సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ నిజ జ్యేష్ఠ బహుళ చతుర్దశి – 13 జూలై 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


జాతీయ భద్రత విషయంలో ప్రపంచంలో ఏ దేశమూ వ్యవహరించనంత నిర్లక్ష్యంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాలపాటు భారతదేశం వ్యవహరిం చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం కశ్మీర్ సమస్య. 1947లో 24 నెలలపాటు జరిగిన యుద్ధంలో 2500 మంది సైనికులు అమరులై విజయం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో నెహ్రూ ఈ సమస్యను ఐక్యరాజ్యసమితికి నివేదించడం బాధాకరం. ఈ స్వార్థ రాజకీయం కారణంగా ఈ రోజు పీఓకేగా పిలుస్తున్న ప్రాంతంలో మన భద్రతకు సంబంధించిన గిల్గిత్, బాల్టిస్తాన్ వంటి కీలకమైన ప్రాంతాలు ఉండిపోయాయి. 1840లో గిల్గిత్‌పై రష్యా దాడి చేసినపుడు ఆనాటి కశ్మీర్ రాజు రష్యా సైన్యాలను ఓడించడమే కాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను పసిగట్టడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే శ్రీనగర్‌లో రష్యన్ భాషకు సంబంధించిన పాఠశాలను నెలకొల్పడం మన పాలకుల దూరదృష్టికి, మాతృభూమి రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతలకు నిలువెత్తు ఉదాహరణ ఇది.  గిల్గిత్ నుండి రష్యాతో సహా చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సైనిక కదలికలను గమనించదగిన గొప్ప కీలక ప్రాంతం. ఈ విధంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతం మన దేశంలో ఒక భూభాగం మాత్రమే కాకుండా జాతీయ భద్రత దృష్ట్యా దేశానికి గుండెకాయ వంటిది.

అలాంటి కశ్మీర్ చరిత్రలో 1990వ దశకం అత్యంత సంక్లిష్టమైన కాలం.  ఈ సమయంలో లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు విజృంభించడం, వేర్పాటువాద ఉద్యమాలు బలపడడం, సామాన్య ప్రజల భద్రతపై ఆందోళనలు పెరగడం వంటి పరిణామాలు దేశభక్తులను తల్లడిల్లేటట్లుచేశాయి. ఈ కాలంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో నర్సు సరళాభట్ హత్య కేసు ఒక నమÖనా మాత్రమే. ఇలాంటివి లెక్కలేనన్ని జరిగాయి. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈ కేసులో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకోవడంతో ఇది మరోసారి చర్చకు వచ్చింది.

సరళాభట్ కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన యువతి. ఆమె శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో నర్సుగా పనిచేసేవారు. 1990 ఏప్రిల్‌లో ఆమెను తీవ్రవాదులు అపహరించి క్రూరంగా హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కశ్మీరీ పండిట్‌లలో భయాందోళనలు మరింత పెరగడానికి కారణమైన సంఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది.

కశ్మీర్‌లో ఆ సమయంలో జరిగిన హింస కారణంగా అనేకమంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీరీ పండిట్ల వలసలు పెద్ద ఎత్తున అదే సమయంలో జరిగాయి. భద్రతా పరిస్థితుల కారణంగా వేలాది కుటుంబాలు తమ నివాస ప్రాంతాలను విడిచి వెళ్లాల్సి వచ్చింది.

సరళాభట్ హత్యకేసు ముందుకు సాగకపోవడానికి చాలాకాలం పాటు అప్పటి పరిస్థితులు, సాక్షుల భద్రతకు సంబంధించిన సమస్యలు, దర్యాప్తులో ఎదురైన సవాళ్లు కారణమయ్యాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ(SIA) పాత ఆధారాలను పరిశీలించి ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో కేసు మళ్లీ న్యాయ పరిధిలోకి వచ్చింది. ఈ కేసులో కొందరు వ్యక్తుల పేర్లు ప్రస్తావించ బడ్డాయి.

కశ్మీర్‌లో వేర్పాటువాద రాజకీయాలు, ఆయుధ పోరాటం, భారత ప్రభుత్వ విధానాలు, స్థానిక ప్రజల ఆకాంక్షలు వంటి అంశాలు దశాబ్దాలుగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేర్పాటువాద నాయకుల పాత్రపై కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్వార్థ రాజకీయ నాయకులు కొందరు తీవ్రవాదులను రాజకీయ ఉద్యమకారులుగా పేర్కొంటుండటం దురదృష్టకరం.

ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రచురించిన ‘పర్సనాలిటీస్ అండ్ లెజండ్స్ ఆప్ జమ్మూ కశ్మీర’ అనే పుస్తకం మరోసారి కశ్మీర్ సమస్యను చర్చలలోకి తీసుకొచ్చింది. వేర్పాటువాద నాయకుడు మక్బూల్ భట్ తదితరులను ‘షహీద’ (అమరవీరుడు) లేదా ‘లెజండ’ (పురాణపురుషులు)గా చిత్రీకరించారని ఆరోపణలు తీవ్ర అభ్యంతరానికి దారితీసాయి. ఒక వ్యక్తి గురించి చరిత్రలో భిన్నమైన అభిప్రాయాలుండవచ్చు. కానీ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా హింసాత్మక మార్గాలను ఎంచుకున్న వ్యక్తులను గొప్పవారిగా చూపిస్తే యువతకు తప్పుడు సందేశం అందే ప్రమాదముంది. మక్బూల్‌భట్ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకులలో ఒకరిగా వేర్పాటువాద రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు. తీవ్రమైన నేరారోపణల తరువాత అమరచంద్ హత్యకేసులో ఆయనకు 1984లో మరణశిక్షను అమలుచేయడం గమనార్హం.

సరళాభట్ కేసు కేవలం ఒక వ్యక్తి హత్యకు సంబంధించిన న్యాయ వ్యవహారం మాత్రమే కాదు. అది కశ్మీర్‌లో జరిగిన సంక్లిష్ట చరిత్రకు సంబంధించిన ఒక అధ్యాయం. ఈ చరిత్రను అర్థం చేసుకునేటప్పుడు బాధితుల వేదనను గుర్తించడం ఎంత అవసరమో, అదే సమయంలో న్యాయ ప్రక్రియను గౌరవించడం కూడా అంతే ముఖ్యం.

సరళాభట్ కేసు మనకు ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తు చేస్తుంది. ఏ ప్రాంతంలోనైనా హింసకు ఎక్కువగా నష్టపోయేది సాధారణ ప్రజలే. ఉగ్రవాదం, రాజకీయ హింస, చివరకు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బాధితులకు న్యాయం చేయడం, నిజాలను వెలికితీయడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో దర్యాప్తు సంస్థల కీలకమైనది. అంతకన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ దర్యాప్తు సంస్థలు, స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటట్లు చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉంటుంది. నేటి కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ముందుకెళుతుందని ఆశిద్దాం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.