తెలంగాణ రాజకీయాల్లో భావోద్వేగాలకూ, సిద్ధాంతాలకూ ఎంత పదును ఉంటుందో.. వ్యూహాత్మక రాజకీయాలకూ అంతే పదును ఉంటుంది. కానీ, ఇటీవల చోటు చేసుకుంటున్న ‘సవాళ్లు-ప్రతిసవాళ్ల’ పర్వం ఇటు పాలకుల హుందాతనాన్ని, అటు ప్రతిపక్షాల బాధ్యతను పక్కనబెట్టి విలువైన సమయాన్ని వృథా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అసలు సిసలైన సమస్యలను, అభివృద్ధిపై జరగాల్సిన మేధోమథనాన్ని పక్కదారి పట్టిస్తూ.. కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే సాగుతున్న ఈ ‘బహిరంగ చర్చల’ నాటకం ప్రజల దృష్టిలో నవ్వులాటగా మారుతోంది. రాష్ట్రం అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్ల వ్యవహారంపై అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి నాయకులు సృష్టించిన హైడ్రామా చివరకు ‘దొందూ దొందే’ అన్న చందంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై శ్వేతపత్రాలు, విమర్శలతో దాడి చేస్తోంది. ప్రతిగా బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇది శ్రుతిమించి, పరస్పరం కించపరుచుకుంటూ ‘దమ్ముంటే చర్చకు రా’ అనే స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌తో మొదలైన ఈ పక్రియ, మంత్రులు, విపక్ష నేతల చేతుల్లోకి వెళ్లేసరికి హద్దులు దాటి పోయింది.
‘రాష్ట్ర ఆర్థిక భారంపై చర్చకు తాము సిద్ధమా’ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు చేసిన సవాల్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వీకరిస్తూ, ‘నేరుగా తెలంగాణ భవన్‌కే వస్తా. నా లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా’ అని ప్రకటించారు. మరోవైపు గురుకులాల టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజాహరుద్దీన్‌లు స్పందిస్తూ, ఈ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటనలు గుప్పించారు. అంతేకాదు..జూలై 2వ తేదీన వారు నేరుగా సీఎల్పీ కార్యాలయానికి వచ్చి, అక్కడినుంచి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరారు. కాసేపు అక్కడ బైఠాయించి, తాము మీడియా ముందు చెప్పుకోవా లనుకున్నది చెప్పేసి, అధికారిక కార్యక్రమాలు ఉన్నాయంటూ కాసేపటికే అక్కడి నుంచి నిష్క్రమించారు. తేదీలు, సమయాలు, వేదికల విషయంలో ఇరు పార్టీలూ పోటీ పడి మరీ ప్రకటనలు గుప్పించుకోవడంతో..ఈ బహిరంగ చర్చల్లోనే అసలు నిజాలు తేలిపోతాయని తెలంగాణ సమాజం ఆసక్తిగా గమనించింది. కానీ, అసలు రాజకీయం వేరేలా సాగింది. తొడగొట్టడం, తిరిగి వెళ్లడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఒకరకంగా ఎవరికి వారు సింహగర్జనలు చేసి..చర్చలకు వచ్చే సరికి వెను దిరిగిన పరిస్థితి కనిపించింది. మరోవైపు.. తెలంగాణ భవన్‌కు వస్తానని ప్రతిజ్ఞ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆఖరి నిమిషంలో గాంధీ భవన్‌కు దాకి మార్చారు. ‘కేటీఆర్, హరీశ్‌రావు నా ముందు చిన్నపిల్లలు. వారితో నాకేం చర్చ? అసలు బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు గన్‌పార్క్‌కు రావాలి’ అంటూ అక్కడ మీడియా ముందు ఒక్కసారిగా నాలిక మడతేశారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్ కే చెందిన ఇతర నాయకులకు సవాల్ విసిరిన తన సహచర మంత్రులు గన్ పార్క్‌లో బైఠాయించారని తెలిసి, తాను అక్కడికి వస్తున్నానంటూ అప్పటికప్పుడు ప్రకటించారు. మిగతా మంత్రులు వెళ్లిపోయిన తర్వాత జూపల్లి కృష్ణారావు గన్‌పార్క్‌కు చేరుకొని, తాను సవాల్ విసిరిన వాళ్లు ఎవరూ అక్కడికి రాలేదంటూ తిరిగి వెళ్లిపోయారు.
ఇక, అటు.. తెలంగాణ భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి, పేరు రాసి, శాలువాతో వేచి చూసిన కేటీఆర్, మంత్రి రాకపోవడంతో నిరాశ చెందారు. గురుకులాల టెండర్ల అవినీతిపై ఆధారాలతో సహా చర్చిస్తామన్న హరీశ్‌రావు కూడా తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, చర్చలకు రావాలని సవాళ్లు విసిరిన అధికార పక్షం, శాంతిభద్రతల నెపంతో పోలీసులను రంగంలోకి దించింది.బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్ గేటు దాటకముందే వారిని పోలీసులు చుట్టుముట్టడం, తోపులాటలో హరీశ్‌రావు కిందపడిపోవడం, వారిని అరెస్ట్ చేసి గంటల తరబడి నగరమంతా తిప్పడం లాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అత్యంత హాస్యాస్పదమైన విషయమేమిటంటే.. అరెస్ట్ అయిన హరీశ్‌రావు కారులో నుంచే మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు ఫోన్ చేస్తుంటే, సీఎల్పీ కార్యాలయంలో కూర్చున్న వారు ఆ ఫోన్ చూస్తూ ‘ఎత్తొద్దు.. ఎత్తొద్దు’ అని దాటవేయడం అక్కడి మీడియా కంటికి చిక్కిందని చెబుతున్నారు. అలాగే, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియా సాక్షిగా కేసీఆర్‌కు ఫోన్ చేసి, ఆయన ఫోన్ తీయకపోవడాన్ని పెద్ద రాజకీయ విజయంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే, ఇరుపక్షాలకూ చర్చల ద్వారా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలనే చిత్తశుద్ధి లేదు. కేవలం మీడియా కెమెరాల ముందు ప్రత్యర్థిని దెబ్బకొట్టాలనే ఆరాటమే కనిపించింది.
అంకెల గారడీ.. పొంతన లేని లెక్కలు
బహిరంగ చర్చలకు సిద్ధమన్న నాయకులకు కనీసం తాము మాట్లాడే అంశాలపై ప్రాథమిక అవగాహనైనా ఉండాల్సింది పోయి.. అప్పుల లెక్కలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఒకసారి రూ. 8లక్షల 21వేల కోట్ల ఆర్థిక భారం అని, మరుసటి గంటలోనే రూ. 7 లక్షల కోట్లు అంటూ మాట మార్చారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అసలు అప్పు ఎంత అనేదానిపై ఆ పార్టీ కూడా ఆర్‌బీఐ, కాగ్ లెక్కలంటూ తమకు అనుకూలమైన గణాంకాలను మాత్రమే వల్లిస్తోంది.
ఇక, గురుకులాల టెండర్ల విషయంలో మంత్రుల మధ్యే పొంతన లేదు. కొనుగోళ్ల పక్రియ మొత్తం కలిపి రూ.1,143 కోట్లు మాత్రమే ఉంటే, ఇందులో రూ.2 వేల కోట్లు, రూ.3 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? అని మంత్రి పొన్నం ప్రశ్నిస్తే, మరో మంత్రి అడ్లూరి…మొత్తం టెండర్ల విలువపై భిన్నమైన అంకెలు చెప్పారు. నోట్‌బుక్స్ కొనుగోళ్లు, వాటర్ మార్క్ నిబంధనల వెనుక రూ.వందల కోట్ల కమీషన్లు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపించగా, ‘అసెంబ్లీలో చూసుకుందాం’ అంటూ అధికారపక్షం దాటవేస్తోంది. సవాల్ విసిరేటప్పుడు గన్‌పార్క్, ప్రెస్‌క్లబ్ అని వీధులలోకి తెచ్చి.. తీరా చర్చకు వచ్చేసరికి ‘సభలోనే తేల్చుకుందాం’ అనడం ప్రజల ముందు కుప్పి గంతులు వేయడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయ క్రీడలో మీడియా, ప్రజలు ‘ఫూల్స్’
ప్రభుత్వం మారినప్పుడు కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వ లోపాలను ఎండగట్టడం,తన ప్రణాళికలను వివరించడం సహజం. కానీ, ప్రస్తుతం నడుస్తున్న సవాళ్ల పర్వం కేవలం ‘డైవర్షన్ పాలిటిక్స్’ అంటే.. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయం మాత్రమేనని స్పష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. రుణమాఫీ, నిరుద్యోగ నిధులు, రైతు భరోసా, కొత్త నోటిఫికేషన్లు వంటి కీలక ప్రజా సమస్యలపై ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి అధికార పార్టీకి ఈ సవాళ్లు ఉపయోగపడుతుంటే.. క్షేత్రస్థాయిలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఇదొక ‘మైలేజ్ టూల్‌గా మారింది.
జూలై 2వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియా ఛానళ్లలో ‘బ్రేకింగ్ న్యూస్’ల పేరిట నడిచిన ఈ రచ్చ, అంతిమంగా ప్రజలకు అందించిన సందేశం మాత్రం ఏమీ లేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను, మీడియాను వాహకాలుగా వాడుకొని వదిలేస్తారన్న అంశం తేటతెల్లమైందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా నడిచింది. చర్చల పేరుతో ఊదరగొట్టడం, తీరా సమయానికి అరెస్టుల నాటకాలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ద్వారా కాలయాపన చేస్తున్నారు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలపై ఎవరికీ పట్టింపు లేదని తేలిపోయిందంటున్నారు నిపుణులు.
వేదిక ఏర్పాటు చేస్తాం: బీజేపీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆడుతున్న ఈ రాజకీయ క్రీడను గమనిస్తున్న వ•డో ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు పార్టీలు కలిసి ప్రజలను మభ్యపెడుతున్న వేళ.. తామే అసలైన వేదికను సిద్ధం చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాటకాలకు స్వస్తి పలికి.. రాష్ట్రం అప్పుల అసలు రికార్డులను, గురుకుల టెండర్లలో జరిగిన అంతర్గత ఒప్పందాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేస్తోంది. నాటకాలు ఆడే రెండు పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చి, ప్రజల సాక్షిగా వారి అసలు రంగులను బయటపెట్టేందుకు సిద్ధమని తెలిపింది.
ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందిస్తూ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న వ్యవహారం ‘బిగ్ బాస్’ షోను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. పైకి పోరాటంలా కనిపిస్తున్నా, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు ప్రజల నుండి ‘డబుల్ ఎలిమినేషన్’ తప్పదని, తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆ రెండు పార్టీల బండారాన్ని ఈ క్రమంలోనే ప్రజల సమక్షంలో బయటపెట్టేందుకు బహిరంగ చర్చ నిర్వహించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చెప్పారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి, పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో వాటి నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేలా ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, అందుకే బీఆర్‌ఎస్ నేతలపై అనేక కేసులు ఉన్నప్పటికీ రేవంత్‌రెడ్డి సర్కారు వారిలో ఎవరినీ అరెస్టు చేయడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీల అంతర్గత కుమ్మక్కు రాజకీయాలను, నాటకాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా అవినీతిపై చర్చ పెట్టినా తమ పార్టీ పాల్గొంటుందని, గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన రూ.లక్షల కోట్ల అవినీతిని ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు.
సవాళ్లు విసరడం.. తీరా సమయానికి తోకముడవడం తెలంగాణ రాజకీయ సంస్కృతి కాదని, అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ఈ వీధి పోరాటాలు, ప్రచార ఆర్భాటాలు ఆపి.. అసెంబ్లీ వేదికగానో, లేదా ప్రజల ముందో నిజాయితీతో కూడిన చర్చకు ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం సిద్ధం కాకపోతే.. తెలంగాణ సమాజం వీరిని విశ్వసించదన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068