ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి తన పీఠికలో ‘‘పాశ్చాత్యులు నేటివరకు వ్రాసిన చరిత్రలు, రాజుల చరిత్రలు, ఎనిమిదవ హెన్రీకి ఏడ్గురు భార్యలనియు, ముప్పైయేండ్ల యుద్దం అముక తిధులందు జరిగెననియు, 1748 హిందూస్థానీ చరిత్రలో ప్రసిద్ధియనియు, క్యాతరీన్ రష్యా చక్రవర్తినికి ఎందరు భర్తలుండిరనియు చరిత్రలో మరిచిపోకుండా వ్రాయుదురు. వాటివల్ల మనకేమి లాభము?’’ మరి మనకేమి కావాలంటే మన తాతముత్తాత లెట్టివారై యుండిరో మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసము కలిగియుండిరో, ఏ ఆటపాటలతో వినోదించిరో… క్షామాదీత బాధలు కలిగినప్పుడెటుల రక్షణము చేసుకొన్నారు, జాడ్యాలకే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలు ప్రీతి కలవారై యుండిరో, ఏఏ దేశాలతో వ్యాపారం చేశారో తెలుసుకొనుటకు మనకు కుతూహలముండును. అల్లా ఉద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు, అసఫ్‌జా చరిత్రల కంటే మన చరిత్రలు ఏమాత్రము తక్కువైనవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము కాము. కాన బహుశ మనమే మెరుగేమో!’’ కాబట్టి సాంఘిక చరిత్ర, మానవచరిత్ర. అది మన సొంత కధ!
‘‘జగమునేలిన తెలుగు, గోదావరి నుండి జావా దాకా’’ అనే పుస్తకాన్ని డా।। డి.పి.అనురాధ రాశారు. దానిలో మగాడు, ఒక్కలప్ప, నూకరాజు, సన్నరాజు, వెంకటరంగమ్మ అనేవి సాధారణమైన పేర్లు కావంటారు. మయన్మార్, ధాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంకను ఒకప్పుడు ఏలిన రాజులు, రాణులు, ఈ పేర్లు, ఆయాదేశాలలో ప్రాచీన రాజ్యాలకు తెలుగునేలతో దగ్గర సంబంధం ఉందనడానికి గట్టి సాక్ష్యాలన్నారు. శ్రీలంకలో తొలి, మలిరాజ్యాలు తెలుగువారివే. మయన్మారులో తటోసు, హంసావతి, మర్తబాన్ రాజ్యాలు, థాయిల్యాండ్‌లో ద్వారావతి, హరిపుంజాయి, వియత్నాంలోని చంపారాజ్యం, ఇండోనేషియాలోని తరుమనగరం, శైలేంద్రమాతరం రాజ్యాలలో తెలుగువారి ఆనవాళ్లు నేటికీ స్పష్టంగా ఉన్నాయి. అక్కడ ప్రాచీన లిపికి మూలం మన తెలుగు నేలే. శిల్పానికి ప్రేరణ అమరావతి. కాంబోడియాలో ప్రసిద్ధి చెందిన అంగ్‌కోర్‌వాట్ ఆలయంలో అమరావతి శిల్పానికి విస్తృతరూపం కనిపిస్తుంది. శ్రీలంకలో తెలుగురాజ్యాల గురించి ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను.
‘‘మహావంశము’’ శ్రీలంక చరిత్రకు సంబంధిం చిన ఒక గొప్ప చారిత్రక గ్రంథం. దీనిని క్రీ।।శ।। 5 లేక 6వ శతాబ్దంలో ‘‘మహానామ’’ అనే బౌద్ద సన్యాసి పాళీ భాషలో పద్యరూపంలో రాశాడు. ఇది ప్రపంచం లోనే సుదీర్ఘమైన, నిరంతర చారిత్రక రికార్డులలో ఒకటి. ఇందులో క్రీ।।పూ।। 6వ శతాబ్దం నుండి 1815 వరకు జరిగిన రాజకీయ, మత, సాంస్కృతిక విశేషాలు నమోదు చేశారు. మౌర్య సామ్రాజ్యాధినేత అశోకుడి కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్ర శ్రీలంకకు వెళ్ళి బౌద్దమతాన్ని ఎలా వ్యాప్తిచేశారో ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది.
శ్రీలంక 2500 ఏళ్లనాటి గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగున్న ప్రాతం. భారతదేశంలోని తమిళప్రాంతంతో వారికి సన్నిహిత సంబంధాలు న్నాయి. భారత్ నుండి వలసవచ్చిన ‘‘విజయుడు’’ సింహళ రాజ్యానికి పునాది వేశాడు. క్రీ।।పూ।। 3వ శతాబ్దంలో భారత్ నుండి వచ్చిన అశోకుని కుమారుడు ‘‘మహింద’’ ద్వారా బౌద్దమతం ప్రవేశించింది. అనూరాధపురం, పొలన్నరువ వంటి ప్రాచీన రాజధానుల నిర్మాణం, చక్కటి సాగునీటి వ్యవస్థను ఈ రాజులు అభివృద్ధి చేశారు.
శ్రీలంక చరిత్ర ప్రకారం విజయుడు శ్రీలంకను పాలించిన మొదటిరాజు. సింహళరాజ్య స్థాపకుడు. మహావంశము, శ్రీలంక పురాణ గ్రంథాల ప్రకారం ఆయన వంగదేశీయుడు (బెంగాల్) లేదా లాటదేశం (గుజరాత్)కు చెందిన రాకుమారుడు. తండ్రి సింహబాహుడు, తల్లి సింహసీవలి. అతడి తండ్రి పేరు మీదగానే సింహళ దేశానికి ఆ పేరు వచ్చింది. సింహబాహుడు తన కుమారుని, అతని 700 మంది అనుచరులను దేశం నుండి బహిష్కరించాడు. గౌతమబుద్ధుడు క్రీ।।పూ।। 543లో పరినిర్వాణం చెందినరోజునే విజయుడు శ్రీలంకలోని ‘‘తంబపన్ని’’ తీరానికి చేరాడు. స్థానిక యక• తెగకు చెందిన ‘‘కువేణి’’ అనే యువతిని వివాహం చేసుకుని, ఆమె సహాయంతో అక్కడి ఇతర తెగలను ఓడించి, తంబప న్నిని రాజధానిగా చేసుకొని పాలన ప్రారంభించాడు. వారికి జీవహట్టా (కుమారుడు) దిసాలా (కుమార్తె) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. విజయుడు తన సామ్ర్యావ్యాప్తిని కాంక్షించి దక్షిణ భారతంలోని పాండ్య రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. దీనితో విజయుని శపించి కువేణి ఆత్మహత్య చేసుకుంది. ఈమె బిడ్డల సంతతీ శ్రీలంక అడవుల్లో జీవించే ‘‘వెద్దా’’ అనే గిరిజనులని నమ్ముతారు. కువేణి శాపం కారణంగానే విజయునకు వారసులు జన్మించ లేదు. దీనితో, అతని మేనల్లుడు ‘‘పండువాసుదేవుడు’’ రాజయ్యాడు. ఇతడు అనూరాధపురాన్ని రాజధానిగా చేసుకున్నాడు. చక్కటి ఇంజనీరింగ్ నైపుణ్యం గలవాడు. అతడు అనూరాధ పురంలో తాగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసి, ‘‘అభయవాపి’’ అనే చెరువును నిర్మించాడు. అనంతరం దేవానాం ప్రియతిస్స రాజయ్యాడు. ఇతడు అశోకునికి సమకాలికుడు. అశోకుని కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్ర ఈ సమయంలోనే శ్రీలంకకు వెళ్లి బౌద్దమత వ్యాప్తిని చేశారు. అక్కడ ఎన్నో బౌద్ద స్తూపాలను (దాగోబా) నిర్మించారు. కానీ, చోళరాజు ఎల్లాలన్ సింహళ రాజును ఓడించి, అనూరాధ పురాన్ని ఆక్రమించాడు.
శ్రీలంకలోని నీటిపారుదల (చెరువుల) వ్యవస్థ – ఒక ఇంజనీరింగ్ అద్భుతమని (హైడ్రాలిక్ సివిలైజేషన్) ఇంజనీర్లు కొనియాడతారు. ప్రాచీన రాజులు వర్షపు నీటిని నిల్వచేసి, వ్యవసాయానికి ఉపయోగించుకోవడం ప్రపంచంలోనే పేరు గాంచింది. పొడి వాతావరణం ఉండే ఉత్తర, తూర్పు లంక మైదాన ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఈ అద్భుత వర్షపు నీటి వ్యవస్థను సృష్టించారు. తరువాత వచ్చిన రాజులు నదుల ప్రవాహానికి అడ్డంగా భారీమట్టికట్టలను వేసి, మైళ్ళ పొడవున కృత్రిమ చెరువు లను నిర్మించారు. రాజు మహాసేనుడు ‘మన్నేరియా’ అనే చెరువుతోపాటు,16 పెద్దచెరువులను నిర్మించారు. అలాగే ‘యోధుల బిసవక్కులమ’ చెరువును త్రవ్వించాడు. చెరువులో నీటి ఒత్తిడిని నియంత్రిస్తూ, కాలువలోనికి అవసరమైన మేరకే నీటిని విడుదలచేసే ఒక ప్రత్యేకమైన స్లూయిస్ గేటు సాంకేతికతను వారు కనిపెట్టారు. ఆధునిక డ్యామ్‌లలో వాడే వాల్వ్ పద్ధతికి మూలం ఇదే.
బౌద్ధ మతం విషయానికొస్తే, అశోకుని కుమార్తె, కుమారుడు అక్కడకు చేరుకునే సమయానికి రాజు దేవానాంప్రియ తిస్స శ్రీలంకను పాలిస్తున్నాడు. దేవానాంప్రియ తిస్స వేటకు వెళ్లగా మిహింతలే అనే కొండ దగ్గర మహిందుడు కలిశాడు, మహిందుడు రాజు బుద్ధి కుశలతలు పరీక్షించి, తరువాత బుద్ధుని బోధనలు వినిపించాడు. ఆ బోధనలకు ముగ్ధుడై దేవానాం ప్రియ తిస్స బౌద్ధాన్ని స్వీకరించాడు. తరువాత బౌద్ధం శ్రీలంక అధికార మతమైంది.
శ్రీలంకలోని మహిళలకు బౌద్ధదీక్ష ఇవ్వడానికి అశోకుని కుమార్తె సంఘమిత్ర శ్రీలంక చేరుకుంది. ఆమె శ్రీలంకకు వస్తూ బుద్దుడికి జ్ఞానోదయం అయిన గయ లోని పవిత్ర మహాబోధివృక్షం కుడి కొమ్మను వెంట తీసుకువచ్చింది. ఆ కొమ్మను అనూరాధపురం లోని మహామేఘవన తోటలో నాటారు. నేటికి పూజలందుకుంటున్న ప్రపంచంలోనే అతి పురాతనమైన వృక్షం ఇదే.
బుద్ధుని బోధనలు మౌఖికంగా ప్రచారంలో ఉండేవి. కాని కీ।।పూ।। 1వ శతాబ్దంలో శ్రీలంకలోని ‘‘మాతలే అలువిహారే’’ గుహలలో తొలిసారి ఈ బోధనలను తాళపత్రాలపై పాలీ భాషలో గ్రంథస్తం చేశారు. ఇవే త్రిపిటకాలు. ఇది ప్రపంచ బౌద్ద చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం.
శ్రీలంకలో నాణ్యమైన మసాలాదినుసులు (అసలైన దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, జాపత్రి వంటివి) దొరుకుతాయి. ఇక్కడి దాల్చిన చెక్క చౌకైన కాసియా రకంలా కాక మృదువుగా, సులభంగా చుట్టడానికి వీలుగా, తియ్యగా సున్నితమైన రుచిని కలిగి వుంటుంది. అలాగే సిలోన్ బ్లాక్ పెప్పర్ (సిలోన్ మిరియాలు) ప్రపంచ మార్కెట్‌లో ప్రీమియం గ్రేడు. సిలోన్ లవంగాలు, (పెద్ద మొగ్గలు) నూనె తీయడానికి ప్రసిద్ధి.
శ్రీలంకలోని కాండీ రాజ్యాన్ని పాలించిన నాయక రాజులు తెలుగు మూలాలున్న వారు (కమ్మ / బలిజ వంశం). రాజకుటుంబమే విలువైన మసాలా దినుసుల వ్యాపారం చేసేది. దాల్చినచెక్క ఒక వ్యూహాత్మక ఆయుధం (హార్మోజ్ ఇరాన్‌కు వ్యూహాత్మక ఆయుధంలా). ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల దాల్చిన చెక్క కేవలం ఇక్కడే దొరికేది.
యూరోప్ దేశాలలో దీనికి బంగారమంత డిమాండు ఉండేది. దీనిపై డచ్‌వారి కన్నుపడింది. నాయకరాజులు డచ్ వారికి దాల్చిన చెక్క ఇచ్చి బదులుగా ఆధునిక తుపాకులు, మందుగుండు సామాగ్రి, విదేశీ వస్తువులు పొందేవారు. డచ్‌వారు ఆ దాల్చిన చెక్కను ప్రపంచ మార్కెట్టుకు తీసుకుపోయి గుత్తాధిపత్యంతో అమ్ముకుని, స్థానిక రాజును వ్యాపారం చేయనియ్యకుండా రకరకాల ఆంక్షలు విధించి, వేధించేవారు. (ఆర్థిక దిగ్బంధనం). డచ్ వారికి తెలియకుండా మసాలా దినుసులను ప్రపంచ మార్కెట్‌కు చేర్చడానికి కాండీ రాజులు, మరక్కాయర్ అనే ముస్లిం జాతివారిని, చెట్టియార్ అనే వ్యాపారవేత్తలను తమ రాయల్ ఏజెంట్లుగా నియమించుకున్నారు. దాల్చినచెక్కను సేకరించడం, శుద్ధి చేయడం కోసం రాజులు ‘‘చాలాహ’’ అనే ఒక ప్రత్యేక కులవర్గాన్ని ఉపయోగించారు. వీరు రాజుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసేవారు. వీరికి ప్రతిఫలంగా రాజులు పన్నుల మినహాయింపు, సాగు చేసుకోవడానికి భూములను ఇచ్చేవారు.
డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆంక్షలను దాటి మసాలా దినుసులను భారతదేశంలోని మద్రాసు (చెన్నై), కిలకరై, నాగపట్టణం, తూత్తుకుడి రేవులకు చేర్చేవారు, అక్కడ నుండి మసాలా దినుసులు అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. డచ్‌వారి ఆంక్షల నుండి బయలు పడటానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కాండీరాజులు వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి మద్రాసు గవర్నర్‌తో రాయబారాలు నడిపి వారి వలలో పడ్డారు.
శ్రీలంక దాల్చిన చెక్కను ప్రపంచమార్కెట్టుకు చేర్చడానికి పాక్ జలసంధి నుండి చిన్న పడవల్లో తమిళనాడు తీరానికి చేర్చేవారు, తరువాత మన్నార్ అఖాత మార్గం ద్వారా శ్రీలంకలోని పుట్టాలం కుదరమలై రేవు నుండి తమిళ నాడులోని తూత్తుకుడి కాయల్పట్టణం రేవులకు పంపేవారు. ఇక్కడ నుండి ముత్యాలు, శంఖాలు కూడా ఎగుమతి చేసేవారు. తూర్పు తీరమార్గం శ్రీలంక తూర్పు తీర రేవులు తిరుకోణమలి, బట్టికలోవా నుండి ఆంధ్రలోని మచిలీపట్నం, మద్రాసులోని నాగపట్నం లకు సరుకు చేర్చేవారు. రహస్య లాండింగ్ పాయింట్ల ద్వారా నదీముఖద్వారాలకు సరుకు వచ్చేది.
కాండీ రాజ్యాన్ని పాలించిన నాయకరాజులు మసాలా దినుసులు, ఇతర వస్తువులు, అంతర్జాతీయ వ్యాపారంపై విధించిన సుంకాలు, పన్నులు విధానం అత్యంత కఠినంగా, వ్యూహాత్మకంగా ఉండేది. డచ్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల ఆర్థిక దోపిడీని అడ్డుకోవడానికి రాజులు అమలు పరిచిన కస్టమ్స్ డ్యూటీ ఉండేది. కాండీ సామ్రాజ్యానికి తీరప్రాంతా ల్లోని వలస రాజ్యాలకు మధ్య వున్న సరిహద్దుల వద్ద రాజులు కడవత్ అన్న పేరుతో భద్రతా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. విదేశీ వ్యాపారులు రాజముద్ర, లేదా రాజు అనుమతి పత్రం లేకుండా వీటిని దాటడం అసాధ్యం.
కాండీ రాజుల అధీనంలోగల పుట్టాలం, తిరుకోణమలి, బట్టికలోవ వంటి రేవులకు వచ్చే ప్రతీ విదేశీ ఓడపై కస్టమ్స్ డ్యూటీ విధించేవారు. ఈ వసూలు బాధ్యతను దక్షిణ భారతదేశస్తులైన మరక్కాయర్, శెట్టి వ్యాపారులకు అప్పగించారు. రాజుల అనుమతి లేకుండా దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, అక్రమంగా సరిహద్దులు దాటిస్తే విదేశీయులకు లేదా స్థానికులకు కఠినమైన శిక్షలు. దీనివల్ల వలస రాజ్యాలవారు కాండీ కస్టమ్స్ చట్టాలకు లోబడి వ్యాపారంచేయక తప్పలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో మసాలా దినుసులు అమ్ముకున్న తరువాత తిరిగి వస్తూ మచిలీపట్నం నెల్లూరు, తమిళనాడులోని కోరమండల్ తీరప్రాంతాల నుండి పట్టు, జరీ వస్త్రాలు, సామాన్య ప్రజలకోసం నూలు బట్టలు తెచ్చే వారు. నెల్లూరు నుండి ఉప్పు తెచ్చేవారు. దీనితో బ్రిటిష్ వారికి కన్నుకుట్టింది.
కాండీ సామ్రాజ్యాన్ని పాలించిన చివరి తెలుగురాజు విక్రమరాజసింహపై బ్రిటిష్ వారు కుట్రలు పన్ని, స్థానికులలో రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించారు. 1815 ఫిబ్రవరిలో అతడిని ఖైదుచేసి భారత్‌లోని వెల్లూరు కోటకు తరలించారు. విక్రమ రాజసింహను, అతని నలుగురు భార్యలను వెల్లూరులో ‘‘కండ్యన్ మహల్’’ అనే భవనంలో ఖైదు చేశారు. అది నేటికీ వెల్లూరు కోటలో ఉంది. వారికి జీవనభృతి కోసం ప్రత్యేక పెన్షన్ కూడా ఏర్పాటుచేశారు. ఆయన 1832 జనవరి 20న ఆ భవనంలోనే మరణించారు. ఆయన జ్ఞాపకార్థం వెల్లూరులోనే పాలార్ నది ఒడ్డున (ముత్తు మండపం వద్ద) ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నేటికి అక్కడ ఆయన జ్ఞాపకార్థ ఒక సమాధి ఉంది.
ఈ విధంగా శ్రీలంకను పాలించిన తెలుగు రాజవంశం కథ భారతదేశంలో వెల్లూరు కోటలో ముగిసింది. ఆంధ్ర కమ్మ లేదా నాయకరాజులు శ్రీలంక (కాండీరాజ్యం) మధ్య ఉన్న చారిత్రక మసాలా వ్యాపారం ముగిసింది. వారు కమ్మవారే అని నిర్ధారించే చారిత్రక ఆధారం లేక పోలేదు. అయితే ఇది పరిశోధనాంశం.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు