80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఎర్రకోట బురుజులు సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యావత్ భరత జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రతి ఒక్క భారతీయుణ్ణి రోమాంచితం చేసింది. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత 13వసారి పంద్రాగస్టు ప్రసంగం చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి అన్నట్టుగా దేశరాజధానిలో జరిగిన ఈ వేడుకల్లో వందేమాతరం గీతాలాపన జరిగింది. ఎర్రకోటకు మోదీ చేరుకోగానే త్రివిధ దళాలకు చెందిన సంగీత వాయిద్యాల బృందం వందేమాతరాన్ని అత్యంత మృదుమధురంగా పలికించింది. అక్కడే ఉన్న అతిథులందరూ గీతాలాపనకు గొంతు కలపడంతో దేశభక్తి వాతావరణం తొణకిసలాడింది. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అన్నట్టుగా ప్రధాని చేసిన ప్రసంగం దేశ ప్రజల కలలను సాకారం చేయడంలో సరికొత్త ప్రయత్నానికి బాటలు వేసింది. దానికే సప్తధార అని ప్రధాని నామకరణం చేశారు. ఉత్పాదక రంగం నుంచి ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల దాకా ఇలా ప్రతి దానిలోనూ శక్తిని పెంపొందించుకుంటూ ఏడు శక్తుల సమాహారంతో వికసిత భారత్ లక్ష్య సాధనకు యుక్తిని వినియోగించాలిన్స ఆవశ్యకతను మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. అంతరిక్ష పరిశోధనల నుంచి జనగణన దాకా యువత పాత్రను పేర్కొన్నారు. కృత్రిమ మేధ(ఏఐ) ఆవశ్యకతను నొక్కి చెబుతూ వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ ఇస్తామని ఎర్రకోట బురుజుల నుంచి ప్రధాని ప్రకటించారు. అదే సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కోచింగ్ రూపేణా అదనపు ఆర్థిక భారాన్ని నివారించడానికి పరీక్షార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నామని యువతకు హామీ ఇచ్చారు. దేశంలో నక్సలిజం లేదా మావోయిజం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినప్పటికీ మానసిక నక్సల్స్(దిమాగి నక్సల్స్) ముప్పు ఇంకా పోలేదని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశప్రజలను హెచ్చరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఆ ఘనత ఏదో మీరే తీసుకోండి అని పార్టీల నేతలకు సూచించారు. బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవడం ద్వారా వికసిత భారత్ లక్ష్య సాధన వైపు వడివడిగా అడుగులు వేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని ప్రసంగంలోని కీలకమైన భాగాలు యథాతథంగా జాగృతి పాఠకుల కోసం…
గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఖాదీ, గ్రామ పరిశ్రమల రంగం ఉత్పత్తి దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు ఏడు రెట్లు, ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 35 రెట్లు పెరిగింది. ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఆవిష్కరణల ప్రపంచంలోనూ మనదైన ముద్ర వేశాం. ఇంటర్నెట్ వినియోగదారులు, కస్టమర్ల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. మంజూరైన పేటెంట్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరిగాయి. సాధారణ పౌరుల దైనందిన జీవితాలను మెరుగుపరిచేందుకు మేం కూడా అంతే శ్రద్ధతో పనిచేశాం. గతంతో పోలిస్తే సగటున 15 రెట్లు వేగంగా నల్లా నీటి కనెక్షన్లను ఏటా అందించాం. గ్యాస్ కనెక్షన్లు ఏటా సగటున ఆరు రెట్లు వేగంగా అందిస్తున్నాం. పేదల కోసం మరుగుదొడ్ల నిర్మాణం వార్షిక రేటు కన్నా నాలుగు రెట్లు వేగంగా జరుగుతోంది. పేదలకు ఇళ్లు సమకూర్చే వేగం ఏటా మూడు రెట్లు పెరిగింది.

1.75 కోట్ల గృహాలకు పైప్‌లైన్ గ్యాస్
2014కు ముందు, అంటే 12 సంవత్సరాల కిందట, మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైప్‌లైన్‌ల ద్వారా గ్యాస్ పంపిణీ చేసే మౌలిక సదుపాయాలు ఉండేవి. ఈ 12 సంవత్స రాల్లో, మనం ఈ 70 నగరాలను 700 నగరాలకు విస్తరించుకున్నాం. వేగం అంటే ఇలా ఉంటుంది. విస్తరణ అంటే ఇలా ఉంటుంది. 2014కు ముందు, కేవలం 20-22 లక్షల గృహాలకు మాత్రమే పైప్‌లైన్‌ల ద్వారా గ్యాస్ అందేది. ఈ రోజు, దాదాపు 1.75 కోట్ల గృహాలకు పైప్‌లైన్‌ల ద్వారా గ్యాస్ అందించే పనులు జరుగుతున్నాయి.
ఆయుధాలుగా వనరులు ఆందోళనకరం
ప్రస్తుత సంక్షోభ సమయంలో కొందరు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చే ఆటలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ప్రపంచం తన వద్ద ఉన్న ఆస్తులను ఆయుధాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది. పెట్రోల్, డీజిల్, ఎరువులు, మందులు, టెక్నాలజీ చిప్‌ల వంటి వనరులనూ ఆయుధాలుగా మార్చు కుంటున్నారు. నిజానికి, భూభాగాన్నీ వారు ఆయుధంగా వాడుతున్నారు. ఇలాంటి సమయంలో, గత దశాబ్ద కాలంగా మనం స్వయం-సమృద్ధి మంత్రంతో సరైన దిశలో పయనించకపోయి ఉంటే… అటువంటి సవాళ్లను మనం ఎలా ఎదుర్కొనే వాళ్లమో మీరు ఊహించవచ్చు. మన సన్నాహాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
సప్తధారతో సరికొత్త శిఖరానికి భారత్
ఇవాళ, ఎర్రకోట బురుజుల మీద నిలబడి నేను శక్తికి సంబంధించిన ఏడు స్రవంతులకు (వీటిని ‘సప్త ధార’ అంటున్నాను) పిలుపునిస్తున్నాను. గత 5-7 దశాబ్దాల్లో సాధించలేనిది రాబోయే 5-7 సంవత్సరాల్లో ‘సప్త ధార’ సామర్థ్యంతో, శక్తితో దేశాన్ని మనం ఒక కొత్త శిఖరంపై నిలిపి, ఒక కొత్త వేగాన్ని జోడిద్దాం. కొత్త లక్ష్యాల్ని అధిగమించే సామర్థ్యాన్ని సంపాదించుకుందాం. దీంతో పాటు దేశ యువ శక్తిలో ఉన్న సామర్థ్యాల్ని దేశ నిర్మాణానికి పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకుందాం. దేశనిర్మాణంలో వారి శక్తిని జతచేద్దాం.
- తయారీరంగం
రాబోయే రోజుల్లో, ‘సప్త ధార’ను గురించి నేను మాట్లాడినప్పుడల్లా ‘సప్త ధార’లో మొదటి శక్తి తయారీ రంగానికి సంబంధించిన శక్తే అవుతుంది. మనం ఉత్పత్తితో పాటు తయారీ రంగంలోనూ ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. చిన్న చిన్న కంపోనెంట్ల (భాగాలు) మొదలు పెద్ద పెద్ద ఉత్పాదనల వరకూ.. ప్రతిదీ మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. సరకుల పరంగా చూసినప్పుడు, ప్రతి దశలో మనం రాణించాలి. ముందుకు వెళ్లాలి. మనకు కంపోనెంట్లూ కావాలి. తయారీ ప్రక్రియలన్నింటిపైన కూడా పట్టు ఉండాలి. ఉత్పాదన ప్రక్రియ పూర్తి కావడమూ మన వద్దే జరగాలి. రూపురేఖలను తీర్చడం మొదలు తయారీ దాకా, ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఒక విశ్వసనీయ కూడలి (హబ్)గా భారత్ తప్పక ఎదగాలి. ఈ విషయంలో మూడు అంశాల్ని నేను మరీ మరీ చెప్పదలుచుకుంటున్నాను. తయారీ రంగంలో కృషిచేస్తున్న నా సోదరీ, సోదరులారా, ఇది తక్షణావసరం. ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. ఈ విషయంలో ఖర్చు, రాశి, వాసిల పరంగా అంతర్జాతీయ ప్రమాణాల్ని మనం అందుకోవాల్సి ఉంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. మనం తయారు చేసే వస్తువులు వినియోగదారులకు సానుకూలంగా ఉండగలగాలి. మన ఉత్పాదనల ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉండి, ప్రపంచం నలుమూలలా ప్రజల మెప్పును పొందేదిగా నిలవాలి. తయారీ విధానంలో ఏ కొద్ది లోపానికీ తావు ఇవ్వరనే ప్రశంసే మన గీటురాయి కావాలి. ప్రపంచ మార్కెట్‌లో మనకు లభించే గుర్తింపు నికార్సయిన నాణ్యత, విశ్వసనీయతలపై ఆధారపడాలని ప్రతి తయారీ సంస్థకూ, ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకూ, ప్రతి ఒక్క ఎమఎసఎమఈకీ నేను సూచిస్తున్నాను. నాణ్యత విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదు. అందువల్ల మనం జపించాల్సిన మంత్రం ఒకటే. అదే.. నాణ్యత, నాణ్యత, నాణ్యత. ఇదే మన అంతర్జాతీయ బ్రాండ్ వేల్యూగా మారుతుంది.
- వ్యవసాయం – ఆహారోత్పత్తి
ఈ ‘సప్త ధార’లో రెండో శక్తిగా వ్యవసాయాన్నీ, ఆహారోత్పత్తినీ ప్రస్తావిస్తున్నాను. ఆహార శుద్ధి దిశగా కూడా మనం ముందడుగు వేసి తీరాలి. మన రైతులకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎఫ్‌టీఏల కారణంగా, మనం చాలా పెద్ద మార్కెట్టుకు చేరుకోగలుగు తున్నాం. ఆ మార్కెట్లను మనం చేజిక్కించుకో వాల్సిందే. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగ పరుచుకోవాలి. పంట పొలం నుంచి ఎగుమతి మార్కెట్ వైపునకు మనం సాగాలి. మన సాంప్రదాయక ఆహార, పానీయాలు కావొచ్చు, మన సిరిధాన్యాలు కావొచ్చు, మన పండ్లు లేదా పూలు కావొచ్చు.. అనేకం మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ బ్రాండ్లుగా రూపొందాలి. రసాయనాలను ఉపయోగించని పంటలపై మన రైతులు దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా అలాంటి ఉత్పాదనలకే గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. మన వ్యవసాయ ఉత్పాదనలు ప్రతి విషయంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందితే, మనం సులభంగా అంతర్జాతీయ మార్కెట్లను మెప్పించగలుగుతాం.
- సాంకేతికత – నూతన ఆవిష్కరణలు
నేను సూచిస్తున్న ‘సప్త ధార’లో మూడో శక్తి విషయానికి వస్తే, ఆ శక్తి.. సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలు. నేడు కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీ, అంతరిక్షం, రోబోటిక్స్. డేటా సెంటర్ల యుగం నుడుస్తోంది. ఒక సరికొత్త రంగం ఆవిష్కృతమైంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతి కతలు ప్రతి క్షణం మనకు సవాళ్లు విసురుతున్నాయి. అందువల్ల మనం మన దేశాన్ని కేవలం ప్రపంచానికి ఒక మార్కెట్‌గా మార్చడమే కాకుండా, ఆవిష్కరణ లకు కేంద్రంగా మారాలి. యూపీఐ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా మనం ఇప్పటికే మన సామర్థ్యాలను నిరూపించుకున్నాం. మన శక్తి ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాం. ఇప్పుడు భారత్ తన డిజిటల్ ప్రజా సాంకేతికతలను ప్రపంచంలోని నలుమూలలకూ తీసుకెళ్లాలి. తదుపరి తరం కమ్యూనికేషన్ సాంకేతికతలలో భారత్ అగ్రగామిగా నిలవాలి. మేడ్ ఇన్ ఇండియా 6జీ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేలా చూడటమే మన లక్ష్యం కావాలి. ఈ దిశగా మన ప్రయత్నాలను వేగవంతం చేయాలి. ఈ నిబద్ధత ఎప్పటికీ తగ్గకూడదు.
- గతిశక్తితో అనుసంధానం
సప్తధారలో నాలుగో బలం గతి శక్తి. గతి శక్తి కింద దేశవ్యాప్తంగా వేగవంతమైన, అంతరాయం లేని అనుసంధానంపై దృష్టి సారించాలి. హై స్పీడ్ రైళ్ల ద్వారా మన నగరాలను అనుసంధానించాలి. ఆధునిక జాతీయ రహదారులు, అంతర్గత జలమార్గాలు, విమానాశ్రయాలు, బహుళ రవాణా వ్యవస్థలు మనకు అత్యవసరం. మన నౌకాశ్రయా లను కేవలం సరకులు దిగుమతి, ఎగుమతి చేసుకునే లేదా నౌకలు నిలిపే ప్రాంతాలుగా మాత్రమే చూడకూడదు. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి దిశగా మన నౌకాశ్రయాలను ముందుకు తీసుకెళ్లాలి.
- రక్షణ సాంకేతికతలో నాయకత్వం
సప్తధారలో ఐదో బలం, రక్షా శక్తి (రక్షణ రంగ బలం). అన్నివిధాలా ఈ రక్షా శక్తి ప్రాముఖ్యత అత్యంత అపారమైనది. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించడానికి ప్రత్యామ్నాయం లేదని భారత్‌తో పాటు ప్రపంచం కూడా అనుభవపూర్వ కంగా గ్రహించింది. ప్రపంచ దేశాలన్నీ తమ సొంత ప్రయోజనాల గురించే ఆలోచిస్తున్న తరుణంలో, భారత్ కేవలం ఒక మార్కెట్‌గా మిగిలిపోలేదు. రక్షణ రంగంలో మనం సంపూర్ణ ఆత్మనిర్భరతను సాధించాలి. తదుపరితరం రక్షణ సాంకేతికతలను అభివృద్ది చేస్తూ, ప్రపంచానికి రక్షణ పరికరాలను సరఫరా చేసే స్థాయికి ఎదగడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను సొంతంగా అభివృద్ధి చేసుకోవడంతో పాటు, హైపర్ సోనిక్ రక్షణ సాంకేతికతల్లో భారత్ నాయకత్వం వహించాలి. నేడు ప్రతి ఇంట్లోనూ సైబర్ భద్రత ఒక ప్రధాన ఆందోళనకర అంశంగా మారుతోంది. ఇది కూడా రక్షణ రంగంలో ఒక భాగమే. ఇందులో మన యువత నైపుణ్యాలను దేశం, ప్రపంచ సంక్షేమం కోసం వినియోగించుకోవచ్చు.
హరిత-సముద్ర ఆర్థిక వ్యవస్థ
మన సప్తధారలో ఆరో బలం హరిత ఆర్థిక వ్యవస్థ, సముద్ర ఆర్థిక వ్యవస్థ. ఇవి పర్యావరణహిత ఉద్యోగాలను సృష్టిస్తాయి. హరిత హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, శక్తి నిల్వ, హరిత రవాణా, హరిత తయారీ రంగాలలో మనం అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించాలి. ప్రపంచం వాతావరణ మార్పు గురించి చర్చలు జరుపుతున్న సమయంలో, భారత్ వాటికి పరిష్కారాలను అన్వేషిస్తూ, సమాధానాలు ఇస్తోంది. హరిత విప్లవంలో భారత్ అపారమైన సామర్థ్యంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. అలాగే బ్లూ ఎకానమీలో (సముద్ర ఆర్థిక వ్యవస్థ) కూడా భారత్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మనకు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. మత్స్య రంగం, తీరప్రాంత పర్యాటకం, సముద్ర సాంకేతికత వంటి అనేక రంగాలలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వీటి ద్వారా మనం మరింత వేగంగా ముందుకు సాగవచ్చు.
- ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తి
భారత్ సప్తధార దార్శనికతతో ముందుకు సాగుతున్న వేళ ఏడో ధార ప్రపంచానికి అత్యంత ప్రాముఖ్యమైనది. అదే దేశ ‘సాఫ్ట్ పవర’ (ఆధ్యాత్మిక, సాంస్కృతిక బలం). మన సాఫ్ట్ పవర్ సామర్థ్యం అత్యంత అపారమైనది. నేడు యోగా ప్రపంచాన్ని భారత్‌తో అనుసంధానించింది. యోగా ప్రపంచానికి శక్తి మూలంగా మారడమే కాకుండా, ప్రజలకు భారత్‌పై నమ్మకం పెరగడానికి ఒక ముఖ్య కారణమైంది. భారత్‌లో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆయుర్వేదం, సమగ్ర వైద్య విధానం ఉన్నాయి. వీటితో పాటు ‘హీల్ ఇన్ ఇండియా’ ఉద్యమం ద్వారా మన నైపుణ్యాలను ప్రపంచానికి తీసుకెళ్లవచ్చు. చేతివృత్తులు, సంస్కృతి, మన సినిమాలు, సృజనాత్మక రంగం, వీఎఫఎక్స్, యానిమేషన్, గేమింగ్ లేదా డిజిటల్ కంటెంట్ ఏదైనా సరే… అంతర్జాతీయ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భారత్ తన ఉనికిని సగర్వంగా చాటుకోగలదు. దీనిని ఒక ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దాలి. నేడు వేవ్స్ సదస్సుకు భారత్ అద్భుతమైన వేగాన్ని అందించింది. ఇప్పుడు భారత్ నిర్వహించే ఈ ప్రపంచ ఆడియో విజువల్, వినోద సదస్సు కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారత సాఫ్ట్ పవర్‌ను, సృజనాత్మక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. దేశంలో అపారమైన అటవీ సంపద ఉంది. మన వద్ద 100 కంటే ఎక్కువ జాతీయ పార్కులు ఉన్నాయి. మన సామర్థ్యం ఎంతో గొప్పది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించే విషయంలో మనం ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయాం. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను భారత్‌కు ఆకర్షించే గొప్ప అవకాశం మనకుంది. మన నైపుణ్యాలను, అందాలను ప్రపంచానికి చాటిచెప్పాలి. ఈ దిశగా అత్యంత వేగంగా చర్యలు చేపట్టాలి. నేడు క్రీడలు కూడా భారత్ వైపు ప్రపంచాన్ని ఆకర్షించే ప్రధాన వేదికగా మారుతు న్నాయి. అంతర్జాతీయ స్థాయి పెద్ద పెద్ద క్రీడా పోటీలు భారత్‌లోనే ఎందుకు జరగకూడదు? సంగీత కచేరీల రంగం వేగంగా ఎదుగుతోంది. ఇది దేశ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారులు ఏదో ఒక సమయంలో భారత గడ్డపై తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇది ఒక పెద్ద అవకాశం. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోవడానికి కావలసిన మౌలిక వసతులను, వ్యవస్థలను మనం నిర్మించుకోవాలి. సప్తధారలోని ఈ ఏడు బలాలు కేవలం ఒక్కో రంగానికి పరిమితమైన పురోగతి మాత్రమే కాదు. ఒక సమగ్ర విధానంతో, మనం దేశం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను, ఆశయాలను మించి సాధించే దిశగా కృషి చేయాలి.
ఫార్చ్యూన్ 500 జాబితాలో మన స్థానం
మనం తరచుగా ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీల గురించి వింటూ ఉంటాం. రాబోయే దశాబ్ద కాలంలో ఈ ఫార్చ్యూన్ 500 జాబితాలో 50 కంపెనీలు మన భారత్ నుండే ఎందుకు ఉండకూడదు? అనేది మన లక్ష్యంగా మారాలి. నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో ప్రగతిపథంలో పయనిస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల సరసన ఒక భారతీయ బ్యాంకు జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోనే అత్యుత్తమ 5 బ్యాంకుల జాబితాలో కనీసం ఒక భారతీయ బ్యాంకు తప్పకుండా స్థానం సంపాదించాలి. అలాగే దేశ ఔషధ రంగం ఇప్పటికే గణనీయమైన ప్రగతిని సాధించింది. అయితే ప్రపంచంలోని 5 అతిపెద్ద ఔషధ కంపెనీల జాబితాలో ఒకటి లేదా రెండు భారతీయ కంపెనీల పేర్లు మార్మోగడమే నేటి సమయపు ప్రధాన డిమాండ్. భారత్ అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఇక అంతర్జాతీయ లా సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో ప్రపంచ నాయకత్వం ఇప్పుడు మన చేతుల్లోకి రావాల్సిన అవసరం లేదా? మన దగ్గర తగినంత నైపుణ్యం ఉంది. సామర్థ్యం ఉంది. సుదీర్ఘమైన నిరూపితమైన చరిత్ర ఉంది. విభిన్న భాషలపై పట్టు ఉంది. మనం కచ్చితంగా ప్రపంచ స్థాయికి చేరుకోవాలి. ప్రపంచంలోని అగ్రగామి సంస్థలలో ఒక భారతీయ కన్సల్టింగ్ లేదా అకౌంటింగ్ సంస్థ ఎందుకు ఉండకూడదు? మన సాంకేతిక కంపెనీలు ప్రపంచానికే నాయకత్వం వహించాలి. అది మాత్రమే మన ప్రధాన ధ్యేయం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే బ్రాండ్లు మన దగ్గర ఉండాలి. మన బ్రాండ్లు మన దేశానికి గుర్తింపుగా మారి, భారత్‌ను ప్రపంచానికి ఒక ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి. మనం ఆ దిశగా నిరంతరం శ్రమించాలి. ఈ లక్ష్య సాధన కోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇది భారత ప్రభుత్వ బాధ్యత కూడా, మనం మన సంస్కరణల వేగాన్ని మరింత పెంచాలి. 2047 నాటి వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా మన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక రంగం.. అన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు నడవాలి.
యువతకు పెద్ద పీట
నేను వికసిత భారత్ గురించి మాట్లాడినా, దేశాన్ని వేగవంతమైన పురోగతి వైపు నడిపించడం గురించి మాట్లాడినా – ఈ ప్రయత్నాలన్నింటి ద్వారా అత్యంత లబ్ధి పొందేది ఎవరు? ఈ శ్రమను నడిపించే అతిపెద్ద శక్తి ఎవరు? వారు ఎవరో కాదు, మన దేశ యువతే. దేశ యువశక్తే. వికసిత భారత్ వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో యువత వహించాల్సిన పాత్ర అత్యంత కీలకమైనది. అంతేకాదు, వికసిత భారత్ ద్వారా అత్యధిక ప్రయోజనం పొందేది కూడా నా దేశ యువతే. కాబట్టి, మన యువత ఆకాంక్షలు, భాగస్వామ్యాన్ని జోడిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి. యువతకే అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు సాగాలి. గడిచిన 10,12 ఏళ్లలో ఈ దిశగా ఎంతో పురోగతి సాధించాం.
అందరికి అందుబాటులో అంతరిక్షం
స్టార్టప్ ఇండియా కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మన దేశ యువత తమ కోసం తాము పని చేయడమే కాకుండా మరెంతో మందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌ను ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను: మీ కలలతో ముందుకు రండి. మీకు వనరుల కొరత లేకుండా మేం చూసుకుంటాం. మీ ఆలోచనలకు, సంకల్పాలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు రూ. లక్ష కోట్లతో ఒక బలమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాం. పరిశోధనల కోసం నూతన అవకాశాలు వెలు వడ్డాయి. డిజిటల్ ఇండియా ద్వారా అందుబాటులోకి వచ్చిన చవకైన డేటా మన యువ శక్తిని మరింత సాధికారత వైపు నడిపించింది. స్కిల్ ఇండియాను ఒక జాతీయ కార్యక్రమంగా తీర్చిదిద్దాం. అంతరిక్ష రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాం. జాతీయ డ్రోన్ విధానాన్ని రూపొందించాం. ఖేలో ఇండియా విధానాన్ని తీసుకొచ్చాం. 35 ఏళ్లుగా ఎలాంటి నూతన విద్యా విధానం లేదు. మేం నూతన విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చాం. దీని ద్వారా మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ప్రయోజనం పొందాయి.
వెయ్యి విశ్వవిద్యాలయాలు స్థాపిద్దాం
2004 నుంచి 2014 మధ్యకాలానికి సంబంధించిన వివరాలను నేను మీకు అందించాలి. 2004 నుంచి 2014 వరకు మన దేశంలో 350 లోపు విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉండేవి. కానీ ఈ రోజు, ఈ 10, 12 ఏళ్ల కాలంలోనే దాదాపు 650 కొత్త విశ్వవిద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. మనం 1,000 మార్కును చేరుకునే దిశగా పయనిస్తున్నాం. 2014కు ముందు కేవలం 400 వైద్య కళాశాలలు (మెడికల్ కాలేజీలు) మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య దాదాపు 850కి చేరుకుంది. అంతేకాదు, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు భారత్‌కు వస్తున్నాయి. మన యువత భారత్‌లోనే ఉంటూ విదేశీ విశ్వవిద్యాలయాల డిగ్రీలను పొందేలా ఏర్పాట్లు చేశాం. మన దేశంలోని యువత చిన్ననాటి నుంచే సాంకేతికత వైపు ఆకర్షితులయ్యేలా చేయడానికి మేం కృషి చేస్తున్నాం. అందుకే 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను యువ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. తద్వారా వారిలో ఆవిష్కరణలు, సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించవచ్చు. మేం అనేక అవకాశాలను కల్పించాం స్టార్టప్ రంగాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. మన దేశంలోని సగటున 28 ఏళ్ల వయస్సున్న యువకులు నేతృత్వం వహిస్తున్న ప్రైవేట్ స్టార్టప్‌లు తమ స్వంత ఉపగ్రహాలను, రాకెట్లను ప్రయోగించి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడాన్ని మీరు చూసే ఉంటారు. ఈ ఘనత ద్వారా మన దేశ యువత అంతరిక్ష రంగంలో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. అంతరిక్ష రంగంలో మన యువత సాధిస్తున్న ఈ విజయాలు భారత భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.
కోటి మందికి కృత్రిమ మేధలో శిక్షణ
నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉన్నాయి. ఇటీవల మేం కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్‌ను నిర్వహించాం. ఏఐ విస్తరణ అత్యంత వేగంగా జరుగుతోంది. దేశంలోని యువత కోసం ఎర్రకోట నుంచి నేను ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని మేం నిర్ణయించాం. తద్వారా ఏఐ రంగంలో కూడా మన దేశ యువత ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు.
రూ.20 లక్షల కోట్లకు బయో ఎకానమీ
బయోఎకానమీ ఒక నూతన రంగం. 2014 కంటే ముందు బయోఎకానమీ విలువ కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే ఉండేది. నా దేశ యువజనులారా – మీరు సాధించిన ఘనతను ఒక్కసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉండి, లక్ష్యాలు స్పష్టంగా ఉన్నప్పుడు యువత ఎలాంటి ఫలితాలను సాధించగలరో మీరు చూడవచ్చు. బయోఎకానమీ రంగంలో దేశ యువశక్తి తన సామర్థ్యాన్ని చాటిచెప్పింది. 2014కి ముందు ఈ రంగం టర్నోవర్ రూ. 60,000 కోట్లుగా ఉండగా, నేడు బయోఎకానమీ విలువ రూ. 20 లక్షల కోట్లకు చేరింది. 2009-10లో కేవలం 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించగా, 2025-26లో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి.
డ్రోన్లతో 3.25 కోట్ల గ్రామీణ కుటుంబాలకు లబ్ధి
మేడ్-ఇన్ – ఇండియా విమానాల తయారీ దిశగా అడుగులు వేస్తూ మనం గొప్ప విజయాన్ని సాధించాం. స్వదేశీ సాంకేతికతతో తయారైన రక్షణ రవాణా విమానం ‘సీ295’ ఇప్పటికే నింగిలోకి ఎగిరి, విజయవంతంగా తన ప్రయోగాత్మక విమాన యానాన్ని పూర్తి చేసుకుంది. ఇది దేశ యువత సాధించిన ఒక మహత్తరమైన విజయం. డ్రోన్లు కూడా మన ప్రగతిలో అత్యంత కీలకమైన పాత్రను పోషించాయి. గ్రామాల్లో డ్రోన్ల ద్వారా స్వమిత్వ పథకం అత్యంత విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందాయి.

పోటీ పరీక్షార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ
కోచింగ్ క్లాసుల భారం మన మధ్యతరగతి కుటుంబాలకు ఒక పెద్ద సమస్యగా మారింది. తమ పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, వారు వెచ్చిస్తున్న వేల కోట్ల రూపాయలను ఆదా చేయాలని, వారి పిల్లలు ఇళ్లకు దగ్గరగానే ఉంటూ, సరైన సంరక్షణ పొందేలా చూడాలని, కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా నివారించాలని మేం భావిస్తున్నాం. అందుకే, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను అందించాలని మేం నిర్ణయించాం.
మన వద్ద డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు ఉన్నారు. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ వనరులన్నింటినీ సమన్వయం చేయడం ద్వారా దేశంలోని యువతకు ఉచిత శిక్షణను అందించడానికి మేం ఒక విస్తృతమైన వ్యవస్థను నిర్మించనున్నాం.
ఒలింపిక్స్‌లో ఆడేవారికి స్వాగతం
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒలింపిక్ క్రీడల్లో సుమారు 40 రకాల క్రీడలు, దాదాపు 325 నుంచి 350 విభాగాలు ఉంటాయి. ఈ 325కు పైగా విభాగాల్లో దాదాపు మూడింట రెండొంతుల క్రీడా విభాగాల్లో భారత్ అసలు పాల్గొనడం లేదు. మనం అక్కడ ఉండటం లేదు. అర్హత సాధించలేక పోతున్నాం. నేను మీకు సవాల్ విసురుతున్నాను. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ మద్దతును కోరుతున్నాను. 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించాం. 2036 నాటికి, ప్రస్తుతం భారత్ పాల్గొనని లేదా అర్హత సాధించని క్రీడా విభాగాల్లో, అలాగే భారత్ ఇప్పటివరకు దూరంగా ఉన్న ఈవెంట్లలో, నాలుగింట మూడు వంతుల అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. భారత్ ఈ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇందుకోసం ప్రతిభా అన్వేషణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని భావిస్తున్నాం. 2036లో మనకు క్రీడాకారులు కావాలంటే, నేడు 5, 10 లేదా 15 ఏళ్ల వయసున్న బాలబాలికలపై దృష్టి సారించాలి. మన ఆడపిల్లలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అందువల్ల దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, పాఠశాలల్లో 5 నుంచి 15 ఏళ్ల వయసున్న చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ప్రతిభా అన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. వారి సామర్థ్యాలను అంచనా వేసి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తాం. తద్వారా వారిని దేశానికి ప్రాతినిధ్యం వహించగల ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం.
మాదక ద్రవ్య రహిత భారత్ సాదిద్దాం
మాదకద్రవ్యాల దుర్వినియోగం మన దేశానికి, యువతకు పెద్ద ముప్పుగా మారుతోంది. ‘నషా ముక్త్ భారత’ లేదా మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణం మనందరి ఉమ్మడి బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం యువతరం బలంగా ఉండాలి. యువశక్తిని దేశ ప్రగతి కోసం ఉపయోగించాలి. అందుకే ఇటీవల మై భారత్ వాలంటీర్లు, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్జీవోలు, సామాజిక-సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాత్మిక గురువులు అందరూ కలసి మాదకద్రవ్యాలు లేని భారత్ కోసం 100 వారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు సాగుతుంది. మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఇందులో చేరి నషా ముక్త్ భారత్ కలను నిజం చేయడానికి ముందుకు రావాలి అని ప్రతి కుటుంబానికి నేను చెబుతున్నాను.
నక్సల్ రహిత నేలపై మువన్నెల జెండా రెపరెపలు
దశాబ్దాలుగా వేధిస్తున్న సవాళ్లను సమూలంగా అంతం చేయడం ఈ 21 వ శతాబ్దంలో అత్యంత అవసరం. నక్సలిజం, మావోయిజం లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేశాయి. ఎందరో తల్లులకు గర్వకారణమైన బిడ్డల జీవితాలను నాశనం చేశాయి. తల్లిదండ్రుల కలలను ఛిద్రం చేశాయి. భారతదేశంలోని పెద్ద మొత్తంలో భూభాగాన్ని, పెద్ద సంఖ్యలో ప్రజలను నాలుగు దశాబ్దాల పాటు నక్సలిజం తన గుప్పిట్లో ఉంచుకుంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. దేశంలోని సామాన్య పౌరులను కాపాడే క్రమంలో 3,500 మందికి పైగా మన పోలీసు, భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. సామాన్య పౌరులు సురక్షితంగా జీవించేందుకు యుద్ధాల్లో వీరమరణం పొందిన సైనికుల కంటే ఎక్కువ మంది పోలీసు సిబ్బంది ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. నక్సలిజం ఈ నేలను రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడే ఈ దేశానికి నక్సలిజం నుంచి విముక్తి కల్పించాలని సంకల్పించుకున్నాం. ఈ రోజు నక్సలైట్-మావోయిస్ట్ హింసకు చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి సంతోషిస్తు న్నాను. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాం. ఒకప్పుడు నక్సలైట్లు తుపాకులు పేల్చి నేలను రక్తంతో తడిపిన అదే ప్రాంతాల్లో, వారి ప్రభావం తొలగిపోవడంతో ఇప్పుడు అభివృద్ధి, విశ్వాసం, సంకల్పాల మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది.
దిమాగి నక్సల్స్‌తో తస్మాత్ జాగ్రత్త
మావోయిజం లేదా నక్సలజిం సమస్యను మనం తక్కువగా అంచనా వేయకూడదు. దీని విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎన్నో ఏళ్లుగా మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు దేశ అధికార వ్యవస్థల్లోకి చొరబడ్డారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా కూడా ఉన్నారు. ఈ మావోయిస్టు భావజాలం విధాన నిర్ణయాలను కూడా ప్రభావితం చేసింది. అడవుల నుంచి సాయుధ నక్సలైట్లను తొలగించడంలో, ఈ ముప్పు నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో మనం విజయం సాధించాం. అయితే, సాయుధ నక్సలైట్లు లేకపోయినా, మానసికంగా నక్సలైట్లుగా ఉన్నవారు(దిమాగి నక్సల్స్) ఇంకా మిగిలే ఉన్నారు. వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. హింసకు, అరాచకానికి మార్గాలను వెతుకుతున్నారు. సమాజాన్ని తప్పుదారి పట్టించేం దుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. మనం ఇలాంటి వారిని గుర్తించి, వేరుచేసి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రధాన ప్రయత్నం దిశగా దేశ యువతను ముందుకు నడిపించాలి.
యుద్ధాల స్వభావంలో మార్పు
సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సమస్య సరిహద్దుల లోపల ఉన్నా లేదా వెలుపల ఉన్నా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం యుద్ధాల స్వభావం మారుతోంది. ఇక మీదట ఘర్షణలు సరిహద్దులకే పరిమితమవుతాయనే హామీ లేదు. ఆధునిక యుద్ధాలు చమురు శుద్ధి కర్మాగారాలను, బ్యాంకింగ్ రంగం లేదా డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఒక రకంగా ఇది మౌలిక సదుపాయాలు, కర్మాగారాలను నాశనం చేసే సరికొత్త పోరాట రూపం. కొన్నేళ్ల క్రితం మనం ‘మిషన్ సుదర్శన్ చక్ర’ను ప్రకటించాం. దానికి సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
దేశ భద్రతకు భారీ పౌర రక్షణ బలగం
ఇప్పుడు మన రక్షణ రంగ ఎగుమతులు దాదాపు 50 రెట్లు మేర పెరిగాయి. మన రక్షణ ఆయుధాలు సుమారు 100 దేశాలకు చేరుతున్నాయి. ప్రపంచ వేదికపై భారతదేశ పరపతి క్రమంగా పెరుగుతోంది. మారుతున్న ఈ కాలంలో మనం రక్షణ పరికరాలపై దృష్టి సారించాలి. మన సాయుధ దళాల సామర్థ్యాలను పెంచాలి. అదే సమయంలో పౌరులు కూడా సన్నద్ధంగా ఉండాలి. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో రూపొందించిన పౌర రక్షణ వ్యవస్థలు కాలం చెల్లిపోయాయి. అందుకే రానున్న రోజుల్లో ఒక పటిష్టమైన పౌర రక్షణ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నామని ఈ రోజు ఎర్రకోట నుంచి ప్రకటిస్తున్నాను. ఆధునిక వ్యవస్థలపై వారికి అవగాహన కల్పిస్తాం. ఆధునిక సంక్షోభాల నుంచి పౌరులను రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయొచ్చు? ఆధునిక సవాళ్లను అధిగమించడానికి ఒక భారీ స్వచ్ఛంద పౌర రక్షణ బలగాన్ని ఏర్పాటు చేయనున్నాం.
మహిళలకు 33 శాతం కోటా ఇద్దాం
నేడు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రజాప్రతినిధులుగా మారుతున్నారు. దేశాన్ని నడిపిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థ వంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన్ చట్టాన్ని ఆమోదింపజేశాం. అయినప్పటికీ, గత 40 ఏళ్లుగా ఈ కల పదేపదే రాజకీయ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ రోజు ఎర్రకోట బురుజులపై, త్రివర్ణ పతాకం నీడలో నిల్చుని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలనూ నేను వేడుకుంటున్నాను. రండి… స్త్రీశక్తి ఆరాధకులుగా మారదాం. వారి గౌరవాన్ని కాపాడేందుకు ముందుకు వద్దాం. భారతదేశ విధానాలను రూపొందించడంలో భాగస్వామ్యం పంచుకొనేలా శాసనసభలు, లోక్‌సభలో మన మాతృమూర్తులు, సోదరీమణులకు వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం దక్కేలా చూద్దాం. ఇది నేటి అవసరం. మరోసారి అన్ని రాజకీయ పార్టీలనూ నేను కోరుతున్నాను. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా వారి గౌరవాన్ని కాపాడటంలో భాగస్వాములు కండి. ఆ ఘనతను మీరే తీసుకోండి, ఆ కీర్తిని మీరే పొందండి, కానీ నా మాతృమూర్తులు, సోదరీమణులకు వారి హక్కులను అందించండి.
జనగణనలో యువత పాత్ర
సాంకేతికత అందుబాటులోకి రావడంతో, మీ జనాభా లెక్కల వివరాలను మీరే మొబైల్ ఫోన్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. తర్వాత ఎవరైనా ఉద్యోగి లేదా ప్రతినిధి వచ్చి మీతో ఆ వివరాలను చర్చిస్తారు. మీ కుటుంబం అంతా కలిసి కూర్చుని, స్పెల్లింగ్‌లో గానీ లేదా సమాచారంలో గానీ ఎలాంటి తప్పులు లేకుండా డిజిటల్ పద్ధతిలో నమోదు చేసినట్లయితే ఆ కచ్చితమైన సమాచారం దేశ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే దేశ యువత తమ కుటుంబాలతో కలిసి కూర్చుని, సంబంధిత ఫారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మొదట కాగితంపై రాసి చూసుకోండి. ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకొని, ఆ తర్వాత సాంకేతికత ద్వారా డిజిటల్‌గా అప్‌లోడ్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి. దేశం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తుంది. దేశ సమయం, శ్రమ ఒక నిర్మాణాత్మక ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది. అందుకే నా దేశ యువత ఈ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని కోరుతున్నాను.మీరు కేటాయించే ఒకటి రెండు గంటల సమయమే దేశానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది.
బానిస మనస్తత్వాన్ని వదలించుకుందాం
నేను ఎర్రకోట నుంచి (గత సంవత్సరం) ‘పంచ ప్రాణ’ (అయిదు ప్రతిజ్ఞలు) గురించి మాట్లాడాను. ఈ అయిదు ప్రతిజ్ఞలు దేశానికి అపారమైన బలాన్ని అందించాయి. ఆత్మగౌరవంతో ముందుకు సాగడానికి, నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించే సామర్థ్యాన్ని సాధించడానికి దేశాన్ని శక్తిమంతం చేశాయి. బానిస మనస్తత్వాన్ని మనం ప్రతి క్షణం నిర్మూలిస్తూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సాముండా, జ్యోతీరావ్‌ఫూలే కలలుగన్న భారతదేశ దృక్పథం నుంచి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగుదాం. మన స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజనమే ప్రాధాన్యం కావాలన్న, కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలన్న సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటిద్దాం. దేశప్రజలందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఇది మన సమయం. ఇది మనకు లభించిన సువర్ణావకాశం. ఇది మన సంకల్పం. కలలను సంకల్పంగా, సంకల్పాన్ని శక్తిగా, శక్తిని విజయంగా మలుచుకుందాం. ప్రతి అడుగునూ అభివృద్ధి దిశగా వేద్దాం, అడుగులో అడుగు వేద్దాం. మనసులను ఏకం చేద్దాం. లక్ష్యం వైపు దృష్టి సారిద్దాం. ఒక దీపం వేల దీపాలను వెలిగిస్తుంది. అందరం కలిసి వికసిత భారత్‌ను నిర్మిద్దాం.