అక్టోబర్ 18,  విశ్వనాథ 50వ వర్ధంతి

ఆధునికాంధ్ర కవిత్వయుగ మహాకవుల్లో అగ్రగణ్యులు. ప్రాచీన కవిత్వ సంప్రదాయానికి శిఖరాయమానులు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.

ఆధునికాంధ్ర సాహిత్యంలో విరాడ్మూర్తి. ప్రాచీన ఆధునికాంధ్ర సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. గేయం, పద్యం, ముక్తకం,మహాకావ్యం…ఇలా ఏది రాసినా తమదైన వ్యక్తిత్వం ప్రరతిబింబించింది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణలో,భూషణలో వైలక్ష్యం వెల్లివిరిసింది. అమేయ మైన భావనాశక్తి, అమిత వేగవంతమైన ధారాశుద్ధి, అద్వితీయమైన లోక పరిశీలనాశక్తి వారి రచనలలో కనిపించే మేలిమి గుణాలు. తన ప్రతిభను గ్రంథాలలోకి దించి, జాతికి అందించిన మహానుభావుడు విశ్వనాథ. రాష్ట్ర  ఆస్థాన కవి. సనాతన భారతీయ తత్త్వాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన జ్ఞాని. తెలుగులో ‘జ్ఞాన్‌పీఠ’ పురస్కారం తొలి గ్రహీత. కవిగా ఎంత గొప్పవాడో, ‘మాట పెళుసు’ అనిపించినా, మనసున్న మనిషిగా మహోన్నతుడు. 


ఆధునిక తెలుగు సాహిత్యంలో హిమ వన్నగము. సంప్రదాయాలు, కట్టుబాట్లు చెదర రాదన్న ధ్యేయంతో మడమ తిప్పక ముందుకు సాగిన సాహితీ దురంధరుడు, సాహిత్య సార్వభౌముడు. ఆయన సామాన్యుడు..ఆలోచనలు అసామాన్యాలు. భాషాశాస్త్రం, చరిత్ర, ధార్మిక, తాత్త్విక, సామాజిక, రాజకీయాది వైవిధ్యభరిత శాస్త్రాల నేపథ్యాలు, ఇతి వృత్తాలతో చందోబద్ధమైన కవిత్వం రాశారు. ప్రాచీ నాంధ్ర సాహిత్య ఉద్దండులు నన్నయ,తిక్కన, పోతన, శ్రీనాథుడివంటి వారి తరహాలో ఆధునిక సాహిత్యంలో తెలుగుకావ్యాలకు అంతటి స్థాయిని కల్పించిన విరాట్ స్వరూపం. కథానిక, నవల, నాటకం, గేయ కావ్యం, విమర్శ, వ్యాసం, పద్యం, శతకం ఇలా తెలుగు సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. స్పృశించని అంశమం లేదు..సాహితీక్షేత్రంలో పట్టినదంతా బంగారం కావడం ఒక విశ్వనాథ వారికే చెల్లింది. ‘పద్యము వ్రాయుకవి గద్యము వ్రాయ లేక పోవచ్చును. గద్యము రచించు కవికి బద్యము సాగక పోవచ్చును. గద్యపద్య రచయితయైనను నాటకము రచించలేకపోవచ్చును. నాటకకర్త విమర్శకశక్తి కలవాడు కావకపోవచ్చును. సర్వతోముఖ సమర్థత కలవాడు దీక్షతో గ్రంథాలు వ్రాసి లోకమునకందీయ జాలకపోవచ్చును. ఇవన్నియుబట్టినవారు సమగ్ర కళా పరిపూర్ణుడైన జాబిల్లి వంటివారు విశ్వనాథ’అని ప్రఖ్యాత కవి మధునా పంతుల సత్యనారాయణశాస్త్రి శ్లాఘించారు. తెలుగులో జాతీయ కవి ఎవరన్న ఒక ప్రశ్నకు ‘నిస్సందేహంగా విశ్వనాథ’ అని బదులిచ్చారు ప్రముఖ కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. సాహితీవేత్త డాక్టర్ అమరేంద్ర అన్నట్లు ‘భారతదేశంలో తుది శ్వాస వరకూ కలం దించని సాహితీ వ్రతులలో రవీంద్రుని సరసన నిలవగలవారు.

విశ్వనాథ ‘పూర్వకవుల కంటే భిన్నమైన వాతావరణంలో గడిపారు. కవిత్రయాది కవులు హయాంలోని ‘పండిత పరిషత్తు’ల ప్రమేయాలతో పోలిస్తే, ఏ రకమైన సంశయం, భయంలేకుండా మనసుకు స్ఫురించినది, ఆవేశంలో వచ్చినది, తాను అనుకొన్నది కరాఖండీగా హాయిగా మాట్లాడి, రాసి…అంతటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవించిన ఏకైక కవి ..’అని ఆచార్య బోతవోలు రామబ్రహ్మం నివాళులు అర్పించారు.

విశ్వనాథ వారి రచనా విధానం విచిత్రాతి విచిత్రంగా ఉండేదని చెప్పుకునేవారు.ఉదాహరణకు, వందకు పైబడి పద్యాలను మనసులోనే అనుకొన్న తరువాత కాగితంపై పెట్టేవారు. వచనమైతే వారు చెబుతూంటే ఇతరులు రాసుకోవలసిందే. రోజు వచ్చే సందర్శకులతో ముచ్చటిస్తూ, తాము రాస్తున్న రచనలల్లోని భాగాలను వినిపించడం మరో ప్రత్యేకత. అలా అప్పటికప్పుడు శ్రోతల/పాఠకుల స్పందన రాబట్టేందుకు వీలుండేదట. ‘ఏకవీర’ రచనా కాలంలో ప్రతి శుక్రవారం పూజచేసి, టెంకాయకొట్టి మిత్రులకు వినిపించేవారట. ‘వేయిపడగల’ను స్వయంగా రాయడం ప్రారంభించగా, మూడు ప్రకరణాలకు మÖడు నెలల సమయం పట్టిందట. ఇది సరికాదని గ్రహించి, వేయి పుటలను 29 రోజులలో చెబుతూ రాయించారట. నవలా రచన ఏదీ నాలుగు నాళ్లకు మించలేదట. ఆయన ప్రతిభ, వ్యుత్తత్తికి ఇది ఒక నిదర్శనంగా చెబుతారు.

వ్యక్తిత్వంలోనూ ప్రత్యేకత

విశ్వనాథ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా ముచ్చటించనవసరం లేదు. ఆయనంటే సరిపడని సమకాలికులు సయితం వారికి సంబంధించిన విశేషాలను మురిపంగా ముచ్చటించుకొనేవారు, ముచ్చటించుకుంటున్నారు. ఆ మహాకవి పరమపదం చేరి అయిదు దశాబ్దాలైనా ఆయన స్మృతులు సాహితీలోకంలో నిత్యనూతనాలే.

విశ్వనాథ పేరు స్మరించగానే జ్ఞప్తికి వచ్చేది…

‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం/డలఘుస్వాదు రసావతార ధిషణాహంకా సంభార దో

హల బ్రాహ్మీమయ మÖర్తి శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే/ శల చాంద్రీమృదుకీర్తి చెళ్లపిళ వంశస్వామికున్నట్లుగన’ పద్యం. ఇందులో కనిపించే ‘కవితాంహకారం’లో వాస్తవికత ఉందని, అది కేవలం కవితాపరమైనదే తప్ప లౌకిక అర్థంలో అన్వయింపతగదనే వారూ ఉన్నారు. మృదుస్వభావి అయిన ఆయన కోపగించుకోవడాన్ని ‘ధర్మాగ్రహం’ గానే భావించాలంటారు.

 తన శిష్యత్వం గురించి చెప్పుకున్న విశ్వనాథ, తమ గురువు వేంకటశాస్త్రి వ్యక్తిత్వాన్ని….

‘తన యెద యెల్ల మెత్తన కృత ప్రతిపద్యము నంతకంటె మె/త్తన తన శిష్యు లన్న నెడదం గల ప్రేముడి చెప్పలేని మె

త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్లపిళ్ల వేం/కన గురువంచు జెప్పకొనగా నది గొప్ప తెలుంగునాడునన’ అని శ్లాఘించారు.

శత్రువుల పట్ల తమ గురువు చూపే ‘పారు ష్యాని’కి శిష్యుల పట్ల కల వాత్సల్యాన్ని ఉపమానంగా చెప్పారు కానీ, శాస్త్రి గారి శిష్య వాత్సల్యానికి ‘ఇది సాటి’ అని ప్రకటించకుండా, ‘చెప్పలేనంత మెత్త’ అని ముక్తాయించారు. ‘చెప్పలేనంత’ అనేది ఆలోచనామృతాన్ని అందించే పలుకుబడి. అలా గురు కృపను కూలంకషంగా చవిచూసిన, భావితరాలకు ఆదర్శ శిష్యుడు విశ్వనాథ.

‘పుడమిని బెక్కు సత్కవులు పుట్టిరి ముట్టిరి సత్కవిత్వపుం/దొడిమలు చెళ్లపిళ్ల కవితో దులతూగెడువారె? వానలో

దడియనివారు మద్గురువధానమృదూక్తిమరంద ధారలో/గడుగనివారు మా కెచట గానగరా రిల దెల్గునాడునన’…పద్యం విశ్వనాథ వారి గురుప్రశస్తికి మకుటాయమానం. (సత్కవులెందరో కవితలు అల్లినా వారు ఆ కవితా ప్రసూనంలోని తొడిమను మాత్రమే తాకకలిగారట. గురువు వేంకటశాస్త్రి కవితా మకరందాన్ని సేవించి అవధాన కవితా మాధుర్యాన్ని వర్షించారట. వానలో తడియని వాడూ, వారి మకరంద ధారలో మునగనివాడు తెలుగుదేశంలో లేడట.)

శిష్యుడు విశ్వనాథ పట్ల గురువు చెళ్లపిళ్లఅదే తీరులో స్పందిస్తూ…

‘నా మార్గంబున కాదు శిష్యుడైనన్ నాతత ముత్తాతలం/దే మార్గమున్ గాదు వీనిదెదియో ఈ మార్గమట్లౌటచే

సామాన్యుండనరాదు కవితా సమ్రాత్వమీ రీతిలో/ఈ మచ్చిష్యుని తా వరించినది నేనెంతే ముదంబందెదన’.. అంటూ, కవిసమ్రాట్ బిరుదు విశ్వనాథను తానై వరించింది కానీ ఎవరో ఇచ్చినది కాదని రూఢీ పరిచారు.

 తన లాంటి శిష్యుడు ఉండడం గురువు అదృష్టంగా వ్యాఖ్యాంచిన విశ్వనాథ వారే, ఉత్తరోత్తర శిష్య వాత్సల్యాన్ని ప్రకటించారు. తమ సంస్కృత రచనలు ‘గుప్త పాశుపతం, అమృతశర్మిష్ఠం’పై విశ్లేషించేందుకు వచ్చిన శిష్యులు దివాకర్ల వేంకటావ ధాని, మల్లంపల్లి శరభయ్యల గురించి….‘ఇటువంటి వారికి గురువునవడం నా అదృష్టం…వారు నాకు శిష్యులు కావడం వారి ఖర్మ’ అనీ తమదై శైలిలో వ్యాఖ్యానించారు.

భారతీయత ఆరాధకులు

విశ్వనాథ భారతీయతను ఆరాధించారు. స్వీకరించిన సాహిత్య ప్రక్రియ ఏదైనా,అందులో భారతీయ సంప్రదాయ వైభవాన్ని చాటే చెప్పేందుకు తపించారు. తెలుగుభాష, తెలుగుజాతి పట్ల అలవి మాలిన అపేక్ష. తమ రచనల ద్వారా మాతృభాషను, సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఇరవై ఒకటో ఏట (1916) రాసిన ‘ఆంధ్ర పౌరుషం’లో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. తమ తొలి రచనల్లో ప్రధానమైన వాటిలో ‘ఆంధ్రజాతి వైభవం’అంటే వారి శరీరంలోని అణువణువుకు పులకింత. ఉత్తర భారతదేశంలో తెలుగువాణికి, తెలుగువానికి విశేష గౌరవం కట్టబెట్టిన పద్యం …

‘గోదావరీ పావనోదార వాః పూర

          మఖిల భారతము మా దన్ననాడు

తుంగభద్రాసముత్తుంగరావముతోడ

          కవులగానము శ్రుతి గలయునాడు

పెన్నానదీ సముత్పన్నకైరవదళ

          శ్రేణిలో తెన్గు వాసించునాడు

కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ

          శిల్పమ్ము తొలిపూజ సేయునాడు

అక్షరా జ్ఞాన మెఱుగదో యాంధ్రజాతి?

విమనకృష్ణానదీ సైకతములయుందు

కోకిలపు (పా)బాట పిచ్చుకగూండ్లు కట్టి

నేర్చుకొన్నది పూర్ణిమానిశలయందు’

తెలుగునాట నదులు ఇతివృత్తంగా చెప్పిన ఈ పద్యం తెలుగేతరులను ఆనందసంభ్రమాలలో ముంచెత్తింది. కాశీ విశ్వవిద్యాలయం సమావేశ మందిరం కిటకిటలాడుతోంది. సమావేశ మందిరం వెలుపల అదే సంఖ్యలో నిలబడి ఉన్నారు. వేదిక నుంచి మధుర గంభీరస్వరం వినపడింది. పరిస రాలు నిశ్శబ్దం. అధిక సంఖ్యలో ఉన్న బెంగాలీ,హిందీ భాషీయులకు తెలుగు తెలియకపోయినా, ఆ స్వర మాధుర్యం (రసధుని) వారిని పరవశులను చేసింది. పది నిమిషాల పాటు కరతాళ ధ్వనుల కోలాహలం. “సంస్కృతాంధ్రాలు ఇంత సహజీవనం చేస్తాయని మాకు తెలియదు. ఇలాంటి కవి దేశంలో ఉన్నారని కూడా మేం ఎరుగము. ఈ కవి రచనా రీతి భారతదేశంలోనే విశిష్టమైనది. దీనిని ‘ఆంధ్రరీతి’ అని గాని, ‘విశ్వనాథ రీతి’ అనిగాని అందాము” అని విశ్వవిద్యాలయ ఉప కులపతి నరేంద్రదేవ్ లేచి ప్రణమిల్లారు.

స్వభాషానురక్తి

తెలుగు భాష పట్ల విశ్వనాథకు గల అనురాగం, దానిపై ఆయనకున్న సాధికారత, భాషను ఆయన ప్రయోగించిన తీరు ‘న భూతో న భవిష్యతి’ అని విమర్శకులు సోదాహరణగా చెప్పారు. ‘ఆయన వాడినన్ని తెలుగు మాటలు, పలుకుబడులు, వాక్యభేదాలను మరేకవి/రచయిత వాడలేదేమో! భారతదేశంలో ఇన్ని విధాలుగా సాంస్కృతిక మÖలాలను వ్యాఖ్యానించిన మహా రచయిత ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. ఆయన వాడిన భాష పల్లెల్లో ఇంకా ఇంగ్లీషు వాసన సోకనిది’ అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ఒక సందర్భంలో. విశ్వనాథను గ్రాంథికవాదిగా అభివర్ణిస్తారు కానీ, ఆయన రాసినంత వ్యావహారిక£ తెలుగును ఎవరూ రాయలేదని ఆచార్య చేకూరి రామారావు పేర్కొన్నారు.

రచన నుంచి పఠనం, విమర్శ దాకా కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉండాలనేవారు విశ్వనాథ. గ్రంథాన్ని త్వరగా చదివేందుకు అభ్యాసం కావాలి. శబ్ద,వాక్య విన్యాస వైఖరి పరిజ్ఞానం అవసరం అంటూ, దానిని ఆచరించి చూపారు. అన్ని రకాల భావాల వ్యక్తీ కరణకు ఒకే శైలిని ప్రయోగించడం వారికి సమ్మతం కాదు. రచన, పదబంధం అర్థవంతం కానంత వరకు భావాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించలేరని భావిం చారు. లక్ష్య (గ్రంథం రాస్తున్న) భాషతో పాటు ఇతర భాషా పరిచయం, కవిత్వ భాషకు`ఇతర ప్రక్రియల భాషకు గల తేడా తెలిసి ఉండాలి. వీటి పట్ల అవ గాహన ఉన్నప్పుడే కావ్యం/కవిత గురించి తెలు స్తుంది. ‘శిల్పము కానీ, సాహిత్యంకాని జాతీయమై యుండవలయును. విజాతీయమై యుండరాదు. వ్రాసిన వానికి ముక్తి, చదివినవానికి రక్తి`ముక్తి. ఎంత సముద్రం మీద ఎగిరినను పక్షి రాత్రి గూటికి చేరును.అది జాతీయత. ఇది సంప్రదాయం’ అని వ్యాఖ్యానించారు.అంటే ఎవరు ఎన్ని భాషలు నేర్చినా, భారతీయతను, మాతృభాషను విస్మరించకూడదనే అంశాన్ని ‘పక్షి విహారం’ను ప్రస్తావిస్తూ చెప్పారని భావించాలి.

‘నేను ఏది చదివిననూ సర్వం కూలంకషముగా దానిలోని లోతులన్నియÖ నా మనస్సుకు తృప్తి కలుగునట్లు చదివెదను. ఇట్లే…ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతము`మÖడు భాషలను చదివితిని. అక్షరమెచ్చట నుండి పుట్టుచున్నది? ఎట్లు పుట్టుచున్నది? ఏ భాష యొక్క వర్ణ సమన్వయం మెట్లున్నది? దేని శక్తియెంత?వాల్మీకి, వ్యాసులు, నన్నయ`తిక్కనలు, అక్కడ హోమర్`పర్జిల్` షేక్స్ పియర్ల దాకా…రచనలను తరచి తరచి చూచితిని’ అని వివరించారు. ఆంగ్ల సాహిత్యంపై ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, వారి సంస్కృతి, ఆచారాలు వారికి గిట్టవనే ప్రచారం ఉంది.

‘భారత దేశాన మున్ను కొందరు తపస్సు

చేసి ఋషులైరి నేడు మా సీమ యందు

ఇంగిలీసు గ్రంథముల నిట్టె చదివి

యట్టె బ్రహ్మర్షులగు చుండి రద్భుతముగ’ అని చమత్కరించారు

‘పాషాణపాక ప్రభూ’!?

‘నిరంతర కావ్య వ్యాసంగంతో విలక్షణత సంపాదిద్దామన్న అభినివేశంతో వారి రచన క్లిష్టత మైంది. అప్పటి బందరు కవులు, ఆయన ఎదుట మెచ్చుకుంటూ వెనుక వెక్కిరించేవారట.‘పాషాణపాక ప్రభూ’ అనీ సంబోధించారు’ అని పాత్రికేయ ప్రముఖులు ఆచార్య తిరుమల రామచంద్ర ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆ విమర్శలు, వ్యాఖ్యలకు విశ్వనాథ మనసు కొంత క్షోభపడినా ‘నా మార్గం నాదే…నేను ఎందుకు ఒకరి వెంట పరుగు పెట్టాలి?’  అనే నిశ్చయానికి వచ్చారట. ‘నా కవిత్వం చాలా మందికి నచ్చకపోవచ్చు, నచ్చదు. అంతమాత్రం చేత నా కవిత్వానికొచ్చిన నష్టమేమీ లేదే!’ అంటూ తన పంథాలో సాగుతూ,తమ రచనలపై వచ్చిన పొగడ్తలు, తెగడ్తలను ఒకేలా స్వీకరించారు. కాకపోతే…తమ రచనలను అరఠావు కూడా చదవకుండానే అవ లీలగా ఆరేడు ఠావులు విమర్శలతో నింపగల వారంటేనే రుచించ లేదు.

అందుబాటులో కొన్నే రచనలు!

విశ్వనాథ వారి నవలేతర రచనలు ప్రస్తుతం అందుబాటు ఉన్నవాటి కంటే కొన్ని రెట్లు అదృశ్యమై ఉండవచ్చని ఆయన మాటలను బట్టే తెలుస్తుంది. వాటిని భద్రపరచడంలో ‘నేను సోమరి’అని స్వయంగా చెప్పుకున్నారు.  ‘నేను శరపరంగా రాసిన పద్యాలను సంకలనం చేయలేదు. అక్కడక్కడ కొందరు స్నేహితులు వేశారు.నేను వ్రాసిన పద్యములకు సంబంధించి… ప్రకటింపబడిన వాటి సంఖ్య సుమారు ఇరువది వేలు ఉండవచ్చు. నేను చించివేసినవి ఒక ఏబది వేలుండవచ్చు. నేను వ్రాసిన గంథముల పేర్లన్నియు నాకు గుర్తుండవు. ఏవి అచ్చు చేయుదునో అవి మాత్రమే గుర్తు’ అని (‘మహతి’) పేర్కొన్నారు.

రమణీయం రామాయణం

విశ్వనాథ వారి రచనలన్నీ విశిష్టమైనవే. కానీ వారి కావ్యరచనా ప్రస్థానంలో ‘రామాయణ కల్ప వృక్షానిది’ ప్రత్యేక స్థానం. ఎందరో రామాయణాన్ని ఎంతో రమ్యంగా రాసినా, తనకు వ్యక్తిగతంగా ‘రామాయణ కల్పవృక్షం’ ఎంతో తృప్తిని ఇచ్చిందని, ఒక తెలుగు కుటుంబంలో జరిగిన కథలాగా రాశానని తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పేవారు. తెలుగువారి మాటతీరు, వ్యవహార రీతి, పలుకు బడులు, చమత్కారాలు, సకల జీవన విధానాన్ని ఈ కావ్యంలో ఆవిష్కరించారు. తెలుగు కుటుంబాలలోని మన్ననలు, ఆప్యాయతలు, పద్ధతులు ఈ కావ్యంలోని పాత్రలతో నడుస్తాయి. రామాయణ గాథ అతి ప్రాచీనమైనదైనా గాథగతమైన ఔచిత్యం చెడకుండా తమ కాలం నాటి అనేక విషయాలను, ప్రాభవాన్ని వ్యక్తీకరించారు. సమకాలీన అనేక రాజకీయ, సాంఘిక, శాస్త్రీయ విశేషాంశాలను తమ అభిమతానుసారం సమకూర్చారు.

మానవ సంబంధాలు..ముఖ్యంగా స్త్రీపురుషుల అనుబంధాలు/సంబంధాలు తడబడుతున్న సందర్భాలలో వాటిలోని సామరస్యతను నిలబెట్ట వలసిన ఆవశ్యకతను ఈ కావ్యం ప్రబోధించిందని విమర్శకులు పేర్కొంటారు. ‘రామాయణ కల్పవృక్షాన్ని మించిన కవిత్వం ఉండదు. సర్వశక్తులూ పెట్టి వ్రాశాను. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నారాయణుడే పరమేశ్వరుడు. నేను అద్వైతిని. నాకు శివకేశవులకు భేదం లేదు. విష్ణువుకు రామునకు భేదం లేదు. నేను వ్రాసినది రామాయణం. అంకిత మిచ్చినది విశ్వేశ్వరస్వామికి’ అన్నారు కవిసమ్రాట్. ‘కల్పవృక్ష’ సృష్టిపై ప్రత్యేక మమకారం ఉన్నా, ఇతర రచనలన్నీ సమానమే. ‘మీ రచనలలో ఏది నిలుస్తుంది?’ అని ప్రశ్నిస్తే..‘అన్నీనూ…!తల్లికి సంతానమంతా సమానమే కదా?’ అనే ప్రశ్నతో కూడిన సమాధానం వచ్చేది. “ఎవరో నా ‘ఏకవీర’ ఉత్తమమన్నారు. నేను ఉత్తమమని ఎందుకనాలి? ఒక తరం పోయి మరో తరం వచ్చినట్లు చెప్పిన ‘వేయిపడగలు’ గొప్పది కాదా? దాని గుణగణాలు ఎవరైనా పరిశీలించారా?ఎంతో సైకాలజీ గుప్పించిన ‘చెలియలికట్ట’ ఏమైనట్టు? పురాణవైరి గ్రంథమాలలో ఒక్కొక్క నవలలో ఒక్కొక్కశిల్పం చూపానే! ఎవరైనా చూచారా?అని ఎదురు ప్రశ్నించేవారు. ఒక లక్ష్యంతో ఒక ప్రయోజనంతో రాసిన వాటిని చాలామంది ఆ విధంగా అర్థం చేసుకోలేదన్నది వారి భావన కావచ్చు.

కవులు, కావ్యాల విషయంలోనూ అదే పంథా.‘కవుల్లో ఎక్కువ తక్కువ ఏమిటోయ్! ఎవరి రుచి వారిది. మెంతిమజ్జిగ రుచి మెంతి మజ్జిగది. సేమ్యాపాయసం రుచి సేమ్యాపాయసానిది. ఈ రెండింటిలో ఏది బాగుందంటే ఏం చెప్పాలి’ అన్నది ఆయన వ్యాఖ్య. కావ్యాన్ని ఆ కావ్యదృష్ట్యా ప్రత్యేకంగా చదవాలి కానీ అందరి కావ్యాల్ని కలిపి ఒకే సూత్రానికి ఎలా బంధిస్తావు? విమర్శకునికి ప్రక్రియ దృష్టి ప్రధానం. భాషలోనైనా ప్రధానంగా, సంస్కృతాంధ్రాల్లో సర్వకావ్యాలను ఒకే దృష్టితో చూడరాదు. కవిత్రయం రచనల మాదిరిగా ప్రబంధకవుల రచనలను చూడరాదనే వారు.

పాశ్చాత్యుల వ్యాఖ్యాల వల్ల భారతదేశ చరిత్ర వక్రీకరణ పాలవుతోందని, దానిని పునరుద్ధరించ వలసిన అవసరం ఉందని భావించి ‘పురాణ వైరి గ్రంథమాల’ను నెలకొల్పారు.ఆయా రచనల్లో సమాజ హితం, చైతన్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. మనస్తత్వ విశ్లేషణలతో ఆయన రాసిన నవలలన్నీ ఆణిముత్యాలుగా భాసిల్లాయి. వారి రచనల్లో స్త్రీ పాత్రలు వివేకవంతంగానూ, జ్ఞానవంతంగానూ, సంస్కార పూరితంగానూ చైతన్యంతో నిండి ఉంటాయి. అర్థాంగిపట్ల అంతులేని ప్రేమ ఆయన రాతల్లో కనిపిస్తుంది.

విశ్వనాథవారి నవలల పేర్లు చూసీ చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. తెఱచిరాజు (చదరంగపు టెత్తుకు తెలుగుపేరు), విష్ణుశర్మ ఇంగ్లీషుచదువు, పులుల సత్యాగ్రహము, ఆఱునదులు, హాహా హూహూ, శార్వరి నుండి శార్వరి దాక, దిండు క్రింది పోకచెక్క, చిట్లీ చిట్లని గాజులు, దంతపుదువ్వెన, పాతిపెట్టిన నాణెములు, నందోరాజా భవిష్యతి..అలా అని కేవలం ఆకర్షణకు పెట్టినవి కావు. ప్రతి రచనలో ఒక విశిష్టత ఉంటుంది. వాటిని స్థాలీపులాయక న్యాయంగా స్మరించుకుంటే…

పరాయి పాలనతో వెన్ను విరిగిన వైనాలను కళ్లకు కట్టిన వెయ్యి పుటల నవల ‘వేయిపడగలు’. పాశ్చాత్య ప్రభావం వల్ల నాగరికత, సంస్కృతి విధ్వంసం అయ్యే క్రమంలో అనేక అంశాలను ఎంతో ఆవేదనతో వర్ణించారు. ఇది కేవలం నవల కాదని, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వానికి మారుగా వెలసిన గ్రంథంగా మన్ననలు అందుకుంది. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిఫలింపచేసిన విధానం మనస్సుని ఆకట్టుకొంటుంది. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నిర్వహించిన నవలల పోటీలో దీనితో పాటు, అడివి బాపిరాజు ‘నారాయణరావు’ నవల సంయుక్తంగా ఎంపికై చెరో అయిదు వందల రూపాయల బహుమతి గెలుచుకున్నాయి. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ‘వేయిపడగలు’ను ‘సహస్ర ఫణ’ పేరిట హిందీలోకి అనువదించారు.‘

‘ఏకవీర’ తెలుగు కాల్పనిక సాహిత్యంలో విలక్షణమైనది. నాలుగు పాత్రలను నాలుగు స్తంభాలుగా మలచి మహామండపాన్ని నిర్మించారు. మధురై దగ్గరి వైగై నది చుట్టూ ఈ కథ తిరిగి, చివరకు వైగై నదిలోనే ముగుస్తుంది. సందర్భో చితంగా వర్ణితమైన కూచిపూడి భాగవతుల భామా కలాపం, గొల్లకలాపం వారి ప్రాచీన కళాత్మకతకు గురుతులుగా చెబుతారు. ప్రేమ, ప్రణయం ఎంతటి గొప్ప ఉద్వేగపూరితమైనవైనా, శృంగార భావాలు, మధురమైన కోరికలు ఎంతటి విశృంఖలమైనవి అయినా, హద్దు మీరకుండా నిగ్రహించుకోవడమే భారతీయ సంప్రదాయమని ఈ నవల తీర్మానిస్తుంది. విశ్వనాథను నవలాకారునిగా ఆవిష్కరించిన ఆ రచన మలయాళ, హిందీభాషల్లోకి (పుట్టపర్తి నారాయణా చార్యులు, అంబడిపూడి హనుమయ్య) అనువదితమైంది.

‘చెలియలికట్ట’ మానసిక పరిణామ దశలను విశ్లేషించిన ఒక సూత్ర గ్రంథం. సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి భారతీయ మనో విశ్లేషణలన్నింటినీ పుక్కిలి పట్టిన విశ్వనాథ దీనిని విశిష్టంగా రూపొందించారు. క్షీణిస్తున్న నైతిక సూత్రాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెలియలి కట్ట.

స్వరాజ్యం వచ్చిన తొలినాళ్లలో జవాహర్ లాల్ నెహ్రూ, వల్లభభాయ్ పటేల్ మధ్య కలిగిన విభేదా లను చర్చిస్తూ, ‘వల్ల్లభ మంత్రి’ అనే నవý రాశారు. ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర ప్రశస్తి వంటి తెలుగువారు రొమ్ము విరుచుకుని చెప్పుకునే పద్య కావ్యాలు రాశారు. విశ్వనాథ నాటకాలలో వేనరాజు, నర్తన శాల, అనార్కలి ప్రసిద్ధమైనవి.

ఆయన రచనలలో ‘జీవుడి వేదన’ అనే మాట తరచూ వినిపిస్తుందని, అది ఆయన స్వేచ్ఛా చింతనకు ఉదాహరణ అని రచయిత శ్రీరమణ ఒక సందర్భంలో అన్నారు. ప్రతి మనిషికీ తనవైన కొన్ని ఆలోచనలు, సొంత ఘోష ఒకటి ఉంటుందని, అదే విశ్వనాథ ప్రతిపాదించిన జీవుడి వేదన అని పేర్కొన్నారు.

విలక్షణత

‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే..’ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనం. తమ విద్వత్తుతో సమకాలీనుల దూషణ భూషణలను సమానంగా చవిచూచి నిభాయించు కొచ్చిన విలక్షణ స్వభావి. రచన వ్యాసంగం ఆరంభం నుంచి అనేక విమర్శలు, అపవాదులను తట్టుకుంటూ స్థిరంగా ‘గౌరీశంకరుల శిఖరం’లా నిలిచారు. తమ అభిప్రాయాలను, ఇష్టానిష్టాలను నిక్కచ్చిగా వ్యక్తం చేయడంలో రాజీలేని ధోరణి. సత్యంగా నమ్మినదాన్ని తమ రచనలలోనూ, సభావేదికలపై నిర్భయంగా, నిస్సంకోచంగా చాటారు. దాంతో ఆయనకు అభిమానులతో పాటు వ్యతిరేకులూ ఏర్పడ్డారు. విమర్శలకు వెరవలేదు. విమర్శను స్థూలంగా, కువిమర్శ, అసూయాగ్రస్త విమర్శ, సాహిత్య ద్రోహ విమర్శ, అకులత్వాన్ని సృష్టించే అసౌష్ఠవ విమర్శ …అని పేర్కొంటూ సమకాలీన విమర్శలను, విమర్శకులను దృష్టిలో పెట్టుకొని విమర్శ క్షేత్రంలో సుష్ఠుతనం తేవడానికి ప్రయత్నించారు.

తమ నవలల్లో కూడా విమర్శ అనిపించగలిగిన వాటిపై సాహిత్య చర్చలు చేయడం, మొహమాటం/మర్యాద కోసం రాయవలసిన ముందుమాట/పీఠికల్లో విమర్శ అంశాలు పొందుపరచడం వంటివి ఆయన ప్రత్యేకతలుగా బాగా ఎరిగిన వారు చెబుతారు. ఒక రచన చదివి దానిపై అభిప్రాయం ప్రకటించడం కాకుండా అందులోని భిన్నాంగాల ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని వాటి సమన్వయాన్ని విశ్లేషించేవారు.

‘స్వశక్తిని చెప్పుకుంటే అహంకారమనుకుంటారు. నాకు విరోధులెక్కువ మంది. ఎందుకో నాకర్థము కాదు. నన్నెరుగని వాండ్రు నేను దుర్జనడనందురు. ఎరిగని వారు చాలా మంచి వాడందురు. నేను చాలా మందికి నా చేతనైనచో ఉపకారములే చేయుదును తప్ప అపకార£ములు చేయను. అవతలివానికి అపకారము జరిగెడి అబద్ధం చెప్పనే చెప్పను. ఎవరినైనా ఏదైనా అంటే వాళ్లు నాకు చాలా అపకారం చేస్తే అంటాను. ఒక్కటి మాత్రం ఉంది. నేను అనడం ఘాటుగా ఉంటుంది.కనుక తరువాత దానిని గురించి నాకు జ్ఞాపకముండదు’ అని ఒక వ్యాసంలో పేర్కొన్నారు.అంతేకాదు…గర్వం, గాంభీర్యం మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. చాలామంది తెలియని వారు గాంభీర్యాన్నే గర్వం అనుకొంటూ ఉంటారని, గాంభీర్యం జ్ఞాన సంబంధితం కాగా, గర్వం అజ్ఞానానికి చెందినదని, జ్ఞానికి గాంభీర్యం సహజం, సౌందర్య లక్షణాలని వ్యాఖ్యానించారు. ఈ లెక్కన విశ్వనాథ వారి గర్వం నాటికీ నేటికీ అందరనకున్నట్లు గర్వం కాదు… గాంభీర్యమని అభిమానులు భావన.

ఆయన మాట తీరు అలా ఉన్నా ఆయన ప్రసంగాలు, /ఉపన్యాసాల కోసం జనం విరగబడి రావడం ఆయన పాండితీ ప్రకర్షకు నిదర్శనం. ఆయన నిండు సభలో వేసే విసుర్లు, చెణుకులు, విమర్శలను భూషణాలుగానే తీసుకునేవారు ప్రేక్షకులు. ధిషణాహంకారిగా పేరు పొందిన ఆయనలోని బేలతనం పలువురిని కదిలించేది. ‘జీవితాన్ని సంపూర్ణంగా తరచి చూసినవాడు, అర్థం చేసుకున్నవాడు విశ్వనాథ. హాలాహలం ఎలాంటిదో తెలుసు, అమృతమేమిటో తెలుసు. “బాల్యంలో తల్లిని, యవ్వనంలో భార్యని, వృద్ధాప్యంలో కొడుకుని పోగొట్టుకున్నవాణ్ని. వేదనకి అర్థం నాకు తెలిసినంతగా మరెవరికి తెలుస్తుంది” అన్న మాటలు విన్నవారి కళ్లు చమర్చాయి.

‘నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు, దారుణాఖండం శస్త్రతుల్యము’ అన్న పలుకు వారి పట్ల ప్రత్యక్షర సత్యం అనిపిస్తుంది. చాలామంది అనుకునేలా ఆయన ‘అహంభావి’ కాదని పలువురు స్వానుభావాలను వెల్లడించారు. తెలుగు భాషా మర్యాదలు పాటించిన రచయితలను అక్కున చేర్చుకొనేవారు. విద్వత్ రచయిత అయితే ఎంత చిన్నవాడైనా ప్రోత్సహించేవారు. ఒక ఉదాహరణకు, ఆయన కాలం చేయడానికి సరిగ్గా రెండేళ్ల ముందు (సెప్టెంబర్ 1,1974) పుట్టపర్తి నారాయణాచార్యులు అధ్యక్షతన కడపలో ఆయనకు జరిగిన సత్కారసభలో రైతుకవి బైరపురెడ్డి నారాయణరెడ్డి, తన ‘రాయలసీమ రైతు’ కావ్యానికి విశ్వనాథ వారి ఆశీస్సులు కోరారు. ఆ కవిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి ఈ గ్రంథాన్ని అక్కడికక్కడే చదివి, తమ అభిప్రాయాన్ని చెప్పి, అభినందించారు. విస్తుపోయిన ఆ కవి, ‘స్వామీ! విశ్వనాథ అహంభావి, ఎవరిని లక్ష్యపెట్టరని విమర్శిస్తారు. మీ తీరు అందుకు భిన్నంగా ఉందే!’ అన్న మాటలకు, ‘నన్నేం చేయమంటావు. అది నా ఖర్మ’అనే నిర్వేదనతో కూడిన సమాధానం. ఆయన మాటతీరుతో నిమిత్తం లేకుండా, వారి ప్రశంస దక్కడమే గొప్పగా భావించే కవులు, కళాకారులు కోకొల్లలు. అమరగాయకుడి ఘంటసాల వారి ‘భగవద్గీత’ రికార్డు ఆవిష్కరణ సభలో “సంగీతమే వృత్తిగా బ్రతికిన ఒక జీవి. జీవిత చరమదశలో భగవద్గీత పాడుతూ పోయినాడూ అంటే నిశ్చయంగా అతను ఉత్తమ లోకాలకే పోతాడు.కాదన్నవాడు నరకానికి పోతాడు’ అని ఢంకా బజాయించారు.

‘మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘ టలను చెప్పండి’ అని ఒకరు శ్రీశ్రీని అడిగినపుడు …‘కవితా! ఓ కవితా’అనే గీతం చదువుతుంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశృసిక్త నేత్రులు కావడం ఒకటని చెప్పారు. విశ్వనాథ లోకం వీడినప్పుడు ‘షెల్లీ మళ్లీ మరణించాడు’ అన్నారు శ్రీశ్రీ.

మేలు చేసిన వారి పట్ల వారి కృతజ్ఞత భావనా అలాంటిదే. ఆయనకు ఉద్యోగంలేని సమయంలో ఇల్లు కూడా గడవని పరిస్థితిలో బందరు (మచిలీపట్నం)కు చెందిన బియ్యం వ్యాపారి చిట్టూరి రామారావు సహాయం చేశారు. దాదాపు ముప్పయ్యేళ్ల తరువాత విజయవాడలో కూతురుని చూసేందుకు వచ్చిన ఆయన, విశ్వనాథ దర్శనానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కబుర్లు చెబుతున్న ఆయన వాకిలి గుమ్మం వద్ద నిలుచున్న వ్యాపారిని గుర్తించి ఆదరంగా ఆహ్వానించారు. ‘ఈయన ఎవరో మీకు తెలియదు. మన కుటుంబ ప్రాణదాత. నాకు అన్నం పెట్టి బతికించినవాడు. ఆ రోజుల్లో ఈయన అన్నం పెట్టకపోతే ఎప్పుడే చనిపోయేవాడిని..’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో, గద్గద స్వరంతో కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు. ఆయనను నూతన వస్త్రాలతో సత్కరించారు.మరో సంఘటన… కళాశాలలో సహాధ్యాయి, ‘హంపీక్షేత్ర’కర్త కొడాలి వేంకట సుబ్బారావు హఠాన్మరణంతో శోకతప్తులైన విశ్వనాథ, మిత్రుడి కావ్యాన్ని కళాశాల పాఠ్యాంశంగా నిర్ణయించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు

‘ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త షేక్‌స్పియర్ గొప్ప నాటకాలు, కవితలూ రాశాడు. మహా కావ్య రచన చేయలేదు. మిల్టన్ మహాకావ్యం రచించినా నవల రాయలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు. ఒక్క మహాకావ్యం తప్ప. కానీ, విశ్వనాథ వారి సాహిత్యంలో నవల, కథ, కవిత్వం, నాటకం, మహాకావ్యం, విమర్శ లాంటి సాహిత్య ప్రక్రియలు కొలువుదీరాయి’అని ఒక సాహితీవేత్త విశ్లేషించారు.‘వేయిపడగల పాపరేడూ, చెలియలికట్ట లేని పసిఫిక్ పాథోనిధి, మÖడడుగలతో నేల కొలిచిన త్రివిక్రముడూ ..ఒక్క రూపంలో తెనుగు సాహిత్యం లోకంలో అవతరించినట్టు నాకు పొడగట్టుతారు విశ్వనాథ వారు’ అన్నారు పాత్రికేయ ప్రమఖులు ఆచార్య తిరుమల రామచంద్ర.

అధ్యాపక వృత్తి, సంసారం, రచనా వ్యాసంగం, పర్యటనలు సభలు, సమావేశాలు, ప్రసంగాలు, ఉద్యోగ విరమణ అనంతరం ‘పెద్దతనం..’..ఇలా ఇన్నింటి మధ్య ఒక మనిషి అన్ని రంగాలను అన్ని విధాలుగా, శోధించి, మధించి పలు ప్రక్రియలలో శతాధిక గ్రంథాలను వెలువరించడం సాధ్యమేనా?’ అనిపిస్తుంది. ‘కవిత్వమనే పవిత్రాగ్ని నుంచి పుట్టారా?’ అనిపించుకున్న ఆయన, సమకాలికులు చాలా మంది దాదాపు కలం ఆపేసినా ఆయన తుదిదాకా రచన సాగించారు.అందుకే విశ్వనాథతో పోల్చదగినవారు విశ్వనాథ మాత్రమే! అందుకే ఒకడు విశ్వనాథ. కాదంటే ఒకే ఒక్కడు విశ్వనాథ.!!


‘కల్పవృక్షం’తో అభినవ వాల్మీకి

‘నా రాముడ’ని తనివితీరా కలవరించి పలవరించి విశ్వనాథ, రామాయణాన్ని మళ్లీ తెలుగు సాహిత్య ఉద్యానవనంలో ‘కల్పవృక్షం’గా ప్రతిష్ఠించారు. గీర్వాణ వా్మఙయంలో ఆది కావ్యం వాల్మీకి ‘రామాయణం’ భారతీయ సంస్కృతికి మణిదర్పణం.సందర్భోచితంగా వినూత్న కల్పనలతో వివిధ సాహిత్య ప్రక్రియల్లో విరాడ్రూపం దాల్చింది. తెలుగులోనూ ఎన్నో రామాయణాలు వచ్చాయి. ‘రామచరితంపై అన్ని కావ్యాలు, గ్రంథాలు వెలువడిన తరువాత ఇంకా రాయడం అవసరమా?’ అనే సందేహాలకు…

‘మరల నిదేల రామాయణంబన్నచో/ నీ ప్రపంచకమెల్ల నెల్లవేళ(ల)/ తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్లు తనరుచి బ్రదుకులు తనవిగాన/ చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన/తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన’అని (ప్రపంచమంతా ప్రతిరోజు అదే తిండి తినడంలేదా? ప్రతి దినం అదే జీవనం సాగించడంలేదా?ఎవరి అనుభవం వారిది. నేనూ అంతే.? నా రాముడిని నేను తలచుకుంటాను. ఇది నేను భక్తితో రచించేది వ్యాఖ్యానించారు. ‘కవి ప్రతిభలోన నుండును గావ్యగత/శతాంశముల యందు తొంబదియైన పాళ్లు/ ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయిరెట్లు గొప్పది నవకథా ధృతిని మించి’ (తెలిసినŸ కథను మళ్లీ చెప్పడంలో కవి ప్రతిభ వ్యక్తమవుతుంది. కేవలం కథ చెప్పడం కాకుండా, కవి నూటికి తొంభయ్ పాళ్లు రసాన్ని ఎలా పండిస్తాడన్నదే ప్రధానం)అనీ అన్నారు. ఆ ప్రత్యుత్తరం సాధారణంగా కనిపించినా, అందులో అసాధారణ సందేశం దాగి ఉంది.ఎవరైనా రచనకు ఉపక్రమించినప్పుడు ఇతరుల నుంచి ఎదురయ్యే నిరాశ,నిస్పృహలను అధిగమించేందుకు ఈ మాటలు స్ఫూర్తినిస్తా యనడంలో సందేహం అవసరం లేదు.చెణుకులు విసరడంలో దిట్ట ఆయనతో ‘మీ కల్పవృక్షం చాలామందిని కదిలించింది. దాని ప్రేరణలో విషవృక్షం కూడా మొలిచిందండీ’ అంటే “ఔనౌను, ఎవరి మార్గం వారిది. నేను వెర్రివాడిని. నాకు ఏడు జన్మలకు గాని ముక్తి లేదు.వారిది వైరిమార్గం. జయవిజయులు చూపిన దారి. మూడు జన్మలకే ముక్తి!” అనేవారు


భోజన ప్రియత్వం

విశ్వనాథ వారు ఎంతపాటి యోగియో అంత భోగి. ఎంత శుచి తెలిసినవారో అంత రుచి తెలిసినవారు. ‘ప్రతిదానిలో రసాన్ని తనివీతీరా గ్రోలిన నిత్యతపస్వి. అన్నం తిన్నా, అవకాయ నంజుకున్నా, కమ్మని నేయి వేసుకున్నా, కండ పెరుగు రుచి చూచినా, సన్న బియ్యం తప్ప ససేమిరా యన్నా, పంచామృతం గ్రోలినా, పరమాన్నం త్రాగినా సంబరపడేవారు’ అని వారికి విందు ఇచ్చిన వారు ఆనందంగా చెప్పుకునేవారు. పాకశాస్త్రంలోనూ ప్రవేశం కలిగి స్వయంగా వంటచేసుకునేవారు.


కవిసమ్రాట్ జీవిత ప్రస్థానం

సెప్టెంబర్ 10,1895న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన విశ్వనాథ సత్యనారాయణ కరీంనగర్ సహా కొన్ని ప్రాంతాలలో ఉద్యోగించినా, తమ సాహితీ సేద్యాన్ని కడదాకా బెజవాడ కేంద్రంగానే సాగించారు. అధ్యాపకుడిగా ఎందరినో తీర్చిదిద్దారు. వారి తáండ్రి శోభనాద్రి గారు వంద ఎకరాకు పైగా ఆసామి. మహాభోగి,అంతకు మించి త్యాగి. వారి ఇంట భుజించని వారు స్వగ్రామంలోనే కాదు.. జిల్లాలోనే లేరని ప్రతీతి. కుమారుడు పెరిగి పెద్దయ్యేనాటికి పిత్రార్జితం పూర్తిగా కరిగిపోయింది. ఆ పరిస్థితులు కూడా విశ్వనాథ పట్టుదల, స్వయంకృషికి మÖల హేతువులుగా చెబుతారు. జీవితాన్ని అన్ని దృక్కోణాల నుంచి క్షుణ్ణంగా పరికించి, ఆకళింపు చేసుకొని, దానిని జీవితపరమార్థంతో జోడించి, తాత్త్త్విక దార్శినిక దృష్టితో సాహిత్య సారస్వతాలను సుసంపన్న చేసిన మహామనీషి. ఏ కవిని ఎక్కడ ఎలా దర్శించాలో తెలిసిన కవిసమ్రాట్. ప్రాచీన కవుల రచనలపై ఆయన విశ్లేషణ వ్యాసాలు భావితరం విమర్శకులకు పాఠ్య గ్రంథాలుగా అందించి అక్టోబర్ 18, 1976న సెలవంటూ తరలివెళ్లారు.


డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.