వీర శిరోమణి మహారాణా ప్రతాప్ భారత దేశానికి చెందిన మహాయోధుడు. సూక్ష్మంగా చూసి నప్పుడు రాణా ప్రతాపుడు కూడా త్రేతాయుగపు రాముడు, ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడితో సమానమైన నాయకత్వాన్ని ప్రదర్శించాడు. రాముడు రావణుడితో యుద్ధం చేసేందుకు జనసామాన్యులతో కలిసి భీషణమైన నిరంకుశుడితో పోరాటం చేసి ఎలా విజయం సాధించాడో, అదే తరహాలో ప్రతాపుడు కూడా తన సమయంలో నాటి ఆక్రమణదారుడు, నిరంకుశుడైన అక్బర్‌తో చేసిన యుద్ధంలో మేవాడ్‌కు చెందిన అన్ని వర్గాలను జాగృతం చేసి, జనశక్తిని సైన్యశక్తిగా పరివర్తన చేసి అభూతపూర్వమైన పరిణామాలను పొందాడు. భగవాన్ శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రులతో కలిసి కంసుడి వంటి శక్తిమంతుడైన రాజును ఎలా నాశనం చేశాడో, అలాగే ప్రతాపుడు కూడా అహంకారంతో మునిగితేలుతున్న అక్బర్ సైనికులను ఇబ్బందులపాలు చేశాడు.
ప్రతాపుడు బాల్యం నుంచే మహళ్లలో నివసించ కుండా కుంభల్గఢ్ మొదలుకొని చిత్తోడ్‌గడ్ సమీపంలో ఉన్న అడవులు, గుహలలో, గ్రామాలు, కొండలలో నివాసం ఉండే భిల్లులు, వివిధ జాతి సమాజాల మిత్రులతో కలిసి సమయాన్ని గడుపు తుండేవాడు. తన తల్లి ప్రేరణతో అతడు కుంభల్గఢ్లోని పర్వతపాదాలలో నివాసం ఉండే భిల్లు సమాజపు బాలురతో కలిసి వేట మొదలుకొని రాజదర్బారు ఏర్పాటు వరకూ ప్రతి పనిని ఒక ఆటగా చేశారు. ఆ రోజుల్లో ప్రతాపుడి భోజనం కూడా భిల్లు కుటుంబాలలోనే చేసేవాడని, మేవాడ్‌లో ఒకే పళ్లెంలో భోజనం చేసే సంప్రదాయం కూడా ప్రతాపుడీలో వృద్ధి చేసి, పోషించాడని అంటారు. తన కౌమారంలో ప్రతాపుడు మహారాణా ఉదయ్‌సింగ్ ఆదేశాల అనుసారం వాగఢ్, గోడవాఢ్, ఛప్పన్ ప్రాంతాల గెలుపు కోసం చేసిన కృషి, అతని వ్యవస్థాపక నైపుణ్యాలు, సామరస్య పూర్వక ప్రవర్తన, యావత్ సమాజాన్ని కలుపుకొని వెళ్లడం, సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం వంటి వాటి సహాయంతో కూడా సాధ్యమైంది. అప్పటి ప్రభుత్వ వ్యవస్థలోని అలసత్వాన్ని పసిగట్టి చిన్నచిన్న బృందా లుగా ఏర్పడి ప్రజలను దోచుకోవడానికి పాల్పడు తున్న బందిపోట్లతో విసిగిపోయి, వారికి వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు పోరాడారనడానికి ఛప్పన్ యుద్ధం ఒక నిదర్శనం. అప్పటికే విసిగిపోయి, బాధపడుతున్న ప్రజలకు, అటువంటి దోపిడీదారుల నుంచి ముక్తిని కలిగించేందుకు, ఈ యుద్ధాల ద్వారా మేవాడ్ రాజ్యాన్ని స్థిరంగా, బలంగా ఉంచేందుకు ఒక పక్రియను ప్రతాపుడు ప్రారంభించాడు. తన బాల్యంలో ఒకసారి ఆటల్లో రాజదర్బారును ఏర్పాటుచేసి, సమీపంలోని గ్రామాలలోని గ్రామీణులను నరభక్షక చిరుతపులుల నుండి రక్షించడం కోసం, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, పదేళ్ల అతి పిన్న వయసులోనే తన స్నేహితులతో కలిసి ఒక చిరుతపులిని చంపడానికి అడవికి వెళ్లి, దానిని చంపి తిరిగి వచ్చాడు. తన ఈ చర్యకు తల్లి జయవంతీబాయి కోపగించుకుం టుందని అతను భయపడినప్పటికీ ఈ సాహసం చేశాడు. కానీ, తల్లి జనహితం కోసం బలిదానం వంటి సంస్కారాలను నేర్పడంతో ప్రతాపుడికి జీవన లక్ష్యం లభించింది.
‘మనం యావత్ సమాజాన్ని కలుపుకొని ముందుకు సాగాలి, మాతృభూమి కోసం జీవితంలోని కష్టతరమైన మార్గాన్ని అనుసరించాలి.’
సామంతులు, సర్దారుల ద్వారా పట్టాభిషేకం
చిన్నతనంలోని ఇటువంటి సంస్కారాల కారణంగా ప్రతాపుడు యుక్తవయసు వచ్చేసరికి మొత్తం మేవాడ్ ప్రజలకు అత్యంత ప్రియమైనవాడు అయ్యాడు. అందుకే, సా.శ.1572 హోలీనాడు తండ్రి మహారాణా ఉదయ్‌సింగ్ మరణించినప్పుడు, స్మశానంలో స్వయంగా ఉన్నాడు. ఆయన అలా హాజరుకావడాన్ని చూసి నాటి సామంతులు, సర్దారుల మధ్య చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే, మేవాడ్‌లో సింహాసనానికి వారసుడు మహారాణా అంత్యక్రియలకు హాజరుకాడు. తర్వాత, తన మరణానికి ముందే ప్రతాపుడి చిన్న తమ్ముడు జగ్మాల్ను తన ఉత్తరాధికారిగా ఉదయ్ సింగ్ నియమించాడు. కానీ మేవాడ్ ప్రజలు దానిని అంగీక రించలేదు. తక్షణమే రాజు ఇష్టాలను విస్మరించి సామంతులు, సర్దారులు అందరూ సర్వసమ్మతితో ప్రతాపుడిని మేవాడ్ మహారాణాగా ఆమోదించారు. మహదేవుడి ఆలయం సమీపంలో గల మెట్ల బావి తీరంలో ఆ బావి నీటితోనే ప్రతాపుడికి పట్టాభిషేకం చేశారు. ప్రతాపుడికి గల ప్రజాదరణకు ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? మేవాడ్‌లో ఎవరూ కూడా ప్రతాపుడు కాకుండా మరెవరూ సింహాసనం ఎక్కడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
ప్రతాపుడి భీష్మ ప్రత్ఞి
పట్టాభిషేకంతో పాటే మహారాణా ప్రతాప్ ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఒక కఠోర సంకల్పం తీసుకున్నాడు. కుంభల్గఢ్లో జరిగిన ఒక భారీ సభ మధ్యలో సమస్త మేవాడ్ ప్రజల మధ్య ‘నేను నా మాతృభూమి మేవాడ్‌ను పూర్తిగా స్వతంత్రం చేసేవరకూ మంచంపై నిద్ర పోను, ఈ భూమే నాకు శయ్య అవుతుంది. అలాగే, వెండి, బంగారు పళ్లేల్లో భోజనం చేయను, గొడుగు వేసుకోను’ అంటూ తన సంకల్పాన్ని ప్రకటించాడు.
ప్రతాపుడి సేనల్లో అన్ని వర్గాల వీరులు
మహారాణా ప్రతాపుడి సేనల్లో రాజపుత్రులు, భిల్లుల మధ్య అపూర్వమైన సమన్వయం జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు, కానీ వాస్తవానికి హల్దీఘాటి యుద్ధం మేవాడ్ ప్రజల యుద్ధం. యుద్ధంలో బలిదానం ఇచ్చిన సైనికులు, ఆ తర్వాత మిగిలిన సైనికుల గురించి అధ్యయనం చేసిన తర్వాత అర్థమైందేంటంటే, ప్రతాపుడి సేనలో బ్రాహ్మణులు, ఖటికలు, కంసాలి, కమ్మరి, వైశ్యులు, కాయస్థులు, వాల్మీకులు, చమార్లు, చారణులు, జాట్లు మొదలుకొని ముస్లిం సమాజానికి చెందిన యోధులు కూడా ఉన్నారు. ప్రతాపుడి సేనలలో అతిపెద్ద సంఖ్యలో రాజపుత్ర సేనానాయకులు ఉన్నారు – రాజా రామ్షా తావర్, ఝాలాబీదా, రావత్ కిషన్‌దాస్ చుండవత్, మాన్సింగ్ అక్షజోత్, డోడియా భీమ్‌సింగ్, నేత్రసింగ్ సారంగ్ దేవోత్, సఖత్ సాంగా వంటి యోధులు ఉన్నారు. రాణా పూజా నేతృత్వంలో చంద్వాల్ బృందంలో భిల్లులు తమ ఉనికిని నమోదు చేసుకుంటున్నారు. పురోహిత్గోపీనాథ్ లేదా పురోహిత్ జగన్నాథ్ వంటి బ్రాహ్మణ యోధులు కూడా ఉండగా, బఛావత్ మెహతా, భామాషా, తారాచంద్ కావడియా వంటి వైశ్య యోధులు తమ ఖడ్గ నైపుణ్యాన్ని శత్రువులపై చూపుతున్నారు. మహసానీ జగన్నాథ్, పంచోలీ లాల్దాస్ వంటి కాయస్థ యోధులు భుజం భుజం కలిపి పోరాడేవారు. చారణ్ జైసా, చారణ్ కేశవ్, రామా సందూ, కాన్హా సందూ అన్న చారణ యోధులు కూడా యుద్ధంలో ఉత్సాహంతో పాలుపంచుకున్నారు. పఠాన్ హకీమ్ సూర్, మహమ్మద్ ఖాన్ పఠాన్వంటి ముస్లింయోధులు కూడా హృదయపూర్వకంగా ప్రతాపుడి సంఘర్షణలో భాగమయ్యారు. భావూ సునార్, వాగడియా ఖటీక్, నాగరాజ్ లోహార్, రామలాల్ చమార్, జ్వాలా వాల్మీకీ, వైలనోత్ కానజీ బలాయీ వంటి యోధులు శత్రువులను అణచడంలో ప్రతాప్తోపాటు ఉన్నారు. అలాగే, పెద్ద సంఖ్యలో భిల్లు సమాజ యోధులు తమ భూమికను నిర్వహించారు. భగోరా వంశానికి చెందిన భిల్లులు సలుంబర్ వంశంతో కలిసి పోరాడారు.
హల్దీఘాటీ యుద్ధంలో ప్రతాపుడు కేవలం మేవాడ్ రాజు మాత్రమే కాదు, ప్రజల స్వాభిమానం, స్వతంత్రత, ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉన్నాడు. అతడు సమస్త మేవాడ్ ప్రజలలో లోకప్రియుడు అవవ్వడమే కాక సంపూర్ణ రాజ్పుఠాణే, మాల్వా, గుజరాత్ మొదలుకొని దేశంలోని విభిన్న ప్రాంతాలలో కూడా అతడికి ప్రజాదరణ పెరిగింది. ప్రతిచోట నుంచి అతడికి సమర్ధన లభించడం మొదలైంది. గ్వాలియర్ నుంచి రాజా రామ్ షా తావర్, ఇండోర్ నుంచి రావ్ నారాయణదాస్, బాగ్ నుంచి ఆసకరణ, మార్వాడ్ నుంచి రావ్ చంద్రసేన్ వంటి వారందరి సంస్థానాల నుంచి అతడికి సమర్ధన లభించింది.
చరిత్రకారుడు గౌరీశంకర్ హీరాచంద్ ఓఝా తన ఉదయపూర్ రాజ్య చరిత్రలో , ‘ప్రతాపుడు విపత్తులలో కూడా మేవాడ్ స్వాతంత్య్రాన్ని వదిలిపెట్టలేదు. అందువల్లే ప్రజల హృదయంలో అతడి పట్ల అద్భుతమైన శ్రద్ధ ఉత్పన్నమైంది. ఈ శ్రద్ధ కేవలం భావనాత్మకం కాదు, సంఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా దానిని ప్రదర్శించేవారు’ అంటూ రాశారు.
కవి శ్యామలదాస్ రచించిన వీర వినోద్‌లో విభిన్న జాతులు, సముదాయాల సేనలు సమ్మిళితమై యుద్ధం చేయడం గురించిన వర్ణన కనిపిస్తుంది. భిల్లుల సమాజంలోని వీరులు ఆరావళిలోని దుర్గమ క్షేత్రాలలో ప్రతాపుడికి రక్షణ కల్పించడం, రహస్య సమాచారం, సామాగ్రిని అందించిన వివరాలున్నాయి. భిల్లుల సర్దారు రాణా పూంజా పేరును అత్యంత గౌరవంతో పిలిచేవారు. ప్రతాపుడు భిల్లులకు ఇచ్చిన గొప్ప గౌరవం, అతడి ప్రజానాయకత్వానికి నిదర్శనం.
ముహణోత్ నైణాసీ రచించిన నైణాసీ రీ ఖ్యాత్లో ప్రతాపుడి పట్ల ప్రజలలో ఉన్న భక్తి శ్రద్ధలను ప్రస్తావిస్తూ, మేవాడ్ ప్రజలు అతడిని కేవలం పాలకుడిగానే కాదు తమ గౌరవచిహ్నంగా భావించేవారు. అక్బర్ వంటి శక్తిమంతుడి ఎదుట కూడా ప్రజలు ప్రతాప్‌ను వదిలిపెట్టలేదు.
డా।। కె.ఎస్. గుప్తా తన పుస్తకం మహారాణా ప్రతాప్ వ్యక్తిత్వ ఏవం కృతిత్వ అన్న పుస్తకంలో ‘ప్రతాపుడి అతిపెద్ద శక్తి అతడి ప్రజలు. మేవాడ్‌కు చెందిన సామాన్య వ్యక్తి కూడా తనను తాను ప్రతాప్ చేస్తున్న యుద్ధంలో భాగస్వామిని అనుకుంటాడు’ అంటూ రాశారు.
‘‘ప్రతాప్ దృష్టిలో జెండాలు ఎగురవేయడం, వర్గ భేదాలు ద్వితీయమైనవి; ఆయనకు మాతృభూమి స్వేచ్ఛ మాత్రమే సర్వోన్నతమైనది’’ అంటూ, డా।। చంద్రశేఖర శర్మ తన పుస్తకంలో రాశారు.
‘చేతావణీ రా చూంగటియా’ వంటి డింగల్ సాహిత్యంలో కూడా ప్రతాపుడి పరంపరను ప్రజలను గౌరవించడానికి ప్రతీకగా చెప్పారు. ‘‘మహారాణా మేవాడ్, హిర్దే బసియా హింద్ రే’ (మేవాడ్‌కు చెందిన మహారాణా భారతీయుల మనస్సుల్లో ఉన్నాడు). ప్రతాపుడు చరిత్రలోని ఒక పాత్ర కాదు, భారత ప్రజల చైతన్యంలో పాతుకుపోయిన ఒక ఆదర్శం అని ఈ పంక్తులు పట్టి చూపుతున్నాయి.
చారణ్, భట్ అన్న కవులు తమ గీతాలు, డింగల్ కావ్యాల ద్వారా ప్రతాపుడి శౌర్యాన్ని గ్రామగ్రామానికి వ్యాప్తిచేశారు. ‘మాయీ ఎహడా పూత్ జణా, జెహడా రాణా ప్రతాప్’ (అమ్మా రాణా ప్రతాప్లాంటి కొడుకుని కను) అన్న లోక ప్రసిద్ధ పంక్తులు ప్రతాప్ పట్ల ప్రజల మనస్సుల్లో ఉన్న లోతైన భావాలను వ్యక్తం చేస్తాయి. ప్రతాపుడి సంఘర్షణ ప్రజల ఆధారిత స్వాతంత్య్ర ఆందోళన అని రచయిత శ్రీకృష్ణ జుగ్ను పేర్కొంటారు. ఆయన ప్రకారం, ప్రతాపుడి జీవనం , ఏ సంఘర్షణనైనా కేవలం ఆయుధాలతోనే కాదు ప్రజల విశ్వాసంతో గెలువవచ్చు అనడానికి ప్రమాణమని ఆయన అంటారు.
ప్రతాపుడు మేవాడ్ సామూహిక చేతనకు ప్రతీక అయ్యాడు, ప్రతాపుడు మహలుల వైభావాన్ని వదిలిపెట్టి అడవుల్లో తిరగడాన్ని స్వీకరించాడు. కానీ, పరాధీనతను స్వీకరించలేదు. ఆయన ఈ త్యాగమే అతడిని ప్రజల మనస్సుల్లో అమరుడిని చేసిందని దేవీలాల్ పాలీవాల్ రాశారు.
మహారాణా ప్రతాప్ చరిత్రలో ఒక పాత్ర కాదు, భారతీయ స్వాభిమానానికి శాశ్వత ప్రతీక. అందుకే, నేడు కూడా మేవాడ్‌లో ప్రతి వ్యక్తీ ప్రతాపుడిని తమ వాడనుకుని, శ్రద్ధాభక్తులతో ‘రాణా రో నామ్, మేవాడ్ రో మాన్’ (రాణా పేరును స్మరిస్తాడు, మేవాడ్ గౌరవాన్ని స్మరిస్తాడు) అంటాడు.
మహారాణా ప్రతాప్‌కున్న ప్రజాదరణ ఆయన యుద్ధ పరాక్రమం కంటే ఆయన ప్రజానాయకుడి స్వభావం వల్లే ఎక్కువగా వచ్చింది. హల్దీఘాటీ యుద్ధం కేవలం రాజులు చేసిన యుద్ధం కాదు, అది మొత్తం సమాజ భాగస్వామ్యంతో పోరాడిన ఒక అద్భుతమైన స్వాతంత్య్ర సంగ్రామం. అందుకే, నేడు కూడా ప్రతాప్ కేవలం చారిత్రిక పుటల్లోనే కాక, ప్రతి ఒక్కరి మనస్సులో సజీవంగా ఉన్నాడు.
– అనురాగ్ సక్సేనా, ప్రతాప్ గౌరవ కేంద్ర నిర్దేశకులు, ఉదయ్‌పూర్