుచుకుం టుందన్న వాదనలున్నాయి. వినాయక చవితి వస్తుంది. గణేష్ మండపాలకు అనుమతులు, సౌండ్ సిస్టమ్ నిబంధనలు, డీజే నిషేధం, రాత్రి సమయ పరిమితులు… ఒక్కసారిగా ఎన్నో ఆదేశాలు వెలువడతాయి.

అదే విధంగా బోనాలు వస్తాయి. మళ్లీ పోలీసుల సూచనలు, అనుమతులు, శబ్ద పరిమితులు. మరోవైపు.. అయ్యప్ప స్వామి మండల పూజలు, మహాశివరాత్రి జాగరణలు… ఇలాంటి పర్వదినాలు వస్తున్నాయంటే చాలు నిబంధనల పుస్తకాలు బార్లా తేరుచుకుంటాయి. నిబంధనలు ఉండకూడదని ఎవరూ అనే సాహసం చేయరు. కానీ, అవి అందరికీ ఒకేలా అమలవ్వాలన్నది అందరి అభిమతం. ఒక పండుగకు “శబ్ద కాలుష్యం” గుర్తుకొస్తే, మరో పండుగకు అదే శబ్ద కాలుష్యం ఎందుకు కనిపించకూడదు? ఒక మతపరమైన కార్యక్రమంలో రాత్రి 10 గంటల తర్వాత మైక్ ఆపించగలిగే అధికారులు, మరో మతపరమైన కార్యక్రమంలో అదే నిబంధనను ఎందుకు అమలు చేయలేరనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండదనేది ఒక వర్గం వారి ఆవేదన. ఇది ఏ మతానికి వ్యతిరేకమైన ప్రశ్న కాదు. ఇది అధికారుల నిష్పాక్షికతకు సంబంధించిన ప్రశ్న. అందరి విషయంలోనూ అవే నిబంధనలు అమలు కావాలనే ప్రశ్నను కేవలం మతపరమైన భావోద్వేగంగా కొట్టిపారేయడం సరికాదు. ఎందుకంటే సమానత్వం కనిపించక పోతే అసంతృప్తి పెరుగుతుంది. ఒక వర్గం నిబంధనలను పాటిస్తుండగా, మరొక వర్గం ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోవడం లేదనే భావన ఏర్పడితే… చట్టంపై విశ్వాసం దెబ్బతింటుంది. అది చివరికి శబ్ద కాలుష్య సమస్యను దాటి సామాజిక విశ్వాస సమస్యగా మారుతుంది.

కొన్ని ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాల నుంచి నిరంతరంగా వినిపించే శబ్దంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నిద్రలేమి, పిల్లల చదువుకు అంతరాయం, వృద్ధులకు ఇబ్బంది వంటి సమస్యలతో.. కొన్ని చోట్ల శబ్ద భారం కారణంగా సొంత ఇల్లు ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతాలను వదిలివేసి దూరంగా ఎక్కడికో వెళ్లి నివసిస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. వాటిని కేవలం మతపరమైన వివాదంగా మాత్రమే చూడలేం. ఎందుకంటే ఒక కుటుంబం తన ఇంటిని వదిలి ఎక్కడో దూరంగా నివసించాల్సి వస్తే, అది కేవలం శబ్ద సమస్య కాదు. అది వారి జీవన భద్రతకు సంబంధించిన సమస్య.

మత స్వేచ్ఛ ఉంది… కానీ అది ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించ కూడదు. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను ఇచ్చింది. అయితే, ఏ హక్కుకైనా పరిమితులు ఉంటాయి. ఒకరి మతాచరణ మరొకరి ఆరోగ్యానికి, భద్రతకు తీవ్ర భంగం కలిగించే స్థాయికి చేరితే, ప్రభుత్వానికి నియంత్రణ విధించే అధికారం ఉంటుంది. దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్లకే ఉంటుంది. ఒక మతం పేరుతో మాత్రమే నిబంధనలు అమలు చేయడం సమర్థనీయం కాదన్నది విశ్లేషకుల మాట.

అధికారుల ముందున్న అసలు పరీక్ష

పోలీసులు, మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ బోర్డు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మీదున్న అసలు పరీక్ష ఇదే. ఎవరు ఫిర్యాదు చేశారు? ఏ మతానికి చెందినవారు? ఏ పండుగ జరుగుతోంది? ఎవరి  ప్రార్థనా మందిరం? అన్నది కాదు అసలు సమస్య. ఎంత శబ్దం వస్తుంది? ఎంత సమయం వినియోగించారు? అనుమతి ఉందా? నిబంధనలు ఉల్లంఘించారా? అన్నదే చూడాలి. అదే నిజమైన నిష్పాక్షికత. అదే రాజ్యాంగస్ఫూర్తి. అదే పరిపాలనా ధర్మం.

ప్రభుత్వాలు కూడా ఒకే ప్రమాణాలను ప్రకటించాలి. పోలీసులు ఒకే ప్రమాణాలను అమలు చేయాలి. ఫిర్యాదులపై ఒకే విధమైన స్పందన ఉండాలి. శబ్దాన్ని నిర్ధారించే వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి. అనుమతుల ప్రక్రియ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఉల్లంఘన జరిగితే చర్య కూడా ఒకే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు.. చట్టం నిజంగా అందరికీ సమానమే అని నమ్ముతారనడంలో సందేహం లేదు.

ఈ వ్యవహారంలో, ఈ వివాదంలో మొత్తానికి అసలు ప్రశ్న ఏంటంటే.. సుప్రభాతం వినిపించాలా? అనేది కాదు.  డీజే పెట్టాలా? అనేది కూడా కాదు. అసలు ప్రశ్న ఒక్కటే.. ఒకే చట్టం ఉన్నప్పుడు… ఒకే ప్రమాణంతో ఎందుకు అమలు చేయకూడదు? ఆలయంలో మోగే గంటకు ఒక కొలత, ప్రార్థనా మందిరంలోని లౌడ్‌స్పీకర్‌కు మరో కొలత ఉండకూడదు. హిందూ పండుగలో వినిపించే శబ్దానికి ఒక చట్టం, ఇతర మతాల కార్యక్రమాల్లో వినిపించే శబ్దానికి మరో చట్టం ఉండకూడదు. డెసిబెల్‌కు మతం లేదు. రాత్రి 10 గంటలకు మతం లేదు. శబ్ద కాలుష్యానికి కులం లేదు. అలాగే, చట్టానికి కూడా వర్గం ఉండకూడదు. చట్టాన్ని గౌరవించడం పౌరుల బాధ్యత. కానీ, చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయడం అధికారుల బాధ్యత. ఒక వర్గాన్ని కట్టడి చేయడం న్యాయం కాదు. మరొక వర్గాన్ని వదిలేయడం కూడా న్యాయం కాదు. అందరినీ ఒకే తూకంతో తూచినప్పుడే అది నిజమైన సమన్యాయం అవుతుంది.

– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.