ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన ఘట్టం వ్యావహారిక భాషోద్యమం. దానికి సారథి గిడుగు రామమూర్తిపంతులు. ఒక ఆలోచన జీవితాన్ని మారుస్తుందన్నట్లు, ఒక విదేశీ అధికారికి కలిగిన సందేహం ఈ ఉద్యమానికి నాంది పలికింది. ‘పుస్తకాలలోని తెలుగు భాషకు, నిత్యజీవితంలో వాడే భాషకు మధ్య తేడా ఏమిటి?’ అని నాటి విద్యాశాఖ అధికారి జె.ఎ.యేట్స్‌కు కలిగిన సందేహం పంతులు గారిని ఆలోచనలో పడేసి, భాషోద్యమానికి పునాది వేసింది. నేడు తెలుగులోని అన్ని పక్రియల్లో వ్యావహారిక భాష అమలు కావడం గిడుగు పోరాట ఫలితమేనని, వాడుక భాషకు ఊపరిలూదుతోందని సాహితీవేత్తల భావన.
విజ్ఞానం గ్రాంథిక భాషతో కేవలం కొద్ది శాతం విద్యావంతులు, పండితులకే పరిమితం కారాదని, అది సామాన్యులకు కూడా అందాలని భావించారు గిడుగు రామమూర్తి పంతులు. అందుకు బోధన, మాట్లాడుకునే భాషలోనే ఉండాలని, పత్రికలు కూడా వాడుకభాషలోనే రావాలని భావించారు. ‘ప్రజాలందరు గ్రాంథిక భాషా పండితులు కాలేరు. వాడుక భాష నేర్పితే చాలును. అందులో నుండే అన్ని విషయముల గురించి కావలసినంత జ్ఞానం సంపాదించవచ్చును’ అన్నది ప్రగాఢ ఆయన భావన.
‘నోటి మాటకు చేతిరాత’కు మధ్య గల వ్యత్యాసం భాషా వికాసానికి అవరోధంగా భావించిన గిడుగు, తమ 47వ ఏటా(1910) సుమారు మూడు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తికి విరమణ ప్రకటించి వాడుక భాష ఉద్యమాన్ని చేపట్టారు. ఆ క్రమంలో వాడుక భాష ఆవశ్యకతపై ఒక సదస్సులో చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల నుంచి కొంతమేర సానుకూలత వ్యక్తమైనా గ్రాంథిక వాదులలో, పండితలోకంలో ఏకాభిప్రాయం కుదర లేదు. పైగా, గ్రాంథికంలో రాయలేకే వ్యవహారిక భాషోద్యమాన్ని తలకెత్తుకున్నారనే విమర్శలనూ, వ్యక్తిగత దూషణలనూ ఎదుర్కొన్నారు. బీఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై,సంస్కృత, ఆంగ్ల గ్రంథాలను చదివి, శాసనాలను పరిశోధించిన ఆయనకు గ్రాంథికం రాదనడం కువిమర్శ మాత్రమే. సాధారణ ప్రజలు విద్యావంతులు కావాలన్నదే ఆయన తపన.అందుకే ఎన్ని విమర్శలనైనా భరించారు,సహించారు. ఎదుటి వారి విమర్శలతో ఆయనలో పట్టుదల పెరిగింది.
తమ ఉద్యమ ప్రచారానికి ‘తెలుగు’ అనే పత్రికను ప్రారంభించారు. అందులోని సంపాదకీయాలు, వ్యాసాలు తీవ్రచర్చలకు దారితీశాయి. చాలా మందిలో చైతన్యం నింపాయి. తమ ఉద్యమానికి చేయూతనివ్వవలసిందిగా సమకాలీన పత్రికలను అభ్యర్థించారు. వ్యవహారిక భాష ఆవశ్యకతను తెలియజేస్తూ పలు పత్రికలలో వ్యాసాలు రాశారు. సంచలనాత్మక ప్రసంగాలు చేశారు. ‘భాష జీవనది లాంటిది. అది నిరంతరం పరిణామం చెందుతుం టుంది.పాతనీరు పోయి కొత్త నీరు చేరినట్లే భాష లోనూ మార్పులు సహజం. ఉన్న పదాలకు అర్థాలు (అర్థవిపరిణామం) మారవచ్చు. కొత్త పదాలు కొత్త అర్థాలతో చేరవచ్చు. మార్పులు చేర్పులు లేకపోతే అది భాషే అనిపించుకోదు.ఈ మార్పును ఎవరూ శాసించలేరు, అడ్డగించలేరు’ అని వ్యాఖ్యానించారు. ‘వ్యాకరణం తర్వాతే భాష’ అనే నాటి పండితుల వాదనతో విభేదించి, ‘భాష తరువాతే వ్యాకరణం’ అని ప్రతిపాదించారు. భాషా నిర్బంధం, నియమాల విధింపు వ్యాకరణ ఉద్దేశ్యం కాకూడదని వాదించారు.
బాల్యమిత్రుడు, సహాధ్యాయి గురజాడ అప్పారావు, ఆంధ్రదేశంలో సంఘసంస్కరణ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు, ఆయన సంకల్పానికి అండగా నిలిచారు. వాస్తవానికి కందుకూరి మొదట గ్రాంథికవాదాన్ని బలపరిచినా, గిడుగు వాదనలోని వాస్తవాన్ని గ్రహించి.. విద్య, పత్రికలు ఎక్కువమందికి చేరువ కావాలంటే వాడుకభాష అత్యంత అవసరమని భావించారు. తా•ము నిర్వహిస్తున్న పత్రికలలో ఆ శైలిని ప్రవేశ పెట్టారు. నవ్యసాహిత్య పరిషత్, నవ్య సాహితీసమితి లాంటి సంస్థలు వాడుకభాషలోనే రచనలు ప్రారంభించాయి
విశ్వవిద్యాలయాలలో బోధన, పాలనా వ్యవహారాలు వాడుకభాషలోనే సాగాలన్న గిడుగు కల, ఆయన కన్నుమూసిన దాదాపు మూడు దశబ్దాలకు గానీ సాకారం కాలేదు. సిద్ధాంత వ్యాసాలను వ్యావహారిక భాషలో రాసే అవకాశం కూడా కలిగింది.
వాడుక భాష కోసమే కాక గిరిజనులను అక్షరాస్యులను చేయాలని తపించారు గిడుగు. వారిని విద్యావంతులను చేయాలనే లక్ష్యంతో తమ ఉన్నత విద్యాభిలాషను పక్కనపెట్టారు.ఆరోగ్యాన్ని కూడా లక్ష్మపెట్టలేదు. పర్లాకిమిడి ప్రాంతంలో కొండలలో నివసిస్తున్న సవర జాతితో పరిచయం పెంచుకొని వారి భాష, ఆచార వ్యవహారాలను పరిశీలించారు. ఆ భాషను నేర్చుకున్నారు..స్థానిక అధికారులకు ఉచితంగా నేర్పారు. అధికారులకు స్థానిక భాషలో ప్రవేశం ఉండడం ప్రజలకు ప్రయోజనం కలుగు తుందని ఆనాడే గుర్తించారు. సవర పిల్లల కోసం ఆ భాషా బడులు నెలకొల్పారు. కొందరు సవర పిల్లలను తమ ఇంట ఉంచుకొని భోజనం పెట్టి చదువు చెప్పారు. సవరల కోసం తెలుగు లిపితో నిఘంటువులు రూపొందించారు.వ్యాకరణం రాసి సవర వాగనశాసనుడిగా వినుతికెక్కారు.స•వర భాషా కృషిలో భాగంగా ఆడవులలో తిరగడంతో తీవ్ర అనారోగ్యం పాలై. వినికిడి శక్తిని కోల్పోయారు. అయినా తమ లక్ష్యానికి దూరం కాలేదు.
గిడుగువారు కేవలం వ్యావహారిక భాషావాది కాదని, మహామానవతామూర్తి అనేందుకు ..‘దేశభాషాభిమానం తోడిదే దేశాభిమాము. ఏ కులము వారైనా,ఏ మతము వారైనా, ఏ దర్జా వారైనా తెలుగు మాతృభాషగా గలవారందరూ ఒక సంఘమువారనిన్ని, ఎవరు వెనుకబడ్దా సంఘమునకు నష్టమే అనిన్ని, ఎవరు త్రికరణశుద్ధిగా భావిస్తారో వారే దేశాభిమానం గలవారమని చెప్పవలెను’ అని పత్రికా సంపాదకులకు రాసిన లేఖల్లోని వాక్యాలే నిదర్శనం. వ్యావహారిక భాషకు పట్టం కట్టినందునే గిడుగు వారి జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం. భావితరాలను తెలుగుకు దూరం చేయకుండా ఉండడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్