అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ సందర్భంగా భారతీయసంతతికి చెందిన అమెరికా దేశస్థులను ఉద్దేశించి అమెరికా కాంగ్రె స్ సభ్యుడు  శాన్‌ఫోర్డ్ బిషప్ ప్రసంగిస్తూ, హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచిందని పేర్కొన్నారు. మనం హిందూ వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి అని అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తన గురించి ఒక హిందువుగా చెప్పుకోవడానికి తానెంతో గర్విస్తానని తెలిపారు. తాను బలమైన హిందూ కుటుంబంలో పెరిగానని చెప్పారు. మతం మార్చుకోవాల్సిన అవసరం కానీ, భావన కానీ తనకు ఎప్పుడూ రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల్లో ఒకటి హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ  జార్జియా రాష్ట్రం తీర్మానం చేయడమైతే మరొకటి హిందుత్వం పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి బహిరంగంగా ప్రకటించడంగా ఉంది.  ఈ రెండు సంఘటనలూ చాలా ముఖ్యమైనవి. నేటి అంతర్జాతీయ సమాజానికి దిక్సూచి లాంటివి. నిజానికి, హిందుత్వంకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక బహుముఖమైన, భిన్నమైన చర్చ జరుగుతోంది. పాశ్చాత్య దేశాలలో, ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి పెరుగుతున్న దౌత్య, ఆర్థిక పలుకుబడితో పాటు, వసుధైవ కుటుంబకం అనే సార్వత్రిక విలువల ద్వారా మానవాళిలో అత్యధికం హిందుత్వంకు సమున్నతమైన గౌరవాన్ని అందిస్తున్నారు.

ఇదే సమయంలో వామపక్ష భావజాలం కలిగిన అనేక వర్గాలు, మీడియా సంస్థలు హిందుత్వంపై ప్రతికూల ప్రచారాన్ని సృష్టించే ప్రయత్నాల్లో నిరంతరం నిమగ్నమై ఉంటున్నాయి. ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు వీటికి కంటగింపుగా మారాయి. మే 22న “హిందుత్వం అంటే ఏమిటి.. ఈ రాజకీయ ఉద్యమ మూలాలు ఏమిటి?” అనే శీర్షికతో అల్‌జజీరా ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో హిందుత్వకు వ్యతిరేకంగా చేసిన వాదనలు, ‘హిందుత్వ’ అనే పదాన్ని 1923లో వినాయక్ దామోదర్ సావర్కర్ మొదటిసారిగా ఉపయోగించారనే అంచనాపై ఆధారపడి ఉన్నాయి. ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, అల్‌జజీరా వంటి మీడియా సంస్థలు భారతదేశం ఒక రకమైన హిందూ జాతీయవాదం వైపు పయనిస్తోందని, దానివల్ల ప్రజాస్వామ్యం, బహుళత్వం ప్రమాదంలో పడతాయనే ఒక కథనాన్ని వండి వడ్డించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి.

వాస్తవానికి హిందుత్వంపై జరిగే చర్చలో ఆరోపణలు అధికంగా ఉంటాయే తప్ప స్పష్టత ఇసుమంత కూడా ఉండదు. ఒక నగరంలో ఏదైనా నేరపూరిత సంఘటన జరిగిందనుకుందాం. ఆ సంఘటనకు మొత్తం నగరాన్నే బాధ్యులను చేయడం సమంజసం కాదు. అదేవిధంగా కేవలం ఒక సంఘటన లేదా అతివాదుల చర్యల ఆధారంగా మొత్తం హిందూ సమాజాన్ని లేదా దాని సాంస్కృతిక సంప్రదాయాన్ని నిందించినట్లయితే, ఆ చర్చ తన అసలు ఉద్దేశం నుంచి పక్కదారి పడుతుంది. ఏదైనా గంభీరమైన చర్చ ఒక నిర్వచనంతోనే మొదలవు తుంది. చర్చనీయాంశం ‘హిందూ ధర్మం’ అయితే, అలాంటి ఒక చర్చ ధార్మికమైన, తాత్విక కోణాలపై ఆధారపడి ఉండాలి. అదే ‘హిందుత్వం’ గురించి అయితే దాని చారిత్రక, సాంస్కృతిక, సైద్ధాంతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ విషయం ఏదైనా రాజకీయ పార్టీ లేదా సంస్థకు సంబంధించినదైతే, దానిపై చేసే విశ్లేషణ రాజకీయ ప్రాతిపదికన ఉండాలి. అయితే, వీటన్నింటినీ కలిపి గందరగోళం సృష్టించినప్పుడే సమస్య తలెత్తుతుంది.

2021లో ‘డిస్‌మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వం’ (ణGH) పేరుతో ఒక అంతర్జాతీయ ఆన్‌లైన్ సదస్సు జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థ లకు చెందిన అధ్యాపకులు, పరిశోధకుల బృందం దీనిని ఏర్పాటు చేసింది. స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, ప్రిన్స్‌టన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, కార్నెల్, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి 50కి పైగా విశ్వవిద్యాలయాల విభాగాలు, కేంద్రాలు ఈ కార్యక్రమానికి సహ-ప్రాయోజకులుగా వ్యవహ రించాయి. ఈ సందర్భంలో హిందుత్వాన్ని అధిక సంఖ్యాకవాదానికి రూపంగా, అల్పసంఖ్యాక వర్గీయుల హక్కులకు ముప్పుగా చిత్రీకరించారు. అలా ప్రతిపాదించినవారు తాము చేపట్టిన చర్చను ఒక సైద్ధాంతికమైన, విద్యాపరమైన చర్చగా నమ్మబలికారు. అయితే ఇక్కడ విమర్శ జరిగిందన్నది ముఖ్యం కాదు. దానికి బదులుగా భారతీయ నాగరికత, హిందూ భావధార, సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన చర్చ, వాదోపవాదాల పరిధి ప్రపంచస్థాయిలో నిరంతరాయంగా విస్తరిస్తోం దని ఇటువంటి సంఘటనలు సూచిస్తున్నాయి.

నేటి ప్రపంచం ఒకప్పటిలా లేదు. ఆలోచనలు ఇకపై దేశ సరిహద్దులకు పరిమితం కానేకావు. విశ్వవిద్యాలయ పరిశోధనలు, అంతర్జాతీయ సంస్థల నివేదికలు, మీడియా చర్చలు, డిజిటల్ వేదికలపై ప్రచారాలు, ప్రవాస సమాజాలలోని సంభాషణలు అన్నీ కలిసి ఒక ప్రపంచవ్యాప్త చర్చను రూపొందిస్తు న్నాయి. తత్ఫలితంగా ఏదైనా భావజాలం, అస్తిత్వం లేదా సాంస్కృతిక సమూహం గురించిన అభిప్రాయాలు కేవలం స్థానికంగానే మిగిలిపోవు. అవి అంతర్జాతీయ సమాజం దృష్టికి వస్తున్నాయి. కనుక ఏదైనా వేదికపై హిందుత్వాన్ని ఒక నిర్దిష్ట దృక్పథంతో ప్రస్తావించినప్పుడు, దాని ప్రభావం కేవలం ఆ సభా ప్రాంగణానికే పరిమితం కాదని గుర్తుంచుకోవాలి. అక్కడ ప్రస్తావించిన విషయాలు వ్యాసాలుగా రూపాంతరం చెందుతాయి. ఆ వ్యాసాలు చర్చలకు దారితీస్తాయి. ఆ చర్చలు సోషల్ మీడియాకు చేరతాయి. క్రమంగా అవి ఒక స్థిరమైన అభిప్రాయం లేదా దృక్పథంగా మారిపోతాయి.

లక్ష్యంలో స్పష్టత అవసరం

విమర్శకు గురయ్యే అంశం లేదా లక్ష్యం స్పష్ట మైన నిర్వచనానికి నోచుకోనప్పుడు హిందుత్వంపై జరిగే చర్చ గందరగోళానికి దారి తీస్తుంది. ఉదాహరణకు, ఏదైనా ప్రభుత్వ విధానంపై ప్రశ్న తలెత్తినప్పుడు, ప్రభుత్వం సమాధానం చెప్పేలా చూడాలి. ఒక రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం ఉంటే, దానిని రాజకీయ కోణంలోనే పరిశీలించాలి. ఒక సంస్థ కార్యకలాపాలపై చర్చ జరుగుతున్నప్పుడు, ఆ సంస్థే చర్చకు కేంద్ర బిందు వుగా ఉండాలి. కానీ వీటన్నింటినీ కలిపేసినప్పుడు ఆ చర్చ స్వభావమే మారిపోతుంది. హిందుత్వ అనేది వేల సంవత్సరాలుగా పరిణామం చెందిన ఒక పరంపరాగతమైన సంప్రదాయం, జీవనవిధానంగా వర్థిల్లుతున్నది. అత్యధికులు హిందుత్వాన్ని ఒక సాంస్కృతిక నాగరికతాపరమైన అస్తిత్వంగా భావిస్తుండగా, కొందరు విమర్శకులు దీనిని ఒక రాజకీయ సిద్ధాంతంగా నిర్వచిస్తుంటారు. అదేవిధంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అనేది ఒక సంస్థ. భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. భారత ప్రభుత్వం ఒక రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ. వీటిలో ప్రతిదానికీ ఒక ప్రత్యేక స్వభావం, పాత్ర ఉన్నాయి. వీటిలో ఒకదానికి సంబంధించిన విమర్శను మరొక దానికి అన్వయించి నప్పుడు సమస్య తలెత్తుతుంది.

‘హూ ఈజ్ ఎ హిందూ?’ (ఔష్ట్రశీ Is a Hఱఅdu?) అనే తన పుస్తకంలో, స్వాతంత్య్ర వీర సావర్కర్ హిందుత్వం అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదని, అదొక ఇతిహాసమని పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని తీర్చిదిద్దిన సాంస్కృతిక, సామాజిక, జాతీయ అంశాలన్నింటి సమ్మేళనమే హిందుత్వం. 1995లో, రమేష్ యశ్వంత్ ప్రభు వర్సెస్ ప్రభాకర్ కుంటేలి కేసులో ‘హిందుత్వం‘ను విశ్లేషిస్తూ భారత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హిందుత్వం, హిందూ ధర్మాన్ని సంకుచిత మతతత్వ దృక్పథంతో చూడకూడదని జస్టిస్ జె.ఎస్.వర్మ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. భారతీయ యవనికపై హిందుత్వం అనే పదం జీవన విధానాన్ని, సాంస్కృతిక దృక్పథాన్ని సూచిస్తుందని తెలిపింది.

మాట నుండి నింద వరకు..

సార్వజనిక జీవితంలో మాటలు కేవలం మాటలుగా మాత్రమే మిగిలిపోవు. కాలక్రమేణా అవి అర్థాన్ని సంతరించుకుంటాయి. భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. రాజకీయ, సామాజిక ప్రభావాలను కలిగిస్తాయి. ఒక భావనను లేదా అస్తిత్వాన్ని సమాజం ఏ విధంగా చూస్తుందనేది కేవలం వాస్తవాల ద్వారానే కాకుండా, దాని గురించి చర్చించడానికి ఉపయోగించే భాష మీద కూడా ఆధారపడి ఉటుంది. ఒక పదాన్ని వివాదాస్పదంగా మార్చడంలో ఒక ప్రక్రియ ఇమిడి ఉంటుంది. వివాదాన్ని సృష్టించాలనుకునేవారు మొదటగా తమకు పనికి వచ్చే పదాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత దానిని ఏదైనా నైతిక ముప్పు, సామాజిక సమస్య లేదా రాజకీయ భయంతో ముడిపెడతారు. ఆ ముప్పు వాస్తవమేనని నిరూపించడానికి నిర్దిష్ట సంఘటనలను, ఉదాహరణలను తెరపైకి తీసుకొని వస్తారు. క్రమంగా, ఈ ఉదాహరణలను ఒక విస్తృతమైన ధోరణికి లేదా సరళికి సంబంధించిన సాక్ష్యాలుగా చూపించడం మొదలుపెడతారు. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగా విశ్వవిద్యా లయాలు, పరిశోధనా పత్రాలు, మీడియా చర్చలు, డిజిటల్ వేదికల ద్వారా అదే భావన విస్తృత ప్రజానీకానికి చేరుతుంది. నిరంతర పునరావృతం వల్ల, ఆ భావన సామాన్య అవగాహనలో ఒక భాగంగా మారుతుంది. ఫలితంగా చాలా మంది మూలాన్ని అధ్యయనం చేసినా, చేయకపోయినా, ఆ భావనను అదే కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఆరోగ్యకరమైన చర్చలో వాస్తవాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది, ఆ తర్వాతే నిర్ధారణలు వస్తాయి. అయితే, వాస్తవాల కంటే ముందే నిర్ధారణకు వచ్చినప్పుడు, భావజాలం, పక్షపాతానిదే పైచేయి అవుతుంది.

సమంజసమైన విమర్శ

హిందుత్వాన్ని విమర్శించేవారు తరచుగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంటారు. హిందుత్వానికి సంబంధించిన విమర్శలు, బహిరంగ చర్చలను వాస్తవికత, సమతుల్యత, నిష్పాక్షికత వంటి ప్రమాణాల ఆధారంగానే అంచనా వేయాలి. ప్రజాస్వామ్యంలో విమర్శ అత్యవసరమైనది. సమాజం, ప్రభుత్వం, సంస్థలు, భావజాలాలు ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే అవి మెరుగుపడతాయి. కనుక విమర్శ అనేది సర్వసాధారణమైన విషయమే. కాకపోతే ఆ విమర్శ చేసే విధానం, దాని వెనుక ఉద్దేశం ప్రశ్నార్థకమవుతున్నది. ఒక సామాజిక వర్గం కులపరమైన వివక్ష సమస్యను ఎదుర్కొంటున్న ట్లయితే, ఆ అంశంపై చర్చ జరగాలి. ఎక్కడైనా మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుంటే దానిపై ప్రశ్నలు లేవనెత్తాలి. ఏదైనా అల్పసంఖ్యాక వర్గం అభద్రతాభావానికి లోనైతే ఆ విషయాన్ని కూడా పరిశీలించాలి. ఇవన్నీ సమంజసమైన విమర్శ పరిధిలోకి వస్తాయి. అయితే కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా ఒక సమÖహంపై కచ్చితమైన తీర్పు ఇచ్చినప్పుడు పరిస్థితి మారుతుంది. ప్రతి నాగరికత, దేశం లేదా సమాజంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. కేవలం ప్రతికూల ఉదాహరణల ఆధారంగా ఒక సమూహం మొత్తాన్ని దోషిగా ముద్ర వేస్తే, అది కేవలం విమర్శగా మిగిలి పోదు. ప్రపంచమంతటా విస్తరించే ఒక ఆరోపణగా రూపాంతరం చెందుతుంది.

ఒక కథనం ఎలా వ్యాపిస్తుంది?

హిందుత్వకు సంబంధించిన అభిప్రాయాలను, చర్చలను అర్థం చేసుకోవాలంటే, సమాజంలో అవి ఏయే మాధ్యమాలు, ప్రక్రియల ద్వారా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయో పరిశీలించడం కూడా అత్యవసరం. ఏ ప్రధాన భావన అయినా రాత్రికి రాత్రే సమాజంలో స్థిరపడిపోదు. దాని వెనుక వివిధ స్థాయిలలో పనిచేసే ప్రక్రియలు ఉంటాయి. ఒక విశ్వవిద్యాలయంలో ఒక నిర్దిష్ట భావజాలం లేదా సామాజిక సమూహానికి సంబంధించిన ఒక నిర్దిష్ట ముగింపును తెలియజేసే పరిశోధనా పత్రం ప్రచురితమైందనుకుందాం. మొదట్లో దీనిని కొద్దిమంది మాత్రమే చదువుతారు. అయితే, అదే భావన మీడియా కథనాల్లో కనిపించడం, టీవీ చర్చల్లో చోటు చేసుకోవడం, సోషల్ మీడియాలో చిన్న వీడియోలు, పోస్టుల రూపంలో విస్తృతంగా వ్యాపించడం మొదలైనప్పుడు దాని ప్రభావం పెరుగుతూ వస్తుంది. అందుకే, ఒక కథనం లేదా భావనాశక్తి కేవలం దానిలోని ఆలోచనలలోనే కాకుండా, దానిని వ్యాప్తి చేసే విధానాలలో కూడా ఇమిడి ఉంటుంది. నేడు విశ్వవిద్యాలయాలు, మీడియా సంస్థలు, డిజిటల్ వేదికలు, సామాజిక సంస్థలు, ప్రభావవంతమైన వక్తలు, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు, ప్రవాస సమాజాలు అన్నీ ఒక భావనను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించగలవు. ఏ భావన కూడా ఒంటరిగా ప్రయాణించదు. అది వివిధ మాధ్యమాల ద్వారా ప్రయాణించే కొద్దీ మరింత ప్రభావవంతంగా మారుతుంది.

యువత – క్యాంపస్ ప్రపంచం

హిందుత్వ, సాంస్కృతిక అస్తిత్వం, నాగరికతా వారసత్వానికి సంబంధించిన చర్చల ప్రభావం తరచుగా యువతపైనే అత్యంత తీవ్రంగా కనిపిస్తుంది. ఏ సమాజ భవిష్యత్తునైనా విశ్వవిద్యాలయాలు, యువతే తీర్చిదిద్దుతాయి. అందుకే అస్తిత్వం, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన చర్చలు యువతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. నేడు అనేక విద్యాసంస్థల ప్రాంగణాల్లో ధర్మం, జాతీయత, అస్తిత్వం, సంస్కృతికి సంబంధించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యువత తరచుగా ఒత్తిడికి లోనవుతుంటారు.కొంతమంది యువతీయువకులు తమ సాంస్కృతిక గుర్తింపు గురించి మాట్లాడటానికి సంకోచిస్తుంటారు. తమ సంప్రదాయాలు లేదా నాగరికతా వారసత్వం గురించి సానుకూలంగా మాట్లాడితే, తమను ఏదో ఒక నిర్దిష్ట రాజకీయ వర్గానికి చెందినవారిగా ముద్ర వేస్తారేమోనని వారు భయపడతుంటారు. మరోవైపు, మరికొందరు యువకులు ప్రతి విమర్శనూ శత్రుపూరిత చర్యగా భావించి, అతిగా, దూకుడుగా స్పందిస్తుంటారు. ఈ రెండు పరిస్థితులూ సమస్యలను సృష్టిస్తాయి. మొదటిది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే, రెండవది చర్చకు ఉన్న అవకాశాన్ని తగ్గిస్తుంది. వీటికి మధ్య ఉండే మార్గమే సరైనది. యువత తమ సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఆధునిక ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. విమర్శకు-ద్వేషానికి, వాస్తవాలకు-ప్రచారానికి మధ్య ఉన్న తేడాను వారు తెలుసుకోవాలి. అలాగే ఒక భావజాలాన్ని విశ్లేషణాత్మకంగా ఎలా పరిశీలించాలో కూడా వారికి తెలిసి ఉండాలి.

ద్వంద్వ ప్రమాణాల సవాల్

హిందుత్వానికి సంబంధించిన చర్చలు, విమర్శలను అర్థం చేసుకోవడానికి, ఇతర ఏ భావజాలం, సమాజం లేదా వర్గం విషయంలోనైనా విమర్శకులు అనుసరించే న్యాయపరమైన ప్రాథమిక ప్రమాణాన్నే దీనికి కూడా వర్తింపజేయాలి.న్యాయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సూత్రం ఏకరీతి ప్రమాణాన్ని పాటించడం. ఒక నియమం సరైనదని భావించినట్లయితే, అది అందరికీ సమానంగా వర్తించాలి. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, నైతికతకు సంబంధించిన చర్చలలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వేర్వేరు వర్గాల పట్ల ఒకే ప్రమాణాన్ని భిన్నంగా అమలు చేసినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఒక సమాజంలోని లోపాలను నిరంతరం ఎత్తిచూపుతూ, ఇతర సమాజాలలో ఉండే అటువంటి సమస్యల విషయంలో మౌనం వహిస్తే అది సహజంగానే న్యాయబద్ధతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తడానికి దారి తీస్తుంది.ఈ వాదన ఎవరి తప్పులనైనా కప్పిపుచ్చడానికి ఉద్దేశించినది కాదు. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి చర్చించాలి. అయితే, అందరికీ ఒకే విధమైన ప్రమాణాలు వర్తించినప్పుడు మాత్రమే నిష్పాక్షికమైన చర్చ సాధ్యమవుతుంది. కాబట్టి ఏ ప్రధాన చర్చలోనైనా, అన్ని పక్షాలనూ ఒకే కొలమానంతో అంచనా వేస్తున్నారా లేదా అని పరిశీలించడం అత్యవసరం.

తులనాత్మక పరీక్ష అవసరం

హిందుత్వానికి సంబంధించిన చర్చలలో పాల్గొనేటప్పుడు లేదా దానిని విశ్లేషించేటప్పుడు విస్తృతమైన, తులనాత్మక దృక్పథాన్ని అవలంబించడం అత్యవసరం. తద్వారా కేవలం పాక్షిక సమాచారం ఆధారంగానే నిర్ధారణలకు రాకుండా ఉండవచ్చు. ఏదైనా భావన, సంప్రదాయం లేదా సమాజం విమర్శకు గురైనప్పుడు, దానిని ఒక విస్తృత సందర్భంలో కూడా పరిశీలించి అంచనా వేయాలి. కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే నిరంతరం పరిశీలనకు గురిచేస్తూ, ఇతర సామాజిక వర్గాలను దాని నుంచి మినహాయింపు ఇస్తున్నప్పుడు ఒక సమతుల్యమైన నిర్ధారణకు రావడం కష్టమవుతుంది. అందుకే ఏ నాగరికతను లేదా భావజాలాన్ని అర్థం చేసుకోవడానికైనా తూలనాత్మక దృక్పథం అత్యవసరం అని భావిస్తారు. తూలనాత్మక విధానం ద్వారా ఏ సామాజిక వర్గమÖ పరిపూర్ణమైనది కాదని, ప్రతి సంప్రదాయంలోనూ విజయాలు, సవాళ్లు రెండూ ఉంటాయని కూడా తెలుస్తుంది. అందువల్ల, ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని నైతికంగా ఉన్నతమైనది గానో లేదా లోపభూయిష్టమైనదిగానో ప్రకటించడం కంటే దానిని ఒక విస్తృత సందర్భంలో అర్థం చేసుకోవడం మరింత ప్రయోజనకరం.

సమాధానం తార్కికంగా ఉండాలి

హిందుత్వానికి సంబంధించిన చర్చలు, ఆరోపణలకు ఇచ్చే సమాధానాలు కేవలం పైపైన స్పందించేలా ఉండకూడదు. బదులుగా అవి స్పష్టమైన భావనలు, ఆధారాలు, సమతుల్యమైన వాదనలపై ఆధారపడి ఉండాలి. ఒక ముఖ్యమైన చర్చను కేవలం భావోద్వేగాలతో పరిష్కరించలేము. ఒక నిర్దిష్ట భావన గురించి విస్తృతమైన అభిప్రాయం ఏర్పడుతున్నప్పుడు దానికి ఇచ్చే ప్రతిస్పందన కూడా పద్ధతిగా, తార్కికంగా ఉండాలి. దీని మొదటి అంశంగా చర్చాంశం ఏమిటన్నది స్పష్టంగా ఉండాలి. ఆ అంశం స్పష్టంగా లేకపోతే, చర్చ గందరగోళంగానే మిగిలిపోతుంది. రెండవ అంశం సాక్ష్యాధారాలు. ఏదైనా ఆరోపణ లేదా వాదనను వాస్తవాలు, సమాచారం, పత్రాలు, ఆధారాల ప్రాతిపదికన పరిష్కరించాలి. కేవలం భావోద్వేగంతో కూడిన స్పందన దీర్ఘకాలంలో ప్రభావవంతంగా ఉండదు. మూడవ అంశం పోలిక. ఒక సామాజిక వర్గాన్ని లేదా భావజాలాన్ని అంచనా వేస్తున్నప్పుడు, ఇతర సామాజికవర్గాలు, భావజాలాలకు కూడా అవే ప్రమాణాలను వర్తింపజేయాలి. దీనివల్ల నిష్పాక్షికత సాధ్యమవుతుంది. నాలుగవది నాగరికతా నేపథ్యానికి సంబంధించినది. కేవలం సమకాలీన రాజకీయాల ఆధారంగా ఏ సంప్రదాయాన్నైనా పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. దాని చరిత్ర, తత్వం, సంస్కృతి, సామాజిక అనుభవాలను కూడా అవగాహన చేసుకోవడం అత్యవసరం. ఐదవది, చివరిదిగా భావవ్యక్తీకరణలో భాషను వినియోగించే విధానం నిలుస్తుంది. ఏదైనా స్పందన ప్రభావం అది ఏ విధంగా వ్యక్తీ£రించబడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. భాషను ఊతంగా చేసుకొని హుందాగా, స్పష్టంగా, దృఢంగా చేసే భావవ్యక్తీకరణ మరింత బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

పదజాలం

హిందుత్వానికి సంబంధించిన చర్చలలో కూడా ఒక భావనాశక్తి కేవలం దానిలోని వాదనలలోనే కాకుండా, వాటిని వ్యక్తీకరించడానికి ఉపయోగించే భాష, భావనలలో కూడా ఇమిడి ఉంటుందని గ్రహించడం చాలా ముఖ్యం. ప్రతి ప్రధాన చర్చా విధానానికి దానికంటూ ఒక ప్రత్యేక భాష ఉంటుంది. ఏ పక్షం అయితే తనకంటూ ఒక ప్రత్యేక భాషను, భావనలను రూపొందించుకోవడంలో విజయం సాధిస్తుందో, ఆ పక్షమే తరచుగా ఆ చర్చా గమనాన్ని నిర్దేశించడం ప్రారంభిస్తుంది. కాబట్టి, ఇతరులు ఉపయోగించే పదాలకు కేవలం ప్రతి  స్పందించడంతో సరిపోదు. దానికి బదులుగా, మనకంటూ ఒక ప్రత్యేకమైన భావనాత్మక పద జాలాన్ని రూపొం దించుకోవడం కూడా అవసరం. భాష కేవలం భావప్రసార సాధనం మాత్రమే కాదు. అది మన ఆలోచనా విధానాన్ని కూడా తీర్చిదిద్దు తుంది. అందుకే, పదాల ఎంపిక అత్యంత కీలకమైనది. ఒక సామాజికవర్గం తన భావాలను వ్యక్తీకరించడానికి సమర్థవంతమైన భాషను కలిగిఉంటే, అది తన భావ జాలాన్ని మరింత ప్రభావవంతంగా వెల్లడించగలదు.

సన్నద్ధత అత్యవసరం

ఏదైనా చర్చకు లేదా వాదనకు ప్రతిస్పందనను కేవలం వ్యక్తిగత స్థాయిలో రూపొందించలేము. ఒక నిర్దిష్ట భావనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా సంస్థాగత వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు, దానికి ప్రతి స్పందించడానికి కూడా వ్యవస్థీకృత ప్రయత్నాలు అవసరమవుతాయి. ప్రజలు ఒక వివాదానికి తక్షణమే స్పందించడం, కొద్దిరోజుల తర్వాత ఆ చర్చ సద్దు మణగడం తరచుగా గమనించవచ్చు. దీనికి విరుద్ధంగా, వ్యవస్థీకృత సంస్థలు దీర్ఘకాలిక అధ్యయనం, పరిశోధన, సంభాషణల ద్వారా వాటి ఉనికిని నిలబెట్టుకుంటాయి. ఇది అశాశ్వతమైన ప్రతిచర్యకు, దీర్ఘకాలిక సన్నద్ధతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది. ఒక సామాజికవర్గం తన చరిత్ర, సంస్కృతి, సమకాలీన అంశాలకు సంబంధించిన వ్యవస్థీకృత సమాచారాన్ని కలిగి ఉన్నప్పుడు అది మరింత ఆత్మవిశ్వాసంతో సంభాషణలో పాల్గొనగలదు.

వేదిక – సంవాదం

ఒక భావజాలానికి శక్తి కేవలం సత్యనిరూపణతో రాదు. ఆ భావజాలం ఎంతమందికి చేరుతుందనే దానిపైనే దానికి శక్తి ఇనుమడిస్తుంది. ఒక దృక్పథం కొద్ది వర్గాలకే పరిమితమైతే దాని ప్రభావం కూడా పరిమితంగానే ఉంటుంది. అందుకే సంవాదానికి వేదికలు కల్పించడం అత్యంత కీలకం. విశ్వవిద్యాల యాలు, పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, మీడియా వేదికలు, బహిరంగ ఉపన్యాసాలు, యువజన కార్యక్రమాలు డిజిటల్ వేదికలు అన్నీ కూడా భావజాలాల మార్పిడికి ఉపకరించే మాధ్యమాలే. ఒక సామాజిక వర్గం తన అభిప్రాయాలను సమర్థవంతంగా వ్యక్తీకరించాలనుకుంటే, అది ఈ వేదికలపై చురుకైన తన ఉనికిని కొనసాగించాలి. ఈ నేపథ్యంలో యువత పాత్ర అత్యంత కీలకమైన దిగా పనిచేస్తుంది. వారికి కేవలం నినాదాలు మాత్రమే సరిపోవు. వారికి అధ్యయన సామగ్రి, వాస్తవాలు, చారిత్రక పరిజ్ఞానం, రాజ్యాంగంపై అవగాహన, సంభాషణ నైపుణ్యాలు అవసరం. యువత క్రమబద్ధమైన జ్ఞానాన్ని పొందినప్పుడే వారు ఏ చర్చలోనైనా మరింత సమర్థవంతంగా పాల్గొనగలుగుతారు.

స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అత్యవసరం

ఏ భావజాలాన్నీ కేవలం సైద్ధాంతిక సూత్రాలకే పరిమితం చేయలేము. ఏదైనా అంశంపై చిత్తశుద్ధితో పనిచేయాలనుకున్నప్పుడు దానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అత్యవసరం. దీనిలో మొదటి అడుగు ఆ అంశంపై జరుగుతున్న చర్చను అధ్యయనం చేయడం. అందులో వినిపిస్తున్న ఆరోపణలు, తరచుగా వాడే పదజాలం, ఆ చర్చను ప్రభావితం చేస్తున్న వేదికల గురించి క్రమబద్ధమైన విశ్లేషణ చేయడం చాలా ముఖ్యం. తదనంతరం శిక్షణ, డాక్యుమెంటేషన్, అధ్యయన సామగ్రిని రూపొందించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు, సందర్భాలపై అవగాహన ఉన్నవారు మరింత సమతుల్యంగా, ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొన గలుగుతారు. దీర్ఘకాలికంగా చూస్తే, పరిశోధనా నెట్‌వర్క్‌లు, వార్షిక అధ్యయన నివేదికలు, యువతకు శిక్షణా కార్యక్రమాలు, వివిధ వేదికల ద్వారా జరిగే చర్చలు వంటి కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైన విగా పరిగణనలోకి వస్తున్నాయి. వీటి లక్ష్యం ఇతరులతో ఘర్షణకు దిగడం కాదు. దానికి బదులుగా మరింత సమతుల్యమైన, న్యాయమైన చర్చకు దోహదపడటం. విమర్శ సమంజసమైనదైతే దానిని స్వీకరించాలి. ఒకవేళ అది పక్షపాతపూరిత మైనదైతే దానికి తగిన కారణాలతో కూడిన సమాధానం ఇవ్వాలి. అమెరికాలోని జార్జియాలో హిందూ వ్యతిరేక ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు శాన్‌ఫోర్డ్ బిషప్ ఇచ్చిన పిలుపు స్వాగతించదగినది. మానవత్వం, సహ జీవనం, ఆత్మగౌరవాన్ని సమర్థించే హిందుత్వానికి మద్దతుగా తీసుకున్న ఇటువంటి చొరవ, ఒక నాగరిక సమాజపు ప్రజాస్వామ్య, మేధోపరమైన, నైతిక వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తుంది.అదే సమయంలో ఇతర ధర్మాలు, వర్గాల పట్ల అవగాహనను పెంపొందించు కుంటూనే, హిందూ సమాజం తన నమ్మకాలు, చిహ్నాలు, సంప్రదాయాలు, మూల విలువలను లక్ష్యంగా చేసుకునే కుట్రలను, వ్యవస్థీకృత ప్రచారాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని క్రమపద్ధతిలో పెంపొందించుకోవాలి.

హిందుత్వ గురించి తెలుసుకో..!

*       హిందూఫోబియా లేదా హిందూ వ్యతిరేక ద్వేషం అనేది హిందూ అస్తిత్వం, ఆరాధనా పద్ధతులు, దేవీదేవతలు, ధర్మగ్రంథాలు, దేవాలయాలు, చిహ్నాలు లేదా హిందూ సమాజం పట్ల చూపించే పక్షపాతం, అవమానం, ఎగతాళి, తప్పుడు చిత్రీకరణ, వ్యవస్థాగత వివక్ష లేదా హింసాత్మక ద్వేషాన్ని సూచిస్తుంది.

*             హిందువులకు సంబంధించిన ప్రతి విమర్శ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. కానీ, వ్యవస్థాగతమైన అవమానాలను, ద్వంద్వ ప్రమాణాలను సాధారణ విమర్శలుగా అంగీకరించడం కూడా తప్పే అవుతుంది.

*           ప్రపంచవ్యాప్తంగా హిందువుల జనాభా సుమారు 120 కోట్లు. దీని అర్థం హిందూ సమాజం ఇకపై కేవలం భారతదేశానికే పరిమితమైన ధార్మిక-సాంస్కృతిక సమాజం మాత్రమే కాదు. అది ప్రపంచవ్యాప్త ఉనికిని కలిగిన ఒక శక్తిమంతమైన, ప్రభావవంతమైన నాగరిక సమాజంగా కూడా అవతరించింది. అందువల్ల, హిందూ అస్తిత్వం, హిందుత్వ చుట్టూ ఉన్న చర్చను సమగ్రంగా అర్థం చేసుకోవడం, సమాధానం ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే దాని ప్రభావం భారతదేశ సరిహద్దులను దాటి విస్తరించి ఉంది కాబట్టి.

*             ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం అనేది భారతీయ నాగరికత సంప్రదాయానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆమోదానికి నిదర్శనం. ఆరోగ్యం, సమతుల్యత, స్వీయ-క్రమశిక్షణ కోసం యోగాను ప్రపంచం ఒక విశ్వవ్యాప్త ఆచరణగా స్వీకరించింది. హిందూ విశ్వాసం,  సంప్రదాయంలో తప్ప ఇటువంటి విశ్వజనీనత, “సర్వే భవంతు సుఖినః” (అందరూ సుఖంగా ఉండాలి) అనే భావన మరెక్కడా కనిపించదు గాక కనిపించదు.

*             భారతదేశం అధ్యక్షత వహించిన జి`20 సదస్సుకు ఇతివృత్తంగా “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” (One Earth, One Family, One Future) ఉంది. ఇది “వసుధైవ కుటుంబకం” అనే భారతీయ భావన నుండి ప్రేరణ పొందినది. నేటి ప్రపంచ దౌత్యరంగంలో భారతీయ నాగరికతా భావనలకు లభిస్తున్న స్థానానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

*             అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలలో భారతీయ మూలాలున్న ప్రజల సంఖ్య పెరుగుతుండటంతో, హిందూ అస్తిత్వానికి సంబంధించిన చర్చ ఇకపై కేవలం భారతదేశ అంతర్గత చర్చలకే పరిమితం కాలేదు. విదేశాలలో స్థిరపడిన హిందూ సమాజం దేవాలయాలు, పండుగలు, భాష, కుటుంబ వ్యవస్థలు, యోగా, భారతీయ వంటకాల సంస్కృతి ద్వారా తన అస్తిత్వాన్ని బహిరంగంగా చాటుకుంటోంది.

*           అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారతీయ మూలాల ప్రజల జనాభా 50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. అక్కడ అత్యంత విద్యావంతులుగా, ఆర్థికంగా విజయవంతమైన వలస సమూహాలలో వీరు కూడా ఉన్నారు. తత్ఫలితంగా అమెరికా విశ్వవిద్యాలయాలు, మీడియా, చట్టసభలలో హిందూ అస్తిత్వంపై జరుగుతున్న చర్చలు ఈ వర్గంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి.

*             హిందూ సమాజంపై జరిగే విమర్శలలో కుల వ్యవస్థకు సంబంధించిన అంశం తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. దీనిని కాదనడం సమంజసం కాదు. అయితే హిందూ సమాజంలోనే స్వీయసంస్కరణకు సంబంధించిన సుదీర్ఘ సంప్రదాయం ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుద్ధుడు, కబీర్‌దాస్, సంత్ రవిదాస్, చైతన్యప్రభు, నారాయణగురు, స్వామి దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయులు బలమైన సామాజిక సంస్కరణ సంప్రదాయాన్ని నెలకొల్పారు.

*             నేడు మహానగరాలలో, మెట్రోలు, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లోనూ, హోటళ్లు, ఆసుపత్రుల్లోనూ, అలాగే బహిరంగ తాగునీటి కేంద్రాలు, యాత్రికుల విశ్రాంతి గృహాలు, దేవాలయాల్లోనూ కుల వ్యవస్థకు సంబంధించిన రుగ్మత, వైపరీత్యం కనుమరుగయ్యాయి.

*           భారతీయ సంప్రదాయంలో ఆత్మవిమర్శ, చర్చ, తత్వచింతన, సంస్కరణ,  సామాజిక పునర్నిర్మాణాల అవిచ్ఛిన్న ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి భారతీయ సంప్రదాయమే హిందూ సంప్రదాయంగా విరాజిల్లుతున్నది.

‘పాంచజన్య’ నుంచి

అనువాదం: మహేష్ ధూళిపాళ్ళ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.