‘‌డాక్టర్‌ ‌చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు దేశసేవకు మొత్తం జీవితాన్ని సమర్పించారు. దేశసేవ అంటే దేశ ఆత్మను, స్వభావాన్ని అర్థం చేసుకుని పనిచేయడం. ఈ కార్యంలో ఉన్నవారికి పునర్జన్మ ఉండదు. అయితే వారి వ్యక్తిత్వాన్ని, గుణగణాలను చిరకాలం స్మరించుకోవాలి. శరీరం దైన్యస్థితిలో ఉన్నా వారి మనస్సు దుఃఖానికి గురికాలేదు. వారు స్థితప్రజ్ఞులు, మహాయోగి’ అని శ్లాఘించారు సద్గురు శివానందమూర్తి.

కృష్ణాజిల్లా నూజివీడులో సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి 1941లో సంఘ పరిచయం కలిగింది. అదే సంవత్సరం మొదటితరం ప్రచారక్‌ ‌బాబాసాహెబ్‌ ఆప్టే నూజివీడు శాఖకు రాగా, 1942లో సంక్రాంతి ఉత్సవానికి నాటి సర్‌సంఘచాలక్‌ ‌పరమపూజనీయ గురూజీ విచ్చేశారు. తోటి విద్యార్థులతో స్నేహంచేసి, వారి అభిరుచికి తగ్గట్లు, వారితో మాట్లాడి శాఖకు ఆకర్షించడం శాస్త్రిగారి ప్రత్యేకత. 1945లో ఇంటర్మీ డియట్‌ ‌చదువుతున్న సమయంలో కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు.

1955లో గుంటూరులో భారతీయ జనసంఘ్‌ ‌మొదటి రాష్ట్ర మహాసభ• సందర్భంగా ‘జాగృతి’ ప్రత్యేక సంచిక విడుదలైంది. శాస్త్రిగారు ఆ పత్రికల కట్టను తీసుకొని గుంటూరు రైల్వేస్టేషన్‌లో దిగి స్వయంగా భుజాన వేసుకొని స్టేషన్‌ ‌బయటకు వచ్చారు. జనసంఘ్‌ ‌ప్రతినిధులకు స్వాగతం చెప్పడానికి తయారుగా ఉన్న స్వయంసేవకులు ఆ దృశ్యం చూసి అవాక్కయ్యారు. శాస్త్రిగారి ఉన్నత వ్యక్తిత్వం,వారి స్థాయి తెలిసిన స్వయంసేవకులకు భవిష్యత్తులో రాజకీయ రంగంలో ఎలా పనిచేయాలో ఎన్నో రకాలుగా మార్గనిర్దేశం చేసింది.

పొరబాట్లను సున్నితంగా సరిదిద్దడంలో నేర్పరి. శిక్షావర్గలలో రాత్రి అందరూ పడుకునే సమయాన్ని ఉల్లంఘించి ఎవరైనా మైదానంలో మాట్లాడుకుంటు న్నట్లయితే పరిశీలనకు వెళ్లిన శాస్త్రిగారు వారి భుజంపైన చేయి వేసి ‘సమయమైంది ఇక నిద్రపోండి’ అనడం తప్ప మరో మాటాడేవారు కాదు. 1988 ఒకసారి అనంతపురంజిల్లా బుక్కరాయ సముద్రంలో జరుగుతున్న విభాగ్‌ ‌ప్రచారకుల ప్రాంత సమా వేశంలో ప్రార్థన అనంతరం, ప్రార్థన చెప్పిన స్వయంసేవక్‌ను శాస్త్రిగారు పిలవడంతో అతనికి కాళ్లు వణికాయి. శాస్త్రిగారు అతనితో మాట్లాడుతూ ‘నువ్వు ధ్వజం ఎగురవేస్తుంటే నీలో శారీరక్‌‌ప్రముఖ్‌, ‌ప్రార్థన చెపుతుంటే నీలో బౌద్ధిక్‌‌ప్రముఖ్‌ ‌కనిపించా డయ్యా!’ అంటూ ప్రార్థన రాగాన్ని సరి చేసిన పద్ధతి చూసిన తరువాత అతనిలో భయం పోయింది.

ఒకసారి భాగ్యనగర్‌ ‌పర్యటనకు రైల్లో వచ్చారు. వారిని తీసుకునిరావడానికి రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కార్యకర్త, రైలు ఆలస్యమైందని కూర్చున్నచోటే నిద్రలోకి జారుకున్నాడు. శాస్త్రిగారు తన కోసం ఎవరు వచ్చారోనని ఎదురుచూడకుండా సరాసరి కార్యాలయానికి వచ్చేశారు. పొర•బాటు చేసిన కార్యకర్త తరువాత వివరణ ఇచ్చినప్పుడు• నవ్వుతూనే పలకరించిన పద్ధతి ఆ కార్యకర్తకు మరోసారి తప్పుచేయకుండా సరిదిద్దుకోవాలనిపిం చింది. ఇలాంటి సున్నితమైన వారి వ్యవహారం స్వయంసేవకుల పొరబాట్లను సరిచేసేది.

స్వభావరీత్యా సాత్వికులు. పిన్నలైనా, పెద్దలైనా నమస్కరిస్తే, రెండు చేతులు జోడించి ప్రతి నమస్కారంచేసే ఆయన సంస్కారం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందరిపట్ల స్నేహంగా ఉంటూ ఆత్మీ యతతో పలకరించడం వారి నైజం. ఒక వ్యక్తి లోపాలను మరొకరి వద్ద ప్రస్తావించేవారు కాదు. తమ మనసులోని విషయాన్ని శాస్త్రిగారికి తీరికగా చెప్పుకోవడం ద్వారా తమకు సరైన పరిష్కారం దొరుకుతుందనే అనుభూతిని కార్యకర్తలందరికీ కలగడం వారి విశేషత. వారి అభిప్రాయం చెప్పడమంటే తుది తీర్పే. ఇక దానిపై వాద వివా దాలకు అప్పీళ్లకు అవసరమే ఉండేది కాదు. ఆ విధంగా వేలాదిమంది స్వయంసేవకుల హృదయాలపై వారు చెరగని ముద్ర వేశారు.

భాగ్యనగర్‌కు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ప్రాంత కార్యాలయంలో ప్రత్యేక సౌకర్యాలు ఏవీ కోరుకునేవారు కాదు. ఉదయం 3.30 గంటలకు నిద్రలేచి దుస్తులను వారే స్వయంగా ఉతికి ఆర వేసుకునేవారు. ఆరిన తరువాత కూడా వారే మడతపెట్టుకునేవారు. ఎవరన్నా సహకరించడానికి ప్రయత్నిస్తే స్వీకరించేవారు కాదు. ఇదే పద్ధతిని చివరి దశవరకు కొనసాగించారు.

ప్రాంత కార్యవాహగా పర్యటన నిమిత్తం తిరుపతికి వెళ్లినప్పుడు సంఘ కార్యక్రమం ముగించుకొని తిరుమలకు దర్శనానికి వెళ్లివచ్చిన తరువాత తిరుమలకు రాను పోను ఖర్చులను లెక్కకట్టి జిల్లా ప్రచారక్‌కు అందజేశారు. వద్దని వారించి నప్పటికీ, దర్శనానికి వెళ్లడం నా సొంత వ్యవహారం. దీనికి సంఘం డబ్బులను ఖర్చుపెట్టడం సముచితం కాదని నచ్చచెప్పారు. భాగ్యనగర్‌కు వచ్చినప్పుడు కూడా సంఘ కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తరువాత, మల్కాజ్‌గిరిలోని బంధువు ఇంటికి వెళ్లిరావడానికి సంఘ కార్యాలయం నుండి ఆటో వ్యవస్థ చేస్తే ఒప్పుకొనేవారు కాదు. వారే స్వయంగా ఆటోచార్జీ చెల్లించి వెళ్లేవారు. విధి నిర్వహణలో భాగంగా వారి పర్యటన రైలులో మొదటితరగతి కావచ్చును, విమాన ప్రయాణం కావచ్చు. నిబంధనల మేరకు వెళ్లేవారు. సంఘ కార్యం నిమిత్తం పర్యటించేటప్పుడు ఎప్పుడూ సాధారణ తరగతిలోనే ప్రయాణిం చేవారు. ‘వయస్సు, బాధ్యత దృష్ట్యా ఇక మీరు రైలులో మొదటితరగతిలో ప్రయాణించండి’ అని శేషాద్రిగారు (సర్‌కార్యవాహ) చెప్పేంత వరకు వారు సాధారణ తరగతిలోనే పర్యటనలను కొనసాగించారు. ఇదే పద్ధతి అనేక పర్యాయాలు వారి జీవితంలో కనపడుతుంది.

శాస్త్రిగారు నిర్విరామంగా పర్యటించేవారు. యూనివర్సిటీ సెలవులు ప్రకటించినప్పటి నుండి తిరిగి కళాశాల తెరిచేవరకు అది 2,3 రోజులైనా, 15 రోజులైనా, ఒకనెల అయినప్పటికీ మొత్తం సెలవు రోజులు పర్యటనలో ఉండేవారు. మన ప్రాంతంలో గృహస్థ కార్యకర్తల పర్యటనకు వీరు ప్రేరణ ప్రదాత అయ్యారు. పదవీ విరమణ రోజు కూడా సాయంత్రం పర్యటనకు బయలు దేరారు. నెల తరువాత తిరిగి వచ్చారు. యూనివర్సిటీ యాజమాన్యం వీరికి సన్మానం చేయడానికి ఎప్పుడు ప్రయత్నించినప్పటికీ విశాఖపట్నంలో ఉండేవారు కాదు. ఒకసారి వైస్‌ఛాన్సలర్‌ ‌ఫోన్‌ ‌చేసి మీకు యూనివర్సిటీ సన్మానం చేస్తున్నది. తప్పకుండా మీరు ఫలానా తేదీ కార్య క్రమానికి రావాలని అడిగినపుడు, ఇలాంటి సన్మా నాలకు నేను దూరంగా ఉంటున్నానని వినయంగా నవ్వుతూ సమాధానం చెప్పారు.

సంఘంలోనే కాదు, వారి వృత్తిలో కూడా సదా స్నేహశీలిగా ఉండేవారు. అధ్యాపకులుగా వీరి సరళి నియమబద్ధంగా ఉండేది. ఉదయం 8 గంటల నుంచి మొదటి రెండు కాలాంశాలనూ బోధనలో వినియోగించేవారు. తోటి అధ్యాపకులు వారి గదికి వచ్చి తేనీరు సేవించేవారు. ఆ తరువాత ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఖాళీ సమయమే. వారి టే•బుల్‌ ఎదురుగా ఉండే రెండు కుర్చీలు ఎప్పుడూ ఖాళీగా ఉండేవి కావు. యూనివర్సిటీలో ప్రతి విభాగం నుండి వచ్చి ఎవరో మాట్లాడుతుండేవారు. శాస్త్రిగారిని కలవడం ఆనందం. వారి మాటలలో ఒక హృదయతంత్రీ మీటే స్వభావం ఉంది. మధ్యాహ్నం కూడా వారి ఇంటికి ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతూ గడిపేవారు. వారి సంఘ కార్య పర్యటనలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు, అలాగే ప్రయాణ సమయాలలో వారితో సంభాషించేవారికి గొప్ప అనుభూతి కలిగేది. అనౌపచారికంగా వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా చెప్పినట్లు లేకుండా స్వయంసేవకులకు జీవన విలువలకు సంబంధించి, సంఘ సిద్ధాంతానికి సంబంధించి అనేక విలువలను బోధపడేటట్లు చేసేవారు.

అక్షరాలు కుదురుగా, గుండ్రంగా చూడ ముచ్చటగా రాయడానికి చూచి రాతలో రెండు విధానాలున్నాయి. మొదటిపద్ధతి గుండ్రంగా రాసి ఉన్న మొదటి పంక్తిని చూస్తూ పేజీ కింద వరుస నుంచి మొదలుపెట్టి పై వరకు రాయడం, రెండవ పద్ధతి మొదటి పంక్తిని చూస్తూ పై వరుస నుంచి కిందకి రాయడం. రెండవ విధానం వల్ల పొరపాట్లు ఎక్కువ దొర్లుతాయి. గుండ్రటి రాత కూడా చెడి పోతుంది. కనుక మొదటి పద్ధతి ఎల్లప్పుడు శ్రేష్ఠమైనది. ‘డాక్టర్‌జీ పరంపరలో సంఘ పెద్దలు ఎంతోమంది పనిచేసినా, మూల స్రోతస్సు మనకు డాక్టర్‌జీయే కావాలి’ అని అనేకసార్లు శాస్త్రిగారు కార్యకర్తల సమావేశాలలో ఉద్బోధిస్తూ ఉండేవారు.

వర్షం కురిసినపుడు గంగానదిలోనూ, ఒడ్డున కూడా చినుకులు పడతాయి.అవి ఇసుకలో ఇంకిపోతాయి. కానీ నదిలో పడిన చినుకులు గంగ పవిత్రతను ఆపాదించుకుని ఒక ప్రవాహంగా ముందుకు వెళతాయి. భగవంతుని ఆశీస్సులవల్ల సహజంగా మనం సంఘ ప్రవాహంలో కొనసాగుతున్నాం. అంటే ఒడ్డున పడిన చినుకులను బలవంతంగా గంగానదిలోకి తీసుకుపోలేం కదా? అలాగే సంఘం పని చేయడం అన్నది ఎవరి బలవంతం వల్లనో, ప్రోద్బలంతోనో కాక మన జీవితంలో జరిగిన దైవనిర్ణయంగా భావించాలి. వ్యక్తి ద్వారా సంస్థలో ప్రవేశిస్తాం. ఆ తరువాత సంస్థలో మమేకమవుతాం. అయితే సంస్థాభిమానంతో మాత్రమే ఆ తరువాతి మెట్టును కూడా అధిరోహిం చాలి.అదే సిద్ధాంతం..అంటూ గౌతమబుద్ధుని వాక్యాలను ఉదహరించేవారు. బుద్ధం శరణం గచ్చామి (వ్యక్తి), సంఘం శరణం గచ్చామి (సంస్థ), ధర్మం శరణం గచ్చామి (సిద్ధాంతం) .ఆత్మపరిశీలన, ప్రక్షాళన నిరంతరం అవసరమని కార్యకర్తలకు మార్గదర్శనం చేసేవారు. ఆ విధంగా తమ వ్యవహార కుశలతతో అనేకమంది కార్యకర్తలను తయారు చేశారు.

ఆయనది కుటుంబంలో తండ్రి పాత్ర. ప్రేమ, క్రమశిక్షణ కలిసి ఉండేవి. ఆయన దూరదృష్టికి ఈ పాత్ర అద్దంపడుతుంది. ప్రతి సంస్థలోనూ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఒడుదొడుకులు వస్తాయి. బాధ్యతలు మారుతుంటాయి.

సంస్థలో తమకున్న పదవీ బాధ్యతల పట్ల అంటీ అంటని తత్వం ఎంతో అవసరం. పదవీ బాధ్యతల పట్ల మొహం సమస్యలకు దారితీస్తుందని అనే వారు. ఓర్పు, సహనం, కరుణ, ఆత్మీయత, త్యాగం, క్షమత, నిస్వార్థత మొదలైన దైవీగుణాలను పెంచుకుంటే అసుర ప్రవృత్తి సహజంగానే తగ్గిపోతుంది. రాక్షస ప్రవృత్తి నిర్మూలనకై కూడా ప్రయత్నం అవసరం. ద్వేషమూ, అహంకారం, ఈర్ష్య, కోపం ప్రతీకార కాంక్ష, కీర్తికండూతి, స్వార్థం అనేవి రాక్షస ప్రవృత్తులు.

మానవుడు ప్రతి నిమిషం బయటి ప్రపంచంతో సంబంధం కలిగి కార్యక్రమం సాగిస్తున్నపుడు వాటి ఫలితంగా కొంత రాక్షస శక్తుల ప్రభావానికి లోనవుతాడు. దానివలన అలజడి, అశాంతి, స్వార్థం వంటి రాక్షస ప్రవృత్తులు వాటంతటవే పుట్టుకొస్తాయి. వీటిని తెలుసుకొని ఎల్లప్పుడు ఆత్మపరిశీలన, ప్రక్షాళన జరుగుతుంటే తప్ప, మనిషికి దైవస్వరూపం కష్టము అనే వేదాంత దృష్టిని సమయ, సందర్భాలను బట్టి శాస్త్రిగారు గుర్తుచేస్తూనే ఉండేవారు.


డాక్టర్‌జీ ప్రతిబింబం
నాగపూర్‌ ‌తృతీయవర్ష సంఘ శిక్షావర్గలో సుబ్రహ్మణ్యశాస్త్రిగారు సర్వాధికారిగా ఉన్నప్పుడు నాకు ప్రథమంగా పరిచయమయ్యారు. ఆ తరువాత ఆంధప్రదేశ్‌ ‌పర్యటన ద్వారా క్రమేపీ వారితో పరిచయం బలపడింది. విశ్వవిభాగ్‌ ‌సంఘశిక్షావర్గలో నెలరోజులపాటు వారిని దగ్గరి నుండి దర్శించే అవకాశం కలిగింది. పితృతుల్యమైన స్నేహం, కార్యకర్తలందరితో సంభాషించే కుశలత, సంఘ సిద్ధాంతం పట్ల స్పష్టత, ప్రభావవంతమైన వ్యక్తిత్వం, ప్రసన్నమైన వ్యవహారశైలి వారి విశేష గుణాలు. ఈ విషయాలు ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోని కార్యకర్తలకు నాకంటే బాగా తెలుసు.
డాక్టర్‌జీ అమరమైన తీవ్రతపస్సు నుండి ఉద్భవించిన స్వయంసిద్ధ ప్రతిబింబాలలో శాస్త్రిగారి జీవితంకూడా ఒకటి. అవసరమైన మార్గనిర్దేశాన్ని వారి జీవితం మనకు ఇవ్వగలదు. ప్రచారక్‌, ‌గృహస్తు కార్యకర్తలందరు స్వర్గీయ శాస్త్రిగారి జీవితం నుండి అనేక సంఘటనలు సదా ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. వారి జీవితాన్ని అక్షరబద్ధం చేస్తున్న సుబ్రహ్మణ్యశాస్త్రిగారి పుస్తకం ఆవశ్యక మైనది. నిత్యం ఎంతో ఉపయోగపడేది. సంఘకార్యం ఆచరణాత్మకంగా తెలియజెప్పే ఈ పుస్తకం మనందరికీ లభిస్తుంది.
సంఘం వ్యక్తినిష్టపై కాకుండా ధ్యేయనిష్టపై ఆధారపడి పని చేస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. నిరంతరం కొనసాగే ఈ పనిలో 5వ తరానికి చెందిన కార్యకర్తలు తగినంత సంఖ్యలోనే ఉన్నారు. వీరందరూ సంఘ కార్యపద్ధతిని నడిపే శిక్షణ ఎక్కడ, ఏ పాఠ్య పుస్తకాల నుండి పొందారు? సంఘంలో ఇలాంటి పాఠ్యపుస్తకాలు లేవు. సంఘమే తమ జీవన సర్వస్వంగా చేసుకుని జీవించిన అనేకమంది కార్యకర్తల జీవితాలే సంఘ పాఠ్యపుస్తకాలు.

– మాననీయ శ్రీ మోహన్‌జీ భాగవత్‌, ‌పరమపూజనీయ సర్‌సంఘచాలక్‌

– ‌మన కాలం మహర్షి
చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి పుస్తకం నుండి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.