భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన చరిత్రలో అశోక్ సింఘాల్ జీవితం ఒక అధ్యాయం. హిందువుల హృదయాల్లో సమ్రాట్గా ఆయన స్థానం సుస్థిరం.భారతీయ సనాతన ధర్మ పరిరక్షణకు సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆయన ఒక యోగి. ఇంజినీరింగ్ పట్టాతో గొప్ప శాస్త్రవేత్త కావడానికి బదులుగా సమాజసేవను తన మార్గంగా ఎంచుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్(ఆరఎసఎస్) ప్రచారక్గా జీవనం సాగిస్తూ హిందూ సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు, భావోద్వేగాలను ఒక్కతాటి మీదకు తీసుకొనివచ్చారు. అజేయమైన శ్రీరామజన్మభూమి ఉద్యమానికి పర్యాయ పదంగా నిలిచారు. విశ్వహిందూపరిషత్(వీహెచ్పీ) పూర్వ అంతర్జాతీయ అధ్యక్షులు, అయోధ్యలో శ్రీరామజన్మభూమి ఉద్యమానికి ముందు వరుసలో నిలిచి, భవ్యమైన బాలరాముని మందిర నిర్మాణం వెనుక ముఖ్య భూమికను పోషించిన అశోక్ సింఘాల్ను భాగ్యనగరం ఘనంగా స్మరించుకుంది. వీహెచ్పీ తెలంగాణ శాఖ ఆధ్యర్వంలో అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది వేడుకలు అక్టోబర్ నాల్గవ తేదీన ఘనంగా జరిగాయి. నాలుగు గంటలకు పైగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్య వక్తగా వీహెచ్పీ జాతీయ ఉపాధ్యక్షులు చంపత్ రాయ్, తదితర ప్రముఖులు సింఘాల్ సేవాచింతనను కొనియాడారు. వారిని ఆదర్శాలను ఆచరణలో చూపడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భజనలు, రామాయణ నృత్యనాటిక, ఓంకారం, ఏకాత్మతా మంత్రం, విజయ మహామంత్రోచ్చారణ, వందేమాతర గీతాలపన, సాధు, సంతుల ఆశ్వీరచనాలు, పుస్తకాల ఆవిష్కరణతో కార్యక్రమం ఆద్యంతం భారతీయతను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా వక్తల ప్రసంగంలో కీలకమైన భాగాలను యథాతథంగా అందిస్తున్నాం.
సింఘాల్జీ జీవితం స్ఫూర్తిదాయకం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అశోక్ సింఘాల్గారి జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనమందరం కలవడం చాలా సంతోషం. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని కేటాయించు కొని, తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుడి స్మృతికి నేను ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా, శ్రీరామజన్మభూమి ఉద్యమ ప్రేరేపితునిగా, దేశ సాంస్కృతిక సేవలో తరించి, హిందూ హృదయ సమ్రాట్గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆ మహనీయుడ్ని జన్మ శతాబ్ది సంవత్సర వేడుకల్లో మనం అడుగుపెట్టాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ` సమాజంలో ఉత్తములు, ఆదర్శప్రాయులైన పెద్దలు ఏ విధంగా నడుచుకుంటారో ఇతరులు కూడా వారి మార్గాన్ని అనుసరిస్తారు. తమ నడవడిక ద్వారా ఏ విలువలనైతే నిరూపించి ప్రమాణంగా నిలబడతారో, తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారో, లోకం కూడా దానినే ప్రామాణికంగా తీసుకొని ముందుకు సాగుతుందని ఆ శ్లోకం చెబుతుంది. శ్రీ అశోక్ సింఘాల్జీ జీవితం అలాంటి ప్రామాణిక ప్రస్థానమే అవుతుంది. కనుక వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారు చూపిన మార్గంలో మనం ముందుకు వెళ్లాలి. ఆయనతో నాకు చిన్న వయస్సు నుంచే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శ్రీ అటల్ బిహారీ వాజపేయిజీ, శ్రీ ఎల్.కె.అద్వానీజీ తరహాలో శ్రీ అశోక్ సింఘాల్జీ నాతో సహా అనేకమంది కి గురుతుల్యులు. వారిని దగ్గరగా చూశాను. వారిని కలిశాను. వారి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. డిసెంబర్, 2017లో నేను ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో సామాజిక కార్యకర్త మహేష్ భగ్చాందక రచించిన “Ashok Singhal: Staunch and Perseverant Exponent of Hindutva” అనే పుస్తకాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కింది. ఆయనలో నిబద్ధత, ధర్మం పట్ల విశ్వాసం నిత్యం మనకు స్ఫూర్తిని ఇస్తాయి. ఆయన లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడం, వారి ఆశయాలను ముందుకు తీసుకొనివెళ్లడమే మనం అందరం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుంది. అశోక్ సింఘాల్జీ కేవలం ఒక సంస్థకు నాయకుడు కాదు.. ఆయన భారతీయ సనాతన ధర్మ సంరక్షణకు తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన విశిష్ట యోగి. స్వరాజ్య సమరంలోనూ, దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనూ సమాజాన్ని ఏకం చేయడానికి ఆయన ఎంతగానో పరితపించారు. ప్రఖ్యాత బెనారస్ హిందూ విశ్వవిద్యాయంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేధావి. చదువునే తన మార్గంగా చేసుకున్న పక్షంలో ఆయన ఎంతో గొప్ప శాస్త్రవేత్తగా రాణించి ఉండేవారు. కానీ ఆయన మేధోవికాసం, లక్ష్యం అంతకన్నా గొప్పవి. భౌతిక సుఖాలను, సంసార బంధాలను పూర్తిగా త్యజించి, ఆరఎసఎస్ ప్రచారక్గా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన మహనీయుడు ఆయన. అట్టడుగు వర్గాల ప్రజలకు ధైర్యాన్ని నూరిపోయడం, దేశవ్యాప్తంగా మన సంస్కృతి ఎదుర్కొంటున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం వారి జీవితలక్ష్యంగా ఉండేది. సింఘాల్ అన్న పేరుకు తగ్గట్టుగా ఆయన ఒక సింహం. ఆయన స్వరంలో సింహ గర్జన వినిపించేది. అదే సమయంలో సమాజంపట్ల అపారమైన ప్రేమ, కరుణ ఆయనలో ఉండేవి. ఒక సన్యాసి ఏ విధంగానైతే మోక్షం కోసం తపనపడతాడో అశోక్ సింఘాల్జీ దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం, జీవితాంతం శ్రమించారు. వారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది అజేయమైన శ్రీరామజన్మభూమి ఉద్యమం. దేశానికి స్వరాజ్యం సిద్ధించిన తర్వాత భారతదేశ సాంస్కృతిక ఆత్మ గౌరవాన్ని పునఃప్రతిష్టించడానికి జరిగిన అతి పెద్ద ఉద్యమం అది. ఆ ఉద్యమానికి ముందు నిలవడమే కాకుండా దానికి ఒక ప్రణాళికాబద్ధమైన నాయకత్వాన్ని అశోక్ సింఘాల్జీ అందించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను, భావోద్వేగాలను ఒకతాటిపైకి తెచ్చారు. ఆ దిశగా దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకురావడంలో వారు పడిన శ్రమ అసాధారణమైనది. శ్రీరామసేతు ఉద్యమం, ఏకాత్మతాయాత్ర ఇలా ప్రతి కార్యక్రమం లోనూ వారి దార్శినికత స్పష్టంగా కనిపించింది. అశోక్ సింఘాల్జీ పడిన తపన ఫలితమే నేడు అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం సాధ్యమైంది. బాలరాముడ్ని ప్రతిష్టించుకొని, దర్శించుకనే మహద్భాగ్యం మనకు దక్కింది. సుప్రీంకోర్టు ద్వారా న్యాయబద్ధంగా అయోధ్యలో శ్రీరామజన్మభూమిని దక్కించుకోవడంలో అశోక్ సింఘాల్జీ సాగించిన సుదీర్ఘమైన పోరాటం చిరస్మరణీయమైనది. అయోధ్యలో బాలరాముడి దర్శనం చేసుకునే ప్రతీ భారతీయుడు ఆనాడు వారు పడిన తపనను, చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మరచి పోలేరు. 1961లో జన్మాష్టమి పర్వదినాన ప్రారంభమైన విశ్వహిందూపరిషత్ కేవలం ఒక సంస్థ కాదు. అది హిందూ సమాజ చైతన్య వేదిక. విశ్వహిందూపరిషత్ను దేశం నలుమÖలాల వ్యాపింపజేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హిందువులందరూ సమానులే. మనం అందరం ఒకే మాతృభూమిలో జన్మించివారము అనే భావనను దేశంలో గ్రామగ్రామానికి చేర్చారు. శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ తరుణంలో మనం గతాన్ని స్మరించుకోవడంతో సరిపుచ్చక, అశోక్ సింఘాల్జీ ఆలోచనాస్ఫూర్తిని నేటి సమకాలీ న సవాళ్లకు ఎలా అన్వయించేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు మన సమాజం సాంకేతికంగా పరుగులు పెడుతోంది. నైతిక విలువలు, సాంస్కృతిక మÖలాల విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుం టోంది. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. దాని ప్రభావంతో పాశ్చాత్య పోకడలు మన కుటుంబ వ్యవస్థను, యువత ఆలోచనావిధానాన్ని దెబ్బ తీస్తున్నాయి. సాంకేతికతను సాంస్కృతిక సంరక్షణ వ్యతిరేకించదు. సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి. సమాజం, సాంస్కృతిక సంరక్షణలో దానిని ఉపయోగించాలి. కులం, ప్రాంతం పేరుతో హిందువుల్లో చిచ్చుపెట్ట డానికి ప్రయత్నించే వారిని ఎదుర్కోవడంలో మనకు సామాజిక సమరసత ఒక అస్త్రం లాంటిది. అదే మనకు శ్రీరామరక్ష.