మన సంస్కృతీ సంప్రదాయాల వారసత్వ గని శ్రావణ పౌర్ణమి. మధుకైటభులు అనే దానవుల నుంచి వేదాలను రక్షించేందుకు యజ్ఞగుండం నుంచి ‘వాగీశ్వరుడు’ (హయగ్రీవుడు) ప్రభవించిన తిథి. వేదాధ్యాయనం ఆరంభించే, ద్విజులు నూతన యజ్ఞోపవీతధారణ చేసే తిథి. సోదరసోదరీ ప్రేమకు ప్రతీక రాఖీ (రక్షాబంధన్)కట్టే రోజు. మరాఠీయులు, కన్నడిగులు ఆనాడు సాగరపూజ చేసి కొబ్బరికాయలు సమర్పిస్తారు. దీనిని నారికేళ పౌర్ణమి, నార్లీ పూర్ణిమ అంటారు. పంటలు బాగా పండాలని కోరుతూ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌వాసులు కజరీ (గోధుమ) పౌర్ణమిగా జరుపుకుంటారు.
వేదోద్ధరణ కోసం శ్రీమహావిష్ణువు హయ గ్రీవుడిగా అవతరించాడన్నది ప్రధాన పురాణ కథనం. సరస్వతీ వాగ్దేవి కాగా, ఆయన జ్ఞానానందమయుడు, వాగీశ్వరుడు.నిర్మలమైన స్ఫటికం వంటి ఆకృతి కలవాడు. సర్వ విద్యలకు ఆధారభూతుడు. గుర్రపు తల, మానవదేహంతో నాలుగు భుజాలలో శంఖం, చక్రం, పుస్తకం, చిన్ముద్రలను కలిగి ఉంటాడు.
విధాత నుంచి వేదాలను అపహరించి సముద్రంలో దాగిన దానవులు మధుకైటభులను శ్రీమహావిష్ణువు హయగ్రీవ స్వరూపంతో సంహరిస్తాడు. వేదాలను కాపాడిన స్వామి, బ్రహ్మకు వేదాధిపత్యాన్ని, సరస్వతికి సకల విద్యాధిపత్యాన్ని అప్పగించాడు. కలియుగంలో మానవ ఉద్ధరణకు ఉపాయం చెప్పాలని అగస్త్యముని అభ్యర్థించగా, హయగ్రీవుడు రుషి రూపంలో కాంచీపురంలో శ్రీలలితా రహస్య నామాలను, శ్రీవిద్యను ఉపదేశించారని పురాణగాథ. హయ గ్రీవునికి విగ్రహరూపం కల్పించి సరస్వతీమాత ఆరాధించిందని పురాణగాథ. ఆమె కశ్మీరంలో రామానుజాచార్యులకు సాక్షాత్కరించి, శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవమూర్తిని ప్రసా దించగా, అది రామానుజుల నుంచి వారి శిష్యులు పిళెí్లయాచార్యులు, వారి నుంచి వేదాంత దేశికు లకు.. ఇలా గురుశిష్య పరంపరలో సంక్రమిం చింది. ఆ మూర్తి ప్రస్తుతం మైసూరులోని శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠంలో అర్చనలు అందుకుంటోంది.
సోదర ప్రేమకు చిహ్నం ‘రక్షాబంధన’
సమాజాన్ని, సనాతన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ, విశ్వమానవ కల్యాణానికి అనువైన వాతావరణాన్ని ఈ రక్షాబంధన్ వేడుక కల్పిస్తుంది. భవిష్యోత్తర, విష్ణు, కూర్మ పురాణాలు ఈ పండుగ గురించి పేర్కొంటున్నాయి. ఇది మానవ సంబంధాలను, కుటుంబ విలువలను పరిపుష్టం చేస్తుంది. దుష్టశక్తులను పారదోలడానికి, చేపట్టిన కార్యాలు విజయవంతం కావడానికి ఉద్దేశించిన ‘రక్షాబంధన’ (రాఖీ) అనంతర కాలంలో సోదరసోదరీ ప్రేమకు, వారి అపురూప బంధానికి ప్రతీకగా నిలిచింది. అరాచకాల బారిన పడుతున్న మహిళల రక్షణ కోసం ఈ సంప్రదాయం వచ్చిందని చెబుతారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను రక్షామంగళ్, రక్షాదివస్, రాఖీ పూనవ్, సలోని ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ‘అక్కాచెల్లెళ్లు పవిత్ర మనసుతో సోదరుడి నుదుటన తిలకం దిద్ది, మంగళ హారతిచ్చి అతని కుడిచేతికి పసుపు కొమ్ము కట్టిన దారపు రక్షను ధరింప చేసి, మధుర పదార్థాన్ని తినిపిస్తారు.రక్షకట్టే మహిళలు, కట్టించుకునేవారు ఏకోదరులు కాకపోయినా ‘నీకు రక్ష కడుతున్న నేను ఈ (మీ) కుటుంబానికి చెందిన వ్యక్తినే. నా రక్షణ బాధ్యత నీపై ఉంది’ అనే సందేశం ఇమిడి ఉంది. రక్షాబంధన్‌కు వేసే మూడు ముడులు ఆరోగ్యం, సంపద, ఆయుష్షులకు సూచికలుగా అభివర్ణిస్తారు. సోదరుడు సోదరికి కానుకలిచ్చి పెద్దల దీవెనలను అందుకోవడం సంప్రదాయం.
యుద్ధవీరులకు పట్టుదల, ఆత్మ స్థైర్యం కలిగేందుకు రక్ష కట్టేవారు. ఛత్రపతి శివాజీ తుల్జాభవానీ సమక్షంలో రక్షాబంధన్ ఉత్సవం నిర్వహించి, తాను ధర్మరక్షణకు పునరంకితమవు తున్నట్టు ప్రతిజ్ఞ చేసేవాడట. ఆ స్ఫూర్తితోనే మరాఠా ప్రాంతంలో నేటికీ ఈ రోజును ‘ధర్మదివస’గా పాటిస్తారు.
ద్విజుల విధులు
ఈ తిథినాడు ద్విజులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.గడచిన సంవత్సరంలో తెలిసీ తెలియక ఏమైనా దోషాలు చోటుచేసుకుంటే వాటి పరిహారార్థం కూడా ఈ విధి నిర్వర్తించాలని చెబుతారు. జపహోమ ధ్యానాదుల నిమిత్తం దీక్షా సూచికగా నూతన యజ్ఞపవీతం ధరించాలని శాస్త్ర వచనం. పాల్కురికి సోమన ‘పండితారాధ్యచరిత్ర’లో ఈ జంధ్యాల పూర్ణిమను ‘నూలు’ పండుగ అని పేర్కొన్నారు.
యజ్ఞోపవీతానికి గల మూడు పోగులను దేవ, పితృ,రుషి రుణాలకు సూచికలుగా,ఆ పోగులకు గల మూడు ముళ్లు ఆరోగ్యం, సంపద, తేజస్సుకు సంకే తాలుగా చెబుతారు. శ్రౌత కర్మానుష్ఠాన, మంత్రాను ష్ఠాన యోగ్యత కోసం మొదటి పోగు, గృహస్థాశ్రమ ధర్మనిర్వహణ కోసం రెండవది, వైదిక కర్మానుష్ఠాన యోగ్యత కోసం మÖడవ పోగు ధరించాలన్నది నియమం. ఉత్తరాయణంలో ఉపనయం అయిన వారికి దక్షిణాయనంలో వచ్చే శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మ చేస్తారు. అంటే ఉపనయనం వేళ యజ్ఞో పవీతంలో కట్టే ‘మౌంజి’ని ఉపాకర్మ సమయంలో తొలగించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తారు.
– స్వామి