చౌకైన ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేసింది. ఉదయం కళ్లు తెరిచినప్పటి నుంచీ మన మొబైల్ ఫోన్లోనో, లాప్టాప్ లేదా కంప్యూటర్‌తోనే జీవితాన్ని వెళ్ల దీసేస్తున్నాం. అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా సందేశాలిచ్చేస్తున్నాం, మాట్లాడేస్తున్నాం. ఆఖరుకు మన ఆర్ధిక లావాదేవీలను కూడా వీటిద్వారానే జరుపుతున్నాం. ఎంతో సుఖవంతంగా, సులువుగా అని పిస్తోంది కదూ? మనం నిజంగా అలా అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఆన్లైన్లో కూడా మోసం చేసే సైబర్ మోసగాళ్లు తయారయ్యారు. మొన్నటి వరకూ మీకు లాటరీ వచ్చిందంటూ మెయిళ్ల ద్వారా మోసంచేస్తే, సైబర్ అరెస్టులు అంటూ కొత్త మోసాలు మొదలెట్టారు. అంతేకాదు, మనం క్రెడిట్, డెబిట్ కార్డుల, ఆధార్ వంటి కీలక సమాచారాన్ని సేకరించి కూడా మోసాలు చేస్తున్నారు. వీటన్నింటికీ విరుగుడు ఏమిటంటే సైబర్ సెక్యూరిటీ. మనం వాడే నెట్‌వర్క్‌లను, డిజిటల్ డేటాను ఈసైబర్ దాడుల నుంచి కాపాడేదే సైబర్ సెక్యూరిటీ.
భారతదేశపు తొలిసారి సైబర్ సెక్యూరిటీ కోసం టీఏసీ సెక్యూరిటీని త్రిష్నీత్ అరోరా స్థాపించారు. ఇది సైబర్ రక్షణ రంగ స్వరూపాన్ని పునర్నిర్మిస్తున్న ఒక శక్తి. డిజిటల్ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ అత్యంత వేగంగా అద్భుత వృద్ధిని సాధించింది. ఈ సంస్థ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, సైబర్ రిస్క్ క్వాంటిఫికేషన్, పెనెట్రేషన్ టెస్టింగ్ వంటి రంగాలలో వ్యాపారాలకు అత్యాధునిక పరిష్కారాలను అందించడానికి కృత్రిమ మేధని ఉపయోగించుకుం టుంది. దాదాపు 19 ఏళ్ల వయసులో, 2013లో చండీగఢ్ నుండి టీఏసీ సెక్యూరిటీని ప్రారంభిం చడంతో ఆయన వ్యాపార ప్రస్థానం మొదలైంది.
తిష్నీత్ అరోరా నవంబర్ 2, 1993న పంజాబ్ లోని లూథియానాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు టెక్నాలజీపై ఉన్న ఆసక్తి, చివరికి ఆయన్ను సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలోకి నడిపించింది. తన ప్రయోగాల ద్వారానే కంప్యూటర్ హార్డ్‌వేర్ గురించి అంతా నేర్చుకున్నాడు. కంప్యూటర్‌పై ఉన్న విపరీత మైన మోజు కారణంగా అతను ఎనిమిదో తరగతి పరీక్షలో ఫెయిల్ అయి, ఓపెన్ లెర్నింగ్ ద్వారా పదో తరగతి పూర్తి చేశాడు. బ్లాగింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి కలిగింది.
దీనితో అతడు కంప్యూటర్లను బాగుచేయడం నుండి సాఫ్ట్‌వేర్‌ను శుభ్రపరచడం వరకు చిన్న చిన్న ప్రాజెక్టులను చేపట్టడం ప్రారంభించాడు, చివరికి తన మొదటి గణనీయమైన చెల్లింపుగా 60,000 రూపాయలను అందుకున్నాడు, దానిని అతడు అభివృద్ధి చెందుతున్న తన కంపెనీలో పెట్టుబడిగా పెట్టాడు. తర్వాత తాను నేర్చుకున్న విషయాలను పంచుకోవడానికి ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని ఆటంకాల కారణంగా, అతని మొదటి పుస్తకం పెద్దగా విజయం సాధించలేదు, దీనితో అతను మళ్లీ ప్రారంభించాడు. అతడి రెండవ పుస్తకం, ‘ది హ్యాకింగ్ ఎరా’, ఫిబ్రవరి 2013లో ప్రచురితమైంది. దాదాపు అదే సమయంలో అతను తన సొంత సంస్థ అయిన టీఏసీ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను ప్రారంభించాలని కూడా నిర్ణయించుకున్నాడు.
గుజరాత్లో 2013లో జరిగిన ఒక వ్యాపార సంబంధాల సదస్సులో అతడు నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసి కీలక ప్రసంగం చేశారు. అతడి ప్రసంగం విన్న తర్వాత, కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు తమ క్రైమ్ బ్రాంచ్ కోసం ఒక వర్క్‌షాప్ నిర్వహించమని అతడిని ఆహ్వానించారు. ఇక్కడే అతడు పోలీసుల కోసం సైబర్ క్రైమ్ కేసులపై పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దికాలానికే, సైబర్ క్రైమ్ దర్యాప్తు, ఫోరెన్సిక్స్‌పై తమతో కలిసి ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించ మని పంజాబ్ పోలీసులు అతడిని సంప్రదించారు. అప్పటి నుంచి, త్రిష్నీత్ అనేక మంది ఐపీఎస్ అధికారులకు, క్రైమ్ బ్రాంచ్ సెల్ అధికారులకు, బ్యాంకు ఉద్యోగులకు, సీబీఐ అధికారులకు శిక్షణ ఇస్తూ వస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ చేతుల మీదుగా ఆయన 2014లో రాష్ట్ర పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ఆయన పంజాబ్ పోలీసులకు ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు.
టీఏసీ సెక్యూరిటీ లక్ష్యం, ‘సైబర్‌స్పేస్‌ను సురక్షితం చేయడం, భవిష్యత్తును సురక్షితం చేయడం,’ అన్నది సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఒక బలమైన సహాయక వ్యవస్థను నిర్మిస్తూ, అరోరా న్యూయార్క్, సింగపూర్‌కు చెందిన పరిశ్రమ నిపుణులతో సహా అనుభవజ్ఞులైన సైబర్‌సెక్యూరిటీ నిపుణులను సంస్థలోకి తీసుకువచ్చారు. ప్రఖ్యాత పెట్టుబడిదారు విజయ్ కేడియా నుండి ఆయన ప్రారంభ నిధులను అందుకున్నారు. ఈ మద్దతు టీఏసీ సెక్యూరిటీ వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడింది, లుధియానా నుండి చండీగఢ్‌కు, ఆపై ముంబైకి, చివరికి యునైటెడ్ స్టేట్స్కు విస్తరించింది.
అతని బహుళజాతి సంస్థ, టీఏసీ సెక్యూరిటీ సొల్యూషన్స్, కార్పొరేషన్లకు నెట్వర్క్ లోపాలు, డేటా దొంగతనం నుండి రక్షణను, సైబర్ సెక్యూరిటీ శిక్షణను అందిస్తోంది. టిఏసీ క్లయింట్లలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), పంజాబ్ పోలీస్, గుజరాత్ పోలీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అవ•ల్, రాల్సన్ (ఇండియా) లిమిటెడ్, అవాన్ సైకిల్స్ లిమిటెడ్, దుబాయ్, యుకెకు చెందిన బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) ఉన్నాయి.
ఈ అద్భుతమైన పనితీరు అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన త్రిష్నీత్ అరోరా, 1,100 కోట్ల రూపాయల నికర సంపదతో, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో ఆరవ అతి పిన్న వయస్కుడిగా, 1,463వ అత్యంత ధనవంతుడిగా స్థానం పొందారు. ఆయనకు లభించిన ఈ గుర్తింపు, ప్రపంచ వేదికపై భారతదేశ సాంకేతిక, సైబర్‌సెక్యూరిటీ రంగాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.