సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారతదేశం ప్రపంచ వేదికపై ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతున్న ఈ కాలంలో, భారత్‌ను అర్థం చేసుకోవాలనే చర్చ కూడా సమాంతరంగా సాగుతోంది. అయితే ఒకవైపు భారత్ ఆధునిక శక్తిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, మరోవైపు దాని సాంస్కృతిక వ•లాలను అర్థం చేసుకోవడంలో పాశ్చాత్య ప్రపంచం ఇంకా సందిగ్ధతలోనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలె యూరప్, అమెరికా పర్యటన ఒక సాధారణ విదేశీ పర్యటన కాదు; అది సంభాషణ ద్వారా వివిధ సంస్కృతుల మధ్య వారధి నిర్మించే ప్రయత్నంగా నిలిచింది.
1897లో స్వామి వివేకానంద అమెరికా, ఐరోపా పర్యటన అనంతరం భారతీయులపై పాశ్చాత్య దేశాలలో నెలకొన్న అపోహలను ప్రస్తావించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక శతాబ్దంపైగా గడిచినా ఈ అపోహల్లో పెద్దగా మార్పులేదు. అలాగే భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఎనభై ఏళ్లకు చేరువవుతున్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నా, పాశ్చాత్య ప్రపంచం భారత్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఇంకా వెనుకబడే ఉంది.
ఈ నేపథ్యంలో హోసబలె పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం RSS గురించి పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న అపోహలను తొలగించడం. దశాబ్దాలుగా వామపక్ష భావజాల ప్రభావిత మీడియా, అకడమీషియా సంఘ్‌ను ‘‘హిందూ ఆధిపత్య’’ లేదా ‘‘మైనారిటీ వ్యతిరేక’’ సంస్థగా చిత్రీకరించాయి. ఈ ప్రచారం పాశ్చాత్య మేధావులు, విధాన నిర్ణేతలలో కూడా అనుమానాలను పెంచింది. అందుకే సంఘ నాయకత్వం ప్రత్యక్షంగా చర్చల్లో పాల్గొని తమ దృక్పథాన్ని వివరించాల్సిన అవసరం ఏర్పడింది. వాషింగ్టన్ DCలోని Hudson Institute లో జరిగిన చర్చ ఈ పర్యటనలో ముఖ్య ఘట్టంగా నిలిచింది. అక్కడ హోసబలె హిందుత్వం అసలు తత్వాన్ని వివరించారు. ‘‘వసుధైవ కుటుంబకం’’ అనే భారతీయ దృక్పథం ప్రకారం ప్రపంచమంతా ఒక కుటుంబమని ప్రాచీన కాలం నుంచి హిందూ సమాజం చెబుతూ వస్తున్నదని, అందువల్ల ఆధిపత్య భావనకు అక్కడ స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఒక రాజకీయ సంస్థ కాదని, అది సమాజ నిర్మాణం కోసం పనిచేసే ప్రజా ఉద్యమమని వివరించారు. సంఘం నిర్వహించే సేవా కార్యక్రమాలను కూడా ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. రోజువారీ శాఖల ద్వారా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడం నుండి విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, విపత్తు సహాయం వరకు ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న సేవలను వివరణాత్మకంగా చెప్పారు. ముఖ్యంగా ఈ సేవల్లో కుల, మత, భాష ఆధారిత వివక్షకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలు తమ రాజకీయ ప్రమాణాలతో భారత్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంవల్లే అపోహలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రపంచం ప్రస్తుతం యుద్ధాలు, ఆర్థిక అసమానతలు, పర్యావరణ సంక్షోభం, కుటుంబ వ్యవస్థ బలహీనపడడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లకు కేవలం రాజకీయ, ఆర్థిక పరిష్కారాలు సరిపోవని, సమాజ కేంద్రిత విలువలు అవసరమని పేర్కొన్నారు. కుటుంబం, సమాజం, ప్రకృతి మధ్య సమతుల్యతను కాపాడే భారతీయ ఆలోచనా విధానం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవగలదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంలో భారతీయ డయాస్పోరా పాత్ర కూడా ఎంతో కీలకమైంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆధునిక ప్రపంచానికనుగుణంగా జీవిస్తూ, తమ నాగరికతా వ•లాలను కాపాడుకుంటున్నారు. ఈ అనుభవాలు వారిని ఆయా దేశాల మధ్య వారధిగా నిలబెడుతోంది. పాశ్చాత్య సమాజాలకు భారతీయ విలువలను పరిచయం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్ర పోషించగలరని హోసబలె పేర్కొన్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటిలో జరిగిన thrive 2026 చర్చలో ఆయన ప్రస్తావించిన అంశాలు మరింత లోతైనవిగా నిలిచాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక కాలంలో మానవజాతి, ‘‘ఆధ్యాత్మికత, నైతికత’’ గురించి మళ్లీ ఆలోచించడం ప్రారంభించిందని చెప్పారు. భారతదేశం వేల ఏళ్లుగా ఆధ్యాత్మికతను ఒక శాస్త్రంగా పరిగణిస్తూ వచ్చింది. సైన్స్, ఆధ్యాత్మికత పరస్పర విరుద్ధాలు కావని, రెండింటి సమన్వయం ద్వారానే సమగ్ర మానవ అభివృద్ధి సాధ్యమని భారతీయ నాగరికత ఎప్పటినుంచో చెబుతోందని వివరించారు.
ఈ మొత్తం పర్యటనలో ప్రధానంగా కనిపించిన అంశం ‘‘సంభాషణ’’. హిందూ సంప్రదాయంలో ‘‘శాస్త్రార్థం’’ అనే భావన ఉంది. అంటే వాదన కోసం వాదించడం కాదు; సత్యాన్వేషణ కోసం అర్థవంతమైన చర్చ జరపడం. హోసబలె పర్యటన అదే భావనకు ఆధునిక రూపంగా నిలిచింది. వ్యూహాత్మక లేదా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, ప్రజల స్థాయిలో పరస్పర అవగాహన పెంపొందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇది ఒక కీలక సందేశాన్ని అందించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు పరిష్కారం కేవలం ఆర్థిక ఒప్పందాల్లోగానీ, సైనిక కూటముల్లో గానీ లేదు. వివిధ దేశాల సంస్కృతుల మధ్య పరస్పర గౌరవం, సంభాషణ, అవగాహన అవసరం. భారతదేశం తన ప్రాచీన నాగరికతా విలువలతో, ఆధునిక సామర్థ్యాలతో ప్రపంచానికి ఒక సమతుల్య దిశను చూపగలదు. ఆ దిశగా సాగుతున్న ప్రయాణంలో హోసబలె ఈ పర్యటన నాగరికత, సంస్కృతి మేళవించిన ఒక ముఖ్యమైన సంభాషణగా చరిత్రలో నిలిచిపోతుంది.