ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ చేసుకున్న సంస్థ కాదు అంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా ఓ ప్రశ్న లేవదీశారు. ఇది అజ్ఞానమా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అదీ కాకుంటే అభద్రతా భావమా? అనే ఒక ముఖ్యమైన సందేహానికి ఇలాంటి ప్రశ్న దారితీస్తుంది. నవంబర్ 9, 2025న బెంగళూరులోనే ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సరిగ్గా ఇదే అంశంపై స్పష్టంగా మాట్లాడారు. అయితే జూన్ 15, 2026న తాము ఒక “ప్రశ్నను పంపామని” ఖర్గే ఇప్పుడు పేర్కొంటున్నారు. ఆయన అప్పట్లో కర్ణాటక సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా ఉండేవారు. కాబట్టి, తన సొంత రాష్ట్ర రాజధానిలోనే కొద్ది నెలల క్రితం విస్తృతంగా చర్చకు వచ్చిన వివరణ గురించి ఆయనకు తెలియదనుకోవడం నమ్మశక్యం కాని విషయం. అప్పట్లో ఆయనకు ఈ విషయం తెలియని రీతిలో ఆయన శాఖ పనితీరు ఉన్నది అని అనుకున్న పక్షంలో ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న ఖర్గే ఆ రికార్డులను తెప్పించుకొని సమాధానం తెలుసుకోవచ్చు.
ఇదే ఖర్గే నవంబర్ 9, 2025న ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ విషయంలో ఓ ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా.. ఇది చట్టపరమైన సూక్ష్మమైన అంశానికి సంబంధించిన విషయం కాదు. భారత రాజ్యాంగం “వ్యక్తుల సమూహం” (Body of individuals)ను చెల్లుబాటు అయ్యే న్యాయపరమైన సంస్థలుగా గుర్తిస్తుంది. దశాబ్దాలుగా భారతీయ న్యాయస్థానాలు కూడా ఈ చట్రం పరిధిలోనే ఆరఎసఎస్ హోదాను, పనితీరును గుర్తించాయి. ఈ సంస్థ నిర్మాణం, దాని రూపకల్పనరీత్యా, సాంప్రదాయ నమోదిత సంఘం లేదా ట్రస్ట్ తరహాలో అది లేదు. అదే తీరుగా వ్యవహరించడానికి దానికి పూర్తి చట్టపరమైన హక్కు ఉంది అనే వివరణ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. మరి అదే ప్రశ్నను ఎందుకు పట్టుబట్టి మరీ అదేపనిగా అడుగుతున్నారు? ఇప్పటికే బహిరంగంగా, చట్టపరంగా సమాధానం చెప్పినా సరే మళ్లీ మళ్లీ అడగడమెందుకు? ఒక ప్రముఖ వ్యక్తి ఒకే ప్రశ్నను పదేపదే లేవనెత్తినప్పుడు అది కాస్త అడిగినట్లు కాకుండా నిందారోపణలు చేస్తున్నట్లుగానే ఉంటుంది. అందరూ అలాగే అనుకుంటారు కూడా. ఈ విషయంలో స్పష్టత, వివరణ కోరే కన్నా కూడా ఎలాంటి సందేహమే లేని చోట, సందేహాన్ని సృష్టించే ప్రయత్నం కిందికే ఇదంతా వస్తుంది. అయితే కొన్ని సంస్థలను ఎంపిక చేసుకొని వాటిపై విమర్శలకు దిగడంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ సంస్థలతో సౌకర్యంగా ఉంటే వాటి జోలికి వెళ్లదు. అదే సంస్థలు తనకు రాజకీయంగా ప్రయోజనకరంగా లేని సమయంలో వాటిని ప్రశ్నిస్తుంది. చట్ట పరిధిలో పనిచేస్తూ, కాలక్రమేణా పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఆమోదం పొందిన ఒక సంస్థ చట్టబద్ధతను ప్రశ్నించడం అనేది సంస్థాగతంగా ఆ సంస్థ స్థిరత్వం పొందిన విషయంపై ఆందోళన చెందుతున్నారనే అనిపిస్తుంది. ఉద్దేశం నిజాయతీతో కూడుకున్నదైతే, ఆ స్పందనను గుర్తించి, దానిపై చర్చించి, లేదా సారాంశంతో కూడిన ఖండన ఇచ్చి ఉండేవారు. దానికి బదులుగా సందర్భానికి సంబంధం లేకుండా, ముందస్తు వివరణను పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ అదే ప్రశ్నలు వేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అడిగిన ప్రశ్నలే అడగడం కంటే విస్తృతమైన బహిరంగ చర్చే మెరుగైంది. కొత్త వాదనలు చేస్తే, వాటిని బహిరంగంగా చేయనివ్వాలి. కానీ విచారణ ముసుగులో స్థిరపడిపోయిన విషయాలను తిరిగి తవ్వడం అనేది ఒక పరిశీలనగా కాకుండా ఒక వ్యూహంగా భావించాల్సి ఉంటుంది. వీటి మధ్య తేడాను క్షుణ్ణంగా చూడటంలో దేశ ప్రజలు సమర్థులు.
“ఈ అంశంపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ కాకుండా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. మాది ఏదీ రహస్యం కాదు.. బహిరంగంగానే పనిచేస్తున్నాం. మేం ప్రజలను పిలిచి సంఘం గురించి చెబుతున్నాం. ఇదంతా రాజకీయం. ఇలాంటి ఎత్తుగడలు వేయడం సహజం. సంఘ్ ఏర్పడిన 10-15 ఏళ్ల నుంచే, మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాము. మాకు ఇవన్నీ అలవాటే.. అక్కడేమీ ఉండదు గానీ, ఏదో ఉన్నట్టు అనుకుంటాం (ఖర్గే వంటి విమర్శకుల భావనలో). అందువల్ల మేం స్పందించాల్సిన పని లేదు. బ్రిటిష్ కాలంలో సంఘం ఏర్పడింది. ప్రజా మోదంతోనే ఆరంభమైంది. అప్పట్లో మేధోమథనం జరిపినవారు ముందుకెలా సాగారో మీకు చెప్పాను. ఏకాభిప్రాయంతో కార్యాచరణ సాగింది. అదీ సంఘం అంటే.. అందుకే దానికి ఎలాంటి ఆటంకం లేదు. హిందూ ధర్మం కూడా రిజిస్టర్ కాలేదు. అలా చాలానే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎవరైతే నిధులు కావాలనుకుంటారో వారికి రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అది అవసరం. అయితే, సంఘం ఉందన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. మమ్మల్ని రెండుసార్లు నిషేధించింది. కానీ ఒకసారి కోర్టు ఆదేశంతోను, మరోసారి సత్యాగ్రహం కారణంగా నిషేధాన్ని తొలగించారు. అందువల్ల ప్రభుత్వానికి ఆర్ఎస్‌ఎస్ గురించి తెలుసు. వారు ఆర్ఎస్‌ఎస్‌ని గుర్తించారు కాబట్టే దానిపై నిషేధం విధించారు. ఈ 100 సంవత్సరాల కాలంలో ఇలాంటివి చాలా జరిగాయి. మేం రిజిస్టర్ కావాలని ఏ ఒక్కరు చెప్పలేదు. మా లిఖితపూర్వక రాజ్యాంగం ప్రభుత్వం దగ్గరుంది. మేం 1950 దశకంలోనే ప్రభుత్వానికి దానిని సమర్పించాము. అప్పుడే మేం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉందని ప్రభుత్వం చెప్పవచ్చు .మేమÖ ఆ పని చేసి ఉండేవారం. వాళ్లు(ప్రభుత్వం) ఏమీ చెప్పలేదు. అందుచేత నేనెందుకు స్పందించాలి? ఇదంతా రాజకీయం. ఇదేమంత తీవ్రమైన విషయం కాదు. ఏదో ఒక విధంగా సంఘం పనిని ఒకవైపు అడ్డుకుని, ప్రజల మనస్సుల్లో అనుమానాలు రేకెత్తించాలని వాళ్లు(పరోక్షంగా ఖర్గేను ఉద్దేశించి) అనుకుంటున్నారు. ఇకపై ఇలాంటివి సాధ్యం కాదు. ఎందుకంటే మేమేంటో ప్రజలకు తెలుసు కాబట్టి. మేము రహస్యంగా పనిచేస్తున్నామని వారు విమర్శిస్తుంటారు. మా కార్యకర్తలు అన్ని చోట్లా ఉన్నారు. ప్రజలు వారిని ప్రతిరోజూ చూస్తుంటారు. మా శాఖలు ప్రజలు చూస్తుండగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుంటాయి. మేం బహిరంగ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటాం. ఈ ఏడాది మేం చాలా మందిని కలుసుకున్నాం. ప్రతి చోటా హిందూ సమ్మేళనం జరుపుకున్నాం. మా పని రహస్యంగా చేసుకునేది అయితే ఇవేవీ సాధ్యం కావు.”
– కేరళ, త్రిశూర్‌లో సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్
ఆర్ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం నేరమా?
సంఘ శతాబ్దిని పురస్కరించుకొని కేరళలోని తిరువనంతపురంలో ఆర్ఎస్‌ఎస్ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రముఖులతో పాటుగా కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైఎస్ చాన్సెలర్(వీసీ), కేరళ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ డా. మోహనన్ కున్నుమ్మల్, మహాత్మా యూనివర్సిటీ వీసీ డాక్టర్ డి.మావూతు, మలయాళం యూనివర్సిటీ వీసీ డాక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ కీలక ఉపన్యాసం చేశారు. అయితే.. ముగ్గురు వీసీలు పాల్గొనడాన్ని కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తీవ్రంగా తప్పుపట్టారు. దాన్ని ఒక పెద్ద వివాదంగా చేశారు. సంఘ శతాబ్దిని పురస్కరించుకొని, ఆర్ఎస్‌ఎస్ ప్రతినిధులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులను కలవడం సర్వసాధారణంగా జరుగుతున్నది. అలాగే సంఘ కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. అయితే మొదట్నుంచి కూడా ఆరఎసఎస్ ప్రచారానికి, హంగూ ఆర్భాటాలకూ దూరంగా ఉంటూ వస్తున్నది. తనపనేదో తాను చేసుకుంటూ పోతున్నది. దీంతో పలువురు ప్రముఖులను ఆర్ఎస్‌ఎస్ కలిసిన సంగతి వార్తలుగా బయటికి రాలేదు. అయితే తిరువనంత పురంలో సమావేశం బహిరంగంగానే జరిగింది. అందులో ఆరఎసఎస్ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు, వేర్వేరు రంగాలలో సంఘ దృక్పథాన్ని మోహన్ భాగవత్ వివరించారు. వారి ప్రసంగంలో ఎలాంటి రాజకీయ ప్రస్తావనలు కానీ, మత ఛాందసాలు కానీ ఏమీ లేవు. అయినప్పటికీ ముగ్గురు వీసీలు క్షమాపణలు చెప్పాలని కేరళ సీఎం వీడీ సతీశన్ డిమాండ్ చేశారు. వారిని తీవ్ర పదజాలంతో విమర్శించారు. మతతత్వానికి చట్టబద్ధత కల్పించే ఏ చర్య అయినా ఆమోదయోగ్యం కాదని అన్నారు. వీసీలు తమ పదవుల గౌరవాన్ని, హుందాతనాన్ని తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు. అయితే వీసీలకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే వీ మురళీధరన్ నిలిచారు. విద్యావేత్తలను సతీశన్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన విమర్శల వెనుక ఉన్న తర్కాన్ని ఆయన ప్రశ్నించారు. ఆర్ఎస్‌ఎస్ అనేది ఒక ప్రధాన సామాజిక-సాంస్కృతిక సంస్థ. ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా ఆర్ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆర్ఎస్‌ఎస్ ఏమీ నిషేధ సంస్థ కాదు. అది ప్రజాస్వామ్య, సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ సమావేశానికి హాజరైతే ఎందుకు క్షమాపణలు చెప్పాలని జాతీయవాదులు ప్రశ్నిస్తున్నారు. 1947 నుండి ఆర్ఎస్‌ఎస్‌ను ప్రజలకు శత్రువుగా చిత్రీకరించడాన్ని ఒక విధానంగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుంది. అన్ని వర్గాల ప్రజలలో సంఘం, దాని సిద్ధాంతాలకు పెరుగుతున్న ఆదరణను చూసి భయపడుతోంది. ఈ ధోరణే సంఘ శతాబ్ది ఉత్సవాల వరకూ కొనసాగుతోంది. కొందరు కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పుకోసం ఆరఎసఎస్‌ను విమర్శిస్తుం టారు. వారికి ఇదో అలవాటుగా కూడా మారి పోయింది.
ఖర్గేకు ఎమర్జెన్సీ పాఠం
ఆర్ఎస్‌ఎస్ ఎక్కడా అధికారికంగా నమోదు కానందున అది ఒక “రహస్య సంస్థ” అని సూచిస్తూ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ వాక్చాతుర్యం మాత్రమే కాదు. అవి భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల పట్ల లోతైన అపార్థాన్ని, భారత నాగరిక, సంస్థాగత సంప్రదాయాల పట్ల అగౌరవాన్ని వెల్లడిస్తున్నాయి. దేశంలోని దాదాపు ప్రతి గ్రామంలో వేళ్లూనుకున్న దశాబ్దాల నాటి జాతీయ ఉద్యమాన్ని కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదనే ప్రాతిపదికన అంచనా వేయడానికి ప్రయత్నించడం, చట్టబద్ధత అంటే అధికారిక గుర్తింపు అని భావించే వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
రాజ్యాంగ విలువల గురించి ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వాలనుకునేవారు ముందుగా రాజ్యాంగాన్ని జాగ్రత్తగా చదవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(సి) ప్రతి పౌరునికి సంఘాలు లేదా యూనియన్లను ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కుకు హామీ ఇస్తుంది. ఒక సంఘం ఉనికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌పై ఆధారపడి ఉండదు. సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం లేదా ట్రస్ట్ చట్టం కింద నమోదు అనేది ప్రాథమికంగా ఒక పరిపాలనా కార్యక్రమం. బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆస్తిని సంపాదించడం, గ్రాంట్లు లేదా పన్ను మినహాయింపులు పొందడం వంటి కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఇది రూపొందింది. ఇది రాజ్యాంగబద్ధతకు అంతిమ పరీక్ష కాదు. పౌరుల శాంతిభద్రతలకు, జాతీయ సార్వభౌమత్వానికి లేదా రాజ్యాంగ పాలనకు ముప్పు కలిగించని ఏ సంఘమైనా, అది రిజిస్టర్ అయినా కాకపోయినా, రాజ్యాంగ రక్షణలో పనిచేయడానికి పూర్తిగా హక్కు కలిగి ఉంటుంది. కేవలం కేంద్రీకృత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదనే కారణంతో ఆర్ఎస్‌ఎస్‌ను “రహస్య” లేదా “చట్టవిరుద్ధ” సంస్థగా వర్ణించడం, ప్రజాస్వామ్యంలో పౌర సమాజాన్ని రక్షించే రాజ్యాంగ స్వేచ్ఛల పట్ల ఉన్న అపార్థాన్ని ప్రదర్శిస్తుంది.
వలస పాలన వారసత్వం
సామాజిక దృక్కోణం నుండి చూస్తే ప్రతి సామాజిక సంస్థ తప్పనిసరిగా అధికారిక రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధతను పొందాలనే పట్టుదల కూడా వలసవాద పాలన వారసత్వమే అవుతుంది. భారతీయ నాగరికత చారిత్రాత్మకంగా వికేంద్రీకృత, సమాజ-ఆధారిత, స్వీయ-నియంత్రణ సంస్థల ద్వారా పరిణామం చెందింది.ప్రాచీన మఠాలు, సంప్రదాయ మఠాలు, వేద పాఠశాలలు, గ్రామ భజన మండళ్లు, సామాజిక ట్రస్టులు, స్థానిక ఉత్సవ కమిటీలు తరచుగా వలసవాద చట్టపరమైన నిబంధనల నుండి చట్టబద్ధతను పొందకుండా తరతరాలుగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వాటి అధికారం సామాజిక విశ్వాసం, ఉమ్మడి విలువలు, సామాజిక భాగస్వామ్యంపై ఆధారపడి ఉంది. ఆర్ఎస్‌ఎస్ ఈ స్వదేశీ సంస్థాగత సంప్రదాయానికి కొనసాగింపుగా నిలుస్తుంది. అటువంటి సామాజిక ఉద్యమాన్ని కేవలం అధికారిక నమోదు అనే దృష్టితో అంచనా వేయడం, భారతదేశ నాగరిక సంస్థల సహజ స్వభావాన్ని అపార్థం చేసుకోవడమే అవుతుంది.
పారదర్శకత-ఆర్థిక స్వావలంబన
ఆరఎసఎస్ చట్టానికి వెలుపల పనిచేస్తుందని లేదా రహస్యంగా పనిచేస్తుందనే ఆరోపణ కూడా అంతే తప్పుదోవ పట్టించేదిగా ఉంది. ఆర్ఎస్‌ఎస్ ప్రాథమికంగా సామాజిక-సాంస్కృతిక ఉద్యమానికి నడుం బిగించిన సైద్ధాంతిక సంస్థ. చట్టపరమైన ఆర్థిక లావాదేవీలు ఎక్కడ జరిగినా దానికి సంబం ధించిన నిర్ధారిత విధానాలను అది అనుసరి స్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరఎసఎస్ కార్యా లయాలు, ఆస్తులు సాధారణంగా చట్టబద్ధంగా నమోదైన ట్రస్టుల ద్వారా నిర్వహణలో ఉంటాయి. ఇవి ఖాతాలను నిర్వహిస్తూ, వర్తించే చట్టాలను పాటిస్తాయి. అంతేకాకుండా ఆర్ఎస్‌ఎస్ స్ఫూర్తితో ఏర్పడిన అనేక సంస్థలు, ఉదాహరణకు విద్యా రంగంలో విద్యాభారతి, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్), సామాజిక సేవలో సేవా భారతి, గిరిజన అభివృద్ధిలో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వంటివి దేశ చట్టపరమైన చట్రంలో పనిచేస్తూ, సక్రమంగా నమోదైన సంస్థలుగా ఉన్నాయి. ప్రభుత్వ గ్రాంట్లు లేదా విదేశీ నిధులపై ఆధారపడే అనేక సంస్థల తరహాలో కాకుండా, ఆర్ఎస్‌ఎస్ ప్రధానంగా తన స్వయంసేవకులు ఏటా అందించే గురుదక్షిణ అని పిలుచుకునే స్వచ్ఛంద విరాళాల ద్వారానే తన ఉనికిని కాపాడుకుంటుంది. ఈ ఆర్థిక స్వావలంబన నమూనా, సంస్థ తన సభ్యులకు సమాజానికి జవాబుదారీగా ఉంటూనే స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కల్పించింది. న్యాయస్థానాలు వెలువరించిన అనేక తీర్పులు కూడా ఈ నమూనాను సమర్థించాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆర్ఎస్‌ఎస్
ఆర్ఎస్‌ఎస్‌ను రాజ్యాంగ వ్యతిరేక సంస్థగా చిత్రీకరించే ముందు, చరిత్ర పుటలను ఒకసారి పరిశీలించాలి. 1975లో విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా పోయినప్పుడు, పౌర హక్కులు కుదించుకు పోయినప్పుడు, రాజ్యాంగబద్ధమైన పాలన తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు నిరంకుశత్వాన్ని ఎదిరించిన ప్రధాన శక్తులలో ఒకటిగా ఆరఎసఎస్ నిలిచింది. ప్రాథమిక హక్కులు నామరూపాల్లేకుండా పోయినప్పుడు వేలాది మంది ఆరఎసఎస్ స్వచ్ఛంద కార్యకర్తలు జైలుపాలయ్యారు. రహస్య ప్రతిఘటన ఉద్యమాలలో పాల్గొన్నారు. అధికార కేంద్రీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే పోరాటంలో చాలామంది తమ వృత్తి జీవితాలను, స్వేచ్ఛను, వ్యక్తిగత భద్రతను పణంగా పెట్టారు. ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడంలో, రాజ్యాంగబద్ధమైన పాలన పునరుద్ధరణకు దోహదపడటంలో ఆరఎసఎస్ కార్యకర్తలు పోషించిన పాత్ర ఆధునిక భారతీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన ఒక చెక్కుచెదరని అధ్యాయం. కాబట్టి, ప్రజాస్వామ్య స్వేచ్ఛను పునరుద్ధరించే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సంస్థ రాజ్యాంగబద్ధమైన నిబద్ధతను, అత్యవసర పరిస్థితి కాలం నాటి వారసులు ఇప్పుడు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.
పరిణతితో కూడుకున్న బహిరంగ చర్చ అవసరం
రాజ్యాంగంపై పరిణతి చెందిన అవగాహనకు కేవలం చట్టపరమైన నిబంధనలను అక్షరాలా చదవడం సరిపోదు. వాటి వెనుక ఉన్న అంతరార్థాన్ని లేదా స్ఫూర్తిని గ్రహించడం అవసరం. ఒక సంస్థ విలువను కేవలం ప్రభుత్వ కార్యాలయంలోని ధ్రువీకరణ పత్రం ఉనికిని బట్టి నిర్ణయించలేము. దానికి బదులుగా సమాజానికి అది అందించిన సహకారం, సంక్షోభ సమయాల్లో అందించిన సేవ, దేశ నిర్మాణంలో దాని పాత్ర ఆధారంగా దానిని అంచనా వేయాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజం. అయితే, రాజ్యాంగ సూత్రాలు, చారిత్రక వాస్తవాలకు సంబంధించిన చర్చలు మేధోపరమైన గంభీరత, వాస్తవిక కచ్చితత్వంతో జరగాలి. అటువంటి చర్చలను కేవలం రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాల గురించిన పైపైన వాదనలకు పరిమితం చేయడం వల్ల ప్రజాస్వామ్య చర్చా విధానం బలపడదు. ఆర్ఎస్‌ఎస్‌తో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా సామాజిక సేవ, జాతీయ సమగ్రత, ప్రజలలో చైతన్యం పెంపొందించడంలో ఆ సంస్థ శతాబ్ద కాలంగా అందించిన సహకారాన్ని కేవలం పరిపాలనాపరమైన సాంకేతిక అంశాలతో కొట్టిపారేయలేం. రాజకీయ చర్చను నిరాధారమైన ఆరోపణలకు కుదించకుండా, దాని స్థాయిని పెంచాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంది. రాజ్యాంగ అవగాహన, చారిత్రక చైతన్యం, మేధోపరమైన నిజాయతీతో కూడిన విభేదాలు వ్యక్తమైనప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
ఆర్ఎస్‌ఎస్‌తో వీవీ గిరి, ప్రణబ్ ముఖర్జీ
ఆర్ఎస్‌ఎస్ చరిత్ర గురించి కేరళ సీఎం వీడీ సతీశన్‌కు పెద్దగా తెలియక పోవడం విచారకరం. మహాత్మాగాంధీ, బి.ఆర్. అంబేద్కర్, కైలాష్ నాథ్ కట్జూ (నెహ్రూ కేబినెట్‌లో హోం మంత్రిగా, మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేశారు) వంటి ప్రముఖులు ఆరఎసఎస్ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఉన్నారు. ఇదే విషయమై కైలాష్‌నాథ్ కట్జూను నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినప్పుడు, “ఒకసారి మీరు ఆరఎసఎస్ కార్యక్రమంలో పాల్గొంటే, స్వయంసేవకులను ప్రశం సించకుండా ఉండలేరు. స్వయంసేవకులకు అటువంటి క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి” అని ఆయన బదులిచ్చారు. 2018లో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో ఆర్ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌తో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. ఆ పర్యటన సందర్భంగా, ఆయన సందర్శకుల పుస్తకంలో ఆర్ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గెవర్ “భారతమాత ముద్దుబిడ్డ”గా అభివర్ణిస్తూ రాశారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు మోహన్ భాగవత్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఆతిథ్యం కూడా ఇచ్చారు. మే 15, 1983న హరిద్వార్‌లో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్మితమైన ‘భారతమాత మందిరాన్ని’ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. సెప్టెంబర్ 2, 1970న కన్యాకుమారిలో వివేకానంద స్మారక చిహ్నాన్ని అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి ప్రారంభించారు.
‘ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’
దేశంలోని యువతపై ఆర్ఎస్‌ఎస్ ఎంతో ఆశాభావంతో ఉందని, నేటి యువత తమ సంప్రదాయాలతోనూ, భారతదేశపు ఘనమైన చరిత్రతోనూ అనుసంధానమై ఉందని ఆరఎసఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. పుణె శ్రామిక్ పాత్రకార్ సంఘ్ శతాబ్ది వేడుకల సందర్భంగా నవీపేఠ్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సునీల్ అంబేకర్ పాల్గొన్నారు. సంఘం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొందరు రాజకీయ నేతలు సృష్టిస్తున్న గందర గోళాన్ని తోసిపుచ్చారు. సంఘ్ చట్టబద్ధమైన ఉనికికి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన వివాదమూ లేదు. స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు దురుద్దేశపూర్వక ప్రయత్నం చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఆరఎసఎస్ పూర్తిగా చట్టబద్ధమైన గుర్తింపు పొందిన ఒక సామాజిక సంస్థ. అందుకే, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వివిధ జాతీయ విపత్తుల సమయంలోనూ, నిర్మాణాత్మక కార్యక్రమాలలోనూ ఆయా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సంఘం క్రియాశీల సహకారాన్ని కోరుతూ వచ్చాయని గుర్తు చేశారు. సంఘ పథ సంచలన్ విషయంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం యంత్రాంగం నుంచి అనుమతి లభించిందని, అంతేకాకుండా తమ శాఖల పేర్లతో అధికారికంగా బ్యాంక్ ఖాతాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే సంఘ ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా పారదర్శకంగా ఉంటాయని, కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరుగుతాయన్నారు. తన దైనందిన ‘శాఖ’ వ్యవస్థ ద్వారా, సంఘం ప్రతిరోజూ సమాజానికి ప్రత్యక్షంగా జవాబుదారీగా ఉంటుందన్నారు.
– జాగృతి డెస్క్