ఎల్‌నినో ఒక ప్రకృతి విపత్తు. ప్రకృతి మానవాళిపై కరుణించి జీవనాన్ని ఎలా సుఖమయం చేస్తుందో అలాగే విపత్తులను కూడా సృష్టించి మానవ జీవితాన్ని దుర్భరం కూడా చేస్తుంది. అయితే విపత్తులకు మానవ తప్పిదాలు కూడా ఒకవిధంగా కారణమవచ్చు. మానవాళి వాడుతున్న శిలాజ ఇంధనాలు,  తద్వారా విడుదలవుతున్న కర్బన, ఇతర వాయు ఉద్గారాల ద్వారా భూమి వాతావరణం వేడెక్కుతుంది. సముద్ర జలాల అంతర్భాగం, ఉపరితల జలాలు వేడెక్కి సముద్రాల పైనుంచి వేడివాయువులు వీస్తాయి. వీటినే ఎల్‌నినోలు అంటారు. మనం ఎల్‌నినోలను రాకుండా ఆపలేము. కానీ, వాటి నుంచి ఉత్పన్నమయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితులనుండి మనల్ని మనం కాపాడుకోగలం. దానికి మంచి ప్రణాళిక, ఆచరణ, అందరి భాగస్వామ్యం కావాలి. ఎల్‌నినో ఒక వాతావరణ అననుకూల ప్రక్రియ. భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కన్నా ఎక్కువగా వేడెక్కడాన్ని ఎల్‌నినో అంటారు. సాధారణంగా సమతుల్యంగా ఉండే వాతావరణం కొన్ని ప్రత్యేక దశలో అధిక వేడిమిని సంతరించు కోవడాన్ని ఎల్‌నినో దశ అంటారు. ఈ పరిస్థితి కొన్ని నెలల వరకు ఉండొచ్చు. పైగా దాని విపరీత ప్రభావం భూమి ఉపరితలం మీద ఎల్‌నినో దశ ముగిసినప్పటికీ మరి కొద్దికాలం కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల సముద్రం ఉపరితల జలాలలో, వాయువులలో ఎక్కువ వేడిమి ఉత్పన్నమవుతుంది.. ఈ వేడిమి ప్రభావానికి చల్లటి రుతుపవనాలు ఎక్కువ దూరం ప్రయాణించలేవు. దీంతో వాతావరణంలో ఎన్నో ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటాయి.


ఎల్‌నినోకు కారణమయ్యే సముద్ర ఉపరితల వేడి నీటి ప్రదేశాలను సీ సర్‌ఫేస్ టెంపరేచర్ (SST) హాట్ స్పాట్స్ అంటాము. ఇవి సాధారణంగా మధ్య, పశ్చిమోత్తర పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోను, ఆగ్నేయ హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ, గల్ఫ్ అఫ్ మెక్సికో, అట్లాంటిక్ సముద్ర ప్రాంతాలలో ఉంటాయి. ఎల్‌నినో సీ సర్‌ఫేస్ ఎయిర్ టెంపరేచర్ హాట్‌స్పాట్స్ (SSA) అంటే ఇవి ఎల్‌నినో కారకమైన సముద్ర ఉపరితల వేడి వాయువులు.ఇవి తూర్పు ఆఫ్రికా,  దక్షిణ అమెరికా, సముద్ర తీర ప్రాంతాల లోని ఖండాలలో ఉంటాయి అని శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల ద్వారా గుర్తించారు. ముఖ్య గుర్తు ఏమిటంటే SST /SSA లలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీలు పెరిగినపుడు ఎల్‌నినో వచ్చే అవకాశం ఉంటుంది. పై రెండింటిని సర్వసాధారణ మైన ఎల్‌నినోలు అంటాము. వీటివల్ల వాతా వరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ అవి తీక్షణమైనవిగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొద్దిపాటి నుంచి ఒక విధమైన ప్రతికూల పరిస్థితు లను కలిగిస్తాయి.

75 ఏళ్లలో నాలుగు సూపర్ ఎల్‌నినోలు

సముద్ర అంతర్భాగంలోనూ, సముద్ర ఉపరితల నీటిలోనూ ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుండి 2.0 డిగ్రీల దాక పెరగడాన్ని సూపర్ ఎల్‌నినో స్థితి అంటాము. ఈ దశ ఒక భయానకమైన స్థితిని సూచిస్తుంది. వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పరిస్థితి అతలాకుతలమై పోతుంది. కొన్నిచోట్ల భారీవర్షాలు, వరదలు, మరి కొన్నిచోట్ల  వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఎండలు, వేడిగాలులు సంభవించే  అవకాశం ఉంటుంది. కాబట్టి సూపర్ ఎల్‌నినో మానవాళి చవి చూసే ఒక భయానక వాతావరణ విపత్తు. దీనివల్ల దారుణమైన వాతావరణ పరిస్థితి కలుగుతుంది. 2026లో సూపర్ ఎల్‌నినో వస్తుంది అనే అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చారు. ఇది మన దేశాన్ని అత్యధికంగా ప్రభావితం చేయనుంది. మనందరికి రానున్నది గడ్డుకాలమనే చెప్పాలి.

1950 నుండి 2025 వరకు అంటే గత 75 ఏళ్ల చరిత్రలో సూపర్ ఎల్‌నినోలు నాలుగు సార్లు సంభవించాయని గణాంకాలు తెలియచేస్తు న్నాయి. 1982-83, 1997-98, 2015-16, 2023-24లలో సంభవించాయి. ఇవన్నీ ప్రభావిత ప్రాంతాలకు,మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. 1997-98 సూపర్ ఎల్‌నినో కారణంగా ఆస్ట్రేలియాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడి భూములలో సగటున 20 నుంచి 40 మి.మీ.ల తేమ  పెరిగింది. అలాగే 2015-16 సూపర్ ఎల్‌నినో కారణంగా ఆస్ట్రేలియాలో వర్షా భావం తలెత్తింది. తేమ గణనీయంగా తగ్గిపోయింది. ఈ రెండు పరిస్థితులూ వ్యవసాయానికి విఘాతం కలిగించాయనవచ్చు.

అంచనా విధానం

అమెరికా జాతీయ సముద్ర వాతావరణ ప్రాధికారిక సంస్థ (నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ -NOAA) ఈ రంగంలో ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది అధ్యయనాలుచేసి ప్రచురించే నివేదికలు ఇతర దేశాలకు ఉపయోగ కరంగా ఉంటున్నాయి. అలాగే యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్ట్స్ ఇన్ యూకే అండ్ జర్మనీ అనే సంస్థ కూడా ఎల్‌నినో గురించి ముందస్తు సూచనలు ఇవ్వగలదు. మనదేశంలో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ విషయాలపై సమాచారం సేకరిస్తుంది. అలా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. విశ్లేషణలు చేస్తుంది. పరిశోధనాత్మక దృక్పథాన్ని సంబంధిత సమాచారానికి ఆపాదిస్తుంది. ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు తమ పత్రికలు, వెబ్‌సైట్ ద్వారా తెలియ చేస్తోంది. వీటితో పాటు పలు దేశాల్లో వాతావరణ సూచన కేంద్రాలు ఇదే రంగంలో పనిచేస్తూ గణాంకాలను పొందుపరుస్తున్నాయి.

అనర్థాలు

ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది కొన్ని ప్రాంతాలలో అత్యధిక, అసాధారణ వర్షపాతం నమోదై వరదలు సంభవించి ఆస్తి, పంటల, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి, 2023 ఎల్‌నినోలో ఇదే జరిగింది (దీన్నే ఇండియన్ నినో అన్నారు). వర్షాభావం, వేడిగాలులు వీచడం జరిగింది. రెండూ తట్టుకోలేని ఉత్పాతాలే.

ఈ ఏడాది వచ్చే ఎల్‌నినో రెండవ రకానికి చెందినదిగా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇది మన దేశంపై అత్యంత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 12 రాష్ట్రాలలో ఉన్న 312 జిల్లాలను కరువుకోరల్లోకి నెట్టగలదని చెపుతున్నారు.

సమస్యలు

  1. అతి వేడి గాలులు: ఇదే మూలమైన సమస్య.. మిగిలిన కష్ట, నష్టాలకు కారణం. ఈ వేడిగాలులవల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలలోని ప్రజలు హీట్ స్ట్రెస్ – వేడిమి ఒత్తిడికి గురవుతారు. వీచే గాలి నుండి జీవులపై ప్రసరించే అతి వేడిమి, అతి తేమ, గాలి, ధార్మికతల సంయుక్త పీడనం. ఇది వాతావరణం నుంచి వచ్చే పీడనం దీనికి ముఖ్యకారణాలు. పారిశ్రామిక, వాణిజ్య, రవాణా కార్యకలాపాలలో విడుదలయ్యే వేడి, వాయు ఉద్గారాలు సమస్యను మరింత జటిలం చేసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మామూలు వాతావరణ పరిస్థితులలోనే ఎల్‌నినోలో నమోదైన ఉష్ణోగ్రతలు, మిగిలిన కారకాలపై ఐరోపాలో పరిశోధనలు చేశారు. వాటి ప్రకారం 1970లో మామూలు వాతావరణ మార్పులకే ప్రపంచ జనాభాలో 55% సంవత్సరంలో కనీసం 90 రోజులు వేడిమి ఒత్తిడికి గురయ్యారట. అది 2025కు వచ్చేసరికి 70%కి పెరిగింది. ఇప్పటికీ సహజ వాతావరణమే వేడిమి ఒత్తిడి కలుగచేస్తుంటే, దానికి తోడు ఎల్‌నినో నుంచి వేడిమి ఒత్తిడి మానవాళిని పూర్తిగా ఇబ్బంది పెడుతోంది. ఉప ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణ ఐరోపా, ఉత్తర, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో మునుపటికంటే అదనంగా ఇప్పుడు సంవత్సరంలో 50 రోజులు వేడిమి ఒత్తిడి ఉంటుందని అంచనా. అంటే ఏడాదిలో 140 రోజులు. ఇక భారత్‌లో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెరుగుతున్న ప్రపంచ కార్యకలాపాలవల్ల గతంలో ప్రతి దశాబ్దం 0.27 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగితే ఇటీవల అది 0.32 కి పెరగడం గమనార్హం. 1970 నుంచి ఈనాటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 900 కోట్ల ప్రజలు విపరీత వేడిమి ఒత్తిడికి గురయ్యారని ఒక అంచనా. ఇది కాక ఐరోపా ప్రాంతంలో ఈ సంవత్సరం ఒమేగా హీట్ డోమ్ ఏర్పడే అవకాశాలు, దీనివల్ల వేడిమి అతిగా పెరిగే అవకాశలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

2.మనదేశంలో క్లైమేట్ స్ట్రెస్ – వాతావరణ ఒత్తిడి  (వేడిమి ఒత్తిడి సహా)తో ముఖ్యంగా వృద్ధులు, బాలలు ఎక్కువగా బాధపడుతున్నారు. ఐక్యరాజ్య సమితి బాలల నిధి – యునిసెఫ్ (UNICEF) బాలలకు పర్యావరణ ముప్పుపై 2026లో సమర్పించిన నివేదిక ప్రకారం మనదేశంలో దాదాపు ప్రతి చిన్నారి వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల నుంచి ఒత్తిడికి  గురవుతున్నారు. అది వేడి కావచ్చు, అధిక వర్షాల వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రపంచం లోని 55% దేశాలలో దాదాపు  97% బాలలు(సుమారు 24 కోట్ల మంది)రెండు రకాల ఒత్తిళ్లు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వాటికి గురవుతున్నారు.దీనికితోడు శిలాజ ఇంధనాన్ని మండించడం, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాల వల్ల ఉత్పన్నమౌతున్న కాలుష్యం, అప్పుడప్పుడు వచ్చే ఎల్‌నినోలు బాలల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. భారత్‌లోపై వాటిలో ఒకటైనా తప్పకుండా, నిరంతరాయంగా బాలలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పైన పేర్కొన్న 24 కోట్ల మంది బాలలలో దాదాపు 16 కోట్ల మంది కరవు, విపరీతమైన వేడి, ఆ వెంటనే వాతావరణం మారి ఆకస్మికంగా ముంచుకొచ్చే వరదలను చవి చూసిన సందర్భాలు ఉన్నాయని UNICEF ఆవేదన. సహజంగానే మనదేశం తుపానులు, వరదలు, వేడి వాతావరణం ఉండడానికి అనుకూలమైన భూభాగం. దీనికితోడు విచ్చలవిడి పట్టణీకరణ, పారిశ్రామికీ కరణ, బొగ్గు,ఖనిజాల తవ్వకం కోసం చెట్లు కూల్చి హరితాన్ని హరిస్తున్న వైనం, భూగర్భ జలాల విపరీత వాడకం, కాలుష్య నియంత్రణలో ప్రభుత్వాల నత్తనడకలతో సమస్య మరింత జటిలమై అమాయక బాలలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు తక్షణమే ఈ సమస్యలన్నిటిపై దృష్టిపెట్టి తగు చర్యలు చేపట్టాలి. అలాకాని పక్షంలో పరిస్థితులు మరింత తీవ్రమై “క్షవరం అయితే గాని వివరం రాలేదు” అన్నట్లుంటుంది.  ఎందుకంటే  కాలుష్య నియంత్రణా వైఫల్యంలో బాలలే మొదటి బాధితులు. ఒక నివేదిక ప్రకారం 2025లో భారత్‌లో వాతావరణంలో చోటుచేసుకున్న విపరీత మార్పులలో దాదాపు 5.5 కోట్ల మంది బాలలు ప్రభావితులయ్యారు. ఇంకొక అతి బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మనదేశంలోనే ఎక్కువ మంది బాలలు విపరీత వాతావరణ మార్పులతో కష్టాలకు గురవుతున్నారు.

మన దేశంలో బహుళ వ్యాప్తంగా ఉన్న నానుడి “మనం ఈ ప్రకృతిని మన పెద్దలనుండి కాక మన భావితరాలనుండి తీసుకుని అనుభవిస్తున్నాం” అన్నది వారికి మిగలకుండా నాశనం చేస్తున్నాం. వాళ్లకి కష్టాలు, నష్టాలు మిగుల్చుతున్నాం” అని దాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమవుతోంది.  దేశ రక్షణ వ్యవస్థలో  ఒక పదం ఉంది. శత్రువుపై ప్రయోగించే కీలకమైన రక్షణ పరికరాలను “వెపన్స్ అఫ్ మాస్ డిస్ట్రక్షన” ` సామూహిక విధ్వంసక ఆయుధాలు అని అంటాము. అలాగే మనం ప్రస్తుతం విచ్చలవిడిగా వాడే శిలాజ ఇంధనాలు, అపరిమిత మైన కార్లు, బైకులు, ఏసీలు, పరిశ్రమలలో  అతిగా వాడే రసాయనాలు, అతిగా ఉత్పత్తి చేసే పారిశ్రామిక వ్యర్ధాలు.. ఇలా అన్నీ అతి అయితే వీటిని ఒక రకంగా పర్యావరణాన్ని నష్టపరచే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ అనవచ్చు. వీటిని నియంత్రించడం మనందరి తక్షణ కర్తవ్యం. రూపాయి విలువ గణనీయంగా తగ్గుతుంటే ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తపరచగానే ప్రభుత్వం తక్షణ చర్యలకు పూనుకుంటుంది.. మరి పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలుగుతుంటే పర్యావరణ వేత్తలు ఆందోళనలు వ్యక్తపరిచినప్పటికీ సత్వరచర్యలు తీసుకోవడానికి అంత వేగంగా నడుంకట్టదు. ఇది వాస్తవం కాబట్టే నానాటికీ పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, ఎల్‌నినోలు దీనికి తోడై ప్రజా జీవితం ముఖ్యంగా బాలలు వాతావరణ ఒత్తిడికి గురవుతున్నారు. ఎల్‌నినో రావచ్చు, రాకపోవచ్చు కానీ శాశ్వతమైన ఎల్‌నినో నిరంతర పర్యావరణ విఘాతమనుకోవచ్చు.

  1. వ్యవసాయ సంక్షోభం

సూపర్ ఎల్‌నినోతో తీవ్ర వర్షభావం కానీ, తీవ్రంగా వర్షాలు పడటం కానీ జరుగుతుంది. దీనివల్ల పంటలు పండించడానికి తగిన నీరు లేకపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడం జరుగుతుంది. అలాగే అతివర్షంతో పంట నాశనమవుతుంది. దీంతో రైతులు తీవ్రమైన ఆర్థిక నష్టంలో కూరుకుపోతారు. దేశంలో తిండి గింజల కొరత ఏర్పడుతుంది. ఎల్‌నినోతో కూడా వర్షాభావంతో తగినంత పంటలు పండవు. ఈ పరిస్థితులలో ముఖ్యంగా నగరాలలో నివసించే అధిక జనాభాకు చాలా ఇక్కట్లు, పారిశ్రామిక, వాణిజ్య కలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అందుకే సూపర్ ఎల్‌నినోను చిన్న ప్రళయంగా భావించవచ్చు.

  1. విద్యుత్ సంక్షోభం

తగినంత నీరు లేక బొగ్గు ఉపయోగించి ఉత్పతయ్యే విద్యుత్, నీటి ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గి విద్యుత్ సంక్షోభం తలెత్తుతుంది.

  1. పర్యాటకానికి దెబ్బ

వేడి గాలులు, విపరీత వర్షాల వల్ల పర్యాటక రంగం దెబ్బ తింటుంది. దాని పైన ఆధారపడుతున్న ప్రాంతాలు, సంస్థలు తీవ్ర ఆర్ధిక నష్టాలను చవి చూస్తాయి.

  1. శ్రామికుల కొరత

అసలే అధిక జనాభా కలిగిన నగరాలలో ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న శ్రామికులు, కార్మికులు ఎల్‌నినోల దశలో ఉపాధి, నీరు, మంచి వసతి, విద్యుత్తు కరవై, స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. దీనివల్ల నగరాల్లో శాశ్వతంగా ఉండే మిగిలిన జనాభాకు శ్రామికులు దొరకక తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయి.

  1. ఆరోగ్య సమస్యలు

వాతావరణ మార్పులు, వేడిమి ఒత్తిడి, నీటి కొరత, విద్యుత్ కొరత వల్ల ప్రజల దైనందిన  జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వృద్ధులు, బాలలు బాధితులవుతారు.

  1. ఆర్థిక సంక్షోభం

ఎల్‌నినోల ద్వారా ఉత్పన్నమయ్యే అనేక ప్రతికూల ప్రభావాల వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. 1983-84 నుండి 2023 వరకు సంభవించిన నాలుగు ఎల్‌నినోలవల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల కోట్ల డాలర్ల నష్టం జరిగినట్లు ఆర్ధిక నిపుణులు తెలిపారు. వీటి నుంచి కోలుకోవడానికి ఎక్కువ ఆర్ధిక వనరులు కావలసి ఉంటుంది.

ప్రభుత్వ చర్యలు

  1. 2026 సూపర్ ఎల్‌నినో వల్ల దేశంలో 315 జిల్లాలు తీవ్ర వర్షాభావంతో ప్రభావిత మౌతాయని, దాదాపు కరవుకు గురవ వచ్చని, వాటిలో మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయని కేంద్రం గుర్తించింది.
  2. పర్యావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పంటలను, పద్ధతులను గురించి రైతులలో అవగాహన కల్పించడానికి నడుంకట్టింది. ఎక్కువ నీటిమీద ఆధారపడని ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రోత్సాహించడం దీని ముఖ్యోద్దేశం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఖేత్ బచావో అభియాన్ అని పేరు పెట్టింది. దీనిలో కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ, మెట్ట వ్యవసాయంపై కేంద్ర పరిశోధనా సంస్థ ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
  3. ఇప్పటికే నిల్వ ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల సురక్షిత నిర్వహణ, నియంత్రణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు సూచనలు ఇచ్చాయి.
  4. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తీవ్ర వర్షాభావ జిల్లాలలో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. వీటితో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, జార్ఖండ్, ఒడిశాలు కూడా అధికంగా ప్రభావితమౌతున్నట్లు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చర్యలు, సూచనలు

–      వర్షాభావం తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలు ముఖ్యంగా పప్పుదినుసులులాంటివి,సహజ సేంద్రియ పంటలు వేయాలి (వీటిని తక్కువ నీటితో పండించవచ్చు).

–    ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ మార్గదర్శ కాలను రాష్ట్ర ప్రభుత్వ “రైతన్నా! మీకోసం! అన్న బృహత్ కార్యక్రమాన్నిన రైతులు అనుసరించాలి.

–          ఎల్‌నినో  తీవ్రరూపం దాల్చకముందే పంటలను కాపాడుకునేటంత నీటిని  జలాశయాల నుంచి వదలాలి.

–         సూక్ష్మ నీటిపారుదల వ్యవసాయ పద్ధతులు పాటించి నీటిని పొదుపుగా వాడుకోవాలి.

–         రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ద్వారా వేడిగాలులను ప్రజలు, ఇతర ప్రాణులు తట్టుకునే ప్రణాళికలు అమలుపరచాలి.

–         పరిశ్రమలు, వాణిజ్య, నిర్మాణరంగంలోని శ్రామికులు వేడిమి నుంచి తట్టుకోవడానికి తగిన నీరు, వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలి.  వైద్య పరమైన సహాయం ముమ్మరం చేయాలి.

రాయలసీమ జిల్లాలకు ముప్పు

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వ్యవసాయ ప్రాంతాలకు ఎల్‌నినో హెచ్చరిక జారీ చేసింది, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను గుర్తించింది. ఈ అంచనా ప్రకారం రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా అధిక ప్రమాదకర కేటగిరిలో ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా ముందుగానే సన్నద్ధమవ్వాల్సిన బలహీన జిల్లాలుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న భూగర్భ జలమట్టాలు, పరిమిత నీటిపారుదల సౌకర్యం, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో రుతుపవన వర్షాలపై అధికంగా ఆధారపడటం ప్రధానంగా ఆందోళనలు కలిగిస్తున్నాయి. రాయలసీమలో వ్యవసాయం ప్రధానంగా రుతుపవన వర్షాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, అక్కడ వర్షపాతం ఏ మాత్రం తగ్గినా విత్తనాలు వేసే నిర్ణయాలు, పంట ఉత్పాదకత ప్రభావితం కావచ్చు. రుతుపవన పరిస్థితులు బలహీనంగా ఉంటే, నీటిని ఎక్కువగా వినియోగించే పంటలకు అధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం వంటి ఉత్తర కోస్తా జిల్లాల్లో, నీటిని పొదుపు చేసే సాగు పద్ధతులను అవలంబించాలని, తేమ ఒత్తిడిని తట్టుకోగల పంటల వైపు మళ్లాలని రైతులకు సూచిస్తున్నారు. కరవు లాంటి పరిస్థితులు వాటిల్లకుండా, క్షేత్రస్థాయిలోనే వ్యవసాయ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని జిల్లా యంత్రాంగాలను కోరారు. ఈ ప్రణాళికలు పంటల వైవిధ్యం, సమర్థవంతమైన నీటి నిర్వహణ, రైతులకు సకాలంలో సలహాలు ఇవ్వడంపై దృష్టి సారిస్తాయి. అధిక నీటి లభ్యత అవసరమయ్యే పంటలకు బదులుగా పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి వంటి కరవును తట్టుకోగల పంటలను పండించాలని బలహీన ప్రాంతాల్లోని రైతులను ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగాన్ని తగ్గించి, ఉత్పాదకతను నిలబెట్టడా నికి మల్చింగ్, అంతరపంటలు, నేరుగా విత్తే వరి (DSR) వంటి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తున్నారు. వర్షపాత ధోరణులు, పంటల పరిస్థితులు, తలెత్తుతున్న ప్రమాదాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో పర్యవేక్షణ సెల్, పంట వాతావరణ పర్యవేక్షణ బృందం ద్వారా పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేసింది. ఈ వ్యవస్థ రైతులకు, జిల్లా యంత్రాంగాలకు సకాలంలో సలహాలను అందించే లక్ష్యంతో పనిచేస్తుంది. వర్షాధార ప్రాంతాలలో స్వల్పకాలిక, తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనిశ్చిత వాతావరణ పరిస్థితులలో కూడా నష్టభయాలను తగ్గించి, రైతుల ఆదాయాలకు రక్షణ కల్పించేందుకు పంటల వైవిధ్యీకరణ, మిశ్రమ వ్యవసాయం, అంతరపంటలను ప్రోత్సహిస్తున్నారు. పరిమిత తేమ లభ్యతలో మెరుగ్గా పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలపై ప్రత్యేక దృష్టి సారించారు.

తెలంగాణలో చర్యలు, సూచనలు

–             ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిల్వలకు ప్రాధాన్యం

–             అవసరమైన చోట డ్యాముల గేట్లకు మరమ్మతులు

–              వరి సాగు 35 లక్షల ఎకరాలకు కుదింపు

–              పప్పులు, చిరు ధాన్యాలు, మొక్కజొన్న, నూనె గింజల పంటలకు ప్రోత్సాహం

–              నదీ జలాల్లో వాటాలపై సంబంధిత రాష్ట్రాలతో సంప్రదింపులు

–              గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి నిల్వల నిర్వహణకు ప్రణాళిక

–              భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాటు

–             రైతు వేదికల ద్వారా ఎల్‌నినో పట్ల రైతులకు అవగాహన

అందుబాటులోఉన్న సమాచారం ద్వారా తెలుస్తున్నదేమిటంటే వర్షాభావ పరిస్థితులను తట్టుకుని పంటలను కాపాడుకునేందుకు కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ, మెట్ట వ్యవసాయంపై కేంద్ర పరిశోధనా సంస్థ సంయుక్తంగా ప్రతి జిల్లాకు ప్రత్యేక వ్యవసాయ అత్యవసర ప్రణాళికలను రూపొందిం చాయి. వర్షాలు నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలలో సాగు ఖర్చులు భారం కాకుండా, తక్కువ నీటి అవసరం ఉండే, తక్కువ కాలంలో పండే ప్రత్యా మ్నాయ పంటలను వేసేలా రైతులను ప్రోత్సహించాలని కేంద్రం కోరింది. పంటల వైవిధ్యీకరణ ద్వారా సాగు నష్టాలను చాలా వరకు తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది.

రైతాంగానికి సాగునీటి కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్రాలు తమ పరిధిలోని చెరువులు, కాల్వలు, జలాశయాలు, పొలాల్లోని చిన్న కుంటలు, చెక్ డ్యామ్‌ల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వాన నీటిని గరిష్టంగా నిల్వచేసుకునేందుకు వీలుగా తాత్కాలిక కట్టలను నిర్మించాలని సూచించింది. తీవ్ర నీటి కొరత ఉన్న జిల్లాల్లో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత నిచ్చింది.

పర్యావరణ పరిరక్షణోద్యమం ఒక నిరంతర ప్రక్రియగా పర్యావరణాన్ని, వాతావరణాన్ని పరిరక్షించే విధానాలను తమ డేటా సమీకరణ, విస్తృత ప్రచారం ద్వారా మనదేశంలో విజ్ఞాన, పర్యావరణ కేంద్రం – సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కృషి చేస్తోంది. ఇది 1980లో ప్రారంభమైంది. పర్యావరణాన్ని, వాతావరణాన్ని పరిరక్షించే విధానాలను ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు తమ ప్రచురణలద్వారా, వెబ్‌సైట్ ద్వారా, ప్రచారం ద్వారా తెలియజేయడానికి ఎంతో కృషి చేస్తోంది. 2023లో సంభవించిన సూపర్ ఎల్‌నినోకు సంబంధించి ఆ దశలో ప్రతి రోజూ వేడిగాలులు వీచిన సరళి, వర్షపాతం తగ్గుదల చెందిన సరళి, ప్రత్యేకంగా ఏర్పడ్డ ప్రతికూల వాతావరణ పరిస్థితులను క్రోడీకరించి, విశ్లేషించి ఒక  డేటా పట్టిక చేసింది. ఎల్‌నినో వల్ల దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిన సరళిని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వివరాలు, చివరకు 2023 ఎల్‌నినో ప్రభావం వల్ల చనిపోయిన వారి సంఖ్యను కూడా డేటాగా పొందుపర చిందని సమాచారం. ఆ అనుభవంతో ఈ సంస్థ 2026 సూపర్ ఎల్‌నినో వల్ల కలిగే (ఇప్పటికే దాదాపు 30% వర్షపాతం నమోదు కాలేదని అంచనా) దుష్పరిణామా లను అంచనా వేస్తున్నది. తమ దైౖనందిన కార్యకమంగా ఈ సంస్థ ప్రతినిధులు గ్రామాలు, పట్టణాలలో తిరిగి పర్యావరణ, వాతావరణ పరిస్థితులను పరిరక్షించు కోవడం కోసం ఎన్నో సదస్సులద్వారా విషయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇది కాక భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం` ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఐఎన్‌సీఓఐఎస్) అనే సంస్థ కూడా ఎప్పటికప్పుడు సముద్రాల్లో మార్పులు, మనపై వాటి ప్రభావం మీద ఎప్పటికప్పుడు మనకు సమాచారం, హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాంటి ఇతర చిన్న, పెద్ద సంస్థలు, పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషి ఎంతో  ప్రశంసనీయం.

ప్రజలు తమ పరిధిలో స్వచ్ఛందంగా, సమష్టిగా పాల్గొని తమ పర్యావరణాన్ని తామే రక్షించుకోగలరనే దానికి రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం నిదర్శనంగా నిలుస్తుంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లోని బార్మేర్ జిల్లాలోని “మొలోప్ ఎనేర్ “ అనే గ్రామంలో నీటి కొరత ఉండేది. ఆ గ్రామంలో కొంత భూమి వ్యర్ధాలతో నిండి నిరుపయోగంగా ఉండేది. ఆ గ్రామ ప్రజలు సంఘటితమయ్యారు. ఆ భూమిని తవ్వారు. అక్కడే జలాశయాన్ని నిర్మించుకున్నారు. వర్షా కాలంలో జలాశయంలో చేరిన నీటితో ఇప్పుడు తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇలా ప్రతి ప్రాంతంలో ప్రజలు తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న అమూల్య వనరులను పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమర్ధమంతంగా, తమకనుగుణంగా మలుచుకుని ఉపయోగించుకుంటే ఎల్‌నినో లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థల శాస్త్రవేత్తలు చేస్తున్న అధ్యయనాలు పరిణతి చెండుతున్నాయి కాబట్టి ముందుగానే విపత్తులకు సంబంధించిన సమాచారం, హెచ్చరికలు అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు సకాలంలో అందుతున్నాయి.

అయితే దేశంలో ప్రతి ఒక్కరు ఆ అధ్యయనాల సారాంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. అటు ప్రభుత్వాలు, ఇటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ప్రజలు తగురీతిగా సకాలంలో స్పందిం చాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు విపత్తు సమయాలలోనే కాక మిగిలిన సమయాలలోకూడా చేపట్టేలా విధానరూపకల్పన జరగాలి. ప్రజల భాగస్వామ్యం ఉండాలి. వనరులను పొదుపుగా, విచక్షణతో వినియోగించుకోవాలి. చట్టాలను విధిగా పాటించాలి. వ్యర్థాలను తగ్గించాలి. ఇలాంటి పనులను సమష్టిగా అమలుచేయడంలో మనం ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఎటువంటి విపత్తునైనా సమర్థ వంతంగా ఎదుర్కొనే స్థాయికి యావత్ దేశం చేరుకుంటుంది.


మన బాధ్యత

ఇలాంటి విపత్తు సమయాల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా (సంఘాలుగా ఏర్పడి) పలురకాల విపత్తు నిర్వహణ కార్యక్రమాలు అమలు చేసే ప్రభుత్వాలకు వారి కార్యక్రమాలలో తగిన చేయూతనిస్తే ఎల్‌నినో పరిస్థితులను సులభంగా ఎదుర్కోవచ్చు. ఆ దిశలో యీ క్రింది సలహాలు ఉపయోగపడొచ్చని అనిపిస్తోంది.

–              మెట్ట పంటలు వేయడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.

–              ప్రజలందరూ మార్కెట్‌లో లభించే ఆహార పదార్థాల వాడకంలో వృథాను అరికట్టాలి.

–             రైతులు సహా ప్రజలందరూ ఎల్‌నినో ప్రభావాý గురించి క్షుణ్ణంగా  తెలుసుకోవాలి.

–             ప్రజలందరూ వేడి సమయాలలో తప్పక గొడుగుల కింద, షెల్టర్‌ల కింద ఉండి తమను తాము కాపాడుకోవాలి.

–             దైనందిన నీటి వాడకంలో అత్యధిక పొదుపును పాటించాలి. పదేపదే ఇళ్లు కార్లు కడగడం తగ్గించాలి.

–             ఎల్‌నినో ప్రభావం సమయాలలో నీటిని ఉపయోగించి చేసే నిర్మాణాలను తాత్కాలికంగా ఆపేయాలి.

–              అత్యవసరమైతే తప్ప స్వంత వాహనాల్లో విహారాలు, ప్రయాణాలు చేయకూడదు. దీనివల్ల ఇంధనం మండించడం వల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలుష్యాన్ని నివారించవచ్చు.

–              జాతీయ రహదారులకు పక్కనే ఉన్న గ్రామాలలోని ప్రజలు రోడ్ల పక్కన సామూహిక షెల్టర్స్ నిర్మించాలి.

–              ఎవరికీ వారు, వారు ఉంటున్న ప్రదేశాలలో పక్షులకు, ఇతర ప్రాణులకు తాగునీటి కడవలు ఏర్పాటుచేయాలి.

–              పరిశ్రమలలో ఎక్కువ నీటి వినియోగం ఉన్న ఉత్పత్తులను తగ్గించాలి/తాత్కాలికంగా నిలిపి వేయాలి.

–              నగరాల్లో, గ్రామాల్లో ప్రజలు వాడవాడలా ఎల్‌నినో సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పొదుపు చర్యలపై సదస్సులు నిర్వహించుకోవాలి.

–             విద్యుత్తును పొదుపుగా వాడుకుని విద్యుత్ ఉత్పత్తిపై అదనపు భారం పడకుండా, ఉత్పత్తి వ్యయం పెరగకుండా చూసుకోవాలి.

–              నగరాల్లో పెద్దగా పనిలేని వారు నగరాల్లోని వనరుల కోసం పోటీ పడకుండా గ్రామాలకు వెళ్లి సహాయపడాలి.

                                                                                              “సర్వే జనాః సుఖినో భవంతు”

– మహావాది రామకృష్ణ


ఎల్‌నినోతో కుప్పకుప్పలుగా నేరేడు పండ్లు

భారతీయ మార్కెట్లు నేరేడు పండ్లతో నిండి పొంగిపోతున్నాయి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నేరేడు పండ్లు అసాధారణంగా సమృద్ధిగా పండుతున్నాయి. కేవలం ఒక సంవత్సరం క్రితం దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఇప్పుడు స్థానికులు చెట్లనిండా పండ్లు ఉండటాన్ని గమనిస్తున్నారు. దీనికి ఒక సామాజిక మాధ్యమ వినియోగదారు స్పందించారు. తమ బామ్మ తరతరాలుగా చెప్పిన ఒక సాంప్రదాయ జ్ఞానంతో ముడిపెట్టారు. వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా అధిక పరిమాణంలో పండ్లను రాల్చితే, ఆ సంవత్సరం కరవు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది బామ్మ మాట.

నేరేడు లేదా సిజిజియం క్యుమిని మార్చి, ఏప్రిల్ నెలల మధ్య పూస్తుంది. ఈ సమయంలో పూసే చిన్న, తెల్లని, సువాసన గల గుత్తులు కాయలుగా మారతాయి. కాయలు ఏర్పడటానికి ముందు ఈ గుత్తులకు తప్పనిసరిగా పరాగసంపర్కం జరగాలి. ఈ సమయంలో కురిసే వర్షమే దీనికి శత్రువు. అది పువ్వుల నుండి పుప్పొడిని రాల్చేస్తుంది, పరాగ సంపర్క కారకాలను కొట్టుకుపోయేలా చేస్తుంది. లేత కాయలు అభివృద్ధి చెందకముందే రాలిపోయేలా చేస్తుంది. ఈ ఏడాది మన దేశంలోని చాలా ప్రాంతాలలో రుతుపవనాలకు ముందు వచ్చే వసంతకాలం అసాధారణంగా పొడిగా ఉంది. అరేబియా సముద్రం నుండి వచ్చే రుతుపవనాల ప్రవాహం నిలిచిపోయింది. జూన్‌లో మహారాష్ట్ర , కర్ణాటక అంతటా 40 నుండి 54 శాతం వరకు వర్షపాత లోటు నమోదైంది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశ కలిగించిన ఆ పొడి వసంతకాలం, నేరేడు పూయడానికి చాలా అనుకూలంగా ఉంది. సాధారణం కంటే అధిక స్థాయిలో పరాగసంపర్కం విజయవంతమైంది. కాయలు బాగా కాశాయి. చెట్లు ఫలాలను అందించాయి. నేరేడు పండ్లు సమృద్ధిగా పండటమనేది చెట్టు ఒత్తిడిని, ప్రత్యేకంగా తగ్గుతున్న భూగర్భ జలాలను గ్రహించి, మనుగడ వ్యూహంగా పునరుత్పత్తి వైపు తన శక్తిని మళ్లిస్తుండటాన్ని సూచిస్తుంది. ‘స్ట్రెస్ ఫ్రూటింగ’ అని పిలిచే ఈ ప్రక్రియ వాస్తవ వృక్షశాస్త్రం నుండి ఉద్భవించింది. నీటి ఒత్తిడికి గురైన చెట్లు పరిస్థితులు మరింత దిగజారకముందే పునరుత్పత్తి చేయాలనే పరిణామ సహజ ప్రవృత్తితో, కొన్నిసార్లు తమ వనరులను శాఖీయ పెరుగుదల నుండి విత్తనోత్పత్తి వైపు మళ్లిస్తాయి. అయితే వృక్షశాస్త్రజ్ఞుల ప్రకారం నేరేడు పండ్ల అధిక దిగుబడి భవిష్యత్తులో కరవుకు సూచన కాదు. అది గతంలోని పొడి పరిస్థితులను, అంటే పూతకు అనుకూలించిన పొడి వసంతాన్ని ప్రతిబింబిస్తుంది. చెట్టు ఇప్పటికే జరిగిన దానికి ప్రతిస్పందిస్తోంది. కానీ అది తరువాత ఏమి జరుగుతుందో అంచనా వేయడం లేదు. సాంప్రదాయ జీవావరణ శాస్త్ర పరిజ్ఞానం, ఆధునిక వృక్షశాస్త్రం ఈ పరిశీలనతో ఏకీభవిస్తాయి. కానీ, కార్యకారణ సంబంధం దిశ విషయంలో అవి విభేదిస్తాయి.

మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కాలానుగుణంగా పెరగడాన్ని సూచించే ఎల్‌నినోను జూన్ 11, 2026న భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. ఆసియా అంతటా వాతావరణ ప్రసరణ సరళిని ఎల్‌నినో మారుస్తుంది. దీనివల్ల భారతదేశం వైపు తేమను తీసుకువచ్చే గాలులు బలహీనపడి ఉపఖండం అంతటా వర్షపాతం తగ్గుతుంది. ఎల్‌నినో సంవత్సరాలలో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ రుతుపవన వర్షపాతం, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన కరవు ఏర్పడతాయి. ఐఎండీ ఇప్పటికే తన 2026 రుతుపవన అంచనాను దీర్ఘకాలిక సగటులో 90 శాతానికి సవరించింది. మొత్తం మీద రుతుపవన కాలంలో వర్షపాతం లోటుగా ఉండే అవకాశం 60 శాతంగా పేర్కొంది. ఎల్‌నినో సృష్టించిన ఈ పొడి రుతుపవన పూర్వ పరిస్థితులు నేరేడు చెట్టుకు ఒక వరంలాంటివి. నేరేడుకు అవసరం లేని అవే వర్షాలపై ఆధారపడిన రైతులకు మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చివరికి, ఆ పండుకు, కరవు హెచ్చరికకు మధ్య పెద్దగా తేడా లేదని తేలింది. వాతావరణ సరళి మారుతున్న కొద్దీ నేరేడు పండ్లను అధికంగా ఇచ్చే పొడి వసంతాలు తరచుగా సంభవిస్తున్నాయి. ఈ జూన్‌లో మహారాష్ట్రలోని రైతులను ఒత్తిడికి గురిచేసిన అవే అస్తవ్యస్తమైన రుతుపవనాలకు ముందు పరిస్థితులే నేరేడు చెట్లకు అనువైన పరిస్థితులను సృష్టించాయి.

  • జాగృతి డెస్క్

About Author

By editor