సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి – 22 జూన్ 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


ఒక దేశం శక్తిమంతమైనదంటే అది కేవలం సైనికశక్తి, అణుశక్తి కలిగి ఉండడమే కాదు, యుద్ధం చేసేది తుపాకి గాదు, తుపాకీని పట్టుకున్న వ్యక్తి. వాస్తవంగా శక్తి తుపాకీలో ఉన్నా, శక్తిని నడిపించే ధైర్యం తుపాకీని పట్టుకున్న వ్యక్తిలో దాగి ఉంటుందని మరువరాదు. కనుక ఒక దేశం శక్తి ఆ దేశ ప్రజలలోని దేశభక్తితో కూడిన ధైర్య సాహసాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మన దేశానికి పరంపరా గతంగా వస్తున్న ప్రజాశక్తితో బాటు ప్రభుత్వ (సైనిక/ఆయుధ) శక్తి కూడా బలంగా ఉంది. మనం చేస్తున్న ఈ శక్తి సముపార్జన ప్రపంచ దేశాలను గుప్పిట్లో పెట్టుకోవడానికి కాదు. మనం సురక్షితంగా ఉంటూ, ప్రపంచానికి శాంతిని ప్రసాదించడానికే.

భారత్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుండడం మనందరం గమనిస్తున్నాం. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 సంవత్సరాలైన సందర్భంగా జూన్ 12న  కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజనాథ్‌సింగ్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ భారత్ వ్యాక్సిన్ శక్తితోపాటు ఆయుధశక్తిని కలిగి ఉందని సగర్వంగా ప్రకటించారు. ఇది కేవలం ఉపన్యాసం కాదు, ఈ 12 సం.లలో భారతదేశం సాధించిన రెండు రకాల ప్రగతికి నిదర్శనంతోపాటు, 145 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక కూడా.

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను భారత్ ఆచరణలోకి తెచ్చింది. కనుకనే మనం తయారు చేసుకున్న కోవిషీల్డ్, కోవాక్సన్ లాంటి వ్యాక్సిన్‌లతో భూటాన్ నుండి బ్రెజిల్‌వరకు 100కు పైగా దేశాలకు 23 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించాం. ఆయా దేశాలు వాటిని ‘సంజీవని’గా భావించి భారత్ దాతృత్వం పట్ల గౌరవాన్ని పెంచుకున్నాయి. కోట్లాది ప్రాణాలు నిలిచాయి. కరోనా సంకటసమయంలో మన దేశ ప్రజలందరికి వ్యాక్సిన్‌ను అందిస్తూనే ప్రపంచాన్ని కూడా ఆదుకోవడం మన ప్రజలలో త్యాగభావనను, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దేశభక్తి ఇనుమడించింది. ఆరోగ్యరంగంలో భారత్ సాధించిన సాత్విక(శక్తి) సంపద ద్వారా మనం స్వావలంబిగా తయారైనాం. నేను జీవించాలి, నా పక్కవాడు కూడా బతకాలనే వేదవాక్యాన్ని ఆచరణలో పెడుతూ ప్రపంచానికి ఔషధాలు, వైద్యసామగ్రిని అందించే సామర్థ్యం మన దౌత్యనీతికి కొత్త బలాన్నిచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే మానవత్వం మాత్రమే సరిపోదు. శక్తి కూడా వెంట ఉండాలి. మంచి మాట అయినా బలహీనుడు చెబితే ప్రపంచం వినదు, కనుక మానవత్వం, శాంతితోపాటు శక్తిని కూడా కలిగుండాలనేది ప్రకృతి నియమం. నాయమాత్మా బలహీన లభ్యః (బలహీనుడికి భగవంతుడు కూడా దర్శనమివ్వడు) అనేది వివేకానందుల సుప్రసిద్ధ వాక్యం. మానవత్వం, శక్తి అనే రెండూ నాణానికి బొమ్మ, బొరుసులాంటివి. వ్యాక్సిన్, సిరంజీలతో బాటు భారత్ కత్తికి పదును పెట్టింది. ఐఎనఎస్ విక్రాంత్ నుండి MK- 1A వరకు, అగ్ని-5 నుండి పిలిప్పిన్స్‌కు బ్రహ్మోస్ ఎగుమతి వరకు ఎదగడమేకాదు, రక్షణ రంగంలో ఆత్మ నిర్బర్ భారత్ ఇపుడు నినాదంగా కాకుండా వాస్తవమని ధ్రువపడింది.

2024`25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు 23,622 కోట్ల రూపాయలు దాటాయి. పదేళ్లలో 30 రెట్లు వృద్ధి జరిగింది. ఇది ఆర్థిక విజయం కాదు, వ్యూహాత్మక విశ్వాసమని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎలఏసి వద్ద మన సైన్యం స్పష్టమైన బదులివ్వడం, సముద్ర (జల) దొంగలను అణచివేసి భారత్ బెదిరింపులకు లొంగదని హెచ్చరించడం, ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ నుండి వేలమందిని తరలించడం. శాంతిని కోరుకుంటూనే యుద్ధానికి సిద్ధంగా ఉండడం. డి.ఆర్.డి.ఓ, హెచఏఎల్, ప్రైవేటు కంపెనీలు కలిసి రక్షణరంగంలో విప్లవం సృష్టించాయి. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన దేశం నేడు 85 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. రాజనాథ్‌సింగ్ వ్యాక్సిన్ శక్తిని, ఆయుధశక్తిని రెండింటిని జతజేయడం వ్యూహాత్మకంగానే భావించాలి. వ్యాక్సిన్ ఉండి ఆయుధం లేకపోతే ప్రపంచం బలహీనుడిగా చూస్తుంది. ఆయుధం ఉండి వ్యాక్సిన్ లేకపోతే దుందుడుకు దేశంగా ముద్రపడుతుంది. రెండు కలిస్తేనే భారత్ విశ్వశక్తిగా, విశ్వమిత్రుడిగా నిలుస్తుంది. ఒకటి దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది ఆ దేశ ఆత్మ కాపాడుతుంది. ఒకటి స్నేహితులను సంపాదించిపెడుతుంది. రెండవది శత్రువులను దూరం చేస్తుంది.

చాణక్యుకుడు చెప్పినట్లు ఏ రాజ్యానికైనా యోగ క్షేమాలు రెండూ కావాలి. యోగం అంటే సంపాదించడం (సంపద కలిగి ఉండడం), రెండోది క్షేమం అంటే కాపాడుకోవడం. వ్యాక్సిన్ శక్తి యోగమైతే – ఆయుధ శక్తి క్షేమం అనుకోవచ్చు. రెండు సమతుల్యంగా ఉంటేనే రాజ్యం స్థిరంగా ఉంటుంది.

2047 నాటికి వికసిత భారత్ సాధించాలంటే ఈ రెండు శక్తులు కీలకం.  వాతావరణ సంక్షోభాలు మరిన్ని వ్యాక్సిన్‌లు, కొత్త ఔషధాలు కోరతాయి. బహు ధ్రువ ప్రపంచం మరింత విశ్వసనీయమైన నిరోధక శక్తిని కోరుతుంది. మహమ్మారిని ఆపగలిగి, సరిహద్దును కాపాడగలిగిన దేశాలే రేపు నిలబడతాయి. నిజమైన సార్వభౌమత్వమంటే ప్రజల్ని కాపాడే శక్తి, దేశాన్ని రక్షించే శక్తి రెండింటిలోనూ భారత్ ఈ రోజు ప్రపంచ వేదికపై స్థానం సంపాదించడం కోసం వెంపర్లాడడం లేదు. వేదికను తానే సిద్ధం చేస్తుంది. ఇదే నవభారత దార్శనికత. ఈ పన్నెండు సంవత్సరాలలో మోదీ సాధించిన ఘన విజయంగా మనం భావించవచ్చు.

About Author

By editor